28, జులై 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1126 (కూఁతురె తల్లియై జనకు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

33 కామెంట్‌లు:

  1. సీత యనంగ నొప్పు నొక చేడియ పుత్రు గనెన్ ముదమ్ముతో
    నాతని బిల్చుచుండె జనకా! యని పాలిడు వేళ తండ్రియే
    ప్రీతిగ నాశిషమ్ములిడె ప్రేముడి నవ్విధమున్ దలంపగా
    కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్

    రిప్లయితొలగించండి
  2. కూఁతురు పుట్టె నా జనకుఁ గూర్మి యెసంగఁగ, నా కొమారితన్
    మాతగ నెంచి యాతఁడు సమంచిత రీతినిఁ బెంచెఁ; గూఁతు రా
    తాతనుఁ బుత్రుఁగాఁ దలఁచెఁ; దండ్రియుఁ జచ్చి సుతుండుఁ గాఁగ, నా
    కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

    రిప్లయితొలగించండి
  3. ప్రీతిగ నొక్క కూతునకు పెండిలిజేసెను తండ్రి, వ్యాధితో
    నాతడు దాటిపోయె, గన నామెయు పుత్రుని యాదినంబునన్
    తాతయె మన్వడై మరల ధాత్రికి వచ్చెనటంచు ప్రేమతో
    కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

    రిప్లయితొలగించండి
  4. మరియొక ప్రయత్నము:

    తాత మహాకవీశ్వరుడు, తత్సుత కావ్యము, దాని యొక్క ప్ర
    ఖ్యాతియె అర్భకుండు, కృతి నమ్మగ వచ్చిన యట్టి సొమ్ములా
    తాతకు గూర్చు పోషణము, తద్విధ మెల్ల దలంచుచో బళా!
    కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్

    రిప్లయితొలగించండి
  5. ఈతరమందు విద్యలకునేర్పడు ఖర్చులకై చలింపకన్
    తాతలయాస్తులమ్మి తమదగ్గరి పైకముకోలుపోవ, వి
    ద్యాతతి చేత కొల్వుగని తండ్రిని ప్రేమగ చూడసాగెనే!
    కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. చలింపక వ్యతిరేకార్థక పదము కావున దాని చివర ద్రుతము రాదు. చలింపకే అంటే కొంత నయము. స్వస్తి.

    రిప్లయితొలగించండి

  7. భార్యను గూర్చి భర్త స్వగతం:

    వాతము జేసి నాయనకు వాడెను కాలును చెయ్యి, మంచమం-
    దాతడు మూల్గ, జేసె సతి యన్నియు, కోడలు కాదు చూడగా
    కూతురె! తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్
    ప్రీతిని యౌషధమ్మిడుచు, వేళకు భోజనమిచ్చి సాకుచున్.

    రిప్లయితొలగించండి
  8. ఆతడునామె తండ్రియట నాతనికర్మఫలమ్మదేమిటో
    యాతన జెందసాగితను నాకలి దాహమటంచు దీనుడై
    చేతులనెత్తి దీర్చుమని చెయగ సంజ్ఙలుజైలులోపలన్
    కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్!!!

    (ఎప్పుడోశ్రీగుమ్మడివెంకటేశ్వర్రావుగారుతనరష్యాపర్యటనజ్ఙాపకాలను ఒకపత్రికలో వివరిస్తూ అక్కడ తాను ఒక చిత్రాన్ని చూసి చలించి పోయినట్లు వ్రాసారు " ఆ చిత్రంలో జైలులో ఉన్న తండ్రిని సందర్శిస్తూ అతని దీనస్థితికి చలించి తన స్తన్యమిచ్చి దాహాన్ని తీర్చుచున్న కూతురి చిత్రమట అది " ఆ సంఘటన ఈ పూరణకు ప్రేరణ.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ నేమాని పండితగురువర్యా,

    సవరణ సూచించినందుకు ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ,
    మీ రెండు పూరణలూ వైవిధ్యంగా, మనోరంజకంగా ఉన్నాయి. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పుత్రుని నాదరంబునన్, మన్మని’ అనండి.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    కరుణరసాత్మకమైన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మొదటి పాదాన్ని ఇలా ప్రారంభిస్తే బాగుంటుందేమో... ‘ఆతడు తండ్రి యామెకట యాతని కర్మఫల....’

    రిప్లయితొలగించండి
  11. నీతిని నమ్ముకొన్న పతి నేటి సమాజము నందు భార్య నే
    రీతిగ సాకునంచునొక ప్రేయసి దుఃఖిత కన్నకూతురున్
    పాతకి పక్ష పాత రుజ భర్తను వీడెను భోగ లాలసన్
    కూతురె తల్లియై జనకు కూరిమి నక్కున జేర్చి పాలిడెన్

    రిప్లయితొలగించండి
  12. మాతగ తానెయై తనకు మారుని పేరది తండ్రి నామమౌ
    ప్రీతిగ జూచుచున్ మిగుల ప్రేమగ బిల్చెను రామరా రనా
    నూతన తేజమా యనుచు నోముల పంటని మోద మం దుచున్
    కూతురు తల్లియై జనకు గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్ !

    రిప్లయితొలగించండి
  13. గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘దుఃఖిత కన్నకూతురు’ అని సమాసం చేయరాదు కదా. ‘రుజ భర్త’యా ‘రుజాపీడిత భర్త’యా? నా సవరణ.....
    ‘ దుఃఖితయైన కూతురున్ / పాతకి పక్ష పాతమున భర్తను..’
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘రామరా రనా’...?
    ‘పంట + అని’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. సంధి లేదు. ‘నోముల పంటగ మోదమందుచున్’ అనవచ్చు.

    రిప్లయితొలగించండి
  14. లేతవయస్సువానిని, కులీనుని,విప్రునిఁగాంచినంతటన్
    జేతులఁబూనిముద్దిడిచు,స్నేహముఁ దుగ్ధము ద్రాపనెంచుటన్
    బూతనపేరబుట్టి కొనె మోక్షమునాబలిచక్రవర్తికిన్
    గూతురె, తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చి పాలిడెన్.
    [
    4వ పాదమ్ లో జనకుడిని - జగజ్జనుకుడు - విషుమూర్తికి అన్వయించే ప్రయత్నం చేసినానండీ]

    రిప్లయితొలగించండి
  15. దాతయ గొక్క తండ్రి మరి తల్లికి కూతురు పుట్టగా సుతన్
    బ్రీతిగ బెంచ బెద్దదయెను, బిడ్డకు తండ్రి వియోగ మేర్పడన్
    గూతురు గర్భమందునొక గుంటడు బుట్టగ తండ్ర నెంచి యా
    కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చిపాలిడెన్

    రిప్లయితొలగించండి
  16. రామకృష్ణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ‘అగు + ఒక్క’ సంధి లేదు. ‘అగునొక్క’ అవుతుంది.
    రెండవ పాదంలో ‘పెద్ద దయెను’ అంటే గణదోషం. ‘పెద్ద దయె’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు
    మీ సూచన ప్రకారము పద్యమును సవారించి వ్రాసినాను
    పక్షపాతమున నన్నచో రోగమను అర్థము ఇవ్వదనే భావముతో .. రోగపీడితుని అని సవరించాను

    నీతిని నమ్ముకొన్న పతి నేటి సమాజము నందు భార్య నే
    రీతిగ సాకునంచునొక ప్రేయసి దుఃఖితయైన కూతురున్
    పాతకి రోగపీడితుని భర్తను వీడెను భోగ లాలసన్
    కూతురె తల్లియై జనకు కూరిమి నక్కున జేర్చి పాలిడెన్


    రిప్లయితొలగించండి
  18. గురువులకు ధన్య వాదములు
    క్షమించాలి " కూతురె " అనుటకు బదులుగా ...." కూతురు " అని టైప్ పొరబాటు ఇప్పుడే చూసాను

    రిప్లయితొలగించండి
  19. పూత ధరిత్రి భార్య తొలి, భూమికి కూతురు యున్ కళత్రమై
    నాతిచారమియంచు తన నాథుని సేవలు చేసె కానలన్
    భూతములన్నియున్ బొగడ భూరి పతివ్రతగా, యశస్విగా,
    కూతురె తల్లియై జనకు కూరిమి నక్కున జేర్చె పాలిడన్

    రిప్లయితొలగించండి
  20. శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు నమస్కారములు, పొరపాటయింది చూసుకోలేదు. గణదోషం జరిగింది, అటులనే సంధి సవరిస్తూ ........

    దాతగు నొక్క తండ్రి మరి తల్లికి కూతురు పుట్టగా సుతన్
    బ్రీతిగ బెంచ బెద్దదయె, బిడ్డకు తండ్రి వియోగ మేర్పడన్
    గూతురు గర్భమందునొక గుంటడు బుట్టగ తండ్ర నెంచి యా
    కూతురె తల్లియై జనకు గూరిమి నక్కున జేర్చిపాలిడెన్

    రిప్లయితొలగించండి
  21. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కూతురుయున్’ అనడం దోషం. ‘కూతురు తాఁ గళత్రమై’ అందాం.

    రిప్లయితొలగించండి
  22. ఆతతబుద్ధి నత్రికిని ఆలు సతీ అనసూయకున్ పరం
    ధాతలు విష్ణు శంకర విధాతలు బిడ్డలుయై జనించగా
    కూతురు తల్లియై జనకు కూరిమి నక్కున జేర్చె పాలిడన్
    ప్రీతిని గ్రోలినారు పసిబిడ్డలు దేవతలెల్ల గొల్వగా

    రిప్లయితొలగించండి
  23. ఖ్యాతినిఁబొందెనోయువతి కష్టములోర్చుచు వైద్యురాలిగా
    తాతలనాటిజబ్బొకటి తండ్రికిసోకగ చేసియిచ్చె ప్రా
    ణాంతకవ్యాధికిన్ విరుగుడంతయు క్షీరముఁగలిపి ప్రేమతో
    కూతురేతల్లియై జనకుఁగూరిమినక్కునజేర్చి పాలిడెన్ ||

    రిప్లయితొలగించండి
  24. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    మంద పీతాంబర్ గారి స్ఫూర్తితో :
    ఇది చాలా ప్రసిద్ధమైన హృదయవిదారకమైన దారు శిల్పం !
    తండ్రిని చూడ్డానికి జైలుకెళ్ళిన ఒక యువతి
    దాహం దాహం అని అలమటిస్తున్న తండ్రికి
    దాహము దీర్చ చనుబాలు పట్టిన వైనం :

    __________________________________

    నీతిని న్యాయము న్మరచి - నిర్మలుడౌ తన తండ్రి నచ్చటన్
    మేతయు దాహము న్నిడక - మిక్కిలి బాధల బెట్టుచున్న యా
    చేతల జూచి బాధపడి - చేతుల నున్న కుమారువీడి యా
    కూఁతురె తల్లియై జనకుఁ - గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  25. 1అ)
    _________________________________

    నీతిని న్యాయము న్మరచి - నిర్మలుడౌ తన తండ్రి నచ్చటన్
    మేతయు దాహము న్నిడక - మిక్కిలి బాధల బెట్టుచున్న దు
    చ్చేతల జూచి బాధపడి - చేతుల నున్న కుమారువీడి యా
    కూఁతురె తల్లియై జనకుఁ - గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్ !
    __________________________________

    దుర్+చేత = దుచ్చేత

    రిప్లయితొలగించండి
  26. దుర్+చేత = దుచ్చేత
    శంకరార్యా ! సరియేనా ?

    రిప్లయితొలగించండి
  27. లవకుశలో కంకంటి పాపరాజు గారి పద్యం లోని " దుశ్చింత "గమనించండి !

    ఇంతకు బూనివచ్చి వచియింపక యుందునె విన్ము తల్లి ! దు
    శ్చింతులు దైత్యు చేబడిన - సీతను క్రమ్మర నేలుచున్న వా
    డెంత వి మోహి రాముడని - యెగ్గులు పల్కిన నాలకించి భూ
    కాంతుడు నిందజెంది నిను - కానల లోపల డించి రమ్మనెన్ !

    రిప్లయితొలగించండి
  28. శంకరార్యా !

    "దుర్" తో కలయిక మీద ఏర్పడే సంధి కార్యం గూర్చి ఎన్నో సందేహాలు !

    కొంచెం వివరంగా వివరించండి

    రిప్లయితొలగించండి
  29. కూతురుఁ బుట్టినింటికిని కూరిమిఁ దెచ్చుచు జానకమ్మటన్
    రీతిగ కాన్పునున్ జరిపి రివ్వున కూతుకు బిడ్డనివ్వగా
    నాతురతన్ వడిన్ జనకుడంచును పేరిడి ప్రీతి సూనుకున్
    కూఁతురె తల్లియై జనకుఁ గూరిమి నక్కునఁ జేర్చి పాలిడెన్

    రిప్లయితొలగించండి