12, అక్టోబర్ 2013, శనివారం

సమస్యాపూరణం - 1202 (కడుపునొప్పి యనుచు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది.....
కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె.
ఈ సమస్యను పంపిన నాగరాజు రవీందర్ గారికి ధన్యవాదములు.

15 కామెంట్‌లు:

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

కరము నొప్పిబుట్ట కరకర లాడించు
నోట వేసి తిండి పూట పూట
నేడు ముట్టడాయె నిమ్మరసమ్మును
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె.

Guda Raghuram చెప్పారు...

నెత్తియుండిననదినెప్పి పుట్టుచునుండు
పొట్టయున్నవచ్చు పొట్టనెప్పి
లేవివేవి నాకు రావుయే తలనొప్పి
కడుపునొప్పు లనుచు కరము మురిసె!

మిస్సన్న చెప్పారు...

చాలు చాలు నయ్య చాలు నీ చెణుకులు
గొప్ప వాడవయ్య కుప్పు స్వామి
నవ్వి నవ్వి చూడు నాకైన దయ్యయో
కడుపునొప్పి యనుచుఁ గరము మురిసె.

subbarao చెప్పారు...

ఫద్మ యీదినంబు పనికిరాలేదుగ
కడుపు నొప్పియనుచు,కరము మురిసె
కనకదుర్గ తాను కనినకలనుగూర్చి
అభయ హస్త మిచ్చె నంబ కలను

Unknown చెప్పారు...

పండిత నేమానిగారికి గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

మాయ నొప్పి కాదు మ౦దుకులొంగదు
పురిటి శాల కేగు త్వరిత మనుచు
తల్లి పలుక వినిన తనయ బాధను మరచి
కడుపునొప్పి యనుచు గరము మురిసె

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

మిక్కుటంబుగాను మెక్కి యొక్కడరచె
కడుపునొప్పి యనుచు, కరము మురిసె
నెంత కాల మాయె సుంతైన విశ్రాంతి
లేక నేడు కలిగె నాక టంచు .

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసెగాని
జ్వరము వచ్చెననుచు వైద్యుడపుడు
సూదిపొడిచినంత చురచుర భుజముపై
నొప్పి నోర్వలేక నోరుమూసె

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

ఎదుటి వాడి బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి యనుచుఁ !,గరము మురిసె!

డా.ఆచార్య ఫణీంద్ర చెప్పారు...

కమల నయనుడు తన గర్భమ్ములో జేరి,
నెలలు నిండి, పురిటి కలయె దీరు
శుభ ముహూర్త మరిగె! చూడరో దేవకిన్ -
కడుపునొప్పి యనుచుఁ, గరము మురిసె!

బొడ్డు శంకర్ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Unknown చెప్పారు...

సంతులేని సతికి చాల దినములకు
గర్భమయ్యె నంబ కరుణ చేత
ముదిత కొక్కనాడు పురిటినొప్పులు రాగ
కడుపునొప్పి యనుచు గరము మురిసె !

Pandita Nemani చెప్పారు...

మిత్రులారా! శుభాశీస్సులు.
ఈనాటి పూరణలను పరిశీలించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:
భోజన ప్రియు డొకడు కడుపు నొప్పి కావున నేడు ముట్టడాయె నిమ్మరసమును అని పూరించేరు. పద్యము చాల బాగుగ నున్నది.

శ్రీ గూడ రఘురాం గారు:
పద్యము బాగుగ నున్నది. నెప్పి అనే పదము లేదు. నొప్పి అనుటయే సాధువు. రావు + ఏ అనుచోట యడాగమము రాదు.

శ్రీ మిస్సన్న గారు:
కుప్పుస్వామిగారి చెణుకులతో మీ పొట్టకి నొప్పి వచ్చినదా? చాల బాగున్నది మీ పద్యము.

శ్రీ సుబ్బా రావు గారు:
పద్మ పనికి రాలేదు. కనకదుర్గకి కల వచ్చినది. మీ పద్యము బాగుగ నున్నది. కానీ అన్వయ సౌలభ్యము లేదు.

శ్రీ తిమ్మాజీ రావు గారు:
ప్రసవ వేదన నొప్పియే ఐనా ఆనందమును ఇచ్చును కదా. మీ పద్యము చాలబాగుగ నున్నది.

శ్రీ లక్ష్మీనారాయణ గారు:
కడుపు నిండుగా మెక్కి, కడుపు నొప్పి వచ్చినా చాల కాలమునకు విశ్రాంతి దొరకినది కదా సంతోషము అన్నారు. మీ పద్యము చాల బాగుగ నున్నది.

శ్రీ శ్రీపతి శాస్త్రి గారు:
కడుపు నొప్పి కంటే సూది మందు నొప్పి ఎక్కువ అన్నారు. బాగుగ నున్నది మీ పద్యము.

శ్రీ సహదేవుడు గారు:
ఎదుటివాని నొప్పిని చూచి మురిసే వాని గూర్చి చెప్పేరు. చాల బాగుగ నున్నది మీ పద్యము. వాడి అనరాదు - వాని అనుటయే సాధువు.

శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు: బహుకాల దర్శనము. సంతోషము.
దేవకి ప్రసవ వేదన లోకమునకే సంతోష కారణము కదా. చాల బాగుగ నున్నది మీ పద్యము.

శ్రీ బొడ్డు శంకరయ్య గారు:
మంచి విరుపుతో పూరించేరు. కాని అన్వయ సౌలభ్యము లేదు. పద్యము బాగుగ నున్నది.

శ్రీ నాగరాజు రవీందర్ గారు:
బాగుగ నున్నది మీ పద్యము - భార్య ప్రసవ వేదన ఆనందదాయకమే కదా.

స్వస్తి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

శ్రీ నేమని గురువర్యులకు ప్రణామములు మరియు ధన్యవాదములు. తమరి సూచన ప్రకారం సవరణ:

ఎదుటి వాని బాగు నెన్నడు విన్నను
తల్ల డిల్లు చుండు తప్పటోడు
కీడు జరిగె నేని కేరింతలఁబడుచు
కడుపు నొప్పి
యనుచుఁ !,గరము మురిసె!

బొడ్డు శంకర్ చెప్పారు...

ఎక్కు వైన తిండి యిబ్బంది పెట్టగా
కడుపు నొప్పి తో నొకండు బాధ
పడుచు మాని వేయ పనులు, విశ్రాంతితో
కడుపు నొప్పి యనుచుఁ గరము మురిసె

Unknown చెప్పారు...

శ్రీ కంది శంకరయ్య గురువర్యులకు వందనములు,,అర్థ గణదోషములున్న సవరించ ప్రార్థన !

కడుపునింపుటకును కాయకష్టమొకడు
కరము తోడ జేయ కడుపు నవ్వె
తిన్న కూడరుగక తిప్పలు పడుచున్న
కడుపు నొప్పియనుచు గరము మురిసె