19, ఏప్రిల్ 2016, మంగళవారం

పద్యరచన - 1199

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

33 కామెంట్‌లు:

  1. పంచ భక్ష్యములను పళ్ళెమందుంచిన
    నావకాయపైననే వసించు
    తెలు గువారిమనసు తెల్లమ్ముగానెప్డు
    యమృతతుల్య ము కద ఆవకాయ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘తెల్లమ్ముగా నెప్పు| డమృతతుల్యము...’ అనండి.

      తొలగించండి
  2. తే.గీ. ఆవ కాయను కాదను ఆంధ్రుడెవరు?
    దేశ దేశాల తీరాల తిరుగు గాని
    పచ్చ డొదలడు తెలుగోడు పసిడి రీతి
    జాడి గుర్తుకు ఓటేయ జాతి మెచ్చు!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పద్యం బాగున్నది. అభినందనలు.
      ‘ఒదలడు, తెలుగోడు’ అనడం గ్రామ్యం. ‘పచ్చడిని వదలడు తెలుగువా డెపుడును? డెవడును’ అందామా?

      తొలగించండి

  3. మెత్త నుప్పును మరియును మిర్చి పొడిని
    ఆవ పిండిని సమ పాళ్ళ యట్లు జేసి
    కలప వలె నమ్మ ! సమముగ గలి యు వరకు
    ఆవకాయకు కారము నిదియ సుమ్ము .

    మామిడి కాయల ముక్కలు
    గోముగ నా కార మందు కొంచెము కొంచెం
    ప్రేమగ వేయుచు నూ నెను
    దామాషగ వేసి కలిపి దాపున జాడిన్ .

    మూ డు దినములు నటులన ముచ్చ టంగ
    భద్ర ప ఱచియు తదుపరి వాడు కొనిన
    మంచి రుచి గల్గి నో రూ రి మరల మరల
    దినగ గోరిక గలుగును దేవి ! మనకు .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆవకాయజాడియాకారమునుజూడ
      నావకాయతోడనదిరిపోయె
      వేడియన్నమందువేసుకుదినినచో
      చెప్పనేలరుచినినప్పలయ్య!

      తొలగించండి
    2. మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
      కొంచెం అని వ్యావహారికాన్ని ప్రయోగించారు.

      తొలగించండి
  4. " ఆవకాయ్ " పద్యాలు.

    శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book కొరకు నేను వ్రాసిన పద్యములు.

    ఆటవెలది:
    ఆవ పిండి ముద్ద నర చేత బట్టిన
    పసుపు గణపతి గనపడును గాదె
    అయ్య దలచి నేడు , నయ్యావకాయను
    దలచి వ్రాతు పద్యములను నేను.

    ఆటవెలది:
    వేదములను సామ వేదమ్ము తాననె
    పక్షులందు గరుడ పక్షిననియె
    తెలుగు వాడె యైన పలుకును హరి " యూర
    గాయలందు నావకాయ నేను. "

    ఆటవెలది:
    మజ్జిగన్నమందు మరియావ ముక్కను
    నంజుకొనగ దినుచు నమలి తొక్క
    టెంకె మీది పీచు నింకనింకను గోరి
    పీకిపీకి దినుట ప్రియము గాదె.

    తేటగీతి:
    వేడియన్నములో కొంత వేడినెయ్యి
    ముద్దపప్పును జేరిచి ముద్దుగాను
    ఆవకాయను గలిపిన యావ గలుగు
    తినగ నోటికి , తెలియర తెలుగు వాడ.

    కందము:
    పుల్లని మామిడి ముక్కలు
    చెల్లగ సన్నావ పిండి చేతన్ గలుపన్
    తెల్లని లవణము, కారము
    మెల్లగ తైలమ్ము జేర్చ మీదట నావౌ.

    కందము:
    పడిపోయిన లక్ష్మణుకై
    వడి సంజీవనిని దెచ్చెవాయుసుతుండే
    మడిజాడి నావకాయను
    సడిలేకను దెచ్చి పెట్ట సరియగు గాదా !

    కందము:

    ఎరుపుగను నూనె గారుచు
    మెరుపుగ నున్నావకాయ మేలుగ గలుపన్
    పెరుగన్నములో, రుచియే
    పెరుగునులే నిజము, తినుము ప్రియ నేస్తమ ! రా !

    కందము:
    ఖండాంతరమందున్నను
    ఖండితముగ జెప్పవచ్చుకలిపిన ముద్దన్
    మెండుగ నావను జేరిచి
    మండుటలేదనుచు జెప్ప మన " తెలుగోడే ".

    కందము:
    ఇయ్యావ దినిన దేవత
    లయ్యమృతమ్మునకు బోవ నాశించరుగా
    అయ్యారె ! తెలుగు వారుగ
    నియ్యవనిని బుట్టి ' నాక ' మిచటికి దేరే.

    కందము:
    వ్రేపల్లియలో గాకను
    " రేపల్లె " ను కృష్ణుడుండ రేపులు మాపుల్
    ఆ పాలు వెన్న వలదని
    తాపెరుగున నావకాయ తనివిని దినుగా.

    కందము:
    ఆవది, రుచులను జేర్చెడి
    నావది, తగు ఘాటు, వేడి నందించుటకున్
    త్రోవది, శ్రమ జీవులకున్
    చేవది, విను దీనిగొప్ప చెప్పగ లేనే !

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తెలుగు వాడె యైన పలుకును హరి ‘యూర
      గాయలందు నావకాయ నేను.’... మనోరంజకమైన భావం. అద్భుతమైన ఖండకృతి. అభినందనలు.

      తొలగించండి
  5. * గు రు మూ ర్తి ఆ చా రి *
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,


    ఆవకాయ యిష్ట మను చతి మ్రి౦గకు |

    ముప్పు బీ . పి . c బె౦చి ముప్పు తెచ్చు |

    నాశ యెక్కు వైన. నగచాట్లు కలుగురా !

    విశ్వ దాభి రామ వినుర వేమ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగుంది. ‘అనుచు నతిగ మ్రింగకు’ అనడం సాధువు. కాని గణాలు సరిపోవు. ‘...యిష్ట మని కడుఁ మ్రింగకు’ అంటే సరి.

      తొలగించండి

  6. కరము రుచిని గూర్చు ఘాటైన పచ్చడి
    మిరప ఆవ లవణ మిశ్రమాలు
    సరిగ నొకట జేర్చి సరిపోవు తైలంబు
    తిరుగ గలిపి తినిన మురియు జిహ్వ .
    ,,,,,,,,,,,,,,,,,,

    ఆంధ్రు డనెడు వాని యలవాటు జూడగా
    ఆవకాయ రుచికి నలమటించు
    కూరలెన్నియున్న దూరము నెట్టుచు
    పచ్చడులనె మిగుల నిచ్చగించు.
    ,,,,,,,,,,,,,,,,,,,,

    అమ్మ చేతి ముద్ద ఆవకాయైనచో
    జిహ్వ త్రుప్పుడుల్లి వహ్వయనును
    ఇంత కన్న నెందు వింతైన రుచులుండు
    దేశ దేశములను దిరిగి చూడ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ మూడు పద్యాల ఖండిక బాగున్నది. అభినందనలు.
      ‘ఆవకాయ+ఐనచో’ అన్నచోట సంధి లేదు. ‘ఆవకాయ యయిన’ అనండి.

      తొలగించండి
  7. మామిడి కాయముక్కలను మాగెడి జాడికి నింపి-నందులో
    కాముకు డెంచు కారమును కల్తియు గానని మంచి నూనెయున్
    క్షేమము నింపు మెంతి పొడి జేర్చుచు కొంచము నూరినుప్పుతో
    ప్రేమగ నింపినిల్వనిడ పెంచును రుచ్యపు నూరగాయగున్|

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. ‘నింపి యందులో... నూరి యుప్పుతో.. పెంచు రుచిన్ గడు నూరగాయయే’ అనండి.

      తొలగించండి
  8. జాడీ నిండుగ దండిగ
    వాడినఁ దనియరు కరండ బద్దము దానిన్
    వీడరిల నావకాయను
    వేడుక లందాంధ్రు లెల్ల విస్మయ మందన్

    రిప్లయితొలగించండి
  9. 1.
    నిలువ మామిడి పచ్చళ్ళు తెలుగు వారి
    సొత్తు యదియె మనకు సొంత మయ్యె జూడ
    ఉప్పు కారమ్ము పులుపు తో నూరగాయ
    తెలియనట్టి యాంధ్రు డిలన లేడు

    2.
    ఆంధ్రభోజనమున యావకాయ యె మేటి
    ఊరగాయలేని యూరులేదు
    మదిని దోచు నవియె మామిడి పచ్చళ్ళు
    తెలుగుదనము నకది తేజమిచ్చు

    3.
    వేసవి కాలము వచ్చెను
    వాసిగ మామిళ్ళు గాచి మదినే దోచెన్
    భేషుగ్గ నూరగాయల
    కే సరి యగు సమయమునకు కీలక మిదియే

    4.
    అమరు లెరుగ రైరి యావకాయ రుచిని
    యసురు లకుతెలిపని యమృత మదియు
    తెలుగువాడొకడికె నిలువ పచ్చడిరుచి
    తెలుసు నదియె ఘనము తెలుసు కొనుము

    5.
    కువల యమ్ము నందు కులమత భేదమ్ము
    కానరానిదదియు ఘనము గాద
    పేద ధనిక భేదమేదియు గనరాదు
    తెలుగు సంస్కృతినది తెలుపు చుండు

    6.
    ఊరగాయగాంచ నోరూరు చుండును
    ఎరుపు రంగు తోడ యెదను దోచు
    ఉప్పు పసుపు నూనె యొక్కింత కారమ్ము
    ఆవపొడులు కలియ నద్భుతమ్ము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ ఆరు పద్యాల ఖండకావ్యం బాగున్నది. అభినందనలు.
      మొదటి పద్యంలో ‘సొత్తు+అదియె’ అన్నపుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘సొత్తుగా మన కదె సొంత మయ్యె జూడ’ అనండి. చివరిపాదం ‘ఆటవెలది’ అయింది. ‘తెలియరానట్టి యాంధ్రు డీ యిలను లేడు. అనండి.
      రెండవపద్యంలో ‘భోజనమున నావకాయ...’ అనండి.
      మూడవపద్యంలో ‘భేషుగ్గ’ అనడం గ్రాంధికం కాదు. ‘భేషనగ నూరగాయల’ అనండి.
      నాల్గవపద్యంలో ‘రుచిని| నసురులకు తెలియని..’ అనండి.
      ఆరవపద్యంలో ‘నోరూరుచుండగా| నెరుపు రంగుతోడ నెదను దోచు| నుప్పు... కారమ్ము| నావపొడులు...’ అనండి.
      సాధ్యమైనంత వరకు పద్యం పద్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ, నుగాగమ సందులతో వ్రాయండి.

      తొలగించండి

  10. 1.ఆవకాయ లేని ఆవాసమేలేదు
    ఆవకాయ తినని ఆంధ్రు డెవడు
    అన్ని వంటకముల నరసి జూడ నిదియె
    మిన్నయంచు జనులు మెచ్చు చుంద్రు/కొంద్రు.

    2.ఉప్పు బాగ దంచి యూరగాయలొ కల్పి
    మెంతి ,ఆవ పొడిని మిరప పొడిని
    సమము గాను కలిపి చక్కగా నూనెను
    పైన వేయ తినుచు వహ్వ యనరె.

    3.ఆవకాయ దెచ్చి అన్నమందుకలిపి
    చేతి ముద్ద లేయ చిన్నవారు
    కూడ కారమనక కోరి తిందురుగదా
    ఆవకాయ యన్న యావ హెచ్చు.

    4.ముక్కల పచ్చడి యైనను
    మక్కువ తోడను కలుపుకు మరువక నేతిన్
    యెక్కువ వేసుకు తినగా
    ఎక్కడి కెళ్ళక జనములు నిక్కడె యుందుర్.
    5.కొత్త ఆవకాయ కూరిమితోకలిపి
    చేతి ముద్దలేయ సిద్దమయ్యె
    బామ్మ తినగరండు బాలబాలికలార
    ఆవురావు రనుచు నాత్రముగను.
    6ఎరుపు రంగు తోడ మిరుమిట్లు గొలుపుచు
    నోటి లోన నీరు నూర జేయు
    నూరగాయ యన్న నుర్విలో యిదియేను
    ఆదరమున తినుడు నావకాయ.

    రిప్లయితొలగించండి
  11. మీ ఆరు పద్యాల ఖండకావ్యం బాగుంది. అభినందనలు.
    రెండవపద్యంలో ‘ఉప్పు మిగుల దంచి’ అనండి. ‘ఊరగాయలొ’ అని ‘లో’ ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. ‘...యూరగాయను కల్పి’ అనండి
    నాల్గవపద్యంలో ‘కలుపుకు’ అనడం సాధువు కాదు. ‘నేతిన్+ఎక్కువ’ అన్నపుడు యడాగమం రాదు. ‘కలిపియు మరి నేతిని తా| మెక్కువగ వేసి తినగా...’ అనండి. ‘వేసుకు’ అనడమూ సాధువు కాదు. ‘తినగా| నెక్కడకు బోక జనగణ మిట నుందురుగా’ అనండి ‘ఉందుర్’ అనరాదు.
    ఆరవపద్యంలో ‘ఉర్విలో నిదియె యని| యాదరమున...’ అనండి.
    పద్యం మధ్యలో అచ్చులు రాకుండా అవసరమైన యడాగమ, నుగాగమ సంధులతో వ్రాయండి.

    రిప్లయితొలగించండి
  12. చూడఁగనే నోరూరెన్
    జాడీలో నావకాయ జలజలమనుచున్
    వేడిగ నన్నము నందున్
    పాడిగ వడ్డించఁ సురలు పరుగనఁ దినరే!

    రిప్లయితొలగించండి
  13. ఆవకాయ దినని యాంధ్రుడు లేడయా
    ఆవకాయ లేని తావు గలదె
    ఆవకాయె మనకు నమృత సమానము
    ఆవకాయ గాదె నాంధ్రమాత!!!

    రిప్లయితొలగించండి
  14. జ్యోతి వలభోజు గారి e-book కొరకు నేను వ్రాసిన పద్యములు


    కరివదనా! నిన్ను దలచి!
    పరిమళమిడు నావకాయ పద్యము లల్లన్
    మురియుచు కలమును బట్టితి
    ధరమెచ్చెడి భావములిడి దయతో గనుమా!!!


    చక్కనిది యావకాయయె
    ముక్కను కొరకంగ చాలు ముక్కంటియు దా
    మక్కువతో మరి వదలక
    చక్కగ జాడీని బట్టి చను నిజపురికిన్!!!


    ముక్కల తో పెట్టగనిది
    సొక్కని వారెవ్వరుంద్రు సురభిని జూడన్
    పెక్కురు ప్రతిరోజు దినెడు
    చక్కని దగు నావకాయ జయజయ జయహో!!!

    చక్కని మామిడి కాయలు
    ముక్కలు గొట్టించి మురిసి పూనిక తోడన్
    ముక్కోటి దేవతలకున్
    మ్రొక్కుచు మరి నావకాయ మొదలగు నిండ్లన్ !!!

    ఆపదల నాదుకొనునిది
    చూపరులకు విందుజేయు చుర్రను దినగా!
    తీపిని జేర్చిన బహురుచి
    గోపాలుడు మెచ్చెనంట గోముగ దీనిన్!!!

    ఎండా కాలము నందున
    నిండుగ మన గుండెతాకు నేస్తంబిదియే!
    మెండుగ బెట్టుదు రందరు
    యండగ తానుండుగాదె యతివల కెపుడున్!!!



    కూరిమిగ నావకాయను
    నోరారన్ దినని వారు నుర్విని గలరే
    యూరిన యూటను జూడగ
    సూరియె చవిజూడవచ్చు సుఖముగ నిలకున్!!!



    కొమ్మలు వండెడి పప్పున
    నిమ్ముగ మరి దోసెలందు నిడ్లీలందున్
    గుమ్ముగ పెరుగన్నమునన్
    కమ్మగ తా నొదుగు నావ కాయయె సుమ్మా!!!

    గారెలు బూరెలు వడలున్
    తీరుగ పొంగలి నిజేసి దేవర నీకై
    కూరిమిగ నావకాయను
    చేరువలో నుంచినారు చేకొనుమయ్యా!!!

    ఆంధ్రులకు చెందు సొత్తిది
    యాంధ్రమున జనించెనిదియె నధికారముగన్
    నాంధ్రమున మాత తానయి
    యాంధ్రులకా నావకాయె యాదరువయ్యెన్!!!

    రిప్లయితొలగించండి
  15. " ఆవకాయ్ " పద్యాలు.

    శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book కొరకు నేను వ్రాసిన పద్యములు.

    1.
    అయిదిళ్ల భిక్ష మెత్తిన
    దయామయుడు నావకాయ దక్కిన వేళన్
    రయమున భక్తుల కిచ్చెనె
    నయముగ నోరూర వారి నాలుక లలరన్!
    2.
    పారాయణమ్ము వీడక
    నారాయణు గొల్చు నట్టి నారదుడైనన్
    నోరూరు నావకాయను
    మారుగ వడ్డించి నంత మంగళ మనడే?
    3.
    తాళిఁ గట్టు వేళఁ దగవులాడగ బావ
    తల్లడిల్లి నట్టి పిల్ల నాన్న
    కట్నమిచ్చి నాడ కంగారు లేలన?
    నన్నమందు నడిగె నావకాయ!
    4.
    కాలెడు కడుపును బట్టుకు
    జోలెను జూపించి వగచి జోగెడు వాడున్
    వేళకు నన్నము పైనను
    జాలిగ నిడ నావకాయ సంబర పడడే?
    5.
    మదిలోన నావకాయయె
    పదిజాడీలమ్మబ్రతుకు బంగారమనన్!
    పదవులకై తిరుగాడెడు
    చదువులు పూర్తైన నొకడు సంపాదించెన్!
    6.
    లవణ మెక్కు వైన రక్తపోటంచును!
    రోగి చేయిఁ బట్టి రొప్పు వెజ్జు
    నింటి కేగి వాడు కంటఁ జూడంగనే
    నావకాయ లేక యసలు తినడు!
    7.
    పాలకోవఁ జూడ పరమాన్నములఁజూడ
    నోట నీరులూరు మాటయేమొ?
    నావకాయఁ జూడ నవని జనులె కాదు
    చొల్లు కార్చనట్టి సురలుఁ గలరె?
    8.
    ఆవకాయఁ జూచి యాగలేకున్నను!
    లాభ నష్ట మెరుగ రక్ష యనుచు
    భక్తి తోడ మ్రొక్కి పలికి భక్షించగన్
    జాలువారు దాని జాలి యూట!
    9.
    గీత బోధఁ జేయు కృష్ణమూర్తియు నాడు
    నావకాయఁ దినవె బావనీవు?
    రోషమెక్కడంచు? భాష పెంచ!
    విల్లు చేతఁ బట్టి విజయుడాయె!
    10.
    ఆవకాయ పైన నల్లిన పద్యాల
    నొక్క టైనఁ జదివి నోరు లూర!
    మారు జన్మలేక చేరుచు స్వర్గమ్ము!!
    యప్సరసల చేత నమృతమంద!!

    రిప్లయితొలగించండి
  16. 11.
    నంద కులము లోన నందాల కృష్ణయ్య
    గొల్లభామ లింట గోప్య ముగను
    యావకాయఁ జీకి యంగిలి కారమై
    పిదప దోచె నంట పెరుగు వెన్న

    రిప్లయితొలగించండి
  17. దేవ కులపతి యెండలోఁ దోవఁ దప్పి
    తెలుగు నేలపై నడుగిడి తిరుగ సాగె
    నూర గాయల ఘుమఘుమ లూర్ధ్వ మంట
    నమృత మిచ్చెద నిమ్మనె నావకాయ

    నవ్వుకున్నారు మనసులో నమ్మలేక
    కాని పొమ్మన తమనోట రాని వారు
    నతిథి నెవడైన భగవంతు డనుచు నాత్మ
    తలచి నింద్రుని రమ్మని పిలిచి రంత

    బేర మేలనో తిను కడుపార ననుచు
    ప్రజలు కొసరి వడ్డించిన పరవశాన
    కోరి తిను చూర గాయల తీరు లన్ని
    నెండ కాలము నింద్రుడు నిచట గడిపె


    చేరి స్వర్గము మేఘాల చేర బిలిచి
    తెలుగు నేలలు బంగరు వెలుగు లీన
    వర్ష మందించ తనకది హర్ష మనియె
    ఆవ కాయల రుచి మనసావరింప

    రిప్లయితొలగించండి
  18. ఆవకాయపద్యములు
    1.
    ఆః పంచ భక్ష్యములను పళ్ళెమందుంచిన
    నావకాయ పైకి పోవు మనస
    యాంధ్ర గృహము లందు నమృతమే యియ్యది
    పప్పుతోడ తిందు రొప్పుగాను
    2.
    ఆ: కుప్ప నూర్చు నపుడు కూర్మితో కర్షకుల్
    కూడు, చుట్టు చేరి కుడుచు నపుడు
    మజ్జిగన్న మందు మామిడి పచ్చడి
    నంజు చుంద్రు కరము రంజితముగ
    3.
    ఆః తెలుగువారి మదిని తృప్తి కలుగు, పెండ్లి
    బంతిలోన నావ పచ్చడున్న
    పరుల దేశ మందు వసియించు వారైన
    నడిగి తెచ్చు కొందు రావ కాయ
    4.
    కః బమ్మెర పోతన సైతము
    యిమ్ముగ వర్ణించె సుమ్మయీ పచ్చడినే
    కమ్మని మామిడి పచ్చడి
    నమ్మమ్మే చేయ తింటినానందముగా

    5.
    ఆః ఆవకాయ లేక అన్నమే వలదని
    అలిగి దాగి యుండ నటుక పైన
    పిలిచి పచ్చడిడెను పేర్మితో పెద్దమ్మ
    ముద్ద పప్పు తోడ ముద్దుగాను
    6.
    ఆః రక్తపోటటంచు వ్యక్తపరచి వెజ్జు
    పచ్చడే వలదని హెచ్చరించ
    నెలకు నొక్క మారు నేయి పప్పు కలిపి
    యారగించు చుంటి నావకాయ
    7.
    కః మామిడి ముక్కల తోడుత
    భామినులందరును చేరి బాధ్యతతోడ
    న్నమృతమునుబోలు పచ్చడి
    ధామములనుచేయుచుంద్రు తనియుచు మదిలో
    8.
    తేః మావి ముక్కల యందున మంచి నూనె
    ఆవపిండి కారమునుప్పు నందుఁజేర్చి
    యూరబెట్టతయారగు నూరుగాయ
    అర్థితో గ్రోలుదురు దీని నాంధ్రులంత
    9.
    ఆః ముద్దపప్పులోన పోడిగా కలిపిన
    నావకాయ నెయ్యి నర్థిఁగొనిన
    స్వర్గమె దిగివచ్చు సదనమ్ము లోనికి
    నన్నమాట సతతమున్ననిజము
    10.
    ఆః పంచె కట్టులోన వసుధలో మొనగాడు
    పద్య విద్యలోన వన్నెకాడు
    నధిక మైన కీర్తి నమెరికా కేగిన
    నావకాయకొరకు నరయు చుండు
    11.
    ఆః అన్నపూర్ణ తల్లి యర్థితో సృష్టించె
    నావకాయ పచ్చడవనియందు
    పంటకాపులిండ్ల పన్నెండు మాసముల్
    నిలువయుండు సుమ్మ నీటుగాను
    12 & 13.
    ఆః మగువ ముద్దుగాను మామిడి ముక్కలన్
    కోయమంచు నన్ను కోరగానె
    చేరినాను వేగ చేడియ చెంతను
    చూడ దాని మేను సోయగమ్ము
    తేః పనితనమ్మును చూసితాఁ బరవశించి
    తన్వి చేపట్టె నాచేయి తనివి దీర
    చక్కనైన చిన్నది నాకు చిక్కెననుచు
    నమ్మ దీవించె మాజంట నరుసమొంది
    14.
    ఆః పొలము పనులఁజేసి యలసిపోయినపుడు
    మజ్జిగన్నము కడు మంచిఁ జేయు
    దోసిలందు ముద్ద వాసిగాఁ గుడుచుచు
    నావకాయ నంజు టద్భుతమ్ము
    15.
    తేః అమ్మలక్కలందరుఁజేరి ఆవకాయ
    పచ్చడితగుపాళ్ళకలిపి పలువిధముల
    యోగ్య మగు పాత్ర లోనుంచి భాగ్యమటుల
    వాడు చుందురు పల్లెలన్ వత్సరమ్ము
    16.
    ఆః సెలవు దినము రోజు స్నేహితు నింటికి
    నరిగినాము కలసి యారుగురము
    మంచి టిఫెను బెట్ట నెంచగా మిత్రుడు
    ఆవకాయ చాలు నంటి మెల్ల

    17.
    ఆః నూజివీడు నుండి న్యూయార్కు నగరమ్ము
    అరుగుచుండె నాంధ్ర ఆవకాయ
    విశ్వ మంత నిద్ది విఖ్యాతి గాంచెను
    చవికి దీని కేది సాటి రాదు
    18.
    తేః ఆవకాయ పచ్చడి లేని యాంధ్రులయిలు
    కాటిరేని కోవెలలేని గ్రామములును
    కాంచలేమను మాటలు కరము నిజము
    అమృతమేసుమ్మ నిజముగ నావకాయ

    రిప్లయితొలగించండి
  19. శ్రీమతి వలబోజు జ్యోతి గారు నిర్వహించిన "ఆవకాయ పద్యాలు" e-book కొరకు నేను వ్రాసిన పద్యములు.

    రిప్లయితొలగించండి
  20. ఇమ్ముగ నున్నది చూడగ
    తెమ్ముర నాకిప్పుడెనన తిప్పలు వచ్చున్...
    గుమ్మా! యిది యెట్లన్నన్:
    కమ్మనిదౌ నావకాయ కడుపును గోకున్ :)

    రిప్లయితొలగించండి