23, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము - 7


 భారతీయ సిపాయి
రచన : ఆంజనేయ శర్మ (విరించి)

ఉ.       త్యాగము సేసినావుగద ధన్యుడవోయి సిపాయి మాతృభూ
భాగపు రక్షసేయ కడు భారపు దీక్ష వహించినావు నీ
వా గిరికానలందున నివాసము జేసి విదేశ వేగులన్
డేగలబోలు శాత్రువుల ఢీకొని నిల్చెదవోయి ధీరుడా!

ఉ.       భారతభూమి రక్షణయె బాధ్యతగా గొని తల్లిదండ్రులన్
దారసుతాదులన్ విడిచి ధారుణి యంచున కొండ కోనలన్
జేరిన త్యాగమూర్తులు నజేయ పరాక్రమ శీలులౌ మహా
ధీరులు మీదు త్యాగధన దీప్తుల నెంచ మహోజ్వలంబులౌ.

ఉ.       శ్రీకర భారతావని విశిష్టచరిత్రయు రత్నగర్భతన్
సాకృతి నొప్పు సంస్కృతుల సంచితశోభల మాతృభూమినిన్
పోకిరి మ్లేచ్చులీ యవని పుణ్య సుసంస్కృతి మ్రుచ్చలింపగాన్
పోకిరి చేష్టలన్ దునుమ పోరును సల్పి మదంబు ద్రుంచుమా.

ఉ.       ఆరడి పెట్టు దుర్జనులనంతము సేయగ రుద్రమూర్తివై
పోరును సల్పు, రక్కసుల పోకిరి మూకల నాశనంబునే
కోరితి నుగ్రవాదమును కూకటివ్రేళుల సంహరించుమా
భారతి కీవు రక్ష సుర భారతి నీకు సదా సురక్షయౌ.

ఉ.       భారము గాదు నీకు భవబంధములన్ విడనాడి ద్రోహులన్ 
మారణకాండ సల్పుదువు మాన్యుడవైన సిపాయివోయి సం
హారము జేసి శాత్రవుల నంతము జేయుము వారి దుష్కృతుల్ 

తీరదు నీ ఋణం బెపుడు తీర్చగ జాలరు భారతీయులున్ .  

17 కామెంట్‌లు:


 1. భారతీయసేనబ్రాముఖ్యముగురిచి
  వారుచేయుసేవ,వారిదీక్ష
  గూర్చిచక్కవ్రాసికోవిదుడవయిన
  నాంజనేయశర్మ!యాశిసులివె.

  రిప్లయితొలగించండి
 2. వెనుదిరగక సాగే సేనావాహినిలా ఒకటే ఉత్సాహంతో ముందుకు సాగింది ఉత్పలమాలావళి. సరైన గుర్తింపే వారికి నివాళి. ఇప్పటివరకూ వచ్చిన ఖండికలలో అత్యుత్తమంగా ఉందనుకుంటున్నాను. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. మీదు దేశ భక్తి మిన్నంటిపోయెను
  పద్యగంథమెంతొ పరిమళించె
  ఉత్పలంబులన్ని యున్నతరీతిని
  కాంతులీని మహిత క్రాంతిదెచ్చె.

  రిప్లయితొలగించండి
 4. రిప్లయిలు
  1. ఆంజనేయ శర్మ గారు దేశ రక్షణ ధురంధరాభినందనముగా మీ పద్య పంచ రత్నాలు మనోహరముగా భాసిల్లుచున్నవి. అభినందనములు. మొదటి పద్యము లో "శాత్రవుల ఢీకొని" అనండి. ముద్రణా దోషము గాబోలు.

   తొలగించండి
  2. ధన్యవాదములండీ _/|\_

   మీసూచనకు కృతజ్ఞతలండీ ...... సరిచేస్తాను

   తొలగించండి
 5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 6. ఆంజనేయశర్మ నందించుమాలలు {ఉత్పల మాలలు}
  భరత భూమిరక్ష భావనలను
  పగలు,రాత్రియనక పాటుబడగల సి
  పాయి|ధన్యు డనుట-పద్యపలుకు|

  రిప్లయితొలగించండి
 7. శ్రీ ఉమారామ లింగేశ్వర శతకం
  రచన :వడ్డూరి అచ్యుతరామకవి
  రాజకళాధరాయ | నాగరాజ సుతా హృదయేశ్వరాయ | గో
  రాజ తురంగమాయ |ఫణి రాజ మనోహర భూషణాయ | నీ
  రాజిత రాజమౌళి మణిరత్న సముచ్చయ పాడుకాయ | నీ
  రేజ భవార్చితాయ | హర | ఋగ్వినుతాయ | శివా | నమోస్తుతే

  కమనీయ గగన గంగాతరంగ విలాస | భాస్వజ్జటా జూట భాసురాయ |
  మహనీయ మాణిక్య మని మనోహర లసద్భోగీంద్ర భూషణ భూషితాయ |
  కాలానలాభీల కీలోగ్ర మాలికా లులిత కుంతల ఫాలలోచనాయ |
  శిశిర శీతల సుధాశీకర శీతాంసు |ఖండమండిత జటా మండలాయ |
  పాండురాంగయ ఫూల విబ్రాజితాయ
  మల్లికార్జున దేవాయ |మంగళాయ |
  అచ్యుతార్చిత పాదాయ | అవ్యయాయ |
  ఓం నమశ్శమ్ కరాయ | మృత్యుంజయాయ |
  ప్రణవ స్వరూపాయ పాపౌఘ నాశాయ పార్వతీ హృదయాబ్జ భాస్కరాయ
  ఖండేందు భూషాయ |కమనీయ వేషాయ కాంచనాచల దివ్యకార్ముకాయ |
  కైలాస వాసాయ |గజదైత్య నాశాయ గంగాధరాయ |జగన్నుతాయ |
  శర్వాయ |సర్వాయ|నిర్వాణ సుఖదాయ గర్విత దుష్టాంధ కాంతకాయ |
  పరమ పురుషాయ భక్తౌఘ పాలనాయ |
  అచ్యుతార్చిత దివ్య పదాంబుజాయ |
  ప్రణవ రూపాయతే నమో భవహరాయ
  శ్రీ ఉమారామలింగాయ చిన్మయాయ |

  రిప్లయితొలగించండి