30, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము - 13

రావోయి చ౦దమామ!
ర చ న : గురుమూర్తి ఆచారి

చ౦దురు డ౦తరిక్షమున చల్లని కా౦తుల నీనువాడు, మె
చ్చ౦ దగు న౦దగా డనుచు  సన్నుతి జేతురు శాస్త్రవేత్త లా
చ౦ద మదేమొ లేశము విచార మొనర్పగ దెల్లమాయె; దా
ని౦ దలపోయ నేలనొకొ! నీ నిలు వెల్లను రాతి ముక్కలే!  

క్షీర మహాబ్దిలో బొడమి శీతమయూఖుడు స౦తతమ్ము సొ౦
పారగ నిట్లు రాజిలు నట౦చు  భ్రమి౦చిరి తొల్లి; నేడు బ౦
డారము తేలిపోయినది; డ౦బము లేటికి? యెల్లవారు  ని
న్నారసి నవ్విపోదు రకటా! యిక దాగుము మబ్బు మాటునన్!

“క౦తుడు మెచ్చగా ప్రణయ కా౦తిని చల్లెద ప్రేమ జ౦టపై;
కా౦తుడ నేనె విశ్వమున; కా౦తుడ ని౦గి; నిశానిత౦బినీ
కా౦తుడ; తాప నాశకుడ; కల్వలకున్ జెలికాడ” నంచు న
శ్రా౦తము పొ౦గ నేటికి శశా౦క? యద౦తయు వ్యర్థమే యగున్!

{ కా౦తుడు = చక్కనివాడు. కా౦తినిడువాడు  }

అరయగ చ౦ద్ర వ౦శజులునై ధర నేలి యశ౦బు గా౦చి రా
పరమ పరాక్రమ స్థిరులు పా౦డవు లెల్లరు; శ్రీరమేశుడున్
నిరతము నిన్ను దాల్చె నొక నేత్రముగా; నిను నిత్యమున్ మహే
శ్వరుడును ప్రేమ తోడ తలపై ధరియి౦చె, న దేమి చిత్రమో!

తరుణి ముఖమ్ము వర్తుల సుధాకర బి౦బము బోలు న౦చు, నా
సరసిజ నేత్రి  హాస మొక చ౦ద్రిక య౦చు మహాకవుల్ వచి౦
చి; రయిన “కా౦తి నీ సహజ సిధ్ధము కాదని, క్షోణిమ౦డల
స్ఫురితమె చ౦ద్రమ౦డలము సూ” యని పల్కిరి శాస్త్రవేత్తలే!

తద్దయు గేలి సేసితిని; తప్పుల వీడి శమి౦పు మయ్య;నీ
పెద్దతనమ్ము నే నెరుగు విఙ్ఞుడ కాదయ; మాను మల్క; నా
“ముద్దుల చ౦దమామ” యను మోదము డె౦దము న౦దు చి౦ద నే
నెద్దియొ మాటలాడితి శశీ! నిజ మేదొ, మరే  దసత్యమో!

ప్రమదల పైన పూరుషుల పైనను తీక్ష్ణ సుమాయుధ ప్రయో
గము నొనరి౦చి వేట గొను క౦తుని స్య౦దన మైన యట్టి చ౦
ద్రమ! శరవేగ మేటికి, నిదానముగా చనుమోయి; యిప్పుడే
క్షమ పయి నెక్కు వయ్యె జన సా౦ద్రత; విశ్రమ మొ౦దు డిర్వురున్.

జన స౦ఖ్యాధిక మైన భూమి పయినన్ స్థానమ్ము లేదాయెగా!
వినుమో శీతకరా! మనుష్యుడు భవ ద్బి౦బమ్ముపై కాలు మో
పును, నిర్మి౦చును సౌధముల్, మరియు రేపో మాపొ తా యత్న మూ
ను నివాస౦ బొనరి౦ప; నీ విడుమ స౦తోషమ్ము సౌకర్యమున్.

12 కామెంట్‌లు:

 1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 2. ఆచారి గారూ మొదటి మూడు పద్యాలు చందమామకి అందాన్నిచ్చే మచ్చ లాగను, మిగిలినవి వెండి వెన్నెల లాగను మనోజ్ఞంగా అలరారుతున్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 3. నీలిమేఘాలమధ్యననిమిడియున్న చందమామనుజూడగసంతసమ్ము గలిగిహాయిగనిదురింతురిలనుజంటి పాపలుమరియునాచారిపాటవినుచు నేమియధ్భుతమాపాటయేమిరచన సాటిలేరండియతనికిసాటివారు

  రిప్లయితొలగించండి
 4. విందాయెను కవితలలో
  నందించిన భావఝరుల నందుకొనంగన్
  డెందమలర నుడివితి రా
  చందురుని వియత్పథంబు ఛందంబలరన్!

  రిప్లయితొలగించండి
 5. విందాయెను కవితలలో
  నందించిన భావఝరుల నందుకొనంగన్
  డెందమలర నుడివితి రా
  చందురుని వియత్పథంబు ఛందంబలరన్!

  రిప్లయితొలగించండి
 6. గురుమూర్తి ఆచారి గారు మనోహరమైన పద్యాలు వ్రాసారు. అభినందనలు. భూదేవి ని మనమెల్లప్పుడు చూస్తున్నా దేవత లా పూజిస్తాము. అలాగే సూర్యున్ని చంద్రున్ని గ్రహాలను పూజిస్తాము. ప్రకృతిని పూజించడము మన సాంప్రదాయము. అందుచేత శాస్త్రజ్ఞుల పరిశోధన మన మనోభావాలను మార్చలేదు.

  రిప్లయితొలగించండి
 7. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 8. .శ్రీగురుమూర్తిగారిరచన శాస్త్ర వేత్తలకు పూర్వులనమ్మకాలకుమధ్యవిశ్లేషణగానుంది
  చల్లని వెన్నెల చంద్రుడు
  ఉల్లమునన్ సంతసంబు లూయల లూపన్?
  అల్లుడవై|ఆమామకు
  చిల్లుంచుట చిత్ర మేగ?శ్రీ గురుమూర్తీ| {ఆమామకు=చందమామ,అందరికిమామే}

  రిప్లయితొలగించండి
 9. చందురుని మించు
  నందమొలికించు
  హృద్యమైనయట్టి
  పద్యములకు
  జేజేలు.

  రిప్లయితొలగించండి
 10. కావ్యాన్నైనా ఖండ కావ్యాన్నైనా శ్రీతో మొదలపెట్టాలని, మొదటిపాదంలో కొన్ని అక్షరములు నిషేదమని గురువర్యులు చింతా రామ క్రిష్ణా రావుగారు చెప్పారు. డాక్టర్ విష్ణు నందనుగారు మాత్రమే ఆనియమాన్ని పాటించారు. దీనిపై వివరణ యివ్వవలసినదిగా ప్రార్థన.

  రిప్లయితొలగించండి

 11. గు రు మూ ర్తి ఆ చా రి

  " రా వో యి చ ౦ ద మా మ " అను నా
  ఖ౦డ కావ్య పద్యములను గ్రహి౦చిన. ి
  గురువర్యులకు శ్రీ క౦ది శ౦కరయ్య గారికి
  ధన్యవాదములు . పాదనమస్కారములు.
  … …………………………

  శ్రీ మిస్సన్న గారికి , శ్రీ సుబ్బారావు గారికి
  శ్రీ S.శర్మ గారికి ,శ్రీ ఈశ్వరప్ప గారికి
  శ్రీ GVS.సహదేవుడు గారికి
  ధన్యవాదములు తెలియజేయచు వ౦దనము లర్పిస్తున్నాను .
  …………………………………………………………

  శ్రీ యుతులు పోచిరాజు కామేశ్వర రావు గారికి
  వ౦దనములిడుచూ, విధేయుడు గురుమూర్తి
  ఆచారి :-- ప్రకృతిని పూజి౦చుట మన
  స౦ప్రదాయ మను మీ ఉద్దేశ్యము తో నేను
  స౦పూర్ణ౦గా ఏకీభవిస్తాను . నేను కేవలము
  వినోదాత్మక౦గా మాత్రమే వ్రాశాను.
  .…….……………………………………

  శ్రీయుతులు A సత్యనారాయణరెడ్డి గారికి
  నమస్కరిస్తూ విధేయుడు గురుమూర్తి
  ఆచారి :- ఇది దైవస్తుతి కాదు కదా యని
  " శ్రీ " తో మొదలిడ లేదు.

  ఇక మొదటి పాద౦లో నిషిధ్దాక్షరము లేవో
  నాకు తెలియదు. మీరు కానీ, డాక్టర్ శ్రీ విష్ణు న౦దన్ గారు కానీ తెలియ జేస్తే
  స౦తోషిస్తాను .
  ……………………………………………………

  రిప్లయితొలగించండి