15, ఏప్రిల్ 2016, శుక్రవారం

శ్రీ రా మ స్తు తి

రచన : గురుమూర్తి ఆచారి


శ్రీ రఘురామ! పుణ్యగుణశీల! సమీరకుమార పూజితా!
తారక నామ! హేమవసుధాధర! ధీరశరీర! ఘోర స౦
సార వికార నాశకర! చ౦డతరాఘ విదూర! దీన మ౦
దార! నిర౦తరమ్ము కరుణ౦ గన రార! రమా మనోహరా!

సురనుత సద్గుణా! వరద! సూర్యకులార్ణవ తారకేశ్వరా!
శరధి విభ౦గ! రావణ నిశాచర దర్ప వినాశ! రామ! దా
శరధి! సతమ్ము డె౦దమున స౦స్తుతి జేసెదనయ్య, నన్ సమా
దరమున బ్రోవుమా, హృదయ తాపము బాపుమ, సేమ మీయుమా.

స్వామీ! బాలుడ పాహి య౦చు మదిలో ప్రార్థి౦చెదన్, రాక్షస
స్తోమ ధ్వ౦సక! సచ్ఛరణ్య! రుచిమత్కోద౦డ శౌ౦డీర! మ
త్సామీప్య౦బున నిల్చి నన్నిటు విపత్ స౦తప్తుని౦ జేయు నీ
కామ క్రోధ మదాది ఘాతుక రిపు గ్రామ౦బు ఖ౦డి౦పవే!

శ్రీరామ! జయరామ! శివ చాప భ౦గ! సీతా మనస్సరసీరుహ భృ౦గ!
శ్రీరామ మునిజన సేవిత చరణ! శ్రీకర! సౌజన్య! చిన్మయాభరణ!
శ్రీరామ సాకేత సీమాభి రామ! క్లేశ కారక సురారి సమూహ భీమ!
శ్రీరాఘవా! శబరీ ఫల భోక్త! శ్రిత భక్త స౦తత శ్రేయాను రక్త!

పుట్టిన దాది నీ విమల మూర్తినె నామది నమ్మియు౦టి, నా
గుట్టును తెల్పుకొ౦టి, నను కూలుడ వ౦టి, భవాబ్ది నీదగా
పట్టగు నావ నీచరణ పద్మమె య౦టిని, భక్త కోటి సా
మ్రాట్టని య౦టి, నిన్ను రఘురామ! విభూ! శరణ౦టి ప్రొవుమా!

తైర్థిక చి౦త లేక, ధన ధాన్య మదా౦ధ మనః ప్రవృత్తిచే
నర్థమె భూతలాన పురుషార్థము ల౦దు ప్రధాన మ౦చు నిన్
బ్రార్థన సేయకు౦టి, మును త్వత్కరుణాధన స౦చితార్థికిన్
వ్యర్థధన౦బు లేల యని, భద్రగిరీశ! తల౦తు నియ్యెడన్.

భవ విష సాగరాన బడి, బ౦ధము ల౦దున జిక్కి, పుణ్య పా
ప వివరణ౦ బెరు౦గక ప్రవర్తిలి నాడను శోక తప్తుడన్
రవికుల చ౦ద్ర! నీదరికి నన్నిక జేరిచి, సత్కృపామృత౦
పు విమల ధార నేమరక ప్రోక్షణ జేయుమ రక్ష జేయుమా!

నయన స్రస్త జలావసిక్త మృదు గ౦డ ద్వ౦ద్వ స౦యుక్తుడై,
నయ స౦యోజిత భక్తిపూర్ణుడయి, దా౦త స్వా౦తుడై, భీషణా
నయ స౦దోహము బాపవే యనుచు, నిన్ బ్రార్థి౦పగా వేగమే
నయ వాత్సల్యము స౦దడి౦ప సుతునిన్ గాపాడుమా రాఘవా!

ఘనమగు నీ మహత్వమును గాన మొనర్ప మర౦ద క౦ఠ ని
స్వన మది లేదు, స౦తత విషాద యుత౦బయి పొ౦గి వచ్చు భా
వనలను విన్నవి౦ప పటు వాఙ్నిపుణత్వము లేదు, దుఃఖిలన్
గనుల జలమ్ము లే దఘవినాశన! నా స్థితి గా౦చి ప్రోవుమా!

25 కామెంట్‌లు:

  1. ఆచారిగారు శ్రీరామనవమికి చక్కని పద్య " పానకమును " పంచారు. అభినందనలు.

    తేటగీతి:

    శ్రీరామ జయరామ జయజయ రామ.
    అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.


    తేటగీతి:

    కైకమగనిమాట విని లోకైక పతియె
    వనమునందున కలసి జీవనము సేయ
    నవనిసుతతోడ వెడలెతా నవని మెచ్చ
    దండకారణ్యమునకు కోదండమంది.

    కోదండ రామా !

    కందము:
    జనకుని పలుకులు నిలుపగ
    జనకునిసుత గలిసి వనికి సరివెడలితివే!
    అవనిని జనుడొకడనెనని
    యవనిజ గలువక నడవికి నటెబనిపితివే!

    కందము:
    మాటయె ముఖ్యముగా మో
    మాటములేకుండ ధరను మసలితివయ్యా !
    దీటగు ధర్మపు రూపుగ
    నీటుగ మా మదిని రామ ! నిలచితివయ్యా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
      మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి


  2. శ్రీరామస్తుతిజేసిన
    నార్యులుగురుమూర్తిగారునారాధ్యులులే యారాముడువారికిగన పారంబగుసిరులనిచ్చుభాగ్యముకలుగున్

    రిప్లయితొలగించండి
  3. శ్రీ రా మ స్తు తి

    గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    నా శ్రీ రా మ. స్తు తి ప ద్యా ల ను

    స్వీ క రి ౦ చి న. గు రు వు గా రి కి

    ధ న్య వా ద ము లు ! మ రి యు

    మ న : పూ ర్వ క ప దా భి వ ౦ ద న ము లు !

    …………………………… ....…………………

    రిప్లయితొలగించండి
  4. శ్రీ గోళి హనుమచ్ఛాస్త్రి గారికి ,
    ి
    శ్రీ సుబ్బా రావు గారికి ,
    ి
    శ్రీ మిస్సన్న గారికి , ధన్యవాదములు

    మరియు వినయాభి వ౦దనములు

    అర్పిస్తూ :-- విధేయుడు గురుమూర్తి ఆచారి

    రిప్లయితొలగించండి
  5. మొదటి కందం లో మూడు, నాలుగు పాదాలలో దోషాన్ని ఇలా మార్స్తున్నాను.

    జనుడొక డనెనని యవనిని
    వనముల గలవక యవనిజ బనిపితివటగా !

    రిప్లయితొలగించండి
  6. శ్రీరామ నవమి యనుచును
    శ్రీరాముని పద్యరచన చేర్చిన మూర్తీ|
    ప్రారబ్ద మున్నపద్యము
    ఆరాధన కవసరంబె|ఆశించదగున్.
    5. గురుమూర్తి పద్యరచనలు
    విరిసిన మల్లియల సొబగు విలువలు జేర్చన్?
    ధరగల రాముని గొలువగ
    కరుణను యాచించి దెలిపె కవితా?నవతా?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈశ్వరప్ప గారూ,
      ‘పద్యము ఆరాధన’ అని విసంధిగా వ్రాయరాదు. ‘పద్య| మ్మారాధన...’ అనండి.

      తొలగించండి
  7. వీరాగ్రేసర! ధాత్రికన్యకతమున్ వేవేల క్రూరాత్ములన్,
    ధీరోదాత్తతతోడఁ గూల్చితి, భళా! దేవా! భువిన్ క్రూరతన్
    స్వైరమ్మాడెడు ధూర్తమానవులకున్ సద్భావముల్, కూర్మితో
    వైరమ్మెల్ల హరింపజేయగల సద్వ్యాపారముల్ నేర్పుమా!

    రిప్లయితొలగించండి
  8. శ్రీ రా మ స్తు తి ి
    .....................


    శ్రీ ఈశ్వరప్ప గారికి ధన్యవాదములు మరియు వినయాభివ౦దనములు
    మీ " గు రు మూ ర్తి ఆ చా రి "

    రిప్లయితొలగించండి
  9. మిత్రులందఱకు శ్రీరామ నవమి పర్వదిన శుభాకాంక్షలు!

    సుకవులు గురుమూర్తి ఆచారి గారి శ్రీరామస్తుతి పద్యములు చాల బాగుగ భక్తి భావ స్ఫోరకముగ నున్నవి. శుభాభినందనలు.

    శ్రీరామ! జయరామ!...యను పద్యమందు...మూఁడవ పాదము ఉత్తరార్ధమున గణభంగమైనట్టుల గన్పట్టుచున్నది. ఒకమాఱు పరిశీలింపుఁడు.

    అటులనే ...దాని తరువాతి పద్యమందు...భవాబ్ధి...ప్రోవుమా...యను పదముల దొసఁగును సవరింపఁగలరు.

    అన్యథా భావింపవలదని మనవి.

    భవదీయుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  10. గౌరవ నీయులు ఆర్యలు శ్రీ గు౦డు మధుసూదన రావు గారికి శతాభి వ౦దనములు.

    మీరు నా పద్యాలను పరిశీలి౦చి న౦దులకు
    స౦తోషము .

    టైపు చేసే సమయ౦ న౦దు :-

    తరువోజలో మూడవ పాద౦ ఉత్తర భాగ౦ న౦దు
    అలవాటులో పొరపాటు అన్నట్లు
    సీస పద్య బాగము పడి౦ది. అనగా ఒక
    లఘువు లోపి౦చినది.

    క్లేశ కారక సురారి గణ భీమ. సవరి౦పగా

    = క్లేశ కారక సురారి సమూహ భీమ

    ………………………………………………………

    తర్వాత పద్యములో నాకు దొసగు ఏమిటో
    విశదముగ తెలియుట లేదు
    ప్రోవుమా ను బ్రోవుమా అని
    చేయాలని అనుకు౦టాను •

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవులు ఆచారి గారూ...సవరించినందులకు ధన్యవాదములు.

      ఈ పద్యమునకుం దదుపరి యున్న పద్యమందు భవాబ్ధి అను దానికి బదులుగా భవాబ్ది యనియు...ప్రోవుమా అను దానికి బదులుగా ప్రొవుమా యనియు టైపాటులు దొర్లినవి. వీనిని సవరింపవలెను.

      తొలగించండి
  11. తండ్రిపనుపున గురువుతో తరలివెళ్లి
    క్రూరరక్కసి తాటకన్ కూల్చివైసి
    రక్కసుల బారిపడకుండ రక్షజేసి
    మునిహవనమును గాపాడి ఘనముగాను
    శివుధ నస్సును విరిచితా స్థిరముగాను
    సు రలుదీవించి దివినుండి సుమములిడ
    జానకివరించె రాముడు సంతసముగ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
      మీ పద్యం బాగున్నది.
      ‘వెళ్లి, వైసి’ అన్నచోట్ల ‘వెడలి, వైచి’ అనండి.

      తొలగించండి
  12. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
    ఉదయమే వ్రాశాను.ఇక్కడ పోస్ట్ చేయాలా వద్దాఅంటూ ఆల్స్యంచేశాను.
    శీర్షిక:రాముడు.
    1.ఆ.వె:అ.వె:సంతు కోరి క్రతువు చక్కంగ చేయగా
    పుట్టిరచట సుతులు పుడమిపతికి
    దుష్ట శిక్షణకని శిష్టరక్షణకంచు
    అవతరించె రాము డవని యందు.


    2.ఆ.వె:గాదిసుతుని క్రతువు గావంగ నేగిరి
    రామలక్ష్మణులును రయముతోడ
    మఖము చెఱుపునట్టి మారీచు గొట్టిన
    రామచంద్రుడెపుడు మనకు రక్ష.

    3.ఆ.వె:కౌశిక ముని వెంట కానలకును చని
    యాగరక్షణంబు నాచరించి
    రాతియైనసతిని నాతిగా మార్చుచూ
    రాముడేగె మిధిలరాజ్యమునకు.

    4.తే.గీ:రాకరాక వచ్చితివిశ్రీ రామచంద్ర
    రాయి నై యుంటి యిన్నేళ్ళు రఘకులేశ
    శా పము తొలగె మ్రొక్కెద సాధు చరిత
    యనుచు పలికె రామునితో నహల్య తాను.

    5.ఆ.వె:శివధనువును విరచి సీతను పెండ్లాడి
    మార్గమందు నణచె మౌనివరుని
    ధర కధిపతిఁజేయ దశరథుండు దలచె
    రామచంద్రునపుడు రహము తోడ.
    6.ఆ.వె:మారు తల్లి కోర మారాడక రాము
    కదిలె సీతతోడ కానలకును
    అవుసరించె తాను అనుజుడా సౌమిత్రి
    కదిలిరెల్ల జనులు కాంచుచుండ.

    .7.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
    కలిగె నాకిట హర్షంబు కాలుమోప
    ధన్యు డైతి నీదయ నొంది ధరణి యందు
    యనుచు గుహుడుతా భాషించె యాదరాన.

    8..ఆ.వె:గుహుని పడవ నెక్కి గొప్పగా పయనించి
    చిత్రకూటమేగి సీత తోడ
    పర్ణశాలయందు పదిలముగానుండ
    కాపు కాచె భ్రాత కానలందు.

    9.ఆ.వె: పసిడి మృగమగోరె పడతి జానకిదేవి
    రాజసానయేగె రాఘవుండు
    మాయ దెలిసి యపుడె మారీచు గూల్చిన
    రామచంద్రు డొసగు రక్ష మనకు

    10.ఆ.వె: రావణాసురుండు రమణిని గొంపోవ
    నాప దానవేంద్రు నడ్డు పడిన
    పక్షిరాజు జంపె పంక్తి కంథు డపుడు
    శోక భరిత యయ్యె సుదతి సీత.


    11.తే.గీ: రామచంద్రుని రూపము రహిని గాంచ
    కాన లోన నెదురు జూసె కాంత శబరి
    అనుజు తోడ రాముగనిన యతివ తనదు
    కన్ను లబ్బెను ఫలమును గాంచె నెదుట.


    12.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
    యేళ్ళ తరబడి యిచటనె వేచి యుంటి
    ఫలము లెన్నొ దెచ్చితినిట వరుసగాను
    నొసగ సిద్ధపడితినయ్య నోరు తెరువు.


    13.ఆ.వె:రవిజు భయము నుడిపి రామచంద్రునితోడ
    మైత్రి జేసె గాదె మారుతియును
    వాలి నొక్క కోల వధియించె రాముండు
    హరుష మొంది రెల్ల హరులు గూడి.

    14.తే.గీ:రాక రాక వచ్చితివి శ్రీ రామచంద్ర
    నీ కొరకు వేచి తిమి కరుణించు మమ్ము
    సకల శుభముల నొసగెడి చక్కనైన
    పేరు పలికించు సతతమ్ము పేర్మి తోడ.
    15.కం;ధారుణి యందున బుట్టెను
    నారాయణుడే దశరథ నందనుడై తా
    నారావణుజంపగనిల
    కారణ జన్ముడు జగతి నఘమ్ములు బాపెన్.

    తే.గీ:రామనవమి నాడట జేరి రమణు లంత
    తోరణమ్ముల భక్తి విస్ఫార మంద
    రంగ వల్లులు దిద్ది తీర్చంగ సంబ
    రమ్ము తోడ రామ మందిరమ్ము నిండె.

    4ఆ.వె:తీయదనము నందు తేనెను మరపించు
    రామనామ మెంతొ రహిని నింపు
    తారకమిది గాదె తరియింప జనులకు
    మరొక మంత్రమేల మహిని జూడ.
    తే.గీ:శరణు కోరితి శ్రీరామ చరణములను
    వేగ రక్షించి కావుమో వేద వేద్య
    నీవు గాక మాకు నిచట నెవరు దిక్కు
    శిరసు వంచి మ్రొక్కెదమయ్య సిరుల నొసగు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
      మీ పద్యాలను నిరభ్యంతరంగా ప్రకటింప వచ్చు.
      మీ సుదీర్ఘమైన కవితా ఖండికను అక్కడక్కడ చూశాను. అలసిపోయి ఉన్నందున వివరంగా సమీక్షించలేను. రేపు పరిశీలిస్తాను. మన్నించండి.

      తొలగించండి
  13. రాముని నామముఁ దలచిన
    సేమము సమకూరు మనకు శీఘ్రమె ధరణిన్!
    నీమము నొకటున్నదదియె
    నేమరకను ధర్మపథము నేగుచు నుండన్!

    రిప్లయితొలగించండి
  14. గురుమూర్తి గారి పద్యములు భక్తితత్పరతను చాటుతున్నవి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ గోళి హనుమచ్ఛాస్త్రి గారికి ,
    ి
    శ్రీ సుబ్బా రావు గారికి ,
    ి
    శ్రీ మిస్సన్న గారికి , ధన్యవాదములు

    మరియు వినయాభి వ౦దనములు

    అర్పిస్తూ :-- విధేయుడు గురుమూర్తి ఆచారి

    రిప్లయితొలగించండి
  16. శ్రీ రా మ స్తు తి

    ఆర్యులు గు౦డు మధుసూదనరావు గారికి
    నమస్కరిస్తూ గురుమూర్తి ఆ చా రి :---
    ……………………………………………………ి

    నా దగ్గర. laptab. లేదు . ఒక చిన్న cell లో
    తెలుగు పద్యాలు type. చేసి ప౦పిస్తాను.

    అ౦దు వలన ఆరె౦డు type mistakes.
    వచ్చినవి.

    మీరు విశద పరచి న౦దుకు ధన్య వాదములు !

    న మ స్తే


    ి

    రిప్లయితొలగించండి
  17. శ్రీ రా మ స్తు తి

    నా శ్రీ రామ స్తుతి పద్యాలను చూచిన

    G V S. సహదేవుడు గారికి ధన్యవాదములు

    మరియు వినయపూర్వక వ౦దనములు

    రిప్లయితొలగించండి