16, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము - 2 (శ్రీకృష్ణ దేవరాయలు)

శ్రీకృష్ణ దేవ రాయలు
రచన : డా. విష్ణునందన్

 కం.    శ్రీకృష్ణ దేవరాయా !
ఆకల్పాంతమ్ము నిల్తు వాంధ్రుల మదిలో !
మా కవితలతో నీకభి
షేకంబొనరింతుమయ్య ! శ్రీమంతముగాన్ !!!

సీ.     తులువ వంశ పయోధి కలువల రాయడై
తుల లేని యశముతో నలరినాడు !
సాళ్వ తిమ్మరుసయ్య సంరక్షణమ్ములో
దృఢ రాజనీతి సాధించినాడు!
మూరు రాయర గండ మూర్ధాభిషికుడై
రిపుతతి తల లుత్తరించినాడు !
అలరు మేల్ మంగమ్మ కలలన్ని గుది గుచ్చి
ఆముక్త మాల్యద నల్లినాడు !
తే.     భాషలొక పది శ్రద్ధగా పాఱజూచి
        భాషయన నాంధ్రమే యని పల్కినాడు !
        తెలుగు వారల చిర తపః ఫలమతండు;
         కృష్ణదేవరాయని కీర్తి నేమనందు???

సీ.    కీర్తికాంత కపోల కిమ్మీర ఫలకాల
మకరికా పత్ర సంక్రాంతి జేర్చి;
కావ్య భాషా యోష కమనీయ చరణాల
మురువుగా కవితల హరువు గూర్చి;
పరిపంథి జన వధూ ఫాలభాగము పైన
వైధవ్య శాసన వ్యాఖ్య వ్రాసి;
స్వీయ రాజ్య రమా విశిష్ట హృద్వీధి లో
సతత సౌఖ్య విపంచి సవదరించి;
తే.    జయతు జయతు జయోస్తు రాజాధిరాజ
రాజ మార్తాండ ! శ్రీ కృష్ణరాయ ! యనుచు
జనులు కీర్తింప రాజ్యపాలనము జేసి
చరితకెక్కిన రాయల సన్నుతింతు!!!

(కీర్తి కాంత యొక్క చిత్ర వర్ణము కలిగిన కపోలం పై మకరికా పత్రం తో విలాసంగా అటూ యిటూ రేఖా చిత్రాలు గీచాడట ( ఇదొక ప్రబంధకాలంలోని శృంగార చేష్టా విశేషం... నాయకుడు నాయిక ఏకాంతంలో నున్న సమయంలో ప్రేమానురాగాలను వెల్లడించే ఒకానొక సాధనం... కీర్తికాంతతో అలా చెయ్యాలంటే మరి కీర్తి అనే స్త్రీ, కృష్ణ రాయలకు ఎంతగా వశమయ్యిందో ఆలోచించాలి... యిదొక ఉత్ప్రేక్ష... ఇక్కడ శృంగార రసం !!!
కావ్యమనే భాషా యోష (సరస్వతి)కి భక్తితో తన కవితలనే ఆభరణాలను, గండపెండేరంగా సమర్పించిన బుద్ధిశాలి... ఇక్కడ భక్తి రసం!!!
పరిపంథి జన వధూ అంటే శత్రు రాజుల భార్యల నుదుటి మీద వైధవ్యమనే నూతన శాసనాన్ని లిఖించాడట ! శత్రురాజుల మీద విజయ సందర్భం గా విజయ శాసనాలు లిఖించడం కద్దు.... వాటితో పాటూ వారికి మరణ శాసనాన్నీ, వారి రాణులకు వైధవ్య శాసనాన్నీ కూడా లిఖించడం కవిసమయం... ఇక్కడ వీర రసం!!!
తన రాజ్యరమ హృదయంలో నిరంతర సౌఖ్యాలు అనే వీణా రాగాలను మీటాడట... అంత సుఖమయంగా, అంత ప్రశాంతంగా సాగిన పాలన అని... ఇదొక శాంత రసం!!!
ఈ విధమైన పాలన జేసి రాణకెక్కిన శ్రీకృష్ణ రాయలను సదా అభినుతిస్తాను అని......)

శ్రీకృష్ణ రాయలకూ - సాక్షాత్తూ శ్రీకృష్ణుడికీ నామ సామ్యమేనా, యింకేమైనా పోలికలున్నాయా అంటే-

సీ.    అతడు యాదవుడంట - ఇతడు భూధవుడంట
యెలమినాతని కన్న నితడె ఘనుడు !
అతడు పసుల గాచు - నితడు కవుల బ్రోచు
నెలమి నాతని కన్న నితడె ఘనుడు !
అతడు గీతను బల్కు - నితడు కైతల జిల్కు
నెలమి నాతని కన్న - నితడె ఘనుడు !
అతనివి మాయలు - యితడేమొ రాయలు
యెలమి నాతని కన్న - నితడె ఘనుడు !
తే.    అతడు - ఒట్టి శ్రీకృష్ణుండు; అరయ నితడు
అహహ ! శ్రీకృష్ణ దేవరాయ ప్రభుండు;
భళిర వేమారు నీ కీర్తి ప్రస్తుతింతు
తెలుగు వల్లభ ! శ్రీకృష్ణ దేవరాయ!!!

(అతడేమో యాదవుడు, మరి యితడో మహా మహీతలాన్నేలే భూధవుడు - చక్రవర్తి !!!అతని కంటే ఇతనే గొప్ప!!! అతడేమో కేవలం వెర్రి మొర్రి పసుల కాపరి...... మరి యితడో? జ్ఞాని వతంసులైన అష్టదిగ్గజాలనే బ్రోచే సరస దయానిధి... అతని కంటే యితడే గొప్ప కాదా? అతడేమో కేవలం ఒక్క గీతను చెప్పాడట... మరి ఇతడో??? రసవంతములైన కైతలనేకం చిలుకుతాడట.... మరి యెవరు గొప్ప? అతనివన్నీ మాయలు; మరి ఇతని పేరే 'రాయలు'.... అతని కంటే యితడే గొప్ప!!! పేరు చూద్దామా? అతనిది వట్టి 'శ్రీ కృష్ణుడు' అంతే..... మరి యితనో??? "శ్రీ కృష్ణ దేవరాయ ప్రభువు"......... కనుక ఇతడే గొప్ప!!!!!!!!)

సీ.    హంపీ విరూపాక్ష హర్షాను కంపాను
రక్తుడై యెవ్వడు రాజ్యమేలె?
శ్రీకాకుళాంధ్ర నిర్దేశమ్ము తలదాల్చి
భక్తుడై యెవడు ప్రబంధమల్లె?
పెద్దన్న, సూరన్న, పేర్గన్న ధూర్జటి
కొలువుండ నెవడు సద్గోష్ఠి సల్పె?
గడసరి గజపతి; బుడతకీచుల పాలి
యమరాజుగా నెవ్వడవతరించె?
తే.    విజయనగర సామ్రాజ్య సంవిద్వికీర్ణ
కీర్తి కాంతిచ్ఛటా ప్రభాకృతి యెవండు?
వాని రాయని బహుముఖ ప్రజ్ఞ మదిని

దలచి కైమోడ్తునీ శుభ తరుణమందు !!!!

8 కామెంట్‌లు:


  1. విష్ణునందన!కవివర!కృష్ణదేవ రాయలనుగృష్ణుతోబోల్చిరచనజేసి తీవయాయదిరమ్యమైయిలనువెలిగె రచననీయదిచదువగరమ్యమాయె

    రిప్లయితొలగించండి
  2. గొప్పగ వ్రాయఁగలిగి మా
    తప్పుల సరదిద్దగల్గు దక్షులు మీరు
    న్నెప్పటికి మీదు కరుణన్
    గుప్పించగ శక్తినొసఁగు గోవిందుడిటన్!

    రిప్లయితొలగించండి
  3. డా.విష్ణునందన్ గారూ మీ కవితామృతం తో శ్రీకృష్ణదేవరాయనికి దివ్యాభిషేకం చేసిన తీరు రసాత్మకంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. హితైషులు , సౌజన్య శీలురు అయిన శ్రీ సుబ్బారావు గారికి , శ్రీ సహదేవుడు గారికి, శ్రీ మిస్సన్న గారికి బహుధా ధన్యవాదాలు.

    ఆదరించిన మాన్య మనస్వి శ్రీ కంది శంకరయ్య గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  5. హాయిగ మది పులకించెను
    తీయగనే " విష్ణు " గారు తీయగ కలమున్
    రాయలనే వర్ణించుచు
    వ్రాయగనిట నందెమాకు పద్యామృతమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మధురములగు పల్కులతో
      సుధలన్ విరజిమ్మునట్టి సుకృతీ! కవితా
      విధి మత్కృతజ్ఞతలివే !
      అధిగత వాక్ఛస్త్రి ! గోలి హనుమచ్ఛాస్త్రీ !

      తొలగించండి