21, ఏప్రిల్ 2016, గురువారం

ఖండకావ్యము – 6 (సరస్వతీ!)

సరస్వతీ!
రచన : లక్ష్మీదేవి

శా.      విద్యార్థుల్ నిను వేడుకొందు రిలలో వీణాధరీ! దీవనల్
సద్యోగంబుల నిమ్ము, శుద్ధచరితా! శాతోదరీ! పావనీ!
పద్యం బన్నను నీరస మ్మనక పక్వంబౌ మహాశ్రద్ధతో
నుద్యోగమ్మున నేర్చుకొ మ్మనుచు నీ వొప్పింపగా రాగదే!

మ.     కరమున్ బట్టుదు పుస్తకంబు, మనమున్ కైంకర్యమున్ జేతు, నీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చెదో,
వరముల్ వేయు నవేల చాలు నదియే, వాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

పంచచామరము
సదా మదిన్ దలంతు నిన్ను శ్రద్ధతో, సరస్వతీ!
పదమ్ము లిట్లొసంగుమా! కృపామయీ, సరస్వతీ!
ముదమ్ముతోడఁ దీర్చుకొందు మ్రొక్కులన్, సరస్వతీ!
పదమ్ముఁ జేరుకొందు, మోక్ష ప్రాప్తికై, సరస్వతీ!

మత్తకోకిల
వీణఁ బట్టిన శారదాంబకు వేశుభమ్ములు పల్కుమా!
ప్రాణికోటికి విద్యనిచ్చెడు భారతీ జయ మందుమా!
పాణిఁ బట్టిన ధాతృపత్నికి, వందనమ్ములు పల్కుమా!

వాణి, పుస్తకపాణి, ముజ్జగవంద్యకున్ శుభమందుమా!

25 కామెంట్‌లు:

 1. చక్కని పద్యాలు. అభినందనలు.
  ‘ముజ్జగ వంద్యకు’ అనరాదు. “వాణి, పుస్తకపాణికిన్, జగవంద్యకున్..’ అనండి.

  రిప్లయితొలగించండి
 2. సరస్వతీ!యటంచు మీరు శారదన్ స్తుతించుచున్
  శిరస్సు వంచి మ్రొక్కినంత శీఘ్రమే వరమ్ములన్
  మరింత వ్రాయగల్లు భావ మాధురీ మహత్తులన్
  నిరంతరమ్ము నిచ్చు మీకు నేర్పులన్, సమున్నతిన్!


  రిప్లయితొలగించండి
 3. గురువుగారూ,
  కృతజ్ఞురాలను. మీ సవరణ శిరోధార్యము.
  నాకొక సందేహము.
  ఖండకావ్యమనగా ఏదైనా ఒక విషయమును గొని ఉపోద్ఘాతము, ఘటన/ఇతివృత్తం, ఉపసంహారము ఉండాలని ఇన్నాళ్ళూ అనుకున్నాను. కానీ ఇక్కడ వచ్చిన ఖండకావ్యములను చూసి నేనూ ఇలా ప్రారంభించాను. కేవల వర్ణనలను, స్తుతులను ఖండకావ్యములనవచ్చునా? వివరింపవలసినది.

  రిప్లయితొలగించండి
 4. ఆదిగురువు మనిషికమ్మ|సరస్వతే|
  వాక్కు నేర్పు తల్లి వాణిగాద?
  భవిత బంచి పెట్టు భారతి బాధ్యతే
  లక్ష్మి|దేవిరచన లక్ష ణంబె|

  రిప్లయితొలగించండి
 5. లలిత పదముల లాస్య విలాస భరిత
  సతత వృత్యనుప్రాసల శారదాంబ
  స్తుతిని జేయ “లక్ష్మీదేవి” సుగుణరాశి
  భార తీదేవి యిచ్చుత భవ్యముగను.

  రిప్లయితొలగించండి
 6. శారదమ్మమీదచక్కనిగృతులను
  రచనజేసినట్టిరమ్యచరిత!
  యింకనురచనలనునింపుగామరికొన్ని
  యందజేయుమిపుడయభ్ధిపుత్రి!

  రిప్లయితొలగించండి
 7. రిప్లయిలు
  1. ఎదురునడక కలిగిన పంచచామరము వ్రాయి చూద్దాం అన్నట్టు గా ఉండి భలే ఆసక్తిని కలిగిస్తుందండి నాకు. ధన్యవాదాలు.

   తొలగించండి
 8. కీ.శే. వడ్డూరి అచ్యుతరామ కవి (వారి కుమారుడు వడ్డూరి రామకృష్ణ )
  అమ్మాశారద భారతీ సకల విద్యాస్వరూపిణి నిన్ను నే
  సమ్మోదంబున భక్తితత్పరత నశ్రాంతంబు గీర్తింతు నా
  కిమ్మోయమ్మ సమస్తవిద్యలును లక్ష్మీ కీర్తి ధృత్యున్నతుల్
  నెమ్మిన్ నీపదపద్మ భక్తియును సాన్నిధ్యంబు వాగ్దేవతా

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పద్యం అద్భుతంగా ఉంది. మొదటిపాదంలో గణదోషం ‘విద్యారూపిణీ నిన్ను...’ అనండి.

   తొలగించండి
 9. ఆనందామృత వర్షిణి త్రిభువను యజ్ఝాన సంహారిణీ
  నానాలంకృత రూపిణీ భగవతీ నాదస్వరూపాననీ
  వాణీవీణ కళావతంసి జననీ వాత్సల్యపూర్ణోదరీ
  వీణాపాణి సునాదమోద వదనీ విజ్ఞాన భాండొదరీ

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విరించిగారూ, ధారాశుద్ధితో చక్కటి శ్లోకాన్ని వ్రాసినందుకు అభినందనలు. చాలా బాగుంది.

   తొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ మీ పద్యాలు అమృతగుళికలు

  రిప్లయితొలగించండి
 11. లక్ష్మీదేవిగారు ...ఆ వాగ్దేవి కరుణా కటాక్షవీక్షణాలతో మీరు మరిన్ని మంచి ఖండికలు వ్రాయాలి...మత్తకోకిల పంచచామరం పద్యములు మరింతగా బాగున్నాయి..

  రిప్లయితొలగించండి
 12. చిన్ని సవరణ.
  కరమున్ బట్టుదు పుస్తకంబు, మనమున్ కైంకర్యమున్ జేతు, నీ
  దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చినన్,
  వరముల్ వేరుగనేల? చాలు నదియే, వాణీ! సదాచారిణీ!
  స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. 'చేతు' అన్న ప్రయోగం సాధువేనా అని అనుమానం. చేతు కోతు లిత్యాదులు సాధువులు కావనుకుంటాను.

   తొలగించండి
 13. కరమున్ బట్టుదు పుస్తకంబు, మనమున్ కైంకర్యమున్ గాగ అని సవరించదగునాండీ!
  సూచించినందుకు ధన్యవాదాలు. నిజమే కదా, చేతుకోతులు సాధువులు కాదు.

  రిప్లయితొలగించండి