24, అక్టోబర్ 2016, సోమవారం

వేంకటేశ్వర శతకము - 3



వేంకటేశ్వర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు)
 (౩)
చేవ నొసంగి స్వామిగను జేయు తటాకము తాన మాడినం
గావున స్వామి పుష్కరిణి గా వచియింతురు దీని నెల్లరున్
క్ష్మావిభు డయ్యె శంఖణుడు స్నానము సేయగ భ్రష్ట భూమికిం
బావన వారిజాకర సుపాలన వైభవ వేంకటేశ్వరా!                                16.

తలచెద శ్రీసతీ రమణుఁ దాపస మానస పారిజాతముం
బలికెద వేంకటాచల నివాస మనోహర కీర్తనావళుల్
కొలిచెద నర్థిలోక వరగుప్తి శుభప్రద దివ్యహస్తునిన్    
విలసిత కాశ్యపేయ పరివేష్టిత సన్నుత వేంకటేశ్వరా!                            17.

భవ్యము మంగళప్రదము భాసిల వక్షము నందు లక్ష్మియున్
దివ్యము నీదు దర్శనము దీన జనోద్ధరణప్రకాశమున్
శ్రావ్యము నీ చరిత్రము పరాత్పర! సన్నుత! భక్తవత్సలా!
యవ్యయ! సంకటాపహర! యజ్ఞవరాహమ! వేంకటేశ్వరా!                     18.       

గాయక మెంచగం గృత యుగంబున నంజన శైల మందుఁ ద్రే
తాయుగ మందు విష్ణువు నితాంత రతిన్ వసియించు నండ్రు నా
రాయణ శృంగి సింహగిరి రంజిలు ద్వాపర మందునం గలి
న్నాయత కీర్తి వేంకట నగాంతర మందున వేంకటేశ్వరా!                       19.
[గాయకము=మర్మము]

భూరి కుమార ధారిక యపూర్వ తటాక నిమజ్జనంబు స
త్పూర సురాపగాది నద పుణ్య నిమజ్జన తుల్యమట్టి కా
సార తటీ స్థితాగ్నిభవ సన్నుత హర్షణ దీన రక్షకా
భారమునీద యంచు మదిఁ బన్నుగఁ గొల్తుము వేంకటేశ్వరా!                20.

దినకరు డుండ కుంభమున దివ్యము మాఘపు పౌర్ణిమా తిథిం
దనర మఘాభ మత్తరిని దర్పము వీడి కుమార ధారికన్
మునుగగ మధ్య ఘస్రమునఁ బుణ్య ఫలమ్ము ప్రకాశమౌ నటం
గనికర మొప్పఁ గాచెదవు కంటికి రెప్పగ వేంకటేశ్వరా!              21.

అంబర రత్న మింపుగ విహారము సేయగ మీన రాశినిం
దుంబుర తీర్థ తోయములఁ దోఁగగ భక్తినిఁ బౌర్ణమీ తిధిన్
సంబర మొప్ప ద్వాదశభ సంయుత తుర్యపు కాల మందు న
న్నంబల గర్భ జన్మములు నంటవు నీదయ వేంకటేశ్వరా!                       22.
[ద్వాదశభ=12వ నక్షత్రము, ఉత్తరఫల్గుని ; తుర్యపు కాలము = నాల్గవ దైన బ్రహ్మ ముహూర్తము, తెల్లవారుఝాము]

శూరుడు మేష రాశి గన శూరతఁ బున్నమి నాటి వేకువం
బారగ చిత్త యత్తఱిని బాంధవ నందన దార యుక్తమై
గౌరవ మొప్పగన్ గగన గంగ సరోవర మందుఁ దోగగన్
మూరిన ప్రేమ నిచ్చెదవు మోక్షము మాకిల వేంకటేశ్వరా!                       23.
[ గగనగంగ = ఆకాశ గంగ]

మిహిరుడు వాహ రాశిఁ జన మింటిని ద్వాదశి శుక్ల కృష్ణలన్
మిహిర కుజాఖ్య వారములు మేలుగ పాండవ తీర్థ మందున
న్నిహమున దుఃఖ నాశనము నింక పరమ్మున సౌఖ్య రాశులున్
సహనము తోడఁ దోగగను జక్కగ నిత్తువు వేంకటేశ్వరా!                       24.

నియతిని సప్తమీ తిధిని నిర్మలుడై రవివార మందు హ
స్త యుతము నైన నుత్తమపు తారల నైనను దోగినన్ సుధా
మయ జలమం దనంత గిరి మస్తక నిర్ఝర పాపనాశ నా
హ్వయమున కోటి జన్మ కృత పాపము లుక్కును వేంకటేశ్వరా!               25.
[అనంతగిరి=శేషాచలము]

2 కామెంట్‌లు:

  1. భవ్యత నొందుట కొఱకు ను
    నవ్యయుడగు గృష్ణు గొలువ నాతడు మనకున్
    దివ్యంబగు మోక్షంబును
    సవ్యంబగు రీతి నిచ్చు సహజ న్ముండా !

    రిప్లయితొలగించండి