6, జూన్ 2011, సోమవారం

చమత్కార పద్యాలు - 67 (రారా తమ్ముఁడ)

మోచెర్ల వెంకన్న కవి సమస్యా పూరణలు - 11
సమస్య - "రారా తమ్ముఁడ రార యన్న యనె నా
రాజాస్య ప్రాణేశ్వరున్"
శా.
గారాబల్లుఁడు నర్జునుండు శ్వశురాగారంబునం దుండఁగా
నీరేజాస్య సుభద్ర వచ్చి యతనిన్ వీక్షించి పెన్ సిగ్గునన్
బాఱం జొచ్చిన సత్య పట్టుకొని యింపారంగ నయ్యర్జునున్
"రారా తమ్ముఁడ! రార యన్న" యనె నా రాజాస్య ప్రాణేశ్వరున్.
(శ్రీ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి "చాటుపద్య రత్నాకరము" నుండి)
ఈ సమస్యకు పూరణలు పంపవలసిందిగా కవిమిత్రులను ఆహ్వానిస్తున్నాను.

7 కామెంట్‌లు:

  1. వీరే, మున్ కపటమ్ముచే యతివలే వేషంబులే వేసి మ
    మ్మా రీతిన్ మనువాడిరంచు విరిబొమ్మా,యా సుభద్రాణి దే
    వేరే, చెప్పెను బావగారినెడఁనావేడ్కల్; హర్షాన "రా!
    రారా! తమ్ముఁడ, రార!" యన్న యనె, నా రాజాస్య ప్రాణేశ్వరున్.

    రిప్లయితొలగించండి
  2. చేరన్ పార్థుడు, కృష్ణ యొక్క వనమున్; శ్రీకృష్ణుడే వచ్చెగా
    మీరాక్రీ డిని తోడ్కు రండు యనగా, మీ యాజ్ఞ చిత్తంబనెన్
    చేరన్ బిల్చెను భీముడున్నకులుడున్ చే జూపి నావైపుకున్
    "రారా తమ్ముఁడ! రార యన్న" యనె; నా రాజాస్య ప్రాణేశ్వరున్.

    రిప్లయితొలగించండి
  3. మందాకిని గారూ,
    శార్దూలం నిర్దోషంగా బాగుంది. కాని పూరణ భావం సందిగ్ధంగా ఉంది. వివరణ ఇస్తే బాగుండు. "సుభద్రాణి దేవేరే" ... ?

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పూరణ బాగుంది. అభినందనలు.
    "తోడ్కు" .. ?

    రిప్లయితొలగించండి
  4. గురువుగారూ,
    మన్నించాలి. సుభద్రను, గణగణనకై సుభద్రాణి అన్నాను. తప్పైతే మన్నించాలి. సుభద్రాణి దేవేరియే స్వయంగా తన బావగారైన ధర్మరాజుతో తన వివాహం ఎలా జరిగిందో ఆ వేడుక చెప్తోంది.
    అర్జునుని చూపుతూ , "వీరే , (మీ తమ్ముడే) చూడండి బావగారూ, మున్నొకనాడు యతివలే వేషము వేసి యా రీతిలో మనువాడినారు" అనుచూ విరిబొమ్మలాంటి యా సుభద్రాణి దేవేరియే బావగారితో ఆ వేడుకలు చెప్పగా, వలచి, వలపింపబడి మనువాడిన తమ్ముని(ఆ రాజకుమారి ప్రాణేశ్వరుని) సంభ్రమంగా చూసి ధర్మరాజు రారా తమ్ముడా అని ప్రేమతో పిలిచారు ,

    ఏరా, తమ్ముడనేమనంచు పిలిచేవీవిచ్చకంబుట్టగాన్?
    కారే పాల్ సిరిబుగ్గలుండు చిరుసింగారిప్డు నిన్నేమనెన్?
    మారాముల్ సరిపొమ్మనంచు నెవరే, మాటాడిరిచ్చోటనే?
    రారా తమ్ముడ రార, యన్న యనె, (న్+ఆ) రాజాస్య ప్రాణేశ్వరున్


    శార్దూలాన్ని ప్రశ్నోత్తర రూపంలో పూరించవచ్చో లేదో తెలీదు. చెప్పవలసినది. పిలిచేవీవు+ఇచ్చకం+పుట్టగాన్, చిరుసింగారి+ఇప్పుడు = చిన్న అమ్మాయి (పాలుగారే చిన్న పాప ఇప్పుడు నిన్నేమని పిలిచింది) , మారాము చాలని ఎవరు ఎవరితో మాట్లాడినారు అనే ప్రశ్నలకు, సమాధానాలకు అన్వయం కుదిరిందనే అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! ధన్యవాదములు.తోడ్కొని రండు అని వ్రాయుటకు గాను "తోడ్కు" రండు అని వ్రాశాను. దోషమైతే ...రమ్మనుండు..అంటే సరిపోతుందా ? సూచించగలరు.

    రిప్లయితొలగించండి
  6. మందాకిని గారూ,
    ఏ ఛందస్సులో నైనా ప్రశ్నోత్తరరూపమైన పూరణ నిరభ్యంతరంగా చేయవచ్చు. వివరణకు ధన్యవాదాలు. పూరణ బాగుంది. అభినందనలు.

    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ఇప్పుడు చక్కగా సరిపోయింది. బాగుంది.

    రిప్లయితొలగించండి