10, అక్టోబర్ 2011, సోమవారం

సమస్యా పూరణం -488 (భగవదారాధనము చేసి)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

23 కామెంట్‌లు:

  1. పరమ శివుడిని మెప్పించు పరమ భక్తు
    డైన రావణు డానాడు రామ చంద్ర
    సతిని జానకి చెరబట్టి చచ్చె గాద
    భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  2. దొంగ సాముల వెంబడి దిరుగు చుండ
    గగన మంటిన హోమము లెగసి పడగ
    గంగ పూజలు చేయగ భంగ పడుచు
    భగవ దారాధానము చేసి పతితు డయ్యె !

    రిప్లయితొలగించండి
  3. వాదనమ్ముల నిందించు పలు విధముల
    భగవదారాధనము. చేసి పతితుఁ డయ్యె,
    ఫలితమనుభవించిన నాడు పాపి యొకడు
    గురువు బోధల విన్నంత కోరి కొలిచె.

    రిప్లయితొలగించండి
  4. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    బడుగు జీవుల దోచుచు - భయము లేక
    పట్టు పంచల నొంటికి - పన్ను కొనుచు
    భాల మందున బొట్టును - బాగు పెట్టి
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమాని రామజోగి సన్యాసిరావు గారి పూరణ ....

    గుడులకని యజ్ఞములకని కోట్లు కోట్లు
    ప్రజల ధనమును గుంజి రవ్వంత మాత్ర
    మిచ్చి దైవకార్యములకు మిగులు మేసి
    భగవదారాధనము చేసి పతితుడయ్యె

    రిప్లయితొలగించండి
  6. గన్నవరపు నరసింహ మూర్తి గారి పూరణ ....

    మిత్రుల పూరణలు అలరారుచున్నాయి.

    భక్తి మార్గము గోపన్న ముక్తుడయ్యె
    భగవదారాధనముఁ జేసి , పతితుఁడయ్యె
    నైహికేచ్ఛలు వర్ధిల్ల గేహ మందు
    నీతిబాహ్యుడై వర్తిల్లి నిగమ శర్మ .

    భగవంతుడు కరుణా మయుడు. నిగమశర్మకు కూడా మోక్షము వచ్చిందిగా !

    రిప్లయితొలగించండి
  7. 02)
    _________________________________

    వటరు వలె దోచి, సొమ్మును - పాతకమున
    బయట కోశము లందున - భద్ర పరచి
    ప్రాణయోనికి నందులో - భాగ మివ్వ
    కోరి కోటీర మొకదాని - కోట్ల కూర్చి
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________
    వటరుడు = దొంగ
    బయట కోశము = విదేశీ బ్యాంకు

    రిప్లయితొలగించండి
  8. 03)
    _________________________________

    ఫాల నేత్రుని పూజించి - వరమునొంది
    వాని తలపైన చెయినిడ - బయలుదేరి
    భస్మ రాక్షసు డానాడు- భంగ పడెను
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  9. 04)
    _________________________________

    విల్లి పుత్తూరు నందున - విప్రు డొకడు
    తనయ తమకము తలదాల్చు - దండ నొకటి
    కేశముల గూడి యున్నను - కేలు మోడ్చి (కేశవునకు)
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  10. 05)
    _________________________________

    పరమ భక్తుడు రావణ - బ్రహ్మ యనిన
    పరమ శివునిని బూజించి - వరము లొంది
    పరమ సాధ్విని మోహించి - పాపకరుడు
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  11. 06)
    _________________________________

    పరమ భక్తిని భగవాను - భజన సేయు
    పరమ పూజ్యుడు, పూజారి - పండితుండు
    పాప వశమున నొకనాడు - పణ్య మందు
    పాడు మద్యము సేవించి - పాపమనక
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________

    రిప్లయితొలగించండి
  12. 07)
    _________________________________

    పాడు వర్తన జరియించు - పాపి యొకడు
    పట్న మందుండి జేరెను - పరిఖ మీద
    వలపు పలుకుల దేనెల - కులుకులాడి
    పతితతో గూడి యొకనాడు - భయము లేక
    భగవదారాధనము చేసి - పతితుఁ డయ్యె !
    _________________________________
    పరిఖ = కొండ

    రిప్లయితొలగించండి
  13. నియమ బద్ధుడు పరిపూర్ణ నీతి తోడ
    భగవదారాధనము చేసి ప్రాజ్ఞుఁడయ్యె.
    నియమ రహిత దుర్నీతుఁడు నీతి తప్పి
    భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  14. నీతి ధర్మమ్ము విడనాడి ప్రీతిగాని
    చేటు పనులన్నిజేసిన చేతి తోడ
    భగవ దారాధనము జేసి పతితుడయ్యె
    గాలి! ఫలితమ్ము జైలులో గడుపుటయ్యె !!!

    రిప్లయితొలగించండి
  15. చక్కని పూరణలు చేసిన మిత్రులకు అభినందనలు.
    నా పూరణ లో రెండవపాదంలో యతి భంగాన్ని సవరిస్తూ..

    పరమ శివుడిని మెప్పించు పరమ భక్తు
    డైన రావణు డానాడు జానకమ్మ
    పట్టి దెచ్చెను, పుణ్యమ్ము వట్టి దాయె
    భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  16. శ్రీగురుభ్యోనమ: హేతువాదులు వాదముల్ హెచ్చుకాగ భక్తి వ్యాపారమైపోయె భారతమున పరుల కీడును కాంక్షించి పామరుండు భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.సోమవారం, అక్టోబర్ 10, 2011 11:58:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    హేతువాదులు వాదముల్ హెచ్చుకాగ
    భక్తి వ్యాపారమైపోయె భారతమున
    పరుల కీడును కాంక్షించి పామరుండు
    భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  17. నా పూరణ .....

    పలికె నానందమే పరబ్రహ్మ మనుచు
    నీతినియమముల్ విడనాడి నిష్ఠ తొలఁగి
    యైహికేచ్ఛల విడక సందేహపడుచు
    భగవదారాధనము చేసి పతితుఁ డయ్యె.

    రిప్లయితొలగించండి
  18. **********************************************************************
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు కవిమిత్రులు మన్నించాలి. నిన్న రోజంతా ‘కరెంటు’ కోత!
    **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ముందు మీ పద్యం రెండవ పాదంలో యతిదోషాన్ని సవరిస్తూ ‘పరమభక్త / రావణాసురు డానాడు రామచంద్ర...’ అని సూచించా లనుకున్నాను. తరువాత చూసాను. మీ సవరణ బాగుంది.
    **********************************************************************
    నేదునూరి రాజేశ్వరక్కయ్యా,
    మీరు ‘అఘోరా’లను దృష్టిలో పెట్టుకొని పూరణ చేయలేదు కదా? గంగాతీరంలో ఎక్కువగా ఉంటారని విన్నాను. నేనెప్పుడూ ఉత్తరదేశానికి వెళ్ళలేదు. ఉత్తరదేశ పుణ్యక్షేత్రాలు చూడాలని ఉంది. ఆ కోరిక ఎప్పుడు, ఎలా తీరుతుందో? తీరకుండానే గడచిపోతానో?
    మీ పూరణ నిర్దోషంగా చక్కగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    నిజమే! ఈకాలంలో భగవదారాధనను నిందించడం ఫ్యాషనైపోయింది.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    మీ పేరులో వసంతర్తు శోభ, ఇప్పుడేమో శరత్తు. కాని మీ పద్యాల జడవాన వర్షర్తువునే తలపిస్తున్నది.
    మీ ఏడు పూరణలూ బాగున్నాయి. ముఖ్యంగా భస్మాసురుని వృత్తాంతంతో మూడవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    పండిత నేమాని గారూ,
    జనుల భక్తిని సొమ్ముచేసుకొనేవారి గురించిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    చింతా రామకృష్ణారావు గారూ,
    మీ పూరణ ఒక నీతిపద్యమై సందేశాత్మకంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    అక్రమార్జనలో దేవునికి ‘పర్సంటేజీ’ల లెక్కన అప్పజెప్పేవా రున్నారు. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్ర్రి గారూ,
    అజ్ఞాతగా మీరు పంపిన పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    తమ మేలు కంటె ఎదుటివాడి కీడు కోసం పూజ చేసే పతితులు లోకంలో చాలామందే ఉన్నారు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  19. శంకరార్యా ! ధన్యవాదములు.
    ఐహికేచ్ఛల విడక సందేహపడు వారి ఆరాధన గురించి చక్కగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  20. మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  21. గురువుగారు,
    భక్తసులభుడైన భగవంతుని పుణ్య క్షేత్రాల సందర్శనం పట్ల మీకున్న ఆకాంక్ష భగవంతుడు తప్పక నెరువేరుస్తాడు.

    రిప్లయితొలగించండి
  22. విప్రనారాయణుండను విబుధవరుడు
    రంగనాథు సేవించు నహరహము భక్తి
    చివరకొక వేశ్య వలలోన జిక్కుకొనియె
    భగవదారాధనము చేసి పతితుడయ్యె.

    రిప్లయితొలగించండి
  23. ‘కమనీయం’ గారూ,
    ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించాలి.
    విప్రనారాయణుని ప్రసక్తితో చక్కని పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
    రెండవ పాదంలో గణదోషం. ‘రంగనాథు గొల్చును నహరహము భక్తి’ అంటే సరి!

    రిప్లయితొలగించండి