18, అక్టోబర్ 2011, మంగళవారం

సమస్యా పూరణం -497 (గాలిమేడలు స్వర్గము)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
గాలిమేడలు స్వర్గముకన్న మిన్న.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

23 కామెంట్‌లు:

  1. ' గాలిమేడలు' స్వర్గముకన్న మిన్న
    ' గాలి' మేడలు కట్టెను గనుల దోచి
    గాలి దీయగ సీబియై కదలి పోయె
    గాలిమేడలు నిలుచునె ఘనులకైన

    రిప్లయితొలగించు
  2. పగలు రాత్రియు కలవరపడెడు వారు,
    కలలు కనువారు కట్టిరకట! మనమున
    గాలిమేడలు; స్వర్గముకన్న మిన్న
    యగును, సంతసమిచ్చునవంచుఁ దనకు.

    రిప్లయితొలగించు
  3. కనక సింహాసనంబును, మణిమయంబు
    హంస తూలికా తల్పంబు, నతిశయించు
    వెండి బంగారు మయములై వెలుగు చున్న
    "గాలిమేడలు" స్వర్గముకన్న మిన్న.

    ( అతిశయోక్తి అలంకారము )

    రిప్లయితొలగించు
  4. అయ్యా! మా పూరణ:

    ఊహలా కావు బహువిధ యోగదములు
    అఖిల సంపన్నిధానమ్ము లద్భుతములు
    నవ్యయమ్ములు సర్వ సౌఖ్యావహములు
    గాలి మేడలు మిన్న స్వర్గమ్ము కన్న

    పండిత నేమాని

    రిప్లయితొలగించు
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    కాలు కదపగ పనిలేదు - ఖర్చు లేదు !
    కనక సౌభాగ్య సంపదల్ - గలుగు నిజము !
    కష్ట మేలేదు స్వేదమ్ము - కార బోదు !
    కాని పని లేదు కళ్ళను - కాస్త మూయ !

    కోటి కోర్కెల నూహల - గూర్చు కొనుచు
    కలలు గనినంత చాలును - కడుపు నిండు !
    కామితములన్ని తీరును - క్షణము లోన !
    గాలిమేడలు స్వర్గము - కన్న మిన్న!
    _________________________________

    రిప్లయితొలగించు
  6. ఆర్యా !
    ఇది నా పూరణ !

    కాంచన ధన బంధుజన వికారము లిక
    గాలిమేడలు, స్వర్గముకన్న మిన్న
    సురవినుత వేదవందిత శుద్ధ సత్త్వ
    పధవిదగ్ధ మహేశ్వరు పాదసేవ

    రిప్లయితొలగించు
  7. గురువు గారికి సవరణలకు ధన్యవాదములు, నమస్కారములతో
    ----------
    గాలి వారు గనులనెల్ల కొల్లగొట్టి
    కట్టె బళ్ళారి యంతట గట్టిగాను
    గాలి మేడలు, స్వర్గము కన్న మిన్న
    సుఖము సకుటుంబమొందెలె సొగసు తోడ|

    రిప్లయితొలగించు
  8. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ .....

    బొందితో స్వర్గవాసమ్ము పొందలేక
    నాకమును నింగి, నేలల నడుమనొంది
    సంతసించినవాడై త్రిశంకుడనియె
    గాలిమేడలు స్వర్గముకన్న మిన్న.

    రిప్లయితొలగించు
  9. మాస్టారూ,
    పండితనేమాని వారి పూరణలో "...గాలి మేడలు మిన్న స్వర్గమ్ము కన్న" అని వుంది, కానీ మీరు పోస్టు చేసినదాంట్లో "గాలిమేడలు స్వర్గముకన్న మిన్న" అని వుంది. రెండూ కూడా యతి భంగం లేకుండా ఒకే భావాన్ని సూచిస్తున్నాయి. బాగుంది.
    మీ,
    చంద్రశేఖర్

    రిప్లయితొలగించు
  10. మూడు గంటల చిత్రము వేడు కనుచు
    ఊ హలందును దేలుచు నాహ యనగ
    వాస్త వమ్మును మరపించు నేస్త మవగ
    గాలి మేడలు స్వర్గము కన్నా మిన్న !

    రిప్లయితొలగించు
  11. నా పూరణ ....
    ‘ముంగేరీలాల్ కీ హసీన్ సప్నే’ దూరదర్శన్ సీరియల్ గుర్తుందా?

    దొరికినంతనె తృప్తి సంబరము లంది
    యూహలందున మాత్రమే నున్నతమగు
    భోగభాగ్యానుభవముతో ప్రొద్దుపుచ్చు
    గాలిమేడలు స్వర్గముకన్న మిన్న!

    రిప్లయితొలగించు
  12. నీటి బుడుగల చందమ్ము నీవు గట్టు
    గాలి మేడలు !స్వర్గమ్ము కన్న మిన్న
    కష్ట పడుటలో నున్నట్టి కమ్మదనము!
    వలదు సోమరి తనమ్ము వలదు నీకు!!!

    రిప్లయితొలగించు
  13. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    చక్కగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రస్తుత కాలోచితంగా ఉంది. బాగుంది. అభినందనలు.
    ‘మణిమయంబు’ అనేది ‘మణిమయంపు/ మణిమయమగు’ అనీ, మూడవపాదంలో ‘బంగారు మయములై’ అన్నచోట ‘బంగారములతోడ’ అంటే బాగుంటుందని నా సలహా.
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    గాలిమేడలు సామాన్యాలు, ప్రయోజనరాహిత్యాలు కావని నిరూపించారు మీ పూరణలో. ధన్యవాదాలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    ‘కలలు గనినంత చాలును - కడుపు నిండు’ అనడం చాలా బాగుంది. చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    కళ్యాణ్ గారూ,
    ‘మహేశ్వరు పాదసేవ మిన్న’ అన్న మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    వరప్రసాద్ గారూ,
    చక్కని భావంతో పూరణ చేసారు. బాగుంది. అభినందనలు.
    మొదటి పాదంలో యతిదోషం.
    ‘గాలి వారలు దోచిరి గనులనెల్ల
    కట్టి ... ’ అంటే సరి!
    **********************************************************************
    శ్రీఅదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    త్రిశంకుని స్వగతంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    చంద్రశేఖర్ గారూ,
    సమస్యను ఇచ్చిందీ, దానికి పూరణ చేసిందీ నేమాని వారే. ఎలా చూసినా అర్థభేదం లేదు కనుక ‘ప్రమాదో ధీమతా మపి!’
    **********************************************************************
    రాజేశ్వరక్కయ్యా,
    ఇప్పటి సినిమాల విషయమేమో కాని మాయాబజార్, మిస్సమ్మ, సువర్ణసుందరి, దొంగరాముడు మొదలైన మూడుగంటల సినిమాలు నన్నైతే ఏవో లోకాలలోకి తీసికెళ్తాయి. వాటిని ఎన్నిసార్లు చూసినా ఏదో క్రొత్తదనం కనిపిస్తుంది. చక్కని పూరణ (అదీ నిర్దోషంగా , నాకు సవరణలకు అవకాశం ఇవ్వకుండా) చెప్పారు. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    చక్కని నీతిపద్యాన్ని చెప్పారు పూరణ పేరుతో. చాలా బాగుంది. అభినందనలు.
    చివరి పాదంలో గణదోషం. ‘సోమరితనమ్ము’ అనేది ‘సోమరితనమది’ అంటే సరి!
    **********************************************************************

    రిప్లయితొలగించు
  14. సాదర ఆహ్వానం...!
    మీకోసం "అనునాసిక ద్య్వక్షర కందం (నమనం)" వేచి ఉంది. సచిత్రంగా..! రండి..! ఆస్వాదించండి...!
    http://www.rpsarma.blogspot.com/

    ధన్యవాదములు..!

    రిప్లయితొలగించు
  15. శ్రీగురుభ్యోనమ:

    ఊహలందున నూయలలూగవచ్చు
    గగనతలమును తాకగ గట్టవచ్చు
    గాలిమేడలు, స్వర్గముకన్న మిన్న
    సగటు జీవికి తృప్తియే స్వర్గమనగ

    రిప్లయితొలగించు
  16. చాల జనులకు కోర్కెల సాధనమ్ము
    వీలు కాని పరిస్థితి విడువరైన
    కట్టు కొనియెదరు పగటి కలల నట్టి
    గాలి మేడలు స్వర్గము కన్న మిన్న.

    రిప్లయితొలగించు
  17. ద్వారపాలురడ్డి యవరోధ మనబోరు
    పిలువరెవ్వరు రంభను వలపుఁజిలుక
    పదవి బెంగ నింద్రుడు కించపరుప బోడు!
    గాలిమేడలుమిన్న స్వర్గమ్ముకన్న!!

    [గాలిమేడలు స్వర్గముకన్న మిన్న.]

    రిప్లయితొలగించు
  18. ధన్య వాదములు తమ్ముడూ !
    కాకపోతే టైపు పొరబాటు .నేను లేటుగా చూసాను " స్వర్గము " కన్న " అని ఉండాలి కానీ స్వర్గము " కన్నా " అని పడింది .ఫరవాలేదా ?

    రిప్లయితొలగించు
  19. స్ఫటిక మణిమయ వేదికా పటలములట
    భూరి నీలముల్ పరచిన భూతలములు
    దివ్య గంధమ్ము వెదజల్లు నవ్య నిత్య
    పుష్పభరిత పాదప సహ పుష్పకమను
    భవ్య రావణా౦త: పుర భవన ములవి
    గాలిమేడలు, స్వర్గము కన్నమిన్న!

    రిప్లయితొలగించు
  20. మన తెలుగు - చంద్రశేఖర్బుధవారం, అక్టోబర్ 19, 2011 4:48:00 AM

    మాస్టారూ,
    ముంగేరీలాల్ కీ హసీన్ సప్నే - అప్పట్లో మాయింట్లో అందరికీ ఫేవరేట్. ముంగేరీలాల్ మొహం ఇంకా కళ్ళముందు కనిపిస్తోంది. మంచి హాస్యభరితమైనది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించు
  21. **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ‘తృప్తిలోనే స్వర్గముంది’ అన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    ‘కమనీయం’ గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    **********************************************************************
    ఊకదంపుడు గారూ,
    ‘పదవి బెంగ నింద్రుడు కించపఱుచబోడు’ చాలా బాగుంది. మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    అక్కయ్యా,
    హన్నా! నేను గమనించలేదు సుమా! అక్కయ్య నిర్దోషంగా పద్యం వ్రాసిందని సంబరపడ్డాను. అయినా అది ‘టైపాటు’ కదా! కాబట్టి మీ పూరణ నిర్దోషమే.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ సుందరపదసుమగంధశోభితమై అలరారుతున్నది. అందమైన పద్యం. బాగుంది. అభినందనలు.
    కాని రావణాంతఃపురాన్ని ‘పుష్పకం’ అన్నారు ?
    అన్నట్టు నేనూ ముంగేరీలాల్ టైపే. ఏవేవో కలలు కంటూ ఊహాలోకాల్లో విహరిస్తుంటాను. ప్రతి మనిషిలోను ఒక ముంగేరీలాల్ ఉంటాడని నా నమ్మకం.
    **********************************************************************

    రిప్లయితొలగించు
  22. శంకరార్యా ! ధన్యవాదములు !

    ఎమ్*ఎస్*రామారావు గారి "సుందరకాండ" లో
    రావణుని అంతఃపురం పుష్పకంలోనే ఉంటుంది గదా !

    రిప్లయితొలగించు