19, అక్టోబర్ 2011, బుధవారం

సమస్యా పూరణం -498 (కుంచములోఁ బోతునక్క)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది ....
కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్.
(కుంచము = నాలుగు మానెళ్ళ కొలపాత్ర)
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని గారికి
ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. ఉంచితి నీకై కందులు
    కుంచములోఁ బోతునక్క; కూనలఁ బెట్టెన్
    పంచను మూలన పిల్లియె
    పంచను మనసాయె నాకు పట్ట్టుము, అక్కా !

    రిప్లయితొలగించండి
  2. కొంచెము ధాన్యము నిచ్చట
    కుంచములోఁ బోతునక్క !కూనలఁ బెట్టెన్
    మంచిది మన మార్జాలము.
    కంచమునను పాలు పోయ గంగను పిలుమా!

    రిప్లయితొలగించండి
  3. వంచన జేయగ దూరెను
    కుంచములో బోతునక్క! కూనల బెట్టన్
    చంచలమార్జాలమొకటి
    కుంచము మంచముల మధ్య ,కూనలుజచ్చెన్!!!

    రిప్లయితొలగించండి
  4. కుంచములో పోతును అక్కా అని అక్కాచెల్లెళ్ళ సంభాషణ గా నేను పూరించుట చదువరులు గ్రహించగలరని అనుకుంటున్నాను.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    చుంచులు పిల్లల బెట్టెను
    కుంచములో ! పోతునక్క - కూనల పెంటన్ !
    కుంచముతో పని యున్నది
    కొంచెము ధాన్యమును సంచి - కొలిచి నిడవలెన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  6. నక్కలు కూడా పిల్లల్ని మెడ పట్టుకొని స్థావరాన్ని మారుస్తుంటాయి !

    02)
    _________________________________

    చుంచులు పిల్లల బెట్టెను
    కుంచములో ! పోతునక్క - కూనల బెట్టెన్
    మంచిగ మన పొలమందున
    సంచారము జేసి వాని - సత్వము బెంచన్ !
    _________________________________

    రిప్లయితొలగించండి
  7. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, అక్టోబర్ 19, 2011 12:42:00 PM

    కొంచక యొక తుంటరి యనె
    'మంచమునకు మూడు కాళ్ళు మరియెట్లన్నన్
    వంచన యెరుగని దౌటను
    కుంచములో బోతు నక్క కూనల బెట్టెన్'

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, అక్టోబర్ 19, 2011 1:48:00 PM

    పొంచి నిరీక్షించ - పుడమి
    కుంచములో బోతు - నక్కకూనలబెట్టెన్
    గొంచక రక్షించుటె మగ
    లంచితముగ నెంతు రవని నాలిన్ సుతులన్

    రిప్లయితొలగించండి
  9. మంచిది, బ్రహ్మముగా రూ
    హించినదే జరిగె! కలియు హెచ్చెను గనుకన్,
    చుంచుకు గుఱ్ఱము బుట్టెను;
    కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్.

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారు పద్యాంతంలో 'పట్ట్టుము, అక్కా !' అన్నారు. నిజానికి తెలుగు భాషాపరంగా విరామచిహ్నాలు లేవు. సరే, అవగాహనకోసం మనం వాడుక చేస్తున్నాం మంచిదే. ఈ రోజున నా పూరణంలో కూడా విరామచిహ్నాలు వాడాను. కాని అవి సంధిసమాసనియమాలను త్రోసిరాజన లేవు గదా. ఉత్తున కచ్చు పరమైనప్పుడు సంధి నిత్యంగా జరుగుతుంది కాబట్టి, 'పట్ట్టుమక్కా' అనే రూపం అనివార్యం.

    మందాకిని గారి పూరణంలో, మూడవ పాదం 'మంచిది మన మార్జాలము.' అని ఉంది. బాగుంది. కాని, తెలుగు పద్యానికో నియమం ఉంది. పద్యం మధ్యలో వాక్యావసానం కారాదు. ఒకవేళ అయినా, అదీ కనీ కన్పించకుండా చేయాలి. ఎలాగంటే, దానితో మరొక వాక్యాన్ని అందంగా అతుకు పెట్టి. అతుకు తెలుస్తున్నా, సాంకేతికంగా వాక్యం పొడిగించాలి. ఉదాహరణకు: 'వచ్చెడి వాడు ఫల్గుణ డవశ్యము గెల్తు మనంగరాదు.......' ఈ ప్రసిధ్ధ పద్యంలో, వచ్చెడి వాడు ఫల్గుణుడు' అనగానే వాక్యం పూర్తయింది. కాని, చాలా అందంగా పొడిగింపబడింది. చెప్పవచ్చేదేమిటంటే, వేరు వేరు సంబంధంలేని వాక్యాలతో పద్యాన్ని నింపరాదని. అదలా ఉండగా, మనమే, మన పద్యంలో, వాక్యం పూర్తయిందండీ అని వాక్యవిరామచిహ్నాన్ని ఉంచడం ఉచితం కాదు.

    మంద పీతాంబర్ గారి పూరణలో ఇచ్చిన సమస్యాపాదాన్ని పద్యం మధ్యలోకి తెచ్చి పూర్తి చేయటం కనిపిస్తుంది. ఆక్షేపించటం నా ఉద్దేశ్యం కాదు గాని, యిలా సమస్యను మధ్యలోకి తోసి పూర్తిచేయటం అంతం సబబైన పధ్ధతి కాదు. ఈ ధోరణిగా సమస్యలు పూర్తిచేయటాన్ని నేను చాలా సార్లు గమనించాను. ఈ రోజుల్లో యిలా గూడా సావుకాశం ఉందేమో తెలియదు. చాలా యేళ్ళ క్రిందటే ఒక ఘోరమైన అష్టావధాన కార్యక్రమంలో, అవధానిగారికి పృఛ్ఛకుడు ఉత్పలమాలలో మొదటి మూడు పాదాలూ ఇచ్చి నాల్గవ పాదం పూర్తి చేయమని అడగటం చూసాను. నాకైతే, సమస్యను నాల్గవ పాదంగానే ఉంచి పూర్తి చేయటం నచ్చుతుంది. నాది చాదస్తం కావచ్చు.

    వసంత కిశోర్ గారి మొదటి పూరణం కుదరని వ్యవహారం. ఆయన సమస్యను మార్చివేసారు. పొరబడి యేమో. 'కూనల పెంటన్' బదులు 'కూనల బెట్టెన్' అనే వ్రాయబూనారని నా అనుమానం. వారు కూడా సమస్యను మధ్యలోకి తోసారు. అదీ కాక, 'కొలిచి నిడవలెన్' అని పద్యాంతం. ఇక్కడ యడాగమమే. 'కొలిచి యిడవలెన్' అని ఉండాలి.

    లక్కాకుల వెంకట రాజారావు గారి మొదటి పూరణ మంచి ధారాశుధ్ధి కలిగి ఉంది. కొంచెం అన్వయం విషయం ఆలోచించాలి. కాని బాగుంది. అయితే పద్యం ప్రారంభంలోని 'కొంచక' అన్న పదం నాకు బోధపడలేదు. ఈ పదం వారి రెండవ పూరణలో కూడా ఉంది.

    రిప్లయితొలగించండి
  11. సవరించిన పద్యము.

    కొంచెము ధాన్యము నిచ్చట
    కుంచములోఁ బోతు, నక్క కూనలఁ బెట్టెన్
    మంచెకు పైనను, కుక్కలు
    వంచనతోడనిటు జేరు, వాసన గనినన్.

    శ్యామలీయం గారి సూచనలకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ .......

    దంచినవారందరికిని
    కుంచెడు ధాన్యమ్ము కూలి కొలిచెద ననుచున్
    వంచింపగ నొకడిట్లనె
    కుంచములో బోతునక్క కూనల బెట్టెన్.

    రిప్లయితొలగించండి
  13. ________________________________________________
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘పోతున్ + అక్క’ పదవిభాగం ప్రశంసనీయం. చక్కని పూరణ. అభినందనలు.
    ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్య గమనించారు కదా! అక్కడ ‘పట్టవె యక్కా!’ అంటే సరి!
    _______________________________________________
    మందాకిని గారూ,
    మీరూ గోలి వారి మార్గమే పట్టారు. వివరణ అక్కర లేకుండానే మీ భావం అవగాహన అవుతున్నది. మీ పూరణ చాలా బాగుంది. చక్కని ధార. అభినందనలు.
    _______________________________________________
    మంద పీతాంబర్ గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మీ పూరణలో ‘కూనల బెట్టెన్’ అనేది ‘కూనల బెట్టన్’ అయింది.
    _______________________________________________
    వసంత కిశోర్ గారూ,
    చమత్కారభరితంగా ఉంది మీ మొదటి పూరణ. అభినందనలు.
    ఇంతకీ ‘కూనల పెంట’ను ఎక్కడ పోస్తానంటున్నది?
    రెండవపూరణలో ‘పోతునక్క’ కూనలు పెట్టడం ఏమిటి? పోతునక్క అంటే ‘మగనక్క’!
    ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారా? నా ‘యడాగమం’ పాఠం శ్రద్ధగా చదివినట్టు లేదు.
    _______________________________________________
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ఈమధ్య మన బ్లాగుపైన శీతకన్ను వేసారు. చాలా రోజులయింది మీ పూరణలు లేక.
    మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    ‘పుడమి కుంచంలో పోతునక్క నిరీక్షించిందా?’ ఎంత చక్కని భావన! భేష్!
    _______________________________________________
    ‘శ్యామలీయం’ గారూ,
    కలికాలం! ఏం జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు. చక్కని పూరణ. అభినందనలు.
    కవిమిత్రుల పూరణ గుణదోషాలను ఎంతో ఓపికతో వివరంగా సమీక్షించి తగు సలహాలు ఇచ్చినందుకు బహుధా ధన్యవాదాలు. ఇటువంటి సహకారం ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.
    _______________________________________________
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ప్రశస్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    ______________________________________________

    రిప్లయితొలగించండి
  14. శంకరార్యా ! ధన్యవాదములు.
    శ్యామలీయం గారూ! ఎంతో ఓపికగా దోషములను తెలుపుచూ సవరణలు, సూచనలు చేసినందులకు ధన్యవాదములు. యడాగమం విషయంలో ఇంకా నాకు పూర్తి అవగాహన కలుగ లేదు. అప్పుడప్పుడు దోషములు దొర్లుచున్నవి. ఉదయం పూరణ చేసిన తదుపరి దోషమును గ్రహించి మార్చవలె ననుకున్నాను. కానీ ' పవర్ కట్' మూలంగా చేయలేక పోయాను. అమూల్యమైన మీ సమీక్ష మాస్టరు గారు చెప్పినట్లు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను.ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  15. దంచిన బియ్యము పోయుము
    కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్
    పంచను పిల్లియె, కుక్కలు
    పొంచెను మా వీధిలోన పోయెద నక్కా!

    రిప్లయితొలగించండి
  16. సుందరకాండ: అశోకవన విధ్వంసం తరువాత సేనలను చంపిన హనుమ భీమ పరాక్రమ ప్రదర్శన చేస్తూ,
    అంచన దప్పిన రావణు
    నంచితసేనల దునుముచు హనుమయు దలచెన్
    చంచలు, లంకా పురియను
    కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్
    మనవి: చంచలు = గడ్డిబొమ్మలు; పోతునక్క => రావణుడు అనే భావంలో

    రిప్లయితొలగించండి
  17. ఎంచుచుఁ, సరి! గురుతించమ
    టంచును,ప్రశ్నించెనొకడువ్యస్తాక్షరిలో
    నుంచన్వళినయ్యనిటుల-
    "కుంచములోఁ బోతునక్క, కూనలఁ బెట్టెన్"

    రిప్లయితొలగించండి
  18. శంకరార్యా ! ధన్యవాదములు !

    01)
    _________________________________

    చుంచులు పిల్లల బెట్టెను
    కుంచములో ! పోతునక్క - కూనల పెంటన్ !
    కుంచముతో పని యున్నది
    కొంచెము ధాన్యమును సంచి - కొలిచి నిడవలెన్ !
    _________________________________

    ప్ర: "ఇంతకీ ‘కూనల పెంట’ను ఎక్కడ పోస్తానంటున్నది?"

    జ: అక్కా , కుంచముతో ధాన్యము కొలవవలసిన పనియున్నది
    కుంచములో చుంచులు పెట్టిన పిల్లల్ని
    పెంటమీద పోతును(పోస్తాను) !

    రిప్లయితొలగించండి
  19. నక్కలు కూడా పిల్లల్ని మెడ పట్టుకొని స్థావరాన్ని మారుస్తుంటాయి !

    02)
    _________________________________

    చుంచులు పిల్లల బెట్టెను
    కుంచములో ! పోతునక్క - కూనల బెట్టెన్
    మంచిగ మన పొలమందున
    సంచారము జేసి వాని - సత్వము బెంచన్ !
    _________________________________

    2ప్ర:రెండవపూరణలో ‘పోతునక్క’ కూనలు పెట్టడం ఏమిటి? పోతునక్క అంటే ‘మగనక్క’!
    జ :అయ్యా ! పద్యం పైన నా వ్యాఖ్య మీరు గమనించినట్టు లేదు !
    పోతునక్క(మగనక్క) కని పెట్టిందని కాదు స్థావరాన్ని మార్చాలనే
    ఉద్దేశ్యంతో తెచ్చి పెట్టిందని నా భావన !
    మరొక్కసారి గమనించ గలరు !

    రిప్లయితొలగించండి
  20. 3ప్ర:శ్యామలీయం’ గారి వ్యాఖ్యను గమనించారా? నా ‘యడాగమం’ పాఠం శ్రద్ధగా చదివినట్టు లేదు.
    జ :అయ్యా ! మీ పాఠాలు శ్రద్ధ గానే చదువుతున్నాను !
    కాని ఇక్కడ జరిగిందేమిటంటే

    "కొంచెము ధాన్యమును కొలిచి - సంచి నిడవలెన్ !"
    అని మొదట వ్రాసుకొన్నదాన్ని యతికోసం
    "కొంచెము ధాన్యమును సంచి - కొలిచి నిడవలెన్ !"
    అని మార్చడం వల్ల జరిగిన పొరపాటు !

    రిప్లయితొలగించండి
  21. శ్యామలీయం గారూ ! వందనములు !
    మీరు చెప్పిన సవరణలూ సూచనలూ
    అందరూ అనుసరించి, ఆచరించదగినవీ,
    బ్లాగు శోభను మరింత పరిపుష్టం చేయగలవీను !
    ధన్యవాదములు !

    మొదటి పూరణ నేను కావాలనే మార్చాను ! నా భావం గమనించారుగా !
    అక్కడ సవరణతో అని వ్యాఖ్య పెట్టడం మరిచాను !

    అలా మార్చడం చట్టసమ్మతం కాదు గనుకనే
    రెండవ పూరణ చెయ్యవలసి వచ్చింది !

    రిప్లయితొలగించండి
  22. కాంచీ పట్టణ బొమ్మలు
    పంచెను మా మంచి యక్క పదిమందికిఁ దా
    నుంచెను మీనుల నీటను
    కుంచములోఁ బోతునక్క,కూనలఁ బెట్టెన్

    రిప్లయితొలగించండి
  23. సవరణ :

    కాంచి పురపు బొమ్మలుఁ గొని
    పంచెను మా మంచి యక్క పదిమందికిఁ దా
    నుంచెను మీలను నీటను
    గుంచములోఁ బోతు, నక్కకూనలఁ బెట్టెన్

    రిప్లయితొలగించండి
  24. నాకు యింకా అక్కయ్యలున్నా, పద్యాలు వ్రాసేటప్పుడు ' మంచి యక్క ' అంటే రాజేశ్వరి అక్కయ్యగా భావించ వలెనని సూచన.

    రిప్లయితొలగించండి
  25. శ్రీగురుభ్యోనమ:

    పెంచెడు తల్లి గతించగ
    పంచెను ప్రేమామృతమ్ము పసికూనలకున్
    మంచిగ భద్రత గూర్చగ
    కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్

    రిప్లయితొలగించండి
  26. ఇంచుక వింతయు లేదన:
    "కుంచములోఁ బోతు; నక్క కూనలఁ బెట్టెన్"
    మంచిగ నిముడుట లేదా
    కించిత్తు హస్తము లోన కింగులు క్వీనుల్?


    కింగులు క్వీనులు = చదరంగము మరియు పేకాట లోని రాజు రాణులు

    రిప్లయితొలగించండి
  27. ప్రియంక:

    దంచుచు స్పీచులు మమ్మీ!
    కంచములో పెట్టె నన్న గాడిద గుడ్లన్
    ముంచుచు గంగను కాంగ్రెసు
    కుంచములోఁ బోతునక్క కూనలఁ బెట్టెన్

    రిప్లయితొలగించండి