30, అక్టోబర్ 2011, ఆదివారం

సమస్యా పూరణం - 510 (భవుఁడు భవు నెదిర్చి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.
ఈ సమస్యను పంపిన
పండిత నేమాని వారికి
ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. శివుడు దీక్ష నుండ సేవల జేయుచు
    గిరిజ ఎదుట నిల్వ విరుల బాణ
    ములను వేయ గాల్చె ముక్కంటి, యా మనో
    భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె.

    రిప్లయితొలగించండి
  2. బొమ్మనొకటి జేసి దమ్మూది గుమ్మాన
    నిలిపియంబ పోవ జలకమాడ
    నయ్యనెరుగనట్టి యా పార్వతీ మనో
    భవుడు భవునెదిర్చి భంగపడడె

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  3. తే.గీ.లో పూరణ:
    అచలజ శివప్రసన్నార్ధి యగుచు నిత్య
    విధుల నతనికి పూమాల వేయ జూడ
    నంత పంచ బాణము వేయ నంగ భవుఁడు
    భవు నెదిర్చి భంగపడఁడె భవ్య రీతి ?

    రిప్లయితొలగించండి
  4. సంపత్ కుమార్ శాస్త్రిఆదివారం, అక్టోబర్ 30, 2011 9:35:00 AM

    జగమునందు తాను జగదేకవీరుండ
    ననుచు విఱ్ఱవీగి, మునిగణంబు
    చూచుచుండవైచి సుమబాణములనంగ
    భవుడు భవునెదిర్చి భంగపడడె.

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _________________________________

    భవుని తపము నేను - భంగమ్ము జేసెద
    బాలచంద్ర యతని - భార్య యగును
    భయమికేలటంచు - పల్కిన; నయ్యంగ
    భవుఁడు, భవు నెదిర్చి - భంగ పడఁడె !

    _________________________________

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని గారి పూరణ .....

    బాల్యమున గణపతి నీలకంఠుని తండ్రి
    యనుచు నెరుగ డకట నడ్డు పడెను
    ద్వారము కడ నహహ! భవలీల భవునాత్మ
    భవుడు భవు నెదిర్చి భంగ పడడె

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని వారూ,
    మొదటి పాదంలో యతి తప్పింది.
    ‘బాలుఁడగు గణపతి నీలకంఠుని తండ్రి’ లేదా
    ‘బాల్యమున గణపతి పరమేశ్వరుని/పంచవక్త్రుని/ప్రమథాధిపుని/ఫాలనేత్రుని/వామదేవుని/వాకతాల్పుని/బాలేందుధరు’ వీటిలో ఏదైనా సరిపోతుంది.

    రిప్లయితొలగించండి
  8. యజ్ఞ కర్త భవుడు యజ్ఞ భోక్తభవుండు
    యజ్ఞ ఫలము భవుడు యజ్ఞ మతడు
    దక్షు డెఱుగ డాయె తమమున, శిక్షించె
    భవుడు, భవు నెదిర్చి భంగ పడడె.

    రిప్లయితొలగించండి
  9. పండిత నేమాని గారి వ్యాఖ్య ......

    మహానుభావా శంకరయ్య గారూ!
    తొందరపాటులో జరిగినది.
    బాలుడగు గణపతి నీలకంఠుని తండ్రి
    యనుచు నెరుగ డకట యడ్డుపడెను
    ద్వారముకడ నహహ! భవలీల భవునాత్మ
    భవుడు భవునెదిర్చి భంగపడడె

    టైపు చేస్తూ చేస్తూ పదాలు మార్చితే ఇలాగే ఉంటుంది తంటా.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని వారూ
    ఇప్పుడు కూడా కొన్ని పాదాల్లో కాస్త????


    స్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  11. అయ్యా! ఆదిభట్ల వారూ!
    నా తప్పులు నాకు తెలియవు కదా. మీరేంటి చూచేరో చెప్పండి.

    రిప్లయితొలగించండి
  12. పంచముఖుడు,ధాత,బ్రహ్మదేవుడు తొల్లి
    పరమశివుని గాంచి పరిహసింప
    శిరసు గోలుపోయి చిన్నబోయెను,అబ్జ
    భవుడు భవునెదిర్చి భంగపడడె.

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని పండితార్యా
    నేను పొరపాటు పడ్డాను, మన్నించాలి.

    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతిశాస్త్రిఆదివారం, అక్టోబర్ 30, 2011 9:58:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    మనసిజుండు తాను మరులు గొల్పగ పూని
    శివుని చూపు సోకి చితికి పోయె
    పరిహసించె శివుని పరికించి పద్మసం
    భవుడు భవునెదిర్చి భంగపడడె.

    రిప్లయితొలగించండి
  15. కరము శిరము తాక కాలి బూడిద యగు
    నటుల వరముఁ బొంది నట్టి వేళ
    చేయి వేయనెంచె శివునిపై నసురసం
    భవుడు, భవునెదిర్చి భంగపడడె.

    రిప్లయితొలగించండి
  16. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ పశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    అద్భుతమైన పూరణ మీది. అభినందనలు.
    ‘పంచబాణము(లు?) వేయ’ అన్నదానిని ‘పంచబాణము లేయి’ అంటే బాగుంటుంది.
    **********************************************************************
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    వసంత కిశోర్ గారూ,
    చక్కని పూరణ మీది. అభినందనలు.
    ‘బాలచంద్ర’ ...?
    **********************************************************************
    పండిత నేమాని వారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    **********************************************************************
    మిస్సన్న గారూ,
    దక్షయజ్ఞ ప్రస్తావనతో అద్భుతమైన పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    **********************************************************************
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    ‘పరాభవుడు’ శబ్దాన్ని ఏ అర్థంతో ప్రయోగించారు?
    **********************************************************************
    ‘కమనీయం’ గారూ,
    పంచముఖుడైన బ్రహ్మ చతుర్ముఖుడైన ఐతిహాసికాన్ని ప్రస్తావించిన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మన్మథుడు, బ్రహ్మ భంగపడిన విషయాన్ని ఒకే పద్యంలో చెప్పిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    **********************************************************************
    మందాకిని గారూ,
    భస్మాసుర వృత్తాంతంతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  17. ‘శ్యామలీయం’ గారూ,
    శ్రమ తీసుకొని ఒక్కొక్కరి పూరణలను నిశితంగా పరిశీలించి గుణదోష విచారణ చేసి విస్తృతమైన వ్యాఖ్య పెట్టినందుకు ధన్యవాదాలు. మీ యీ సహకారం ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.
    ఎందువల్లనో మీ వ్యాఖ్య నేరుగా బ్లాగులో ప్రకటితం కాలేదు. నేను నా వ్యాఖ్యలను టైపు చేసున్న సమయంలో అది నా మెయిల్ వచ్చినట్టుంది. దానిని అక్కడనుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  18. ‘శ్యామలీయం’ గారి వ్యాఖ్య ......

    ‘మన తెలుగు’ వారి పూరణలో చమత్కారం. సమస్యను ఒకే పాదంగా కాక రెండు పాదాల మధ్యకు చేర్చి "నంగ భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె భవ్య రీతి" అన్నారు. బాగుంది. అయితే 'పంచ బాణము వేయ' అన్న ప్రయోగం ఉచితం గాదేమో. పంచ బాణము అని నమాసం కుదరనిదిగా నా అభీప్రాయం,నాదే తప్పు గావచ్చును.

    వసంత కిశోర్ గారి పద్యంలో బాలచంద్ర పదం యొక్క అన్వయం స్పష్టం గావటం లేదు నాకు.

    పండిత నేమాని గారి తొలి పూరణలో 'నెరుగ డకట నడ్డు పడెను' అని యుంది. కాని 'అకటన్' అని దృతం కాదు గాబట్టి యడాగమమే రావలసి యన్నది గదా. అదీ గాక మొదటిపాదంలో బాల్య -- నీల అకు ప్రాసయతి కుదరదు. శంకరయ్యగారి పరిష్కరణం బాగుందిక్కడ. నేమాని వారు సవరించిన పద్యం యిచ్చారు.

    మిస్సన్నగారి పూరణలో చివరి పాదం యిబ్బంది పెడుతున్నది. చూడండి. "దక్షు డెఱుగ డాయె తమమున. శిక్షించె భవుడు. భవు నెదిర్చి భంగ పడడె." చివరి వాక్యం అసంపూర్ణం. భవు నెదిర్చి భంగ పడడె అన్నప్పుడు యెవరా భంగపడినదీ వాక్యంలో రావాలి కదా.

    మంద పీతాంబర్ గారు 'తేటముగను' అన్నారు కాని అది సాధువు కాదేమో. 'తెల్లముగను' అంటే సరి. 'పరాభవుఁడు' అన్న మాట నాకు సాధువు కాదనిపిస్తోంది. నా అభిప్రాయం తప్పు గావచ్చును.

    కమనీయం గారి పద్యంలో ద్వితీయపాదం పరిహసింప అని కాక పరహసించి అని ఉంటే బాగుంటుంది. యోచించండి.

    అయితే, కొన్ని పద్యాలలో సమస్య 'భవునెదిర్చి భంగపడడె' అని ఉండటాన్ని సరిగా వినియోగించినట్లు తోచదు. 'శివుడి నెదిరించి భంగపడ లేదా అని ప్రశ్న ఉన్నది యిక్కడ. అజ్ఞాత గారు బొమ్మనొకటి జేసి.... అంటూ చేసిన పూరణం భంగపడెను అని ముగిస్తే సరిగా అన్వయం అవుతుంది. సంపత్ కుమార్ శాస్త్రి గారి జగమునందు... పద్యం గూడా అంతే. మిస్సన్న గారి యజ్ఞ కర్త భవుడు.... పద్యమూ అంతే. ఈ పట్టిక సంపూర్ణం కాక పోవచ్చును. హెచ్చు పూరణలు 'భంగ పడెను' అన్న భావనకు సరిపడేలా వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  19. ‘శ్యామలీయం’ గారూ,
    నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. మీరు మళ్ళీ పోస్ట్ చేసిన వ్యాఖ్య కూడా తప్పిపోయింది. నా మెయిల్ కు మాత్రం వచ్చింది.
    ఇలాగే పండిత నేమాని గారి వ్యాఖ్యలూ నేరుగా బ్లాగులోకి రావడం లేదు. నా మెయిల్ నుండి కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయవలసి వస్తున్నది.
    ఎందుకిలా జరుగుతున్నదో అర్థం కావడం లేదు.

    రిప్లయితొలగించండి
  20. గురువు గారికి ,శ్యామలీయం గారికి నమస్కారం.
    పూరణను పోస్ట్ చేసిన తర్వాత "తేటముగను"కు బదులు "తెల్లముగను" అని వ్రాయాల్సింది అనుకొన్నాను దానినే శ్యామలీయం గారుసూచించారు. ధన్యవాదములు .

    ఎంతటి భక్తుడైనా శంకరుడిని తన ఇంట రక్షకుడుగా ఉండమని కోరడం శివుని పరాభావించడ మేనని భావించి అలా పరాభావించిన బాణాసురున్ని "పరాభవుడు" గా ప్రయోగించాను. ఆ పదం సాధువు కాదేమోనన్న సందేహం నాకూ కలిగింది, ఐనా గురువుగారు సందేహ నివృత్తి చేస్తారనే భరోసాతో పూరించాను.వీలైతే పూరణను సవరిస్తాను లేదా తొలిగిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. శంకరార్యా ! ధన్యవాదములు !
    శ్యామలీయంగారూ ! ధన్యవాదములు !
    బాలచంద్ర = పార్వతి (ఆచార్య జి ఎన్ రెడ్డి)

    రిప్లయితొలగించండి
  22. వసంత కిశోర్ గారూ,
    ఆచార్య జి. ఎన్. రెడ్డి గారి ‘పర్యాయపద నిఘంటువు’ పరిశీలించిన తరువాతే ‘బాలచంద్ర ...?’ అన్నాను. మరోసారి పరిశీలించండి. లేక రెడ్డి గారు రచించిన మరో నిఘంటువు ఏదైనా ఉందా?

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా !
    "బ" తో ఉన్న పార్వతి కి పర్యాయపదములు :
    (ఆచార్య జి ఎన్ రెడ్డి-తెలుగు పర్యాయ పద నిఘంటువు -
    ఎనిమిదవ ముద్రణ - జనవరి 2010 నుండి)

    బదరీవాస,బర్హిధ్వజ,బహుభుజ,బాభ్రవి,బృహద్భట్టారిక,బ్రహ్మచారిణి,
    బ్రహ్మవిద్య,భంజ,భగవతి,భద్రకాలి,భవాని,భవ్య,భార్గవి,బాలచంద్ర,
    భీమ,భూతమాత,భైరవి,భ్రామరి

    రిప్లయితొలగించండి
  24. శ్యామలీయంగారూ, ధన్యవాదాలు. మీ "...పడెను" - "పడడె" అనే అన్వయ సందిగ్ధం నాకూ కలిగింది. నేను సమస్య చూసిన వెంటనే మాష్టారుకి క్రింది ఈమెయిలు వ్రాశాను. వారు స్పందించలేదు. బహుశ: చూసివుండరు.
    ----
    "మాస్టారూ, ఈ రోజు సమస్య- "భవుఁడు భవు నెదిర్చి భంగపడఁడె" అయితే ప్రశ్నార్థకంగా వుంది, లేకపోతే ఆశ్చర్యార్థకంగా వుంది. దానివల్ల కొన్ని పూరణలో అన్వయం కొంత దెబ్బ తింటోంది లేదా force చేసి నట్లవుతోంది. కాబట్టి, "భవుఁడు భవు నెదిర్చి భంగపడెను" అంటే యెలా వుంటుంది? "
    ----

    రిప్లయితొలగించండి
  25. వసంత కిశోర్ గారూ,
    దొరికింది. ఇంతకు ముందు సరిగా గమనించక వ్యాఖ్యానించి మిమ్మల్ని శ్రమపెట్టాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. చంద్రశేఖర్ గారూ,
    నిన్న ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక జిరాక్స్ సెంటర్ లో ఐదునిమిషాల వ్యవ్యధి అడిగి నా మెయిల్ చూసినప్పుడు మీ వ్యాఖ్యను గమనించాను. నా మెయిల్ కు వచ్చిన నే్మాని వారి వ్యాఖ్యను కాపీ చేసి బ్లాగులో పేస్ట్ చేయడంతోనే సమయం అయిపోయింది. ఇంటికి వచ్చాక మీ వ్యాఖ్యపై స్పందిచాలనుకొని మరిచిపోయాను.
    అక్కడ మీ రన్నట్లు ప్రశ్నార్థకంగాను, నిర్దేశార్థకంగాను, ఆశ్చర్యార్థకంగాను పూరణ విషయాన్ని బట్టి ప్రయోగించే అవకాశం ఉంది. ‘భంగపడలేదా? భంగపడినాడు కదా! ఓసీ! భంగపడినాడు కదే! ఇలా ...’

    రిప్లయితొలగించండి