17, అక్టోబర్ 2011, సోమవారం

యడాగమం -1

యడాగమం -1
‘మా + ఇల్లు’ అన్నప్పుడు సంధి జరుగడానికి అవకాశం లేదు. వ్యావహారికంలో "మా ఇల్లు ఇక్కడికి చాలా దూరం’ అంటాము. కాని గ్రాంథికంలో "మా యిల్లిక్కడకు చాల దూరము’ అంటాము. గ్రాంథికంలో ముఖ్యంగా పద్యరచనలో వాక్యం మధ్య అచ్చును ప్రయోగించడం దోషం. ‘మా + ఇల్లు = మా యిల్లు’ ఇక్కడ ‘ఇ’ అనే అచ్చు స్థానంలో ‘యి (య్ + ఇ) వచ్చింది. ఇది యడాగమం.
యట్ + ఆగమం = యడాగమం. ‘యట్’ అనేది ఆగమంగా రావడం యడాగమం. ‘యట్’లోని టకారం లోపించి ‘య’ మిగులుతుంది. ‘య’లోని అకారం ఉచ్చారణాసౌలభ్యం కోసం చేరినదే. నిజానికి అక్కడ ఆగమంగా వచ్చేది ‘య్’ మాత్రమే.
‘ఆగమం’ అంటే వర్ణాధిక్యం. ఒక వర్ణం (అక్షరం) అధికంగా వచ్చి చేరడమే ఆగమం. మనకు ఆగమ సంధులు, ఆదేశ సంధులు ఉన్నాయి. ‘మిత్రవదాగమః (మిత్రవత్ + ఆగమః), శత్రువదాదేశః (శత్రువత్ + ఆదేశః)’ అంటారు. ఆగమం మిత్రుని వంటిది. అంతకు ముందున్న అక్షరాన్ని తొలగించకుండా మిత్రుని వలె ప్రక్కన చేరుతుంది. ఉదా... పెంకు + ఇల్లు = పెంకు + టు + ఇల్లు = పెంకుటిల్లు (టుగాగమ సంధి). ఆదేశం శత్రువు వంటిది. అందుకు ముందున్న అక్షరాన్ని కాని అక్షరాలను కాని తొలగించి శత్రువులా ఆ స్థానాన్ని ఆక్రమించుకుంటుంది. ఉదా... వాఁడు + చచ్చెను = వాఁడు సచ్చెను (గసడదావేడ సంధి).
ఇప్పుడు ఎక్కడెక్కడ యడాగమం వస్తుందో చూద్దాం ....
1) సంధి లేనిచోట స్వరంబునకంటెం బరంబయిన స్వరంబునకు యడాగమం బగు.
వివరణ - సంధి జరుగని చోట అచ్చు తర్వాత ఉన్న అచ్చుకు యడాగమం అవుతుంది.
ఉదా.
మా + అమ్మ = మా యమ్మ
మీ + ఇల్లు = మీ యిల్లు
మా + ఊరు = మా యూరు
రావా + ఇటు = రావా యిటు
అదియే + ఇది = అదియే యిది.
2) అత్తునకు సంధి బహుళముగా నగు.
వివరణ - ‘అత్తు’ అంటే హ్రస్వమైన అకారం. దీనికి అచ్చు పరమైనప్పుడు సంధి బహుళముగా జరుగుతుంది. బహుళమంటే అనేకవిధాలు. వ్యాకరణంలో బహుళార్థాలు నాలుగు (క్వచిత్ ప్రవృత్తిః క్వచిదప్రవృత్తిః, క్వచిద్విభాషా క్వచిదన్యదేవ| విధేర్విధానం బహుధా సమీక్ష్య, చతుర్విధం బాహుళకం వదంతి||)
అ) ప్రవృత్తి (నిత్యం) - విధించిన వ్యాకరణకార్యం నిత్యంగా (తప్పకుండా) జరగడం.
ఉదా... రామ + అయ్య = రామయ్య; సీత + అమ్మ = సీతమ్మ.
ఆ) అప్రవృత్తి (నిషేధం) - విధించిన వ్యాకరణకార్యం జరుగకపోవడం. స్త్రీవాచక తత్సమ సంబోధనాంత పదాల అత్తునకు సంధి లేదు.
స్త్రీవాచక శబ్దాలకు ఉదా ...
అమ్మ + ఇచ్చెను = అమ్మ + య్ + ఇచ్చెను = అమ్మ యిచ్చెను
అక్క + ఎక్కడ = అక్క + య్ + ఎక్కడ = అక్క యెక్కడ.
తత్సమ శబ్దాలకు ఉదా ...
దూత + ఇతఁడు = దూత + య్ + ఇతఁడు = దూత యితఁడు
హరి + ఎక్కడ = హరి + య్ + ఎక్కడ = హరి యెక్కడ
సంబోధనాంత శబ్దాలకు ఉదా ...
చెలువుఁడ + ఇందము = చెలువుఁడ + య్ + ఇందము = చెలువుఁడ యిందము
రామ + ఇటురా = రామ + య్ + ఇటురా = రామ యిటురా
మిత్రమ + ఏమంటివి = మిత్రమ + య్ + ఏమంటివి = మిత్రమ యేమంటివి
ఇ) విభాష (వికల్పం) - విధించిన వ్యాకరణకార్యం జరుగవచ్చు, జరుగక పోవచ్చు.
ఉదా ...
మేన + అల్లుఁడు = (సంధి జరిగి) మేనల్లుఁడు;
(సంధి జరుగక యడాగమం వచ్చి) మేన + య్ + అల్లుఁడు = మేనయల్లుఁడు.
పుట్టిన + ఇల్లు = పిట్టినిల్లు; పుట్టినయిల్లు.
చూడక + ఉండెను = చూడకుండెను; చూడకయుండెను.
ఈ) అన్యకార్యప్రవృత్తి (అన్యవిధం) - మరొక విధంగా జరుగడం.
ఉదా ... ఒక + ఒక = ఒకానొక.
(మిగతా తరువాతి పాఠంలో ...)
దయచేసి ఈ పాఠంపై మీ అభిప్రాయాలను తెల్పండి.

14 కామెంట్‌లు:

  1. శ్రీపతిశాస్త్రిసోమవారం, అక్టోబర్ 17, 2011 8:29:00 PM

    గురువుగారూ యడాగమము గురించి ఒక అవగాహన కల్గించినారు. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    ఇది ఆరంభమే. ఇంకా చెప్పవలసింది చాలా ఉంది.

    రిప్లయితొలగించండి
  3. మాస్టరు గారూ! ఓపికగా మీరు అందించుచున్న పాఠం ఎంతో ఉపయుక్తముగా నున్నది.అన్నింటిని ప్రత్యెక లేబుల్ లో ఉంచితే పునశ్చ రణకు వీలు కలుగుతుంది. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. యడాగమము పై మీ పాఠం ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నాను. ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! చక్కని పాఠానికి ధన్యవాదములు !

    రిప్లయితొలగించండి
  6. గురువుగారికి నమస్కారము. శ్రమ చేసుకుని మీరిస్తున్న ఈ పాఠానికి ధన్యవాములు.

    రిప్లయితొలగించండి
  7. గురువు గారూ వ్యాకరణ పాఠము రసవత్తరముగా ఉంది. యడాగమము ఆంగ్లములో కూడా వింటూంటాము. ఏదైనా చెప్పినా, అడిగినా ' యా !( యెస్)' అంటూంటారు. కావాలంటే ఏవైనా ఆంగ్ల చలన చిత్రాలు చూడండి.

    రిప్లయితొలగించండి
  8. మాస్టారూ, చాలా బాగుంది. ఈ పాఠాలు కొనసాగిస్తారని ఆశిస్తాను. వ్యావహారికం రాయడంలో కొన్ని అసంబద్ధమైన సంధుల వాడుక కనిపిస్తున్నది. ఉదాహరణగా మీరిచ్చిన పదాలలోనే
    అమ్మ ఇచ్చింది = అమ్మిచ్చింది, అక్క ఎక్కడ = అక్కెక్కడ లాంటి వాడుకలు కనిపిస్తున్నాయి.
    మేనల్లుడు, మేనత్త వంటి పదాల వలెనే పై వాటిలో సంధి చేయవచ్చునా?

    రిప్లయితొలగించండి
  9. **********************************************************************
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మంద పీతాంబర్ గారూ,
    వసంత కిశోర్ గారూ,
    కాజ సురేశ్ గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ........... ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహంతో పాఠాలు కొనసాగించాలనే ఉంది.
    **********************************************************************
    కొత్తపాళీ గారూ,
    ధన్యవాదాలు. ‘అమ్మ + ఇచ్చించి = అమ్మ యిచ్చించి; అక్క + ఎక్కడ = అక్క యెక్కడ’ అనే తప్ప మరోరకంగా రాదు.
    **********************************************************************

    రిప్లయితొలగించండి
  10. గురువు గారు,
    వ్యాకరణ పాఠాల కోసం ఎప్పడినుండో ఎదురు చూస్తున్నాను. అందజేస్తున్నందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. యడాగమం గురించి ఎంత బాగా చెప్పారో . శ్రమ తీసుకుని మంచి పాఠాలు అందిస్తున్న గురువు గారికి ధన్య వాదములు. ఇక నుంచీ అయినా [ నేను ] తప్పులు లేకుండా రాస్తే అదే పెద్ద గురుదక్షిణ . [ మళ్ళీ తెలుగు క్లాసులో ఉన్నట్టుంది ]

    రిప్లయితొలగించండి
  12. జిగురు సత్యనారాయణ గారూ,
    రాజేశ్వరి అక్కయ్యా,
    ...........ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. అయ్యా ! వివరణ బాగుంది.పుట్టిన + ఇల్లు = పుట్టినిల్లు కదా ! పిట్టినిల్లు అని టంకనమయ్యింది. సరిచేసుకోగలరు. చక్కని వివరణ నిచ్చి నందులకు నెనరులు.

    రిప్లయితొలగించండి