2, డిసెంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1557 (భీముని భార్య యూర్వశి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
భీముని భార్య యూర్వశి విభీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే.

21 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అబద్ధాలపోటీలో - ప్రథమ బహుమతి - కాముడిదే :

    01)
    _________________________________________

    భీముని పట్నమందుగల ♦ భీముని యాలయ మండపమ్మునన్
    గ్రామపు పెద్ద సాక్షిగను ♦ గాఢపు కాఱుల పోటి యందునన్
    కాముడు పల్కి యీ విధము ♦ కప్పును గెల్చెను తోటి వాండ్రపై
    " భీముని భార్య యూర్వశి వి ♦ భీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే ! "
    _________________________________________
    గాఢపు = గొప్పదైన
    కాఱు = అబద్ధము
    పోటి = పోటీ

    రిప్లయితొలగించండి
  2. లేమను జూడ కోరికలు లేచిన యూర్వశి యౌను కంటికిన్
    ప్రేమగ పుత్రుడయ్యెను విభీషణ గాత్ర ఘటోత్కచుండికన్
    సోముడె పాండు రాజు ఘన శూరుడు, ధర్మజుడింక శౌరియౌ
    భీముని భార్య యూర్వశి విభీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే!!

    రిప్లయితొలగించండి
  3. శుంఠ - సోమరి - ఆ పైన గర్వం - మన శౌరికి - ఎవ్వరి మాటా వినడు - ఎవ్వరేమన్నా పట్టించు కోడు :

    02)
    _________________________________________

    భీముని భార్య, యాత్మజుల ♦ పేర్లవి యేమని పృచ్ఛ సేయగన్
    సోమరిపోతు గర్వితుడు ♦ శుంఠయు వేగము బుద్ధిహీనతన్
    " భీముని భార్య యూర్వశి వి ♦ భీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే "
    వేమరు తోటి వారలదె ♦ విచ్చిన నవ్వుల గేలి సేయగన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  4. చందముతో కుస్తీ పడుతున్న భార్య - ఉత్పలమాల పాదం సరిగ్గా వ్రాస్తే - బహుమతి :

    03)
    _________________________________________

    గోముగ నేర్పి ఛందమును ♦ గోరగ నుత్పల మాల పాదమున్
    సామును జేయుచున్న నొక ♦ చామదె నేర్పున వ్రాయ నివ్విధిన్
    " భీముని భార్య యూర్వశి వి ♦ భీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే "
    భామను మెచ్చి ప్రేమమున ♦ భర్తదె కౌగిలి నుంచి ముద్దిడెన్ !
    _________________________________________

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందరికీ నమస్కృతులు.
    నిన్న, మొన్న ప్రయాణంలో ఉండి మీ పూరణలను, పద్యాలను సమీక్షించలేకపోయాను. మన్నించండి. వీలైతే ఈరోజు సాయంత్రం వరకు రెండురోజుల పద్యాలపై వ్యఖ్యానిస్తాను.
    ****
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు విధాల పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. శ్రీగురుభ్యోనమ:

    ఏమి హిడింబి తానగును, నింద్రుని కొల్వున నుండిరెవ్వరో,
    రాముని సన్నిధానమున రాక్షసు డెవ్వడు జేరవాచ్చెనో,
    ధీమణి! దేవకీసతికి దేవి యశోదకు నెంచి జూడగా
    భీముని భార్య, యూర్వశి, విభీషణుఁ, డాత్మజుఁ డన్న శౌరియే

    రిప్లయితొలగించండి
  7. హైమవతీలలామ జయ అంబిక యెవ్వని భార్యయో? నరున్
    ప్రేమను పంచమన్న దివి వేశ్య, దశానను తమ్ములెవ్వరో?
    మామను సంహరించి తన మాతను బ్రోచిన సూను డెవ్వరో?
    భీముని భార్య, యూర్వశి, విభీషణు డాత్మజుడన్న శౌరియే!

    రిప్లయితొలగించండి
  8. ఏమియు తప్పు లేక కడునింపుగ వ్రాసెనొకండు, శ్రద్ధగా
    నేమరపాటు లేక పదమెయ్యది యైనను, దోషశూన్యమై
    తామమరంగ చక్కగ నిదానముతోడను వ్రాసె చెప్పగా-
    భీముని భార్య యూర్వశి విభీషణుఁ డాత్మజుఁ డన్న శౌరియే

    రిప్లయితొలగించండి
  9. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్ది గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది.అభినందనలు.
    ‘తామమరంగ’....?

    రిప్లయితొలగించండి
  10. కోమ హిడింబియే యగును, గోపతి గొల్వున నచ్చరెవ్వరో ?
    రాముని మిత్రుడైనగుణి రక్కసు డెవ్వడు రామసత్కధన్ ?
    భామ యశోద దేవకికి పట్టిగ ప్రేమను బంచెనెవ్వరో
    భీముని భార్య , యూర్వశి, విభీషణు, డాత్మజుడన్న శౌరియే!!!

    రిప్లయితొలగించండి
  11. గురువుగారు,ధన్యవాదాలు.
    ...పదమెయ్యది యైన దోషశూన్యమై
    తాము అమరంగ....
    వచనదోషమున్నది కాబట్టి
    ....నుడులెయ్యవియైన అని సవరిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  12. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    లక్ష్మీదేవి గారూ,
    మన్నించండి. నేనే సరిగా అవగాహన చేసికొనలేదు.

    రిప్లయితొలగించండి
  13. కె.యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
    ప్రేమముతో నరణ్యమున పెండిలి యాడినఆహిడి౦బి_ యే
    కామినియైమదిన్ వలచి గాండివ ధారికి శాపమిచ్చె- యా
    రామునికాప్త మిత్రుడగు రాక్షస సోదరుడే -యశోదకున్
    భీముని భార్య,యూర్వశి,విభీషణు,డాత్మజుడన్న శౌరియే

    రిప్లయితొలగించండి
  14. కె ఈశ్వరప్ప గారి పూరణ
    కామిత దాయకంబయిన కల్పిత నాటక సంఘమందునన్
    ప్రేమగు పెంపుకున్ తగిన పెద్దలు పెళ్లిని నిశ్చయి౦చగా
    భీముని భార్య,యూర్వశి,విభీషణు,డాత్మజుడన్న శౌరియే
    క్షేమపు దీవెనల్ యిడగ సీతకు సోముడు తాళి గట్టెగా

    రిప్లయితొలగించండి
  15. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవిమిత్రులందఱకు నమస్కారములు!

    అనారోగ్యకారణమున నేను కొన్నిదినములు మన బ్లాగునకు దూరముండవలసివచ్చినది. మన్నింపుఁడు.

    నా పూరణము:

    (ఒక సంపన్న గృహస్థుఁడు తమ నమ్మిన బంటు భీమునిం బరిచయము సేయుచుఁ దన బంధువర్గముతోఁ బలికిన సందర్భము)

    నేమముతోడ మా గృహము ♦ నెప్పుడుఁ గాఁౘుౘు మమ్ముఁ గొల్చుౘున్
    క్షేమముగా వసింౘుౘు వి ♦ శేష విధిన్ సహకారి యౌౘునున్
    భీముఁడు కాఁపురస్థుఁడయె! ♦ వీరలు భీముని బంధు! లీమెయే
    భీముని భార్య యూర్వశి! వి ♦ భీషణుఁ డాత్మజుఁ! డన్న శౌరియే!

    రిప్లయితొలగించండి
  16. కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘దీవెనల్ + ఇడగ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘క్షేమపు సేసఁబ్రా లిడగ...’ అనండి.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    ఈకొద్ది రోజులు మీలోటు కనిపించింది. మీ పునరాగమనం ఆనందదాయకం.
    భీముడు, అతని బంధువల పరిచయంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. "భీముని తమ్ముడర్జునుడు వీరుడు,నాతనిఁ గూడు చెల్లెలా
    భీముని భార్య యూర్వశి,విభీషణు డాత్మజు"డన్న శౌరియే
    రాముడు"రాజ్య హీనులగు రాజిత వీరుల వల్ల లాభమే!
    నే మరి కూతునీయ"నని చెప్పెను తమ్ముని మాట త్రోయుచున్

    భీముడు నా హిడింబి నటు వేగమె చేకొనె,కామరూపి యా
    భీముని భార్య యూర్వశి విభీషణుడాత్మజు"డన్న శౌరియే
    భీమ కుమారుడే మడియ,ఫెళ్ళున నవ్వగ తప్పుబట్ట"నా
    భీముడె రాక్షసుండు వెస,వీరుడు నైనను ముందు చిక్క"నెన్

    రిప్లయితొలగించండి
  18. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  19. పూజ్యులు గురుతుల్యులు శంకరయ్య గారికి వందనములు
    భీముని భార్య, యూర్వశి,విభీషణుడాత్మజు,డన్న. శౌరి, యే
    లా? మము గాసి పెట్టెదవు రావణు రాణివి యై సుఖమ్ములన్
    కాముని తృప్తి సేయుమిక కాదనకంచును హింస పెట్టగా
    రాముని దూత జూచె నట రక్కసి మూక ల మధ్యజానకిన్

    రిప్లయితొలగించండి
  20. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. భీముని భార్య, యూర్వశి, విభీషణుఁ డాత్మజుఁ డన్న, శౌరియే
    గోముగ రాధతో కలిసి గొప్పగ రుక్మిణి, సత్యభామయున్,
    రాముడు, సీతయున్, కపియు, రంభయు, కైకయు, లక్ష్మణుండహో,
    పాముల పట్నమందునను పన్నుగ జేరిరి నాటకమ్మునన్

    రిప్లయితొలగించండి