16, డిసెంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1564 (కనులు కనులు గలిసినంత గర్భవతి యయెన్)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కనులు కనులు గలిసినంత గర్భవతి యయెన్.

29 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    కర్ణ జననం :

    01)
    __________________________________
    ముని యిడిన మంత్ర మహిమను
    యినుడంతట కుంతి జేరి ♦ యిచ్చిన వరమున్
    పెనకువ యది లేకున్నను
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్
    __________________________________
    పెనకువ = కలయిక

    రిప్లయితొలగించండి
  2. ధర్మజు జననం :

    02)
    __________________________________

    తన పతి యానతి సంతా
    నము కొరకయి ధర్ము వేడ ♦ నచ్చిన వరమున్
    శని తండ్రియె యొసగినపుడు
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  3. భీమ జననం :

    03)
    __________________________________

    తనయుడు, కడు బలవంతుని
    కనవలెనని కుంతి దలచి ♦ గంధహు వేడన్
    విని పవనుడు కరుణించిన
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  4. అర్జును జననం :

    04)
    __________________________________

    దునెదారిని పెను ధన్విని
    తనయునిగా బొంద గుంతి ♦ తద్దయు దీక్షన్
    అనిమిషుపతి బ్రార్థించిన
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ !
    __________________________________
    దునెదారి = శూరుడు

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. నకుల, సహదేవుల జననం :

    05)
    __________________________________

    తన సవతియె మంత్రము నిడ
    వినయులు నతి సుందరులగు ♦ బిడ్డల గోరన్
    మినురతనము సుతుల దయను
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ !
    __________________________________

    రిప్లయితొలగించండి
  7. శంకరార్యా ! ధన్యవాదములు !
    నిన్న చక్రి మరణ వార్త విపరీతంగా కలచి వేసింది !
    అస్సలు నమ్మ బుద్ధి కావడం లేదు !

    రిప్లయితొలగించండి
  8. వినూత్న పరిశోధన :

    06)
    __________________________________

    వినియుంటిమ యెన్నడయిన ?
    కనుగొనిరట శోధకు లదె ♦ కడు కష్టముతో
    దిన దిన పరిశోధనలను
    " కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ "!
    __________________________________
    (నిన్న ఈనాడులో వార్త :
    జీవకణమును సృష్టించడంలో దగ్గర దగ్గరగా సఫలమయిన పరిశోధకులు
    అదేగాని జరిగితే - ఇది కూడా సాధ్యమే )

    రిప్లయితొలగించండి
  9. వసంత కిశోర్ గారూ,
    కుంతీసుతుల నందరినీ ప్రస్తావించి, కవలను వదిలివేశారెందుకని అడగాలనుకున్నా.. ఆ లోటు తీర్చారు. బాగుంది.
    శాస్రపరిశోధనలపై ఆరవపూరణకూడా బాగున్నది. అభినందనలు.
    మేమింకా చక్రి మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నాము. చక్రి తండ్రి జిల్లా వెంకటనారాయణ హిందీ ఉపాధ్యాయుడుగా పనిచేసేవాడు. పాటలు పాడేవాడు, బుఱ్ఱకథలు చెప్పేవాడు. ఆ వారసత్వమే కొడుక్కి వచ్చింది. నా సాయి పాటలు రికార్డ్ చేయడానికి మూలకారకుడు చక్రియే.

    రిప్లయితొలగించండి
  10. హాస్యానృతముల పోటీ :

    07)
    __________________________________

    విని నంతనె నవ్వు గలుగు
    ననృతముల పలికెడు పోటి - యందున పలికెన్
    పినుగొకడట బ్రజ నవ్వగ
    " కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్ "!
    __________________________________
    పినుగు = బుద్ధిహీనుడు

    రిప్లయితొలగించండి
  11. మీరేమిటి ? ఎవరూ జీర్ణించు కోలేని వార్త యిది !
    మీ కింకా కష్టంగా ఉంటుంది !

    ఒక అనారోగ్యం లేదు
    పోనీ ప్రమాదమా అంటే అదీ లేదు
    పెద్ద వయసా అంటే - అదీ కాదు
    అకస్మాత్తుగా యిలా జరగడం - ఏమనుకోవాలో అర్థం కాని స్థితి !

    అందుకే అన్నారెవరో
    " విధి ఒక విష వలయం - అది***** "

    రిప్లయితొలగించండి
  12. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు తేటగీతి లొ పూరణ
    కలహమగు యువతీ యువకులకు తొలుత
    వలపు గా మారు పిదప వివాహమవగ
    తనువు తనువులును కనులు కనులు కలసి
    నంత గర్భవతి యయెన్ సహజము గాదె

    రిప్లయితొలగించండి
  13. కె/యెస్. గురుమూర్తి ఆచారి గారి పూరణ

    మును కుంతి మంత్ర పఠన
    మ్మున దివ్యులగని నలుగురు పుత్రులు పొందెన్
    తనువులు కలియక నాయమ
    కనులు కనులు గలిసినంత ♦ గర్భవతి యయెన్!

    రిప్లయితొలగించండి
  14. కనదలచి మూడవ సుతుని
    ననిలుని ప్రార్థించ కుంతి యారాధనతో
    కని దర్శనమిడగ నతడు
    కనులుకనులు కలసినంత గర్భవతి యయెన్

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    మీ ఏడవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    తేటగీతిలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    కె.యస్.గురుమూర్తి ఆచారి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    2వ పూరణ:తనువులు కలియగ కలిగిన
    తనయుల దుశ్చేష్ట వలన త్రస నాశ మయె చీ
    కున కమరుల కృప కుంతికి
    కనులు కనులుకలసి నంత గర్భవతి యయెన్

    రిప్లయితొలగించండి
  17. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    కనుమూసినకనుదెరచిన
    తనవాడివాడిగనెంచుకొనెనుతన్వికకలలో
    మనువాడినమరునిమిషమె
    కనులుకనులుగలసినంత-గర్భవతియయెన్

    రిప్లయితొలగించండి
  18. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘త్రస నాశమయె చీ’ అన్నచోట గణదోషం. ‘త్రస యడగెను చీ’ అనండి.
    ****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదంలో ‘వాడి’ అదనంగా టైపయింది.

    రిప్లయితొలగించండి
  19. పూజ్యులయినకందిశంకరయ్యగారికివందనాలతో
    తనువుతనువుకలయకుండతలచమరియదేవునే
    కనులుకనులుగలసినంతగర్భవతియయెన్
    ఘనుడుక్రీస్తుజననమందేకంటకంబుదీర్చగా
    మనుజుడైనదేవదూతమానవత్వమెంచియే

    రిప్లయితొలగించండి
  20. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవపాదం చివర గణదోషం. ‘గర్భవతి యయెన్ గదా’ అనండి.

    రిప్లయితొలగించండి
  21. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు

    3 వ పూరణ: మనసున తీవ్రపు గోర్కెలు
    కనులందున ప్రతి ఫలించ కాముని యజ్ఞ
    మ్మున తనయుని కాంక్షించిన
    కనులు కనులుకలసి నంత గర్భవతి యయెన్

    రిప్లయితొలగించండి
  22. కనులు,కనులు గలిసి వలపు
    వనిత,పురుషులందు గలిగి వారలొకటిగాన్,
    జనియించు పిండమపుడే
    కనులు,కనులు గలిసినంత గర్భవతియయెన్

    కనులను వెడలును వేగమ
    వని నెమలికి రేతమదియ,బాగుగ గ్రుడ్డౌ
    వనితౌ నెమలియె మ్రింగగ
    కనులు కనులు గలిసినంత గర్భవతియయెన్

    కనియె పరాశరుడా సతి
    కనులు,కనులు గలిసినంత,గర్భవతియయెన్
    జననము నందెను వ్యాసుడు
    వనితను జూచి మునిగనిన భావిత ప్రేమన్

    మునియగు దుర్వాసుడిడిన
    పెను మంత్రపఠన నినుడిడె,వెస తా సుతునే
    వినయపు కుంతికి-వారల
    కనులు కనులు కలిసినంత,గర్భవతియయెన్

    వని,తా మేనక,తపమును
    మునికిని చెడ జేసెనంత,మోహము తోడన్
    మునియును,మేనకలపుడును
    కనులు కనులు గలిసినంత,గర్భము దాల్చెన్

    రిప్లయితొలగించండి
  23. తనువులు కలియుట తెలియక
    "కనులు కనులు కలిసినంత గర్భవతియయె"
    న్నని పెద్ద వారలనుకొని
    పెను మోదము గాంచినంత విషయము దెలిసెన్!

    రిప్లయితొలగించండి
  24. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ మూడవ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఇనుమడిగ బ్రేమ గలుగును
    కనులు కనులు గలిసి నంత, గర్భ వతి యయె
    న్నిన మడుగు సామి గరుణన
    కనకమునకు దనువు పెరిగి కళకళ తోడన్

    రిప్లయితొలగించండి
  26. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. మనసైన వాడి తోడను
    మనువాడెను పెద్ద లెల్ల మైకొనినంతన్!
    క్షణమోపని పతితో సతి
    కనులు కనులు కలిసినంత గర్భవతియయెన్!

    రిప్లయితొలగించండి
  28. తన మగడు పుట్టు గ్రుడ్డట
    తనకేమో గంతలంట తప్పనిసరిగా;
    మనసున మనసున నిద్దరి
    కనులు కనులు గలిసినంత గర్భవతి యయెన్ :)

    రిప్లయితొలగించండి
  29. వినరా! మూర్ఖుడ! పృచ్ఛక!
    మనసులు హృదయములు కూడి మనువది కుదురన్
    తనువులతో పాటు ప్రియుల
    కనులు కనులు గలిసినంత గర్భవతి యయెన్

    రిప్లయితొలగించండి