30, డిసెంబర్ 2014, మంగళవారం

సమస్యా పూరణం - 1571 (ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము.

25 కామెంట్‌లు:

 1. విద్య లేకున్న మనుజుడు వెలితి పడడు
  జగతి మూలము ధనమట జన్మ తనరు
  భోగ లాలస గలిగిన భుక్తి యున్న
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 2. భక్తితో భగవంతుని ప్రణతు లిడుము
  దైవ భక్తికి సాటి యే ధనము లేదు
  కష్ట కాలమునందున గాయునట్టి
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 3. వస్తు వాహనమ్ములుపొందు వాంఛ లేల
  దైవ సన్నిధి జేర్చదు ద్రవ్య బలము
  శుద్ధి బుద్ధికలిగి చిత్త శుద్ధియున్న
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 4. రాజేశ్వరి అక్కయ్యా,
  ధనమూల మిదం జగత్తంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
  ****
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 5. కలిమి గలిగిన వేళల గర్వ బడక
  కష్ట నష్టము లందున నిష్టముగను
  ధర్మ మార్గము దప్పని దైవ భక్తి
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము!!!


  ధనమె విజ్ఞాన మిచ్చును దండిగాను
  ధనమె దైన్యము బాపును ధరణిలోన
  ధనమె కీర్తిచంద్రిక లిడి దయను బెంచు
  ధనమె తీర్ధయాత్రలుజేయు దారి జూపు
  ధనమె భుక్తి సత్తలిడు నిం ధనము గనుక
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము!!!

  రిప్లయితొలగించండి

 6. ఉ౦ది ఉ౦దన్న నరులకే ముందు గతులు
  లేదు లేదన్న సద్గతి లేనె లేదు
  పేద సాదల కిచ్చిన పెట్టుపోత
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి

 7. మరియొక పూరణ
  ధనము నేడిటు మారక ద్రవ్యమవగ
  జప తపమ్ములు చేయించి శాంతి నొంది
  దైవకార్యము లొనరించి దానమిచ్చు
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 8. సత్యమార్గమున్ వీడక సంపదగొని
  పేద వర్గాల సేవతో ప్రీతి పొంది
  పుండరీ కాక్షు సంతత పూజ యనెడి
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 9. కె యెస్ గురుమూర్తి ఆచారి గారి పూరణలు
  1.ధనముపై చింత తోడ హృదయము-నిక మ
  థనము గావి౦చుచు భవబంధనము బడి-ని
  ధనము జేయకు ధర్మపథమును;భక్తి
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము
  2.ధనము జీవనమన్న యంత్రమున కరయ
  వలయు ని౦ధనమె.కాని కలుషితంపు
  టి౦ధనము మరను చెరచు నెపుడు సుగుణ
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 10. శైలజ గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ రండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. రామ నామామృతమ్మును ప్రేమ తోడ
  ద్రావుచును రామవిభుని సంధాన మగుచు
  రామ పాదాబ్జముల చెంత రాలి పడు ని-
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 12. దీపముండగనే యిల్లు దిద్దు కొనుడు
  మరల దక్కదు నరజన్మ మహిని మీరు
  చేయు యోగ్య కర్మల ఫల సిద్ధి పుణ్య
  ధనమె, నరులకు మోక్షసాధనము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 13. కం"సముచితసాధనమె నరుల
  కుమోక్షసాధనముసుమ్ము"కోర్కెలుదరుగన్
  క్రమముగ-నత్యాసన్నది
  సమయుటచే?మనసుజేరుసాధుగుణంబే

  రిప్లయితొలగించండి
 14. ధనమె నిక్కముగ నిజ పతనపు దారి
  తరతరాలుగ మనుజుల తరగని సిరి
  యనుదినము గృహమున పూజలందుకొనెడు
  ధనమె నరులకు మోక్షసాధనమ్ము సుమ్ము!
  ధనము: విత్తము, ఆవులమంద

  రిప్లయితొలగించండి
 15. నిత్య జీవన యానము నియతితోడ
  సలుపుచు సతము వెన్నుని సన్నుతించి
  కుటిలతనొసంగు మదిలోని కోర్కెల ప్రమ
  ధనమె నరులకు మోక్షసాధనముసుమ్ము!

  రిప్లయితొలగించండి
 16. ఆరు గుణముల పోషించి నట్టి వాని
  ముక్తి చేరునె? మాత్సర్య మోహ మదము
  క్రోధముల్, కామలోభపు గుణములకు ని
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 17. మిస్సన్న గారూ,
  ‘నిధనము’తో పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  ‘పుణ్యధనము’తో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  కె. ఈశ్వరప్ప గారూ,
  తేటగీతి సమస్యకు కందంలో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. కలిమిబలిమియుబెరుగంగకలతబెరుగు|
  ఫలితమొసగెడిభక్తియేవిలువలుంచ?
  సంఘసంస్కరణంబులుసాకునట్టి
  ధనమెనరులకుమోక్షసాధనముసుమ్ము
  2మానవత్వమునిలిపెడిమనసుగలిగి
  దైవతత్వమునందునధర్మవిధులు
  చేయబూనెడివారికిచేరునట్టి
  ధనమెనరులకుమోక్షసాధనముసుమ్ము

  రిప్లయితొలగించండి
 19. ధనమె మూలమ్ము జగతిని తలపగాను
  సకలమదిగూర్చు నిహమున చదువుకూడ
  ధనము నౌటను విజ్ఞత తాను పొందు
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  భక్తి యొక్కటెచాలును బాగుకొల్వ
  దైవము నటుల మిగిలినధనములెల్ల
  పరగ సద్గుణములనిడగ,భక్తియనెడి
  ధనమె మోక్షసాదనము సుమ్ము

  జగతి సంసారికి ధనము సంతునౌను
  ఆస్తిపాస్తులు,విద్యయు నబ్బధనమె
  ధర్మసాధనకారోగ్య ధనము వలెను
  ధనమె నరులకు మోక్ష సాధనము సుమ్ము

  ఉన్నదానను దానంబు నుత్తమంబు
  నన్నితానేను పొందుట నధమ మగును
  దాన మావిధి చేసేటి తలపు గలుగ
  ధనమె నరులకు మోక్షసాధనము సుమ్ము

  రిప్లయితొలగించండి
 20. ప్రాణికోటియురక్షకుపాటుబడుచు
  విద్యదానంబునిస్వార్థవిదులయందు
  భక్తివిశ్వాసమందునశక్తినింపు
  ధనమెనరులకుమోక్షసాధనముసుమ్ము

  రిప్లయితొలగించండి
 21. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. తేగీ . బొగ్గు, పెట్రోలు వనములు బుగ్గి అయ్యె
  నదులు నీరదముకరువై నరులు వగచె
  భావి తరమును కాచుభూవనరులుండు
  ధనమెనరులకు మోక్షసాధనము సుమ్ము.

  రిప్లయితొలగించండి
 23. కంది శంకరయ్య గారు మా పోస్టులకి మీనుంచి స్పందన లభించుట లేదు . మీరు బ్లాగ్ ని చూడడం లేదా ?

  దయచేసి చెప్పగలరు.

  రిప్లయితొలగించండి
 24. పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీరు ఒకటి, రెండు రోజులు ఆలస్యంగా పోస్ట్ చేస్తున్నారు. మీ పోస్టులు నా మెయిల్‍కు కూడా వస్తాయి. చూస్తున్నాను. తరువాత బాగు చూసి వ్యాఖ్యానించాలనుకుంటాను. మరచిపోతూ ఉంటాను. మన్నించండి. ఇప్పుడు పాతపోస్టులన్నీ చూసి వ్యాఖ్యానిస్తాను.

  రిప్లయితొలగించండి