5, డిసెంబర్ 2014, శుక్రవారం

దత్తపది - 57 (చీమ-దోమ-నల్లి-పేను)

కవిమిత్రులారా!
చీమ - దోమ - నల్లి - పేను
పైపదాలను ఉపయోగిస్తూ గోపికావస్త్రాపహరం గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

19 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    చీరలతో చెట్టుపై నున్న గోపాలునితో - గోపికల బేరసారాలు :

    01)
    ____________________________________

    కరుణ చీమంత మాపైన - గలిగె నేని
    దోమటిని దొంగవలె నిట - దోచు కొనిన
    యంబరము లిడు, హారంబు - నల్లి నీకు
    పేనుచున్నవి కాకుండ - పెద్ద దైన
    దండ వేతుము, నిలుపుమీ - దుండగములు !
    ____________________________________
    చీమంత = ఇసుమంత, అల్పము, కొంచెము.
    దోమటి = మాయ, కపటము.

    రిప్లయితొలగించండి
  2. చిన్ని దోమటి నీ కేల చిన్ని కృష్ణ !
    చీమ యంతయు మమ్ముల జేదు కొనక
    మగ్గముల పైన పేనిన రగ్గు లివియ
    యపహ రించకు హారము నల్లి యిత్తు

    రిప్లయితొలగించండి
  3. మర్మమేదో మగువలార మరవకండి
    నన్ను మరువ పూచీ మరి నాది కాదు
    ఘనుడనేనల్లిబిల్లి వాడను తెలియరె
    సిగ్గుల విడుపే నుతమగు సిద్దినిచ్చు!!

    రిప్లయితొలగించండి

  4. స్వీటు కి చీమ చెవికి దోమ
    మంచానికి నల్లి తలకి పేను
    తరచి చూడ,సరిజోడి
    బ్లాగుకి కామెంటు వోలె !!

    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  5. చీమ చిటుకను నంతలో చెట్టు పైన
    మాదు వలువలు దాచిన మాయ దోమ
    పేను చుంటిమి ముకుతాడు ప్రియము గాను
    నల్లివలె నక్కి యుండుట చెల్ల దయ్య

    రిప్లయితొలగించండి
  6. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    జిగురు సత్యనారాయణ గారూ,
    దత్తపదాలను అన్యార్థంలో ప్రయోగించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    నిజానికి దత్తపదాలను అన్యార్థంలోనే ప్రయోగించాలని మొదట ఇచ్చాను. కాని ముందుగా పూరణ చేసిన మిత్రులు స్వార్థంలో ప్రయోగించడంతో ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ‘అన్యార్థంలో’ అన్నదాన్ని తొలగించాను ఔత్సాహికులు ఎక్కువగా పాల్గొనేందుకు వీలుగా..
    అన్యార్థంలో ప్రయోగించిన మీకు ధన్యవాదాలు.
    ****
    జిలేబీ గారూ,
    _/\_
    ****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. మేను పై భ్రాంతి మీలోన పేనుకొనెను
    దాని నేనిదో మనసార దాచినాను
    ప్రేమనల్లిన మీమది పిలువ నన్ను
    చీమ మాత్రపు చిక్కులు చేరనీను.

    రిప్లయితొలగించండి
  8. ఔర! చీ! మన చీరెల నపహరించి
    యతని చూపే నునుపగు దేహములనిలిపి
    కొమ్మ పైనల్లి తెమ్మెర గొనుచు నుండె
    నేమి కానున్న దోమన మెఱుగ లేము.
    అల్లితెమ్మెర: చల్ల గాలి

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మామమత నల్లిబిల్లయె
    దోమటి! కృష్ణా! వలువలు దోచుట తగునా?
    మామది తలపే నువుగద!
    చీమంత దయగురిపించు చేడెల పైనన్!!!

    ఏమి యున్నదో మనముననెరుగ లేక
    నూరక వగచీ మరిమరి యూహ లేల
    సిగ్గను తలపే నులుముచు చేర రండి
    హితుడనే నల్లిబిల్ల గు హితము జేయ

    రిప్లయితొలగించండి
  11. నిజమైన దోమలను, చీమలను చంపటానికి బ్యాటులు, మందులు ఉన్నాయి గాని, యిక్కడ నాలుగు జీవులను చంపటం చాలా కష్ట మయ్యింది.
    శౌరి పేచీ మనస్సుతో చేరి యిచట
    పొంద వలపే నుడువిడిచి మ్రుచ్చలించె
    చీరెలన్ని, యేదో మన దారి నేడు?
    చక్క నల్లిబిల్లి మనము సాగవలయు
    అల్లిబిల్లి: ఒద్దిక

    రిప్లయితొలగించండి
  12. సిద్ధి కలుగంగఁజేయు పూచీ మదీయ
    బాధ్యతగఁ జూచెదో మహాభక్తులార
    వరలుమేనల్లికల వలువలఁ గనంగ
    నాత్మరూపేను మేను దేహంబు వలువ.

    దేహానికి చీర ఎలాంటిదో అదేవిధంగా ఆత్మకు దేహము అలాంటిది అనే భావములో..........

    రిప్లయితొలగించండి
  13. శైలజ గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు

    మేమేదో మకురుల్ వచి౦చితని చీ!మమ్మిట్లు గావి౦తువా

    ఏమోయ్!నీకు యశోదకృష్ణ!తగునా యీరీతి మాపుట్టముల్

    ఏమున్ స్నానపు వేళ దాచ నల్లిన్ మానిమన్ని౦చుమా

    ఈమా ,చీరలు ద్రోహులమ్మను తలంపే నువ్వు రానీకుమా

    రిప్లయితొలగించండి
  15. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘దాచ నల్లిన్’ అన్నచోట గణదోషం. సవరించండి.

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    సవరించిన పద్యము
    మేమేదో మకురుల్ వచి౦చితని చీ!మమ్మిట్లు గావి౦తువా

    ఏమోయ్!నీకు యశోదకృష్ణ!తగునా యీరీతి మాపుట్టముల్

    ఏమున్ స్నానములాడు వేళ తగ నల్లిన్ మానిమన్ని౦చుమా

    ఈమా ,చీరలు ద్రోహులమ్మను తలంపే నువ్వు రానీకుమా

    డిసెంబర్ 05, 2014 3:30 PM

    రిప్లయితొలగించండి
  17. "కృష్ణ!యేల పేచీ మనకింక,మాదు
    వలువ లిడగదో మగుడ"ని,భామ లడుగ
    "మనదు నల్లిండ్ల‍‍‌ జూచితి మరగు పిల్ల
    వాడ;తనిపేను వీడని పయికి" ననెను

    దోమతెర వంటి వలువల దొంగిలించె
    చీమ దోలెను పాకియు చెట్టు పైకి
    కాంతలు వెడలి నల్లిండ్ల కాళియమున
    తానమాడంగ తనువులు పేనుకొనుచు

    (నల్లిండ్లు=అగ్రహారపు ఇండ్లు)

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులందఱకు నమస్కారములు!

    తచ్ఛచీమనోహరునకుఁ దమ్ముఁడైన
    యా యుపేంద్రుఁడౌ కృష్ణుండు నపుడెదో మ
    హాద్భుతమగు నుపాయమ్మునల్లి గోపి
    కాంశుకాల్గొని యొప్పేనుఁ గాంచితనియె!

    రిప్లయితొలగించండి
  19. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ సవరించిన పూరణ బాగున్నది. అభినందనలు
    ****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    దత్తపదాలను స్వార్థంలో ప్రయోగించకుండా మీరు చేసిన పూరణ నిస్సందేహంగా ఈనాటి పూరణలలలో అత్యుత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి