16, ఏప్రిల్ 2016, శనివారం

ఖండకావ్యము – 1 (శ్రీ కృష్ణ దేవరాయలు)

శ్రీ కృష్ణ దేవరాయలు
రచన : గుండు మధుసూదన్


సీ.      అష్ట దిగ్గజ కవు లాహ్లాదమును గూర్చ
భువన విజయ మేలు భూపుఁ డెవఁడు?
ఆముక్త మాల్యద నలవోకగా రచి
యించి, యాంధ్ర కవుల మించె నెవఁడు?
జాంబవ త్యుద్వాహ సత్యావధూ ప్రీణ
నముల సంస్కృతమున నడపె నెవఁడు?
దేశ భాషల యందుఁ దెలుఁగు లెస్స యటంచు
నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?
గీ.      అతఁడె మూఱు రాయర గండ; యాంధ్ర భోజ;
సాహితీ సమరాంగణ సార్వభౌమ
బిరుదు లందియు, వెలిఁగిన వీర వరుఁడు;
నతఁడె శ్రీకృష్ణదేవరాయలు ఘనుండు!

కం.    ఇరు ప్రక్కల దేవేరులు
మురిపెముఁ దీర్చంగ నడుమ మోదము తోడన్
వర విగ్రహ రూపెత్తెను
దిరుమల వేంకట నగేశు దేవళ మందున్!

తే.గీ.   తెలుఁగు భాషను సత్కావ్యములును వెలయఁ
గవులఁ బోషించి, మించి, సత్కార మెలమిఁ 
జేసి, సభలోనఁ బ్రజల రంజింపఁ జేసి,
కృష్ణ రాయఁడు స్వర్ణ యుగేంద్రుఁ డయ్యె!

27 కామెంట్‌లు:

  1. మిత్రులందఱకు నమస్సులు!

    మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి నమస్సులు!ఖండకావ్యాలు శీర్షికన ఖండకావ్యాలను ప్రకటించుట ముదావహము. అభినందనలు.

    తొలుతగా... నేను గతంలో మన శంకరాభరణంలో ప్రకటించిన శ్రీకృష్ణదేవరాయల ఖండకృతినిం బ్రచురించుట నా మహద్భాగ్యముగా భావించుచున్నాను. ఇందులకు మీకు నా కృతజ్ఞతలు మఱియు ధన్యవాదాలర్పించుకొంటున్నాను.

    భవదీయుఁడు
    గుండు మధుసూదన్

    రిప్లయితొలగించండి
  2. ఖండకావ్యమురచియించికవులయందు
    నగ్రగణ్యుడవైతివియార్య!నీవు
    సంతసమ్ముననీకిత్తుసాదరమున
    వందనంబులుశతకోటివందనములు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదమ్ము లో మిత్ర! ధన్యచరిత!
      తమరి యభిమాన వాక్కు నన్ ధన్యుఁ జేసె!
      సంతసమ్మందితిని! నమస్కారములిడి
      నా కృతజ్ఞతల్ దెలిపితి నందుకొనుఁడు!!

      తొలగించండి
  3. ఖ ౦ డ కా వ్య ము
    ........................

    ఆర్యులకు గు౦డు మధుసూదన్ రావు గారికి
    శతాభి వ౦దనములతో మీ విధేయుడు
    గురుమూర్తి ఆచారి :--

    మీ సీస పద్యము న౦దు 4 వ పాదములో
    దాని రె౦డవ భాగములో
    యతి సరి పోయినదా ?

    సెలవీయ గలరు

    ( నెలుగెత్తి చాటిన. నేత యెవడు )

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుమూర్తి ఆచారి గారూ,
      అక్కడ అఖండ యతి వేయబడింది.
      .................... అఖండయతి .....................
      యతిస్థానంలో సంధి జరిగినప్పుడు పరపదాద్యక్షరమైన అచ్చుతో యతిమైత్రి కూర్చడం ‘స్వరప్రధానయతి’. ‘రమ్ము + అనెను = రమ్మనెను’. ఇక్కడ ‘రమ్ము’ పూర్వపదం. ‘అనెను’ పరపదం. పరపదంలోని మొదటి అక్షరమైన అచ్చు (అ)కు యతిమైత్రి కూర్చాలి.
      ఉదా. అన్ని బాధలఁ దీర్ప రమ్మనుచు పిలిచె.
      ఇక్కడ పాదాద్యక్షరమైన ‘అ’కు, యతిస్థానంలో సంధిగతమైన పరపదాద్యక్షరమైన ‘అ’కు యతి కూర్చబడింది.
      మరికొన్ని ఉదా.
      ఇతని ప్రాణమ్ముఁ దీయ నీ విష్టపడవు.
      ఉన్నమాటను చెప్ప నీ వులికిపడితె.
      ఎంద రెన్ని చెప్పినను నీ కేమి లెక్క?
      ఒరుల బాధిందు పనికి నే నొప్పుకొనను.
      ఈ ‘స్వరప్రధానయతి’ సర్వసాధారణం.
      యతిస్థానంలో సంధి జరిగినప్పుడు అక్కడి అచ్చుకు గాని, హల్లుకు గాని యతి కూర్చడం ‘ఉభయయతి’. ఏకశబ్దంలా భాసిస్తూ అంతర్గతంగా స్వరసంధి జరిగినప్పుడే ఈ ఉభయయతి చెల్లుతుందని అందరూ అంగీకరించారు. [ఉదా. నాస్తి (న + అస్తి), అనంత (న + అంత), నారాయణ (నార + ఆయణ),. రసాయన (రస + ఆయన), సమాస (సం + అస)]. దీనిని అనంతుడు తన ‘ఛందోదర్పణము’లో ‘నిత్యసమాసయతి’ అనీ, దీనికే ‘అఖండయతి’ అని పేరున్నదనీ చెప్పాడు.
      యతిస్థానంలో సంధి జరిగినప్పుడు అక్కడి హల్లుకు యతికూర్చడమే అఖండయతి. (అచ్చుకు యతి చెల్లవలసిన చోట హల్లుకు యతి చెల్లడం అఖండయతి). ‘రమ్మనెను (రమ్ము + అనెను)’ అనే చోట పరపదాద్యక్షరమైన ‘అ’కారానికి కాక పూర్వపదాంతాక్షరమైన ‘మ’కారానికి యతికూర్చడం అఖండయతి అవుతుంది.
      ఉదా. మాదు బాధలఁ దీర్ప రమ్మనుచు పిలిచె.
      ఇక్కడ ‘రమ్మనుచు’ లోని సంధిగత ‘అ’కారానికి కాక ‘మ’కారానికి యతి కూర్చబడింది.
      అప్పకవి మొదలైన కొందరు లాక్షణికులకు (నాకు కూడా!) ఈ అఖండయతి ఇష్టం లేదు. అందువల్ల యతిభేదాల సంఖ్య ఎక్కువయింది.
      మరికొన్ని ఉదా.
      పిలిచి ప్రాణమ్ముఁ దీయ నీ విష్టపడవు.
      పుణ్యవాక్కులు జెప్ప నీ వులికి పడితె.
      కేశవుఁడు పిల్చె నన్న నీ కేమి లెక్క?
      పొమ్మనుచు నిన్నుఁ దిట్ట నీ వోపలేవు.
      పూర్వకవుల ప్రయోగాలు .........
      భానుసహస్రభాసి వృషభాధిపుఁ డన్నటు లర్థయుక్తమై (కవిజనాశ్రయము)
      వడి యనంగఁ బొల్చు దేవాదిదేవ (కూచిమంచి తిమ్మకవి)
      చూవె మనంబునఁ దలంచుచుండుదు నేనున్ (భారతము)
      మతిఁ గింకిరి పడక యోల మాసపడక (భారతము)
      సారముం జేయవే సారసాభనయన (శృంగార నైషధము)
      వెలయు నవ్విశ్వనాథు దేవేశుఁ గాంచి (హరిశ్చం.)

      తొలగించండి
    2. శ్రీ కంది శంకరయ్య గారూ, అఖండ యతి విషయంలో నాకూ కొన్ని అభ్యంతరాలున్నాయి. మహా కావ్యాలలో ఏ 1000 పద్యాలకో క్వాచిత్కంగా ఒకటీ అరా వాడితే ( అది కూడా అన్య మనస్కంగానే , విధాయకం లేని పరిస్థితుల్లో ) అంగీకరించవచ్చును కానీ - మార్గాంతరముంది కదా అని ఎడాపెడా వాడుక చేయడం కూడదని స్వీయాభిప్రాయం. గుండు మధుసూదన్ గారి వంటి చేయి తిరిగిన కవుల విషయం సరే ,(వారిని అఖండయతి విషయంలో అభ్యంతర పెడితే ఇంకో సాధారణ యతితో పాదపూరణం చేయగల సామర్థ్యముంది కనుక) కానీ, అభ్యాస కవులు వాటి జోలికి పోకపోవడమే ఉత్తమం. ఏదేమైనా 'యద్యదాచరతిశ్శ్రేష్ఠః' కనుక ' ఎలుగెత్తి చాటు మన్నీఁడెవండు '? అని అంటే సరిపోతుంది - వంక పెట్టడానికి వీల్లేకుండా పోతుంది. స్వస్తి.

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      అఖండయతి విషయంలో నేను మీతో సంపూర్ణంగా ఏకీభవిస్తాను. అఖండయతిని నా పద్యాలలో ఎప్పుడూ ప్రయోగించను (చివరకు విద్యార్థి దశలో వ్రాసిన పద్యాల్లోను ప్రయోగించలేదు). ఎవరైనా ప్రయోగిస్తే అభ్యంతరం చెప్పను. ఆధునిక కవుల్లో (కొందరు ప్రసిద్ధులు కూడా) యధేచ్ఛగా దీనిని ప్రయోగించడం కనబడుతున్నది.

      తొలగించండి
    4. సుకవి మిత్రులు
      శ్రీ కంది శంకరయ్యగారికి మఱియు శ్రీ గురుమూర్తి ఆచారి గారలకు...

      విద్వత్కవిపండిత మిత్రులు డా.విష్ణునందన్ గారికి...
      మనఃపూర్వక నమస్సుమాంజలులు!

      పదహారవ తేదీ సాయంత్రము మా యింట విద్యుదంతరాయం వల్ల నేను పై వ్యాఖ్యలను చూడలేకపోయాను. తెల్లవారింతర్వాత మీరు [శ్రీ కంది శంకరయ్యగారు] చరవాణి ద్వారా మీ వ్యాఖ్యా విషయం తెలపడం వల్ల చూశాను. కాని, వ్యాఖ్య పెట్టేలోపుననే విద్యుత్తు మళ్ళీ పోవడం...చాలా సేపటి వరకు వేచివున్నా కరెంటు రాకపోవడం వల్ల...మేం అంతకుముందే మా పెద్దమ్మాయి యింటికి గవిచర్లకు పోవలెనని నిర్ణయించుకున్న కారణాన, మేమంతా అక్కడికి పోయి రెండు రోజులు వుండి తిరిగి ఇంతకుముందే ఇంటికి రావడం జరిగింది. ఈ రెండు రోజులలో అక్కడ అంతర్జాలం అందుబాటులో లేకపోవడం...నా చరవాణి రిపేర్‍లో ఉండడం... నా ట్యాబ్‍లో నెట్ సిమ్ సపోర్ట్ చేయకపోవడం... ఇత్యాది కారణాలవల్ల నేను నా స్పందనతో గూడిన వ్యాఖ్య పెట్టలేకపోయాను. ఆలస్యంగానైనా సమాధానం ఇవ్వడం నా బాధ్యత కాబట్టి...ఇప్పుడు ఈ క్రింది విధంగా నావ్యాఖ్యను పెడుతున్నాను. ముఖ్యంగా మీకు [డా. విష్ణునందన్ గారికి మఱియు శ్రీ గురుమూర్తి ఆచారి గారికి] నా సమాధానాన్ని తెలపాలి కాబట్టే ఈ వ్యాఖ్యను పెడుతున్నాను. ఇది విషయావగాహన కోసమే కాబట్టి అన్యథా భావించరాదని మనవి.

      [నావ్యాఖ్యలోని మొదటిభాగం]

      డా.విష్ణునందన్ గారూ...

      మిత్రులు గురుమూర్తిగారు...నా సీసపద్య తృతీయపాదోత్తరార్ధంలో యతిమైత్రి సరిపోయినదో లేదో సెలవీయమని శంకరయ్యగారిని కోరినారు.

      దానికి శంకరయ్యగారు...
      అది అఖండయతి అని తెలిపి...దానికి సరిపోయినన్ని ఉదాహరణముల నిచ్చారు. అదీగాక భారతోదాహరణాన్ని కూడా ఇచ్చారు.

      దీన్ని బట్టి అఖండవడిని భారతకవులూ, కవిత్రయేతర కవులూ వాడారనే కదా! అందువల్ల ఈ అఖండయతి విషయంలో మీవంటి విద్వత్కవిపండితులు అఖండ ద్వేషాన్నిపాటించరాదని మనవి.

      ఈ అఖండవడిని మనమంతా తప్పక పాటించవలసినదే నని నా అభిప్రాయం. ఎందుకంటే...ఇది కూడా ఒక యతిభేదం కదా...దీన్ని ఎందరో లాక్షణికులు చెప్పారు. లాక్షణికులు చెప్పిన యతిభేదాలన్నీ కవులకు శిరోధార్యాలు కావాలి. నిజానికి ఈ యతిభేదాలన్నీ మనం కవిత్వం రాస్తున్నప్పుడు వాటి నామ లక్ష్యలక్షణాలతో సహా మన మనస్సులలో కదలాడుతూ వుండవు. కవిత్వం రాస్తున్నప్పుడు ఆ ధారలో మన పదప్రయోగానికి అవసరమైన యతిభేదాన్ని అలవోకగా ఆశువుగా తీసుకొని మనం మన కవిత్వ వ్యవసాయాన్ని కొనసాగిస్తాం. ఇది స్వరయతియా, ఇది వ్యంజనయతియా, ఇది ఉభయయతియా అంటూ ఆలోచిస్తూ కూర్చోం. ఆ సమయంలో ఏ యత్యక్షరం సరిపోతుందో దాన్ని స్వీకరించి ముందుకు కదులుతాం. అలాంటప్పుడు ఏ కవి ఐనా ఎప్పుడో ఒకప్పుడు అఖండయతిని వేయడం జరుగుతుంది. అది కూడా నేరమేమీ కాదు అని నా అభిప్రాయం. ఎందుకంటే భారత కవిత్రయమే ఈ అఖండవడిని వాడారు. ఈ అఖండవడి ద్వేషి ఐన అప్పకవి దానిని తన లక్షణ గ్రంథంలో స్వీకరించకుండా ఉభయయతులలో అఖండవడి పేరు చెప్పకుండా ఇతర పేర్లతో యతిభేదాలను చెప్పారు. [అవి కూడా అఖండయతులేనని ఆయనకు తెలిసినా].

      అంతేగాకుండా...భారతంలో అఖండయతులున్న చోట్లలో దిద్దారు. అదే విధానాన్ని అప్పకవి మార్గానుయాయులు భారత ముద్రణ సమయంలోనూ దిద్దారు. అందువల్లనే మనవంటి వారికి అఖండయతి వేయకూడనిదేమో అనే భావం ఏర్పడింది. కాని ఇది తప్పక మనం ఇతర యతుల లాగానే వాడ వలసిన యతియే అని నా అభిప్రాయం. మీరు కూడా నా అభిప్రాయాన్ని బలపరుస్తారనే నమ్ముతున్నాను. (ఈ అఖండయతిపై నేను అతిత్వరలోనే ఒక వ్యాసం రాసి మీ అందరి సమక్షంలో ఉంచుతాను)

      ....మిగతాది రెండవభాగంలో... ఈ క్రింది భాగంలో చూడగలరు...

      తొలగించండి
    5. ...నా వ్యాఖ్యలోని రెండవభాగం...

      అఖండయతి లక్షణాన్ని చెప్పుతూ కూచిమంచి తిమ్మకవిగారు:

      "హల్లునకు హల్లు వడి యిడు నపుడు వాని
      తుదిని స్వరము ఘటిల్లిన నది యఖండ
      డి యనఁగఁ బొల్చుఁ గృతుల దేవాదిదేవ
      యనుచుఁ జెప్పిన శైలకన్యా సహాయ!"

      అన్నారు. మూడవపాదంలో లక్ష్యాన్ని ఇచ్చారు.

      మీరు అన్యథా భావించనట్లయితే...దీనికి...నేను రాసిన పద్యంలోని లక్ష్యమూ...అలాగే...మీరు రాసిన పద్యంలోని లక్ష్యమూ ఈ క్రింద ఇస్తున్నాను (ఇవి రెండూ కూడా నేనూ, మీరూ అఖండయతిని ఉపయోగిస్తున్నామని తెలియని స్థితిలోనే రాసినవని గమనించగలరు).

      1)ముందు... కూచిమంచి వారిది:
      "డి యనఁగఁ బొల్చుఁ గృతుల దేవాదిదేవ"
      యతిమైత్రి:వడి లోని ’వ’కారమునకు - స్వరమైన ’ఆ’కు మైత్రి లేదు కావున దాని ముందున్న ’వ’కు చెల్లినది. ఇది అఖండయతి.
      [దేవ + ఆదిదేవ...దే’వా’దిదేవ]

      2) తర్వాత... నాది (నా "శ్రీకృష్ణదేవరాయ ఖండకృతి"లోనిది):
      "......యటంచు
      "నెలుఁ గెత్తి చాటిన నేత యెవఁడు?"
      యతిమైత్రి: సంధివశాన వచ్చిన ’నె’ లోని ’ఎ’కు రాబోయే అక్షరంతో మైత్రి లేదు కాబట్టి సంధివశాన వచ్చిన ’నె’కు - నేత లోని ’నే’కు చెల్లినది. ఇది కూడా అఖండయతియే.
      [పై పూర్వ పాదమందలి ...అటంచును + ఎలుఁగు...అటంచు ’నె’లుఁగు]

      3) చివరగా... మీది (మీ "శ్రీకృష్ణదేవరాయ ఖండకృతి"లోనిది):
      "యతు జయతు జయోస్తు రాజాధిరాజ"
      యతిమైత్రి: జయతు లోని ’జ’ కు - రాజాధి లో ఉన్న ’జా’ లో సంధివశాన వచ్చిన
      ’ఆ’కు మైత్రిలేదు కావున దాని ముందున్న ’జ’ కు మైత్రి చెల్లింది. ఇది కూడా అఖండయతియే కదా.
      [రాజ + అధి - రా’జా’ధి]

      గమనించారా మిత్రమా. ఇది మీ తప్పో, నా తప్పో ఎంత మాత్రమూ కాదు. అసలు ఇది తప్పు కానే కాదు. అఖండవడి కూడదన్నవాళ్ళకు ఇది పెద్ద తప్పు. కాని, ఈ అఖండవడిని నన్నయాదులే ప్రయోగించారు. మనమొక లెక్కా? కాబట్టి మనం అఖండయతిపై ఎంతమాత్రమూ ద్వేషం చూపకుండా... పద్య ప్రారంభకులకు యతులపై ఉండే భయాన్ని పోగొట్టే విధంగా నడచుకోవాలని సవినయంగా కోరుకొంటూ...

      అన్యథా భావించరను దృఢవిశ్వాసంతో...
      భవదీయుడు
      గుండు మధుసూదన్

      తొలగించండి
  4. .గుండు మధుసూధనార్యుల గుప్త నిధిని
    ప్రశ్న లందున బంచగ?పరవశంబె|
    కృష్ణ రాయల సౌశీల్య తృష్ణదెలుప?
    తెలుగు వెలుగులదీప్తికి మలుపుగాద?
    శ్రీ గుండుమధు సూధన్ గారికి వందన చందనాలతో తమరిరచనలుభావగర్బితాలు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రమా ...కృతజ్ఞుఁడను! ధన్యవాదములు!!

      మిత్ర! మీ యభిమానమ్మె మేరలేని
      దయ్య! సంతోష మయ్యెను! నెయ్యమునను
      దెలిపి నట్టిడు పద్యమ్మె తెలిపెనయ్య
      మీ మనము వెన్న యని! నా ప్రణామము లివె!!

      తొలగించండి
  5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. ఇక మధురమైన పలుకుల మధుసూదన కవి కృతమైన ఈ కవితా ఖండిక సుకవితండమును మెండుగా అలరింపగలదని అభినందిస్తూ ----

    శ్రీకృష్ణ రాయ చరితము
    సాకల్యముగా రచించి సరస వచశ్శ్రీ
    ప్రాకటముగ భారతికొక
    ప్రాకారముఁ గట్టినావు పండిత సుకవీ !

    చక్కనైన కవిత చిక్కని పాకాన
    తేనె వోలె సుధల సోనలూర
    మధురమైన పల్కు మధుసూదనుఁడు జిల్కు
    వసుధ నతని వాక్కు వాసికెక్కు !!!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యోఽస్మి విష్ణునందన్ గారూ! కృతజ్ఞతాపూర్వక ధన్యవాదములు!!

      ఆదరమున మీర లందఁ జేసినయట్టి
      మెచ్చుకోలు నాకు నిచ్చె బలము!
      ఓ కవీంద్ర యిపుడు నే కృతజ్ఞుఁడనయ్యు
      ధన్యవాదము లిడెదఁ గొనుఁ డయ్య!!

      తొలగించండి
  7. శ్రీయుత మధుసూదనమా!
    పేయములౌ పదములల్లి వేడుక తోడన్
    రాయల వారిని మీరలు
    బోయీలై మోసినంత మోదము గూర్చెన్!




    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సహదేవుడు గారూ,
      ‘మధుసూదనమా’ అన్న సంబోధన బాగా లేదు. ‘శ్రీయుత మధుసూదన! కడు| పేయములౌ...’ అనండి.

      తొలగించండి
    2. శ్రీ శంకరయ్య గారూ, శ్రీ సహదేవుడు గారూ , ' పేయ ' శబ్దానికి ఒంటరిగా ప్రయోగాలు అరుదు , అది విశేషణంగానే రాణిస్తుంది కర్ణపేయము వలె. కనుక ఇక్కడ

      "శ్రీయుత మధుసూదన! శ్రుతి
      పేయములౌ ---- " అంటే బాగుంటుందని సూచన.

      తొలగించండి
    3. డా. విష్ణునందన్ గారూ,
      ధన్యవాదాలు.

      తొలగించండి
  8. డా. విష్ణునందన్ గారూ,
    అమోఘమైన ఈ కవితాఖండిక కేవలం ‘వ్యాఖ్యారూపం’గా ఉండడం సబబు కాదని భావించి ‘ఖండకావ్యాలు’ శీర్షిక క్రింద పోస్ట్ చేశాను. అందువల్ల ఇక్కడి వ్యాఖ్యను తొలగిస్తున్నాను. అన్యదా భావించకండి.

    రిప్లయితొలగించండి
  9. గురుదేవులకిద్దరకూ ధన్యవాదములు.
    సవరించిన పద్యం:
    శ్రీయుత మధుసూదన! శ్రుతి
    పేయములౌ పదములల్లి వేడుక తోడన్
    రాయల వారిని మీరలు
    బోయీలై మోసినంత మోదము గూర్చెన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సుకవి మిత్రులు గుండా వేంకట సుబ్బ సహదేవుఁడు గారూ...నమస్సులు...ధన్యవాదములు!

      పబ్బతి గుండా వేంకట
      సుబ్బా సహదేవ సుకవి సోదర కొనుమా!
      అబ్బా! చక్కని పద్దెము
      దబ్బున నా కిడిన మీకు దండము లయ్యా!!
      [పబ్బతి = ప్రపత్తి]

      తొలగించండి
  10. చాలా మనోజ్ఞమైన ఖండిక వ్రాసారు..అభినందనలు..

    రిప్లయితొలగించండి