26, ఏప్రిల్ 2016, మంగళవారం

ఖండకావ్యము - 10

కాలభైరవాష్టకము
రచన : రాంభట్ల పార్వతీశ్వర శర్మ (అష్టావధాని)

పలుకువాడు! పిలువ పలుకుల నిడువాడు
పరమపావనుండు! భక్తివశుడు!
కష్టములను దీర్చు కాశీపురాధీశ
బైరవుండు! కాలభైరవుండు!!

శక్రుడేనికొలుచు జలజపదయుతుడు
ఉరగయజ్ఞసూత్ర ధరుడతండు
కృపకునబ్ధివోలె నుపమింప సరివచ్చు
బైరవుండు! కాలభైరవుండు!!

నారదాది యోగి నతుడు! దిగంబరుం!
డిందుశేఖరుండు! సుందరుండు!
విషముగొన్నవాడు! విషమాక్షునకునీడు!
బైరవుండు! కాలభైరవుండు!!

సూర్యకోటి బోలు సురిచిర దేహుండు!
తాండవప్రియుండు ! దండపాణి!
శూలటంకపాశ శోభిత హస్తుండు!
బైరవుండు! కాలభైరవుండు!!

ముక్తినిచ్చువాడు! మోహనాకారుండు!
భక్తవత్సలుండు! ప్రభుడతండు!
చారుకింకిణీ లసత్కటి శోభిత
బైరవుండు! కాలభైరవుండు!!

ధర్మవర్తనులకు దక్షుండు! దక్షాది
ధర్మదూరనాశ దక్షుడతడు!
మృత్యుదర్పమణచి భృత్యుల రక్షించు
బైరవుండు! కాలభైరవుండు!!

రత్నపాదుకావిరాజితపదములన్
సర్వసేవకాళి సాకునతడు!
అష్టసిద్ధులొసగు తుష్టినింకెవ్వడు?
బైరవుండు! కాలభైరవుండు!!

భీమవిక్రముండు! భీతిని పరిమార్చు
భూతనేత! నిత్యనూతనుండు!
అష్టకమ్ముజెప్పనాధారమైనాడు

బైరవుండు! కాలభైరవుండు!!

12 కామెంట్‌లు:

  1. గురువుగారూ కర్త్ృత్వాన్ని ఒకసారి సరిజూచుకోండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మిస్సన్న గారూ,
      మన్నించండి. రాత్రి నిద్రాసక్తతతో ఖండికను షెడ్యూల్ చేస్తున్నపుడు సరిగా పరిశీలించలేదు. ఇప్పుడు సరి చేశాను. ధన్యవాదాలు.
      నిజానికి ఈరోజు మీ పేర ఒక ఖండకృతి వేయాలని నా కోరిక. ముఖపుస్తకంలో మీ పేర వెదికితే అది కనిపించింది. వెనుకా ముందూ చూడకుండా పోస్ట్ చేశాను.
      మీ ఖండికల్లో నాలుగైదు ఎన్నుకొని నా మెయిల్‍కు పంపండి. బ్లాగులో ప్రకటిస్తాను.

      తొలగించండి

  2. కాలభైరవ!మమ్ములగరుణజూడు కాంక్షగలదయ్యనినుజూడగాశియందు నీయుమనుమతిమరిమాకునీశ!నీవు భాగ్యమగుమాకుదువ్వూరివారివలన నీదుదర్శనభాగ్యమ్మునెమ్మితోడ

    రిప్లయితొలగించండి
  3. పార్వతీశ్వరుల కాలభైరవస్తుతి వైభవంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  4. రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారు మీ కాలభైరవాష్టకము భక్తి ప్రదముగా మృదుమధుర శబ్ద లాలిత్యముతో విరాజిల్లు చున్నది. అభినందనలు.
    "సూర్యకోటి బోలు సురిచిర దేహుండు!" "సురుచిర" ముద్రణాలోపము కాబోలు.
    దిగంబరుం! డిందుశేఖరుండు! విషముగొన్నవాడు! అంటూ మల్లీ విషమాక్షునకునీడంటున్నారు.

    రిప్లయితొలగించండి
  5. . భైరవాష్టకంబు| “పద్యాలు రాంభట్ల
    పార్వతీశ| రచనపరవశంబు”
    కలుగ జేయుగాదె| కారుణ్య మూర్తిగా
    భైరవుండు|కలిమి బలిమినొసగు.

    రిప్లయితొలగించండి