28, ఏప్రిల్ 2016, గురువారం

ఖండకావ్యము - 11

ఋతు సందేశం
రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు)

చల్లగాలి తెరలు మెల్లగా వీచును
మల్లెపూల తావి మత్తు గొలుపు
కోయిలమ్మ పాట తీయగా మనసుకు
సంతసమ్ము నిడు "వసంత" వేళ!

ఎండ మండిపోవు నెఱ్ఱనై సూర్యుండు
గుండె లదర గొట్టు గుబులు హెచ్చు
ఉస్సు రుస్సు రంద్రు నూరూర జనములు
"గ్రీష్మ" తాప మిట్టి రీతి నుండు.

చిటపటమని వాన చినుకులు రాలును
ఏడురంగు లీను నింద్రధనువు
బీద బిక్కి వార్కి పిడుగు పాటై యొప్పు 
"వర్ష" ఋతువు మేలు కర్షకులకు.

రెల్లు దుబ్బు విరియు తెల్లని పింజలై
నిండు చందమామ నింగి వెలుగు
ప్రకృతి పులకరించు పారవశ్యమ్మున
"శరదృతువు" న పుడమి సందడించు!

మంచు బిందుచయము మంచి ముత్యములట్లు
మెరయు బాలభాను కిరణములకు
చలికి ముసుగు తన్ని సాగెడు వారికి
మంచి సుఖ మొసగు "హిమంత" మందు!

ఆకు రాల్చి తరువు లాశతో చూచును
క్రొత్త చివురు తొడుగు కోర్కెతోడ
రేపు మంచి దంచు రేపుచు నాశల
వశము చేసి కొనును "శిశిర" ఋతువు!

కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.

20 కామెంట్‌లు:

  1. అన్నా! మిస్సన్నా! ప్రకృతి పలకరింపులకు పులకించిన మీ హృదయ రవళి అద్భుతము. “దువ్వూరి” రామిరెడ్డి గారి కర్షకుణ్ణి గుర్తుచేసారు. మనఃపూర్వకాభినందనాభివందనములు.
    ఆరు ఋతువుల సందేశ మరయ గాను
    మరచి పోయిన జనులకు మరల యిచ్చె
    అన్న మిస్సన్న నిస్సంశ యాధిపుండు
    లలిత పదముల లావణ్య లాస్య మాడ
    పద్య విద్యయందనవద్య చరితు డగుచు.

    రిప్లయితొలగించండి
  2. పండిత పామర జనరంజకంగా చాలా మనోజ్ఞంగా రచించారు..అభినందనవందనములు సర్...

    రిప్లయితొలగించండి
  3. గురువుగారికి ధన్యవాదములు. కృతుల సంఖ్య 11 కు బదులు 12 పడినట్లుగా ఉంది.

    రిప్లయితొలగించండి

  4. ఆరురుతువులలక్షణాలద్భుతముగ జక్కజెప్పినదువ్వూరిసరళిజూడ గగురుబొడిచెనునామేనుకవితకతని నాహయబ్బురంబయ్యెనునార్య!మిగుల

    రిప్లయితొలగించండి
  5. రిప్లయిలు
    1. దోషరాహిత్యమే నాయభిలాషయని దోషాన్వేషణకాదని మీరు భావిస్తే నేను గమనించినవి కొన్నిటి నుదహరించ గలను. అవి సరియనచో గ్రహించి కానియెడల విస్మరించగలరు.

      తొలగించండి
  6. సోదరులు మిస్సన్నగారి ఋతు సందేశం అద్భుతంగా ఉంది.

    రిప్లయితొలగించండి
  7. . శ్రీదువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావుగారుపొందుపరచినపేరునందేఆరుభాగాలు ఋతువులులాగాగలవుశ్రీ1.,దువ్వూరి2.,వేంకట3.,నరసింహ4.,సుబ్బారావు,5. గారు.6.వందనాలు
    1.ఆరు ఋతువుల విధులను జారనీక
    చల్లగాలి,వెన్నెల,ఎండ,చల్లుహిమము
    పూల జల్లు,వసంతమే పులకరింత
    దుర్ముఖియు,మిస్సన్న రచన మర్మ మిదియె|

    రిప్లయితొలగించండి
  8. చాలా బాగుంది మీలరచన మిస్సన్న గారు.అభినందనలు

    రిప్లయితొలగించండి
  9. గు రు మూ ర్తి ఆ చా రి
    ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,

    చ క్క ని ప ద్య ము ల. న ౦ ది ౦ చి న

    మి స్స న్న గా రి కి వ ౦ ద న ము లు

    రిప్లయితొలగించండి
  10. ఈ ఖండికను మెచ్చుకొన్న సహృదయు లందరికీ ధన్యవాదములు. నిజానికి ఈ ఖండికను వ్రాసి చాలా కాలమైంది. 8/6/1996 న ఆకాశవాణి విజయవాడ కేంద్రము ద్వారా ప్రసారమైంది.

    రిప్లయితొలగించండి
  11. ఇరవై ఏళ్ళా? ఈ ఎండల్లో ఇంత మంచి ఋతుగీతం ఎలా పాడారా అని ఆశ్చర్యం కలిగిందండి.

    రిప్లయితొలగించండి