30, జూన్ 2011, గురువారం

సమస్యా పూరణం -378 (సిరులవలన నేఁడు)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
సిరులవలన నేఁడు చేటు గలిగె.
ఈ సమస్యను సూచించిన కందుల వరప్రసాద్ గారికి ధన్యవాదాలు.

28 కామెంట్‌లు:

  1. స్విస్సు బ్యాంకు నందు సిగ్గులేకను దాచ,
    రియలు బూము లందు' రిచ్చి' గాగ,
    నడిచి వచ్చి నట్టి నడమంతరపు పాడు
    సిరులవలన నేఁడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  2. అందరికీ వందనములు !
    శాస్త్రీజీ ! పాడు సిరులు ! బావుంది !

    01)
    _____________________________________

    పీక కోయు చుండె - ప్రేమికుల మనుచు
    ప్రేమకేది హద్దు ! - పిచ్చి ముదిరె !
    మదము పెరిగె నిలను - మగవారమని ! మగ
    సిరుల వలన నేడు - చేటు గలిగె !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  3. కిశోర్ జీ ! ధన్యవాదములు.
    మగసిరులు...ఏం చెప్పారండీ ... భలే !

    రిప్లయితొలగించండి
  4. రూక విలువ యనగ, రొక్కపు విలువల
    నేమిఁ దెలియగలరు నేటి యువత?
    ఆర్జనల్ పెరగగఁ నదుపుఁ దప్పి చెడిరి
    పిల్లవాండ్రు! చెడెను పెంపకమ్ము!

    కలిసిమెలిసి యుండు కాపురమ్ములిపుడు
    కానరావు నెచట కలల నైన,
    నొకరి తోడ కలిసి నుండబోరు.
    సిరులవలన నేఁడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    మందాకిని గారూ ! బావుంది ! కానీ 7వ పాదం సరిచెయ్యాలి !

    రిప్లయితొలగించండి
  6. రూక విలువ యనగ, రొక్కపు విలువల
    నేమిఁ దెలియగలరు నేటి యువత?
    ఆర్జనల్ పెరగగఁ నదుపుఁ దప్పి చెడిరి
    పిల్లవాండ్రు! చెడెను పెంపకమ్ము!

    కలిసిమెలిసి యుండు కాపురమ్ములిపుడు
    కానరావు నెచట కలల నైన,
    నొకరి కష్టమందు నొకరుగ లేరయ!
    సిరులవలన నేఁడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  7. మందాకిని గారూ ! బావుంది .
    నొకరి తోడ కలిసి నుండబోరొక్కరు ..అంటే ?.

    రిప్లయితొలగించండి
  8. బీర కాయ యైన బెండ కాయైనను
    పదను తెలిసి కోయ బాగు కాదె
    పిన్న వయసు లోనె పెండ్లి చేసితిని ప-
    సిరులవలన నేఁడు చేటు గలిగె

    రిప్లయితొలగించండి
  9. మిత్రులకు ధన్యవాదములు. అందరి పూరణలూ వైవిధ్యంగా బాగున్నవి. హనుమచ్ఛాస్త్రి గారూ, బాగుంటుందండి.మార్చమంటారా?

    రిప్లయితొలగించండి
  10. మిస్సన్న మహాశయా ! బానేవుంది కానీ
    పసిరు లనిన నేమి ?
    02)
    _____________________________________

    *సీ*
    పెద్దవా రనినచో - ప్రేమ లేనే లేదు
    గౌరవ మ్మిసుమంత - గాన రాదు !
    దిక్కు మాలిన రీతి - దినములు గడిపెడు
    అయ్య, అమ్మ లనిన - ఆర్తి లేదు !
    మాతృ దేశంబన్న - మమకారమే సున్న
    పరదేశ మేగుటే - పరము నేడు !
    మాతృ భాషా ద్వేష - మావహించెను జూడు
    పర భాష పైననే - మరులు మెండు !

    ఆ*వె
    భార్య భర్త లనెడి - బంధమ్ము తెగగొట్టు !
    బంధు మిత్రు లన్న - భావ మేది !
    మనిషి లోన మమత - మరణించెనా ? యేమి ?
    సిరులవలన నేఁడు - చేటు గలిగె !
    _____________________________________

    రిప్లయితొలగించండి
  11. చూసినాము మనము స్పోర్ట్సులో స్కాములు
    తెలియ వచ్చె సాయి లీల మనకు
    అక్రమార్జితమ్ము నన్యాయ మైనట్టి
    సిరుల వలన నేడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  12. గురువు గారికి నమస్కారములు
    సిరులు గలిగి యున్న చేరు గప్పలు వేలు
    గాను, సంగమమున కామ చేష్ట
    లధికమై దినదిన యభివృద్ధి జెందగా
    వారువీరనకనె వరుస గుదుర |
    వీధి కుక్కలవలె విధులు మఱచి నేటి
    యువత దిరుగు చుండె, ఊరి జాత
    రవలె నోక్కరోజు రవిజాలనెడి వారి
    సిరులవలన నేఁడు చేటు గలిగె|
    ( రవి= సంభరం )

    రిప్లయితొలగించండి
  13. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జూన్ 30, 2011 11:00:00 AM

    వేద విధులయందు, విద్యాధికులయందు,
    పండు ముసలియందు, బాలలందు,
    నీతి తప్పి దోచి నిల్వ జేసిన, పాప
    సిరుల వలన మనకు చేటు గలుగు.

    రిప్లయితొలగించండి
  14. సీ. దొంగలెందుకు బడుదురు కొంప లందున
    పరుల సొత్తును దోచ !? సిరుల కొఱకు !

    హత్య లెందుకు జేసి హాని కలుగ జేయు
    దురు కర్కశమ్ముగా !? సిరుల కొఱకు !

    వంచన జేయుచు ముంచెద రెందుకు
    స్నేహితులను గూడ !? సిరుల కొఱకు !

    మానవ విలువలు మంట గలిపి యేల
    జేతురు పాపము !? సిరుల కొఱకు !


    ఆ.వె. కోట్ల నల్లధనము కొల్లగొట్టెదరేల !?
    సిరుల కొఱకు గాక ! సిరుల కొఱకు !
    ఇట్టి పాపపు పను లెల్ల బరగు నట్టి
    సిరుల వలన నేడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  15. ఆ.వె: నెనరు ప్రాయ మందె "నెట్ కేఫు" లోదూరి
    చూడ రాని వన్ని చూచు చుండ
    శేల మెట్టు లబ్బు చిన్న? కంతర్జాల
    సిరుల వలన నేడు చేటు కలిగె .

    ---వెంకట రాజారావు . లక్కాకుల

    ---బ్లాగు పేరు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  16. గోలి హనుమచ్చాస్త్రి గారూ,
    ‘పాడు సిరుల’ పూరణ బాగుంది. అభినందనలు.

    వసంత కిశోర్ గారూ,
    మీ రెండు పూరణలూ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా సీసపద్యం అదిరింది. అభినందనలు.
    మొదటి పూరణ మొదటిపాదంలో ‘పీక గోయుచుంద్రు’ అంటే బాగుంటుందేమో?

    మందాకిని గారూ,
    చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
    ఆ పాదంలోని భావం సవరించకముందే బాగుంది. కాకపోతే చిన్న సవరణ. ‘నొకరి తోడ కలిసి యొక రుండగా బోరు.’

    మిస్సన్న గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘పసిరుల వలన’ ... ?

    రిప్లయితొలగించండి
  17. హమ్మయ్య!
    ఇప్పటికి వ్యాఖ్యను పోస్ట్ చేయగలిగాను. ఉదయంనుండి బ్లాగు ఇబ్బంది పెడుతున్నది.
    ఈనాటి సమస్యను పోస్ట్ చేసిన తర్వాత ఈనాటి ‘చమత్కార పద్యాలు’ పోస్ట్ చేయబోతే ఎర్రర్ అని వచ్చింది. చాలాసార్లు ప్రయత్నించాను. అదే ఎర్రర్ వచ్చింది. అందువల్ల ఈరోజు చమత్కార పద్యాల శీర్షిక లేదు. పోనీ ఏదైనా వ్యాఖ్య పెడదామంటే పోస్ట్ క్రింద ఉండవలసిన వ్యాఖ్యల డబ్బా కనిపించడం మానేసింది. ఇప్పుడు కనిపించింది. అనుమానిస్తూనే పై వ్యాఖ్యను పోస్ట్ చేసాను. అది ప్రకటిత మయింది. ఈరోజు ఈసమస్య నాకేనా ? మిగతా బ్లాగర్లకు కూడానా?

    రిప్లయితొలగించండి
  18. నాగరాజు రవీందర్ గారూ,
    మీ రెండు పూరణ ఉత్తమంగా ఉన్నాయి. అభినందనలు.
    ముఖ్యంగా మీ సీసపద్యం అద్భుతంగా ఉంది.

    వరప్రసాద్ గారూ,
    బాగుంది మీ సీసపద్యం. అక్కడక్కడ పానకంలో పుడక లున్నా మంచి ప్రయత్నం. అభినందనలు.

    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘పాపసిరులు ..’ ? ‘పాడు సిరులు’ అందాం.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    చాలా కాలానికి నా బ్లాగులో అడుగుపెట్టారు. సంతోషం.
    మంచి పూరణ చేసారు. అభినందనలు.
    ‘శీలము’ శేలము అని టైపాటు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ, మీరు చెప్పిన సవరణ బాగున్నది.
    బ్లాగర్ ఎర్రర్ వస్తోంది. వరసగా ప్రయత్నిస్తేనే పోస్ట్ చెయ్యగలుగుతున్నాం.
    ధన్యవాదాలు.నాగరాజుగారి సీసపద్యం చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  20. సంపత్ కుమార్ శాస్త్రిగురువారం, జూన్ 30, 2011 9:28:00 PM

    ధన్యవాదములు గురువు గారు. ఇంకా ఉత్తమమైన భావనలతో పూరించడానికి ప్రయత్నిస్తాను.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ ధన్యవాదాలు.
    వసంత మహోదయా ధన్యవాదాలు.
    మీ రిద్దరూ కూడా 'పసిరులు' అంటే ఏమిటని ప్రశ్నార్థం పెడితే నాకూ
    అనుమానం వచ్చేస్తూంది.
    పసిరులు, పసిరి కాయలు, పసిరి పీపలు లేదా పూపలు అని
    చిన్న తనం నుంచీ చదివినదీ, విన్నదీ పదం వాడేను.
    ఏదైనా ఉద్దేశించిన ప్రయోజనానికి తగినట్లుగా తయారు కానిది.
    బాల్య వివాహం వల్ల అనర్థం కల్గింది అని నా భావన.

    అయ్యా నా బ్లాగు ఏమీ ఇబ్బంది పెట్ట లేదు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీపతిశాస్త్రిగురువారం, జూన్ 30, 2011 10:55:00 PM

    శ్రీగురుభ్యోనమ:
    ఆస్తి పెంచుకొనగ నాసక్తితోనాడు
    అక్రమార్జనలను ఆశ్రయించె
    పట్టుబడగ కుమిలె పరువంతబోవగా
    సిరులువలన నేడు చేటు గలిగె

    రిప్లయితొలగించండి
  23. కోట్లధనము కూడెనెట్లొ;మిగుల ప్రేమ,
    శాంతి పంచు చుండ జగతినెల్ల!
    బూది నిడెడు వాన్కి బొక్కసమేలయా?
    సిరులువలన నేడు చేటు గలిగె.

    రిప్లయితొలగించండి
  24. తల్లి దండ్రి యన్న తంటాలు బోలెడు
    అక్క చెల్లి యనగ చిక్కు గాదె ?
    ఆన్న దమ్మి ప్రేమ యెన్నగా బోరాదు
    సిరుల వలన నేడు చేటు గలిగె !
    --------------------------------------------
    ధనము లేని యెడల దరిరావు తంటాలు
    ఉన్న దాని యందు నుండు సుఖము
    కంటి లోని నిదుర మింటకెగసి పోవ
    సిరుల వలన నేడు చేటు గలిగె !

    రిప్లయితొలగించండి
  25. శ్రీపతి శాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.

    ఊకదంపుడు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘వాన్కి .. ? ‘బూది నిడు నతనికి’ అనవచ్చు కదా!

    రాజేశ్వరక్కా,
    రెండు పద్యాలూ బాగున్నాయి. రెండవది ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘అన్న దమ్మి(?)ప్రేమ’ అన్నచోట ‘అన్నదమ్ముల నలి/లలి’ ఏదైనా సరే.

    రిప్లయితొలగించండి
  26. ధన్యవాదములు గురువు గారూ !
    మందాకిని గారూ ! ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి