1, జులై 2011, శుక్రవారం

సమస్యా పూరణం -379 (రావణున కంజలించెను)

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ........
రావణున కంజలించెను రామపత్ని.
ఈ సమస్యను సూచించిన కవివిత్రునకు ధన్యవాదాలు.

22 కామెంట్‌లు:

  1. చెప్పె నువిభీషణుడు, తాను చేతులెత్తి
    రావణున కంజలించెను; "రామపత్ని
    నిప్పు లాటిది కాలును నీవు గోర
    నిట్లు, గోరుము కాలుని నీవు గోర"!

    రిప్లయితొలగించండి
  2. పరమసాధ్వియు, యతిథుల పరమ ప్రీతి
    నాదరించెడి జానకి, నమ్మె నేమొ
    వేషధారిని యతిథిగఁ; విష్ణువైరి
    రావణున కంజలించెను రామపత్ని.

    రిప్లయితొలగించండి
  3. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !
    01)
    _____________________________________

    మధుర మంజుల భాషియౌ - మదన సముని
    మదిని తన భార్య నెన్నడు - మరువ నట్టి
    మహిని మహిమా న్వి తుండగు; మచ్చరీడు
    రావణున ! కంజలించెను - రామపత్ని !
    _____________________________________
    మచ్చరీడు = శత్రువు

    రిప్లయితొలగించండి
  4. మందాకిని గారూ ! చాలా బాగుందండీ ! అభినందనలు.
    కిశోర్ జీ ! మంచి పూరణ . అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. శాస్త్రీజీ ! ధన్యవాదములు !
    మిత్రులందరి పూరణలూ ముచ్చటగా నున్నవి !

    రిప్లయితొలగించండి
  6. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 01, 2011 9:44:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    రామ రావణ సంగ్రామరంగమందు
    రావణునిగూల్చి రాముడు రాజసమున
    వీరస్వర్గము నిచ్చి దీవించె స్వామి
    రావణున, కంజలించె రామపత్ని

    రిప్లయితొలగించండి
  7. కతనమేదైనగానిమ్ము, కపట వేష
    ధారియైవచ్చి భిక్షమ్ము గోరినంత ,
    మాన్వి,మాననీ యుండని మాయ రూప
    రావణున కంజలించెను రామపత్ని.

    రిప్లయితొలగించండి
  8. సాధ్వి మండోదరి వినతిఁ సమర వేళఁ
    రావణునకంజలించెను - "రామపత్ని
    రత్నము,శరణుగోరుము రణము విడచి,
    రాముఁడు రిరక్షువు, కుల రక్ష జేయు!"

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రిశుక్రవారం, జులై 01, 2011 3:06:00 PM

    గురువుగారికి నమస్కారములతో........

    దాశరథి, రామభద్రుండు తానె యనుచు
    నమ్మబలికించు నెపమున నాతి కడకు
    రావణుడునేగె,కనుడు,శ్రీరామ రూపు
    రావణున, కంజలించెను రామపత్ని.

    శ్రీరామ వేష ధారియై రావణుడు అశోకవనములో సీత కడకేగినాడని విన్నాను. సరియనదో కాదో గురువుగారే సెలవివ్వాలి.

    రిప్లయితొలగించండి
  10. నాల్గవ పాదంలో గణదోష తొలగిస్తూ:
    సాధ్వి మండోదరి వినతిఁ సమర వేళఁ
    రావణునకంజలించెను - "రామపత్ని
    రత్నము,శరణుగోరుము రణము విడచి,
    రాముఁడు రిరక్షువిక కుల రక్ష జేయు!"

    రిప్లయితొలగించండి
  11. తే. గీ : ప్రళయ కాలాగ్ని భాస్వన్నిభ భయ గాత్రు,
    నరి భయంకర బాణ ప్రహార ఘన వి
    రాజ దోర్దండ కోదండ రాము , నిహత
    రావణు న కంజలించెను రామ పత్ని .

    ---వెంకట రాజా రావు . లక్కాకుల .

    ---బ్లాగు పేరు : సుజన సృజన

    రిప్లయితొలగించండి
  12. ఉగ్ర భీకర రూపము నుచ్ఛ స్థాయి
    గర్జనలఁ జేయు రణధీర, ఘనపు నీల
    వర్ణ యోధుడు; మృత్యువు పథముఁ జూపె
    రావణున కంజలించెను రామ పత్ని

    కి; అంజలి

    రిప్లయితొలగించండి
  13. శ్రీపతిశాస్త్రిశుక్రవారం, జులై 01, 2011 9:28:00 PM

    శ్రీగురుభ్యోనమ:

    శివుని ధనువును కదిలింప చేతగాక
    క్రిందపడెనంత నా దశగ్రీవు డపుడు
    దాశరథి సాయమందించె దయను చూపి
    రావణున, కంజలించెను రామపత్ని

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    ‘లాటిది, లాంటిది ..’ గ్రామ్యాలు కదా. ‘వంటిది’ అందాం.

    మందాకిని గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు
    మొదటి పూరణలో ‘సాధ్వియు నతిథుల’ అందాం.
    రెండవ పూరణ చివర ‘కి; అంజలి’ .... ?

    రిప్లయితొలగించండి
  15. వసంత కిశోర్ గారూ,
    పద్యం బాగుంది. కాని సమస్యకు అన్వయం కుదిరినట్లు కనిపించడం లేదు. గోలి వారు అభినందించారు మరి! నా అవగాహనా లోపమా?

    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    మంద పీతాంబర్ గారూ,
    మనోజ్ఞమైన పూరణ. అభినందనలు.

    చంద్రశేఖర్ గారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ సర్వశ్రేష్ఠంగా ఉంది. అభినందనలు. ‘నిహత రావణునకు’ మంచి ప్రయోగం.

    శ్రీపతి శాస్తి గారూ,
    మీ రెండవ పూరణ కూడా ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. శంకరార్యా ! ధన్యవాదములు !
    మచ్చరీడు రావణునకు + అంజలించెను !
    రావణుని శత్రువైన రామునికి అంజలించినది సీత అని నా భావం !
    "నిహత రావణునకు " వంటిదే యిది కూడా !

    రిప్లయితొలగించండి
  17. " నాథ! శ్రీ రాముడా పద్మ నాభు డనిన
    వినక పోతిరి యిట్లైతి " రనఘ యనుచు
    రావణున కంజలించెను రామ! పత్ని,
    విగత జీవుని గని విలపించు చుండి.

    (ఆలస్యానికి మన్నించాలి.)

    రిప్లయితొలగించండి
  18. మిస్సన్న గారూ,
    అబ్బ! ఏం విఱుపండి! ‘రామపత్ని’లో రాముడు లేడు, సీతా లేదు. మధ్యలో మండోదరిని లాక్కొచ్చారు. అద్భుతం! ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారూ ధన్యోస్మి.
    ఈ రోజు నేను పంపిన పూరణ లన్నిటికీ
    మీ వ్యాఖ్యలు పెట్టినందుకు శతథా ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి