2, జులై 2013, మంగళవారం

సమస్యాపూరణం – 1100 (మోదమును గూర్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!

23 కామెంట్‌లు:

Pandita Nemani చెప్పారు...

మధ్యాక్కర:
కారులో జనుచుండ పెద్ద గాలి తుఫానులు వచ్చె
దారిలో తృటిలోన ముప్పు తప్పించుకొంటి మయ్యెడను
భూరి కాంతుల నీను మోదమును గూర్చె ఘోర ప్రమాద
మౌర! తప్పెను గదా యనుచు నంతరంగము పొంగిపోయె

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

శత్రు రాజ్యంపు సేన దుస్సాహసమున
భరత ఖండంబునకుఁ బంపెఁ బలగములను
పెను తుఫానులలోఁ జిక్కి వెనుదిరిగిరి
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర.

గోలి హనుమచ్చాస్త్రి చెప్పారు...

చెట్టు గ్రుద్దగ మా ' బస్సు ' చేరలేదు
అమరనాథుని యాత్రకు నపుడు మాకు
గంగ వరదయె తప్పెను, బెంగ లేదు
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!

మధురకవి గుండు మధుసూదన్ చెప్పారు...

దేవదానవ సమ్మోద దివ్య మథన
మున మొదటఁ బుట్టిన గరళము నట మ్రింగి,
శివుఁడు కాచెను సర్వులఁ జిత్రముగను!
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!!

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
=======*=======
జుద మాడు చునుండగ జోలిబట్టె
బీదలు, ధనము తోడుగ పేకలనిడ
మీదబడ్డ రక్ష కులకు మేల మయ్యె
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!
(మేలము = పరిహాసము )
=======*=======
కంటి యమసదనమ్మును ఘనము గాను
పాప పుణ్య ములకు జిక్కు ఫలిత మెల్ల
రాక పోకల మర్మము నాకు దెలిసె
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర!

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ నేమాని గురువర్యుల మధ్యాక్కర మోదమును నాకు గూర్చె
======*=====
రాక్షసులను జంప రామ లక్ష్మణులు యా
వార్త విన్న సకల వారి జాక్ష,
ముని జనులకు మోదమును గూర్చె ఘోరప్ర
మాద మౌర! రామ మనుజనులకు.

కంది శంకరయ్య చెప్పారు...

పండిత నేమాని వారూ,
తప్పిన ప్రమాదం మోదాన్ని కూర్చిందన్న మీ పూరణ మధ్యాక్కరలో బాగుంది. అభినందనలు.
*
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
శత్రుసైన్యానికి జరిగిన ప్రమాదం మనకు మోదాన్ని కూర్చేదేగదా! బాగుంది మీ పూరణ. అభినందనలు.
‘సేన, బలగములు’ అని పునరుక్తి ఉన్నది కదా! ‘శత్రురాజ్యంపు రాజు/నేత’ అందాం.
*
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
బస్సు ప్రమాదం పెద్ద ప్రమాదాన్ని తప్పించిందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
గుండు మధుసూదన్ గారూ,
సాగర మధనం విషయంగా మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

వరప్రసాద్ గారూ,
మీ మూడు పూరణలూ వైవిధ్యంగా ఉన్నాయి. అభినందనలు.
రెండవ పూరణ చాలా బాగుంది.
మొదటి, మూడవ పూరణలలో అన్వయం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది.

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी చెప్పారు...

సేన గొప్పతనమదేమి జీతగాండ్రె
వారలునను వాదములకు బదులు చూపి
ప్రాణ భిక్షను పెట్టిన ప్రతిభఁ గాంచ-
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర!

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ శంకరయ్య గురువర్యులకు ధన్యవాదములు

(మొదటి పూరణలో పోలిస్ రైడింగ్ లో దోరకకుండుట, మూడవ పూరణలో మొదటి రోజు యుద్ధానంతరము
ఆడు వారికి,ముని జనులకు మోదమయ్యె,కానీ రామ మనుజనులకు = వానరులకు ప్రమాదమని సందేహములో వ్రాసితిని )
మరి యొక పూరణ
======*======
విందు నందు వడి వడిగ పాండు సుతుడు
కాల కూటము సేవింప కౌరవులకు
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర!
పాండు సుతునకని దలచె మెండు గాను

Pandita Nemani చెప్పారు...

అయ్యా! వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
మీ 3వ పూరణ తొలి పాదములో రామలక్ష్మణులు + ఆ = రామలక్ష్మణులునా అగును - యడాగమము రాదు. స్వస్తి.

Guda Raghuram చెప్పారు...

వనములఁదరులఁనఱకుట వాహినులలొ
సికతతోడుట తప్పని చెప్పువారి
మాటలకు దేశమునపెద్ద మనుషులకను
మోదమును గూర్చె ఘోరప్రమాదమౌర!

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
======*========
వరద లందు జిక్కి జనులు పస్తు లుండ
పూరి,కిచిడి బెట్టి ధనము పూర్తి గాను
దండు కొన్న వ్యాపారుల దండులకును
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!

subbarao చెప్పారు...

శంకరా భరణ బ్లాగు , చదువరులకు
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర
కలిగె నుత్తరా ఖండము గ్రామ ప్రజకు
బహుళ నదులన్ని వరదలై పా ఱు కతన

కందుల వర ప్రసాద్ చెప్పారు...

రాజకీయ నాయకుల పలుకులు విని ఆత్మహత్యల పై
========*========
రాజకీయ నాయకులెల్ల రణము నందు
బలుకు బలుకులను వినిన ప్రజల కెల్ల
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
నమ్మి నడి సంద్రమున ముల్గు నరుల కెల్ల

కందుల వర ప్రసాద్ చెప్పారు...

మంత్రి గారిపై పిర్యాదు జేసి కష్టములను కొని దెచ్చుకొన్న వారిపై
======*=========
న్యాయ సూత్రములు జదువ నరుల కెల్ల
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
నమ్మి దిరుగు నరుల కెల్ల,చెమ్మ గిల్లు
దార,పుత్రుల చెక్కిళ్ళు ధరణి లోన

Seena చెప్పారు...

బాల్యమున విడిపోయిన బాల్య మిత్రు
లిరువురు వరద వలన కలిసిరి చిత్ర
మిది వినిన భయద విలయమే గననిది
మోదమును గూర్చె ఘోరప్రమాద మౌర.

రాజేశ్వరి నేదునూరి చెప్పారు...

లక్క యింటికి నిప్పును మిక్కుటముగ
నంటు కొనినంత పాండవు లంత మొందు
తెలిసి విదురుడు తప్పించె తెలివి గాను
మోదమును గూర్చె ఘోర ప్రమాద మౌర !

కందుల వర ప్రసాద్ చెప్పారు...

శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
=======*======
సుర వర బలమ్ము నెంచగ శూలివి గద
కరము నుంచెద నొక తురి శిరము పైన
ననుచు దను భస్మమై నట్టి యసురుని గన
మోదమును గూర్చె, ఘోర ప్రమాద మౌర!
======*========
గంగ యమున సొగసును గాంచ జనులు
వెడలె కేదార నాధుని కడకు,మిగిలె
కట్టె పై ధన కనకమ్ము,ఖలులకు నది
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!

కందుల వర ప్రసాద్ చెప్పారు...

అడిగిన వరము లిచ్చెడి యక్షరుడగు
శివుని ధ్యాన పిఠము హిమ శిఖరము గన
మోదమును గూర్చె,ఘోర ప్రమాద మౌర!
జనులు హిమ శిఖరము నెక్కు సాహసమ్ము

మంద పీతాంబర్ చెప్పారు...

గూర్చు జనులకు యాత్రలు కువలయమున
మోదమును; గూర్చె ఘోరప్రమాద మౌర
పెక్కునష్టాలు ,కష్టాలు పెక్కుటిలగ
భరత సైన్యమేకాపాడె భవ్యరీతి !!!

మన తెలుగు చెప్పారు...

కలసి వచ్చిన భార్యతో కాపురంబు
మోదమును గూర్చె; ఘోరప్రమాద మౌర
తప్పెనట, భార్య గయ్యాళి తనము దుర్భ
రమ్ము సోదర! కోరంగ రాదు నెపుడు!

కంది శంకరయ్య చెప్పారు...

లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
వరప్రసాద్ గారూ,
మొత్తంమీద పదిపూరణలు చెప్పారు. ఈరోజు మీలో రచనోత్సాహం పెల్లుబికినట్లుంది. సంతోషం.
3వ పూరణలో ‘రామలక్ష్మణు లట్టి’ అనండి. (నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!)
4వ పూరణ మొదటి పాదంలో యతి తప్పింది. ‘విందునందు వడివడిగ భీముఁ డపుడు’ అందాం.
5వ పూరణలో ‘మున్గు’ టైపాటు వల్ల ‘ముల్గు’ అయినట్టుంది.
8వ పూరణ మొదటి పాదంలో గణదోషం. ‘యమునల’ అంటే సరి.
*
గూడ రఘురామ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘వాహినులలొ’ అని హ్రస్వాంతంగా వ్రాయరాదు. అక్కడ ‘వాహినులను’ అని సప్తమ్యర్థంలో ద్వితీయను వాడవచ్చు.
*
సుబ్బారావు గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. ‘భరణ బ్లాగు’ను ‘భరణము బ్లాగు’ అనండి.
*
‘శీనా’ శ్రీనివాస్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
రాజేశ్వరి అక్కయ్యా,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
*
మంద పీతాంబర్ గారూ,
బాగుంది మీ పూరణ. అభినందనలు.
*
చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.