17, ఆగస్టు 2015, సోమవారం

పద్య రచన - 982

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

18 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

నీలి చిత్రం అంటే
ఏమిటో అనుకున్నా
నీళ్ళ వై 'చిత్రం '
అన్న మాట

శుభోదయం
జిలేబి

subbarao చెప్పారు...

నీలి మబ్బులు గగనాన నిండు కతన
కొండ లన్నియు మఱి యును కువలయమును
వారి సహితము నీ లమై మారె నచట
యెంత యందము ? వర్ణించ యెవరి తరము ?

కంది శంకరయ్య చెప్పారు...

జిలేబీ గారూ,
చాలా కాలానికి ఇటు తొంగిచూశారు. సంతోషం. _/\_.
*****
పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

sailaja చెప్పారు...

సవ్వడి జేసే జలధికి
దవ్వుల నామేఘములకు ధరముల కటుల
న్నెవ్వరు బూసిరి నీలము?
మవ్వపు వర్ణమ్మునవియె మనసే దోచెన్!!!

కంది శంకరయ్య చెప్పారు...

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
*****
వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమ:

అండగ నిల్చి యందరకు నన్నము బెట్టగ నన్నపూర్ణవై
కొండలు జుట్టి వచ్చితివి కోనల సీమల నాదరింపగా
గుండెల నిండ ధైర్యమును గూర్చెడి దానవు నీవు పావనీ!
దండము లందజేసెదను తన్మయ మొందితినమ్మ గౌతమీ.


పాపికొండలు జుట్టి పరవసింపగజేసి
****** రమణీయమైనట్టి ప్రకృతి జూప
నీలంపు గగనమే నీలోన దాగెనా
****** నిండైన వర్ణంబు నీకు కలుగ,
స్వచ్ఛ జలంబుల సాదు తత్వము గల్గి
****** చల్లంగ చూచుచున్ మెల్లగాను
సాగుచుందువు నీవు స్వాగతింతుము మేము
****** సస్యము ల్పండింప శక్తి నీవు!

పావనంబైన గౌతమి పారుచుండ
ధాన్య రాసులు పండును ధరణి లోన
భాగ్యదాయని తానౌచు వరములిడగ
పద్యసుమముల నర్చించి ప్రణతు లిడుదు.

సంపత్ కుమార్ శాస్త్రి చెప్పారు...

గమ్యంబేదియు లేదు గాని బహువేగంబొప్పుచున్ నౌకపై
సామ్యంబో మరి దూరమౌనొ యెఱుగన్ జాలంగనైతిన్ కదా
రమ్యంబౌ సువిశాల సాగర జలారణ్యంబునన్ బ్రోచి మ
త్కామ్యార్థంబులఁ బొందజేయుము హరా! గంగాధరా! శంకరా!

A.Satyanarayana Reddy చెప్పారు...

నీట పరివర్తనముచెంద నింగినుండి
వచ్చిన రవి శిఖలు, నీలి వర్ణమయ్యె
నది జలమ్ములు, ముదమున మదిచెలంగె (మతిపొంగె ముదముతోడ)
సుందరమగు దృశ్య మచట చూడగానె

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.
*****
సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మీ పద్యం చాల బాగుంది. అభినందనలు.
******
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

గగనమున వెలిగెడి కాంతులు
సగభాగంబవని కబ్బి సంద్రము పొంగన్
నిగనిగ లాడెడి కిరణము నీలపు గిరియై
సొగసులు గూర్చుచు కనులకు సుఖమునొ సంగెన్.

కంది శంకరయ్య చెప్పారు...

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
1,3వ పాదలలో గణదోషం. ఒకటవ పాదాన్ని ‘గగనమున వెలుగు కాంతులు’ అనండి. మూడవపాదాన్ని ‘నిగనిగల నీలగిరియై’ అనండి.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

వెన్నెల్లోగోదారిని
వన్నెల్లో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నుల్లో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.
‘వెన్నెల్లో’ అనడం వ్యావహారికం. ‘వెన్నెలలో, వన్నెలలో, కన్నులలో...’ అనండి.

మురళి చెప్పారు...

సీ. నీలాల రాశులు నేలను రాలగ
పాపికొండలమద్య పారుచుండె
పావన గోదారి పాపలు తొలగించి
కోనసీమకుకొత్త సొగసు లిచ్చె
గలగలా పారేటి గోదారి గంగమ్మ
మిలమిలా మెరిసేటి నీలమణుల
నొడినిండ నింపుకొనొయ్యారి నడకతో
తలుకులు మెరయుచు తరగ లెసగ

తే.గీ.తరలి వచ్చిన తల్లిని తనివి తీర
చూడ వేవేల కన్నులుఁ జాలవంత
నీలి వర్ణాల సొబగుల నిన్నుఁ బొగడ
నేను యంతటి వాడిన నీరజాక్షి?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పద్యం:
వెన్నెలలో గోదారిని
వన్నెలలో చూచి మురిసి పరవశమాయెన్!
కన్నులలో కౌముదియై!
యెన్నెన్నో కవితలల్ల నిష్టమ్మాయెన్!

శ్రీపతిశాస్త్రి చెప్పారు...


శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి ఈ పద్యము పై దృశ్యమునకు చక్కని వర్ణన

నీలిజలంబు నీలిధరణీవలయంబు వినీల శైలముల్‌
నీలి తరుప్రపంచములునీలియనంతము - యెందు జూచినన్‌
నీలిమ; నీలిమాకలితనిర్భర కంఠము పిల్చినట్లు నా
నీలిమదేహపంజర వినిర్గతమై పరుగెత్తె నెంతయున్‌.

కంది శంకరయ్య చెప్పారు...

శ్రీపతి శాస్త్రి గారూ,
అనుభూతి ప్రధానమైన కవిత్వాన్ని చెప్పే శేషేంద్ర గారి అద్భుతమైన పద్యాని పరిచయం చేసి ఆనందింపజేసారు. ధన్యవాదాలు.