ఓం గణేశ్వరాయ నమః
శ్రీ విఘ్నేశ్వరు నేకదంతు సుముఖున్ చిన్మూర్తి లంబోదరున్,
దేవారాధ్యు! మునీంద్ర వంద్యుని ! మహాదేవీ ముఖాబ్జార్కునిన్
భావాతీతు దురంత షడ్రిపు హరున్ పాశాంకుశాంచత్కరున్
ధీ వాగ్ధార లనుగ్రహించి సతమున్ దీవించ ప్రార్థించెదన్.
శ్రీదు! సుఖ ప్రసాదు! వర సిద్ధివినాయకు! విఘ్న వారణున్
మోదక హస్తు! దంతిముఖు! మూషక వాహను! నేకదంతు లం
బోదర పాద పద్మములు ముక్తి వధూటికి తావలంబు లం
చాదర మొప్ప గొల్చెద ననంత శుభంబులు గల్గ నియ్యెడన్.
శ్రీకర మాద్య మార్యజన సేవ్యము దివ్య మనంత మచ్యుతం
బేక మహీన మద్భుత మనేకమునై దగు త్వ త్స్వరూపమున్
జేకొని యెల్ల వేళలను చిత్తమునన్ దలపోసి మ్రొక్కు సు
శ్లోకుల బ్రోతు వవ్విధిని జూపుము నీ కృప విఘ్నవారణా!
కరిరాజ వదను! గౌరీ
వరముఖ పద్మార్కు! నాఖు వాహను! లంబో
దరు! విఘ్నవారణున్ శ్రీ
కరు గణపతి భక్తి గొల్తు కైమోడ్పులతో.
విఘ్న తమస్సహస్రకర! విఘ్న మహావనహవ్య వాహనా!
విఘ్న భుజంగ విష్ణురథ! విఘ్న మహోదధి కుంభసంభవా!
విఘ్న మహా గిరీంద్ర పవి! విఘ్న మదేభ మృగేంద్ర! శ్రీ ముఖా!
విఘ్న పయోద మారుత! అభీష్టము దీర్చుమ విఘ్న వారణా!
వినాయక చవితి శుభాకాంక్షలతో….
మద్దూరి రామమూర్తి.
పూణె.