26, సెప్టెంబర్ 2015, శనివారం

సమస్యాపూరణం - 1800 (పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే)

కవిమిత్రులారా!
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.
హమ్మయ్య! సమస్యల సంఖ్య 1800 వందలకు చేరింది. సంతోషం!
మరొక విశేషం... పేజీ వీక్షణల సంఖ్య పది లక్షలు ఎప్పుడు దాటిందో నేను గమనించనే లేదు!

45 కామెంట్‌లు:

  1. నిరంతర సమస్యా కల్పనానల్ప కార్య ధూర్వహులైన శంకరయ్య గారికి - 1800 సమస్యలు సృష్టించడంలో ,వాటిని సమర్థ కవి బృందముతో అవలీలగా పరిష్కరింపజేయడంలో చూపిన నైపుణ్యానికి సాదరాభినందనలతో ---

    ఎలాగూ ' అష్టాదశ సంఖ్యా ప్రాశస్త్యాన్ని ' ఉగ్గడించే పూరణలొస్తాయి కనుక , ఆ జోలికి పోకుండా- స్వీయ శైలికి భిన్నంగా -

    " ఇదిగో ! రారండయ్యా !
    పదిలముగా ' చుక్క అరఁటి ' పండ్లన్ గొనుడీ !
    పది రెండు పండ్ల వెలయా ?
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే ! "

    అంటూ ముగిస్తున్నాను ! ఇతి నతయః !

    రిప్లయితొలగించండి
  2. పదుగురు కొలిచెడి దైవము
    నెదురుగ మనకున్న వారు నెమ్మిని గురువుల్
    పదునగు వందల కవితల
    పదునెనిమిది పదునెనిమిది పదునెని మిదియే
    ------------------------------------
    గురువులు పూజ్యులు శ్రీ శంకరయ్య గారిని " వందలుకాదు వేవేల పద్యములను వ్రాయించ గలరని కోరుతూ ఆశీర్వ దించి అక్క

    రిప్లయితొలగించండి
  3. శంకరయ్య గారికీ , ఇక్కడ పూరణ లో పాల్గొనే పెద్దలందరికీ అభినందనలు .. మరిన్ని పూరణలూ , దత్తపదులూ అప్రతిహతంగా సాగాలని ఆశిస్తున్నాను .. చక్కటి సమస్య . చాలా రోజుల క్రితం ఇలాంటి సమస్య నే ఒకటి విన్నాను . " రెండు రెళ్ళు ఆరు లేక డజను " గరిక పాటి వారికి ఒకానొక అవధానం లో ఇచ్చిన సమస్య .

    రిప్లయితొలగించండి

  4. శంకరాభరణం గ్రూప్ వారిచ్చిన సమస్యకు నాపూరణలు.సమస్య:--
    *పదునెనిమిది పదునెనిమిది పదునెని మిదియే*
    1.కం:పదిలముగా తా వ్రాసెను
    వదలక యెన్నో పురాణ ప్రశస్థ కథల్
    వదలక నెంచిన గలవవి
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    18 పురాణాలు,భారతంలో 18 పర్వములు,భగవద్గీతలో18 అధ్యాయాలు.

    2.కం:వదలక మాచే పట్టుగ
    పదములు గూర్చుచు ముదమున వ్రాయించి తి రె
    వ్విధియైననెంచ వందలు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    రిప్లయితొలగించండి

  5. హృదయపు చప్పుడు వోలెను
    మదికిన్మఱి సంతసంబు మాన్యా ! కలిగే
    పదముల యల్లిక యీ యది
    పదునె నిమది పదునెనిమిది పదునెనిమదియే

    రిప్లయితొలగించండి
  6. మిత్రులందఱకు నమస్సులు!

    ఇదె యష్టాదశ వర్ణన,
    మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి సంఖ్య,
    మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
    బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

    రిప్లయితొలగించండి
  7. నా రెండవ పూరణము:

    పదునౌ సమస్య లివియుం
    బదునెనిమిది వందలయ్యెఁ బరిశీలింపన్
    బదుగు రివి మెచ్చు వందలు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

    రిప్లయితొలగించండి
  8. సదమల! యక్షౌహిణి జె
    ప్పెద పాండవ కౌరవులకు భీకరమగు యా
    కదనమునందున సైన్యము
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే

    రిప్లయితొలగించండి
  9. ముదమున వసించె నొక్కడు
    పదుగురెదుట నాట్యమాడు పడతులఁగనుచున్
    ముదితల మువ్వురి పరువము
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే

    రిప్లయితొలగించండి
  10. నా మూఁడవ పూరణము:

    పదపడి చేయంబోకుఁడు
    పది యేఁడుల పాపల కిల వైవాహికముల్
    సుదతులకుఁ బెండ్లి వయసది
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

    రిప్లయితొలగించండి
  11. సుకవి మిత్రులు V.S.Anjeneyulu Sharma గారూ, మీ రెండు పూరణములును బాగున్నవి. అభినందనలు!

    మీ మొదటి పూరణమునందలి ద్వితీయ పాదమున ’యదుభూషణు’ పదము తదుపరి యర్ధానుస్వార మవసరము లేదు. అందే, తృతీయపాదమున గణభంగమైనది...దానిని..."ముదమిడును" అనిన సరిపోవును.

    ద్వితీయపూరణమున "కొనండి" వ్యావహారికము. దీనిని "కొనుండు" అనిన సరిపోవును.

    అన్యథా భావింపవలదని మనవి.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. పదుగురు మెచ్చుసమస్యలు
    పదునెనిమిది వందలయ్యె భళిభళి బ్లాగున్
    ముదముగ గనరే వందలు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!!!

    రిప్లయితొలగించండి
  13. శంకరయ్యగారూ
    రతిపతి సమస్యలో నేనో సందేహం వెలిబుచ్చేను కాస్త నివృత్తి చేస్తారా

    రిప్లయితొలగించండి
  14. కదనము జరిగిన దినములు
    పదపడు నక్షౌహిణులును పర్వము లెన్నన్
    విదితము భారత మందున
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    రిప్లయితొలగించండి
  15. ముదముగ పురాణములుఁ గనఁ
    బదపడి భారతమునందు పర్వము లెంచన్
    చెదరక తరుణుల వయసట
    పదునెని మిది పదు నెనిమిది పదునెని మిదియే.

    రిప్లయితొలగించండి
  16. ముదమిది కనుగొన బ్లాగను
    కదనములో గల సమస్య సంఖ్యను వినవో
    పదులా కావవి వందలు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయ్యా! విష్ణునందను గారూ! క్షమించాలి. చాలా ఆలస్యంగా చూచాను సున్నితంగా మీరెత్తి చూపిన యతి దోషాన్ని. మీ సూచనే బాగున్నది. అలసత్వానికి క్షంతవ్యుడను.

      తొలగించండి
  17. శంకరాభరణంలో నివ్వబడిన సమస్యల సంఖ్య 1800 కు చేరిన శుభ సందర్భంలో గురువుగారికి, పండితులకు, పెద్దలకు, కవిమిత్రులకు శుభాకాంక్షలు.


    రిప్లయితొలగించండి
  18. శంకరాభరణంలో నివ్వబడిన సమస్యలు 1800 లకు చేరిన శుభ సందర్భంలో గురువుగారికి, పండితులకు, పెద్దలకు, కవిమిత్రులకు శుభాకాంక్షలు.

    పదుగురన వింటిమి పరమ
    పదమే భారత పురాణ భగవధ్గీతల్
    చదివిన బుధులకు, సంఖ్యయు
    పదునెనిమిది, పదునెనిమిది పదునెనిమిదియే!!!

    రిప్లయితొలగించండి
  19. డా. విష్ణునందన్ గారూ,
    నమస్కృతులు. మీవంటి సహృదయ సహచరుల తోడ్పాటు వల్లనే ఈకార్యాన్ని సాధించగలిగాను. మీ సహకారాన్ని ఇలాగే కొనసాగించాలని అభ్యర్థన. ధన్యవాదాలు.
    సాధారణంగా కొన్ని పూరణలు వచ్చిన తర్వాత వాటికంటె భిన్నంగా ఆలోచించాలని చూస్తారు. కాని ఎటువంటి పూరణలు వస్తాయో ముందే ఊహించి, వైవిధ్యమైన పూరణతో శుభారంభాన్ని ఇవ్వడం మీవంటి విజ్ఞులకే చెల్లుతుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    పరుచూరి వంశీ గారూ,
    బహుకాల దర్శనం. సంతోషం! ధన్యవాదాలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    మొదటిపూరణ రెండవపాదంలో గణదోషం. ‘....పురాణ ప్రఖ్యాత కథల్’ అనండి.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కలిగే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘కలిగెన్’ అనండి.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ మూడు పూరణలు వైవిధ్యంగా ఉండి రంజిల్లజేసినవి. అభినందనలు.
    ఆంజనేయులు శర్మ గారి పద్యాలలోని దోషాలను, వాటికి సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘భీకరమగు నా|కదనము...’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    గుండు మధుసూదన్ గారి సూచనలను పాటించండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ప్రయాణంలో ఉండి తరువాత సమాధాన మివ్వాలనుకొని మరచిపోయాను. మన్నించండి.
    ‘ధరణి, ధర, భూమి’ దీర్ఘాంత స్త్రీలింగ పదాలే. వాటిని సమాసాలలో ‘ధరణీసుత, ధరణిసుత, ధరాసుత, ధరసుత, భూమీసుత, భూమిజ’ అనడం ఎలాగో ‘రతిపతి, రతీపతి’ అనడం సరియైనవే.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు మరియు కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు శంకరాభరణం బ్లాగు పదునెనిమిది వందల సమస్యాపూరణములు పూర్తిచేసుకున్న సందర్భంగా అభినందనలు.

    ఇదిగో! తొమ్మిది రెండ్లన?
    పదమూడునకైదుఁగూడ? పాతికలోనన్
    గద! యేడు తీసివేయగ?
    పదునెనిమిది! పదునెనిమిది! పదునెనిమిదియే!

    రిప్లయితొలగించండి
  21. శ్రీగురుభ్యోనమః

    పదునెనిమిది వందలుగా
    పదముల నిడ విస్తరించె పాదుపమటులన్
    ముదమున విరియగ గురువనె
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే
    (పదములు = పద్యపాదములు)

    1800 సమస్యాపూరణలతో నిరాటంకముగా సాగుతున్న శంకరాభరణం బ్లాగునకు శుభాభినందనలు. ఈ సందర్భముగా గురువర్యులు శ్రీమాన్ శ్రీ కంది శంకరయ్య గారికి, శ్రీ చింతా రమకృష్ణా రావుగారికి, శ్రీ ఏల్చూరి మురళీధర్ రావుగారికి, శ్రీ ఆచర్య ఫణీఇద్రగారికి, శ్రీ విష్ణునందన్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.

    స్వర్గీయ శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు.

    ఇది యరువది మాసమ్ముల
    హృదయాంతర మధురభూతి యిష్ఠి యనంగన్
    ముదమొరరించె హవిస్సులు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే
    1800 = 60 నెలలు

    రిప్లయితొలగించండి
  22. టైపాటుల సవరణ

    శ్రీ చింతా రామకృష్ణారావు గారు,
    శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గారూ , మీ సంకల్ప బలం మిన్న అయినది , అందుకే ఆటంకాలనధిగమించి అది సుకవి తతికి పద్య రచనా స్ఫూర్తినందిస్తోంది . ఏతత్ బృహత్కార్య నిర్వహణ నిజంగా ప్రశంసనీయం.

    సుకవి శ్రీ గుండు మధుసూదన్ గారి మధురమైన పూరణల్లో ఒకానొక పూరణలో ఒక చోట సంఖ్యా శబ్దాన్ని సంఖ్యమని అకారాంత నపుంసక లింగముగా అని వాడినట్లున్నారు, ' లెక్క ' అనే అర్థంలో సంఖ్యా శబ్దం నిరంతరాకారాంత స్త్రీ లింగమే ! అకారాంత నపుంసకమైతే యుద్ధమనే రూఢి !

    అలాగే సరస కవి శ్రీ మిస్సన్న గారి " కదనములో గల సమస్య సంఖ్యను వినవో " దగ్గర యతి ప్రతిపాదనార్థం " సదనములో గల సమస్య సంఖ్యను వినవో" అంటే బాగుంటుంది, బ్లాగును ' సదనము ' గా పోల్చుకుంటే మరింత ప్రశాంతంగా కూడా ఉంటుంది - లేదా వారి ' ఊహ శక్తి ' ( ఊహా శక్తి కాదు, ఊహ అకారాంత నపుంసకమే , ఆకారాంతం కాదు , ఊహా శక్తి అని వ్రాస్తారు కాని అది కూడదు ) ననుసరించి మరేదైనా రీతిలో మార్చినా సరిపోతుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. అయ్యా! విష్ణునందను గారూ! క్షమించాలి. చాలా ఆలస్యంగా చూచాను సున్నితంగా మీరెత్తి చూపిన యతి దోషాన్ని. మీ సూచనే బాగున్నది. అలసత్వానికి క్షంతవ్యుడను.

      తొలగించండి

  24. గురువుగారికి నమస్కారం. నా ఈ క్రింది పూరణను పరిశీలించి దోషములు తెలుపగలరు.
    కం. ముదమున వోటును వేయుట,
    పదనుగ చోదన కనుమతి పడయగ హెచ్చౌ
    ముదమిడు ప్రాయము యువతకు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    రిప్లయితొలగించండి
  25. తెలుగు మాట్లాడడమే అరుదవుతున్న ఈ కాలంలో ఇంత అందంగా పద్యరచనల బ్లాగ్ నిర్వహించడం, దానిలో ఇంతమంధి సుకవిమితృలు, పండితులు, పెద్దలూ పాలు పంచుకోవడం చూస్తే ఎంతో ఆనందంగా ఉంది గురువుగారు. దీనివెనకున్న మీ కృషీ, పట్టుదలా, విజ్ఞానమూ అసామాన్యమైనవి. మీకు అభినందనలు, అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో నేనూ పాలు పంచుకోవడం నాకు మహదానందం.

    రిప్లయితొలగించండి
  26. సుకవి మిత్రులు డా.విష్ణునందన్ గారు నా మొదటి పూరణమున "సంఖ్యమ్ము" గూర్చిన వ్యాకరణాంశమునుం దెలిపినందులకు ధన్యవాదములు.

    నేను "సంఖ్యమ్ము" వ్రాయునపుడు నా మదిలో నొక యలంకారనామము "యథాసంఖ్యము" మెదలినది. అందుచేతనే యా ప్రయోగమిటుల దొరలినది. సవరించుచుంటిని.

    కాని, యొక సందేహము..."యథాసంఖ్యము" మువర్ణాంతముగ నున్నది కదా...ఎందులకు? సంస్కృత వ్యాకరణమున నంతగా ప్రవేశము లేమి నిటుల సందేహము వొడముచున్నది. సమాధాన మెవరికైనఁ దెలిసినచోఁ దెలుపగలరు.

    సవరించిన నా పూరణము:

    ఇదె యష్టాదశ వర్ణన,
    మిదె తత్సంఖ్యా పురాణ, మిదె స్మృతి గణణ,
    మ్మిది ధాన్య, జాతి, విద్యయుఁ
    బదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  27. వి. యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    ధన్యవాదాలు
    గుండు మధుసూదన్ గారి సూచనలు పాటించి సవరించినందుకు సంతోషం.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    ధన్యవాదాలు.
    సంఖ్యాశాస్త్ర సంబంధమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు. పూజ్యులు నేమాని వారిని స్మరించి వారి వాత్సల్యాన్ని గుర్తుకు తెచ్చారు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    వేదుల సుభద్ర గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పదహారు వయసుకంటెను
    పదనెనిమిది యవ్వనంబు బహుతీపియగున్
    పదిలము భవిష్య మనుకొన
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే!

    రిప్లయితొలగించండి
  29. శ్రీ కంది శంకరయ్య గారూ మీ బ్లాగు అప్రతిహతంగా పదునెనిమిది వందల ఛందోబద్ధ పద్య పూరణలు పూర్తి చేసుకొన్నందుకు, సారథిగా మీకు, కవి పండిత మేధావి బృందానికి హార్దిక శుభాభినందనలు

    రిప్లయితొలగించండి
  30. శ్రీ కంది శంకరయ్య గారూ మీ బ్లాగు అప్రతిహతంగా పదునెనిమిది వందల ఛందోబద్ధ పద్య పూరణలు పూర్తి చేసుకొన్నందుకు, సారథిగా మీకు, కవి పండిత మేధావి బృందానికి హార్దిక శుభాభినందనలు

    రిప్లయితొలగించండి
  31. పదికినెనిమిదిని కలిపిన
    పదమూడుకునైదు కలుప వచ్చునదొకటే
    పదునెనిమిది పదునెనిమిది
    పదునెనిమిదియేర యింక వాదించకురా

    రిప్లయితొలగించండి
  32. .కుదురుగసంక్యలి టన్ జూ
    పదు|”నెనిమిది,పదునెనిమిది”పదునెనిమిదియే
    వదలిన?లెక్కలు జేయుట
    కుదురదు.సెల్ఫోనునందు కోరురిపేరీ

    రిప్లయితొలగించండి
  33. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    *****
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    వైవిధ్యంగా చెప్పాలన్న మీ ప్రయత్నం కొంతవరకు ఫలించింది. బాగుంది. అభినందనలు.
    ‘చూపదు+ఎనిమిది’ అన్నప్పుడు చూప దెనిమిది అవుతుంది కాని చూపదు నెనిమిది కాదు.

    రిప్లయితొలగించండి
  34. శంకరయ్యగారూ. మీ సమాధానం నాకు సంతృప్తినివ్వలేదు

    రిప్లయితొలగించండి
  35. కొదవయె లేదిట కవులకు,
    చదువుల తల్లియు నొసగెను చక్కటి వరముల్,
    పది' యింత' లగును; వందలు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే?

    రిప్లయితొలగించండి
  36. మాన్య కవిపండితులు శ్రీ కంది శంకరయ్య గారికి, సాదర ప్రణిపాతములు. మీ వివరణ సరైనదే - "రతీపతి" అనవచ్చు, "రతి పతి" అని కూడా అనవచ్చును. అది ఎందుకు , యెలా అని వివరిస్తే చాలు. అయితే ఈ ప్రశ్న కొంచెం ' సుదీర్ఘ వివరణము" కోరుతుంది. అలాగే సంస్కృతాంధ్ర భాషల మూలాల్లోకి వెళ్లవలసి వస్తుంది. విషయావగాహన చేసుకుంటూ సావధానంగా ముందుకు వెళ్తే కఠినమైన యీ ప్రశ్నకు అంతే సులువైన సమాధానం లభిస్తుంది. నా తోచినంత వివరించే ప్రయత్నమిది.

    దేశభాషల్లో తెలుగు భాష ఒక అద్భుతమైన భాష. ఆంధ్ర భాష మీద సంస్కృత భాషా ప్రభావం ఒకవిధంగా దీని బలమూ, ఒక విధంగా బలహీనతా (ఇదిగో ఇలాంటి చిక్కులెదురైనప్పుడు).

    మన భాష - అచ్చ తెనుగు, తత్సమ , తద్భవాలనే సహజాలంకారాలతో ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రస్తుత విషయంలో తద్భవ శబ్ద ప్రాధాన్యం స్వల్పం కనుక దాని జోలికి పోకుండా- తత్సమం గురించి మాత్రం అనుకుంటే సరిపోతుంది. సంస్కృతం తత్సమమై తెలుగులోకి ఎలా ప్రవహించిందీ ఈ వివరణకు నేపథ్యంగా ఉంటుంది.

    సంస్కృత ఈకారాంత , ఆకారాంత శబ్దాలు "తెలుగు భాషలోకి" దిగుమతి అయితే "తత్తుల్యములై", "తత్సమము"లవుతాయి. ఆ విధంగా అవి తత్సమములైనప్పుడు దీర్ఘం కోల్పోయి హ్రస్వాంతాలవుతాయి.(విద్యా - విద్య , రాధా - రాధ , లక్ష్మీ - లక్ష్మి , వాణీ - వాణి , గౌరీ - గౌరి , పృథ్వీ - పృథ్వి , ధరణీ - ధరణి మొదలుగా).

    సంస్కృతంలో అకారాంత , ఇకారాంత , ఉకారాంత పుంలింగాలైతే తెలుగులోకి దిగుమతై తత్సమములైనప్పుడు విసర్గ కోల్పోతాయి. ( రామః - రాముడు , హరిః - హరి , శంభుః - శంభుడు మొదలుగా).

    అకారాంత నపుంసక లింగాలైతే , తెలుగులోకి దిగుమతై తత్సమములైనప్పుడు హలంతం విడనాడి అజంతములవుతాయి ( వనం - వనము , అరణ్యం - అరణ్యము ఇత్యాది )

    ఈ నేపథ్యంతో - ముందుకు వెళ్తే - "రతీపతి" అన్న పదం యే భాష ? సంస్కృతమా? కాదు. తెలుగే! ( తత్సమం). "రతీ పతిః" అన్న సంస్కృత పదం తత్సమమై , విసర్గను కోల్పోయి రతీపతి అయ్యింది . "రతీ పతిః " అన్న సంస్కృత సమాసంలో రెండు పదాలూ (రతీ మరియు పతిః) వాటి వాటి స్వస్వరూపాలలో ఉండడం గమనించవచ్చు ( రతీ - ఆకారాంత స్త్రీలింగం & పతిః - ఇకారాంత పుంలింగం ) . శుద్ధ సంస్కృత పదమైన "రతీపతిః" విసర్గ కోల్పోయి తత్సమమై "రతీపతి" అయ్యింది - ఇది ఒక రూపం . ( లక్ష్మీ పతిః (సం) - లక్ష్మీ పతి (తత్సమం) , గౌరీపతిః (సం) - గౌరీపతి (తత్సమం) - మిగిలిన రూపాలన్నీ ఇలాగే అర్థం చేసుకోగలరు)

    పైనుదహరించినది "రతీపతిః" అన్న సంస్కృత రూపం - తత్సమమైనప్పటి సంగతి. మరి అందులో ఉన్న రెండు పదాలు అనగా - "రతీ" మరియు పతిః" అనే రెండు పదాలు కూడా వేటికవే తత్సమాలైతే వాటి సంగతేమిటి ? పైన చెప్పినట్లు ఆకారాంత స్త్రీలింగమైన "రతీ" శబ్దం తన దీర్ఘాన్ని కోల్పోయి ,తత్సమమై "రతి" అవుతుంది . అలాగే "పతిః" అన్న ఇకారాంత పుంలింగ శబ్దం తత్సమమై విసర్గను విడనాడి "పతి" అయ్యింది. మరి తెలుగులో "తత్సమ రూపంలో" రెండు పదాలు ఇప్పుడు సిద్ధమయ్యాయి - రతి , పతి అంటూ.

    అలాంటి ఆ రెండు తెలుగు పదాలను ఒక్కచోటకు చేరిస్తే సిద్ధించిన రూపమే "రతి పతి" . ఇందులో రతికి దీర్ఘం లేదు ఎందుకంటే అది తత్సమం కాబట్టి. ఈవిధంగా మిగిలిన అన్ని రూపాలకు ఆయా తత్సమ శబ్దాలు సిద్ధిస్తాయి.

    ఏతావాతా చెప్పొచ్చేదేమంటే - "రతీపతిః" అన్న సంస్కృతానికి తత్సమం "రతీపతి"

    ముందుగానే తత్సమ రూపాలుగా ఏర్పడిన రతి మరియు పతి కలిసినప్పుడు ఏర్పడిన సమాసం " రతి పతి" . రెండూ సరైనవే !

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  37. ఇదిగో చెప్పెద వయసే
    మదినెంచగ నోటుహక్కు, మైనరు దాటన్
    అది పెండ్లికి దాట వలయు
    పదునెనిమిది పదునెనిమిది పదునెనిమిదియే.

    రిప్లయితొలగించండి
  38. డాక్టర్ విష్ణునందన్ గారికి ధన్యవాదములు.
    గతములో శంకరాభరణములో అవనిజాత, నదిసుత ప్రయోగాల గురింఛి, పండిత నేమాని వారికి, శ్యామల రావు గారికి, డా. ఆచార్య ఫణీంద్రగారికి మధ్య కొంత చర్చ జరిగినది.
    ఔత్సాహికులకు ఉపయోగకరముగా ఉండవచ్చని ఇక్కడ లంకెనిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  39. శ్రీ శంకరయ్య గురువు గారికి,
    నమస్కారములు, ధన్యవాదములు,
    డా విష్ణునందన్ గారు చెప్పిన, పైన కనబడుతున్న శ్లోకాన్ని ఈ సందర్భం గా మరోసారి మననం చేసుకుంటున్నాను.
    ఈ సాహితీ ప్రక్రియను సుసంపన్నం చేస్తున్న అందఱలకూ ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  40. ' ఊకదంపుడు ' గారికి ధన్యవాదాలు, మీరిచ్చిన ' రెఫరెన్స్ ' చూశాను. అప్పుడు నేను ఆ చర్చలో పాల్గొనలేదు కానీ , అక్కడ ఉదహరించిన ఆయా పదాలు కూడా పై చెప్పిన సూత్రానికి లోబడి తయారైనవే! వింతేమీ లేదు .

    నదీ (సంస్కృతం) - నది ( తత్సమం) ; సుతా (సం) - సుత (తత్సమం) కనుక "నదీ సుతా" అనేది ఆకారాంత స్త్రీలింగం ....ఈ మొత్తం పదం తత్సమంగా కావాలంటే "నదీ సుత" అయ్యింది.

    రెండు విభిన్న తత్సమాలు "నది" మరియు "సుత" కలిస్తే "నది సుత" అయ్యింది. రెండూ ఒప్పిదాలే ! "అవనీజాత" , అవనిజాత" ఇత్యాదులునూ అంతే !

    " తత్సమ రూపమేవ శరణ్యం" !

    రిప్లయితొలగించండి
  41. ధన్యోహం డాక్టర్ విష్ణు నందన్ గారూ

    రిప్లయితొలగించండి
  42. అయ్యా! విష్ణునందను గారూ! క్షమించాలి. చాలా ఆలస్యంగా చూచాను సున్నితంగా మీరెత్తి చూపిన యతి దోషాన్ని. మీ సూచనే బాగున్నది. అలస్త్వానికి క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి