19, సెప్టెంబర్ 2015, శనివారం

పద్య రచన - 1011

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. కలువలు నిండిన తటమున
    వెలుగులు విరజిమ్ము నంట వెన్నెల దొరయౌ
    కులుకుచు గుసగుస లాడగ
    వలపుల వలవేయ నెంచె వయ్యా రమునన్

    రిప్లయితొలగించండి

  2. నీటిలోని పూవు నీరెండ పడినంత
    దరహసించు రీతి తారసిల్లు
    మురిసి పోవు జలజ మురిపెంబు తో తాను
    యినుడు నస్త మింప యిలను జూచు.
    2.తరణి బింబముగన తనువెల్ల పులకించు
    జలము నందె యుండి కులుకు చూపు
    యిను డస్త మింప యిలవైపు దల వాల్చు
    నుత్తమ సతి వోలె నుర్వి యందు.

    రిప్లయితొలగించండి
  3. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
    మొదటి పద్యంలో ‘మురిపెంబుతోడ తా| నినుడు నస్తమింప నిలను జూచు’ అనండి.
    రెండవ పద్యంలో ‘కులుకు చూపు| నినుడు నస్తమింప నిలవైపు దలవాల్చు| నుత్తమ సతివోలె యుర్చియందు’ అనండి.

    రిప్లయితొలగించండి
  4. కాన రావు నేడు కమనీయ దృశ్యాలు
    కలల లోనె మనము గాంచ గలము
    పర్య వరణ మంత పాడవ ధరణిన
    జనుల భవిత దలచ జల్లు మనియె!

    రిప్లయితొలగించండి
  5. టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ధరణిని’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. అందమైన కాసారము లనవరతము
    శోభఁగూర్చునిచ్చలముగ చూపరులకు
    చెరువు లాక్రమించి బ్రజల కొరకటంచు
    ప్రకృతిఁజెడగొట్టుచుండిరి స్వార్థపరులు

    రిప్లయితొలగించండి
  7. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. పోచిరాజు సుబ్బారావు గారు చెప్పారు

    రంగు రంగుల కాంతిని రంగ రించి
    కలువ పూలతో చెఱువది కానిపించె
    ప్రకృతి మాత యందమచట ప్రస్పుటముగ
    ద్యోత మయ్యెను జూడుడు తోయలార!

    రిప్లయితొలగించండి
  9. అరవిరిసినట్టి సరసిజాలంద మొలుక
    సోయగాలతోడ సరసు సొబగు లీనె
    సరస హృదయుల హృదయాలు పరవశింప
    జేయుచున్నట్టి యద్భుత చిత్రమిదియు

    రిప్లయితొలగించండి
  10. న్యాస తటీ నగరాజ వి
    లాసితమున్ స్వాదుతర జలాశయ రాజున్
    భాసిత కోకనదాశ్రిత
    కాసారమునట గనుండు కడుముద కరమున్

    రిప్లయితొలగించండి
  11. తెలివెన్నెల చిలికించుచు
    చెలువల నుడికించు హిముని చేతలు గనుచున్
    కిలకిల నగవుల మురియుచు
    గలువలు వికసించె నదివొ కాసారమునన్ !!!

    రిప్లయితొలగించండి
  12. భూసారపు నర్సయ్య గారూ,
    మీ పద్యాలు రెండూ బాగున్నవి. అభినందనలు.
    ‘నీటఁ బుట్టి పూతయై...’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పద్యం మనొహరంగా ఉంది. అభినందనలు.
    ‘కడు ముద మొసగున్’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. శ్రీగురుభ్యోనమః

    ధరణీమండల సోయగమ్ము గనగా దర్పంబునన్వచ్చుచోన్
    హరితంబయ్యెను తూర్పు తీరమున సంధ్యా కాంతులుప్పొంగగా
    మురిసెన్ మిత్రుని గాంచినంతటనె సమ్మోహమ్మునన్ ప్రేమతోన్
    విరబూసె న్నరుణారవిందములు తావిన్ దేనెలన్ బంచుచున్

    రిప్లయితొలగించండి
  14. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పద్యం మధురమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. ఆకులచీరగట్టి మరియాదగు షోకునుదాచిబెట్టి మా
    రాకులు కాడబెంచియు పరాకును మాన్పగ పూలరంగులున్
    లోకులు మెచ్చురీతిగను లోపములేకను చూడముచ్చటై
    మీ కనుపాపలో బెరుగు మీరటు వెళ్ళిన నీటిపుష్పముల్|

    రిప్లయితొలగించండి
  16. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు.
    “కడుముద కరమున్” కూడ చెరువు కు వేశేషణము కావాలని అలా వ్రాసాను.

    రిప్లయితొలగించండి
  17. పరవశ మందజేయగల భావన భాగ్యము పంచనేంచియో
    అరుదగు నద్భుతంబునిడు యంశములుంచగ చాయ చిత్రమో?
    మరువని సృష్టి,పుష్టికివి మాత్రమె గాదని దేల్ప బూనియో
    విరిసిన యంద చందముల విజ్ఞత మాదని జూపె పుష్పముల్

    రిప్లయితొలగించండి
  18. కవిమిత్రులందరకు నమస్కారములు.

    బురదనీటఁబుట్టిపూతయైయుండెడి
    కెంపు కలువసొంపులింపునింపు;
    మంచిజీవితమ్ము కొంచమైననుఁజాలు,
    మనిషిబ్రతుకవలయు మంచిబ్రతుకు.

    ఆపదలుఁగలిగిననధిగమించు ఘనుడు
    వెతలఁజెందుఁ గాని వెరవడెపుడు;
    నీరుపెరుగుకొలది నీటిపైఁదేలదా
    నీటమునగకుండ నీరజమ్ము.

    రిప్లయితొలగించండి
  19. మామది మెచ్చెడు వేళకు
    కౌముదులన్ దెచ్చు నంచు కలువలు కొలనిన్
    కోమలమౌ వదనమ్ముల
    మామను జూడంగ విచ్చె మధురిమఁ బంచన్

    రిప్లయితొలగించండి
  20. గురుదేవులకు ప్రణామములు. నిన్నటి పద్యరచన పరిశీలించ మనవి.

    కురునృప పాండునందను లకుంఠిత నమ్మిక తోడ మీరలు
    న్నిరతము వారిసేమముల నెంచుటచే సగభాగమీయగన్
    మరిమరి కోరి దూతగను మమ్ములబంపరి సంధిజేయగన్
    సరిపడదన్న నైదుగురు చాలు పురమ్ముల నైద టంచుచున్

    రిప్లయితొలగించండి
  21. మిత్రులందఱకు నమస్సులు!

    ఆ.వె.
    భానుఁ డుదయ మందె! భామినీ నవ్య ప
    ద్మమ్ము వికసనమునఁ దగ హసించె!
    రమ్యమైన యట్టి రంగస్థలమ్మదె;
    భాను భామినులకుఁ బ్రణయ కేళి!(1)

    తే.గీ.
    పత్ర రచిత వలయ శుభ ప్రాంగణమున
    సూత్రధారుండు సూర్యుండు సుప్రభాత
    గీతములు పాడ నేతెంచె కేళి కొఱకు!
    రమణి ముఖపద్మము విరిసె రమణుఁ జూచి!!(2)

    కం.
    రమణి యఁట జలేజాతము;
    సుమనోహర సూత్రధారి సూర్యుం డటకున్
    రమణీయముగా ప్రణిధా
    నము సేయఁగ బిడియమందె నళినమ్మపుడున్!(3)


    తే.గీ.
    రమణుఁ డంతట నునుముద్దు రమణి కిడఁగ,
    ముఖము విప్పారె; సొబగులు మురిపెము లిడె!
    ప్రకృతి కాంతాస్య మోహన రాగ యతికిఁ
    జూపఱ సరసిక హృదయ సుమము విరిసె!!(4)

    కం.
    రమణీయ దృశ్యకావ్యము
    కమనీయముగానుఁ దోచుఁ గవి మిత్రులకున్!
    సమయమ్మిదె వర్ణన మిడ
    సుమనోహర రక్తవర్ణ సుమ సరసి కడన్!!(5)

    రిప్లయితొలగించండి
  22. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘మరియాద+అగు’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘మరియాదకు’ అన్నా సరిపోతుంది.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    ‘ముద కరము’ అన్న సమాసం దుష్టం.అందుకే ఆ సవరణ సూచించాను.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది అభినందనలు.
    నిన్న శీర్షికకు చెందిన పద్యం కూడా బాగుంది.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ లఘు ఖండకృతి మనోహరంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీ సవరణకు కృతజ్నతలు.

    రిప్లయితొలగించండి