17, సెప్టెంబర్ 2015, గురువారం

సమస్యా పూరణం - 1791 (ఏకదంతుని వాహన మెలుక కాదు)

వినాయక చవితి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
ఏకదంతుని వాహన మెలుక కాదు.

31 కామెంట్‌లు:

  1. మిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు !

    శంకరార్యా ! ధన్యవాదములు !

    మీరు చెప్పిన టూల్ ఇనిస్టాల్ చేసాను !

    ఇది నేరుగా టైప్ చేసి పోస్ట్ చేసినదే !

    రిప్లయితొలగించండి
  2. తే.గీ: గరిక,పత్రి పూజ గొనెడి గజముఖుండు
    భక్తి తోడను జేసెడి భజన మెచ్చు
    ఏకదంతుని వాహన మెలుక, కాదు
    కాదనెడి వారి నిలయందు గాంచ గలమె.

    రిప్లయితొలగించండి
  3. చవితిరోజున నేతెంచి చక్కగాను
    కుడుములుండ్రాళ్లుఁబ్రీతితో కోరికుడుచు
    యేకదంతుని వాహన మెలుక, కాదు
    నెమలి, స్కంధు వాహనమది నిశ్చయముగ

    రిప్లయితొలగించండి
  4. సోదర సోదరీ మణు లందరికీ [గురువు గారికీ ]
    వినాయక చవితి శుభా కాంక్షలు .
    --------------------------
    పశువు పక్షియు జంతువు పైన దిరుగు
    సురలు వరముల నీయగ సుకృ తమున
    ఏకదంతుని వాహన మెలుక కాదు
    కాదు కాదను వారిని గాంచ మిలను

    రిప్లయితొలగించండి
  5. వసంత కిశోర్ గారూ,
    సంతోషం! శుభోదయం... వినాయక చవితి శుభాకాంక్షలు!
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్న్దది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సుకృతమున’ అన్నప్పుడు ‘సు’ గురువు కాదు. అందువలన గణదోషం. ‘శుభము లొసగు| నేకదంతుని...’ అనండి.

    రిప్లయితొలగించండి
  6. పూజ్య గురుదేవులకు,కవిమిత్రులందరికీ వినాయక చతుర్ధి శుభాకాంక్షలు...

    పార్వతీదేవి తనయుడు పర్శుపాణి
    విజయము లొసగు గణపతి విఘ్నహారి
    యేకదంతుని వాహన మెలుక, కాదు
    కాదని యనిన సత్యమ్ము కల్ల యగునె!!!

    రిప్లయితొలగించండి
  7. గురువు గారికి మరియు కవిమిత్రు లెల్లరులకు నమస్కార యుక్త వినాయక చవితి శుభాకాంక్షలు

    వదన మనుచోటఁ దప్పుగ వాహనమని
    గ్రంథ మందున యుండగఁ గాంచి యొకడు
    ఏక దంతుని వాహన మెలుక కాదు
    ఏనుగనుచును వాదింప నేమి చెబుదు

    రిప్లయితొలగించండి
  8. శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పరశుపాణి’ అనండి.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. ఏనువంతటి గణనాధుడెక్కితిరుగ
    చుంచు, చిట్టెలుకలశక్తి కొంచెముగద!
    ఏకదంతుని వాహనమెలుకకాదు
    భారమవలీలగా మోయు పందికొక్కు

    రిప్లయితొలగించండి
  10. ఏకదంతుని వాహన మెలుక, కాదు
    పొగడ శక్యంబు నేరికిం బుడమిఁ దాన
    నింధ్యుడతులిత భక్తుడు నిత్య శుభ ప్ర
    దాయి కనుగుంజెలుడుఁ బ్రీతిఁ దలతు నతని.

    రిప్లయితొలగించండి

  11. శ్రీగురుభ్యోనమః

    తెలుగు విద్యార్థి తెలుపుచున్ జెప్పె నంత
    "యేకదంతుని వాహన మెలుక" "కాదు,
    మూషికమ్మ"మె సంస్కృత ముద్దు పట్టి
    భాష యేదైన నేమి తత్భావ మొకటె.

    రిప్లయితొలగించండి
  12. గురువర్యులకు, కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు

    రిప్లయితొలగించండి
  13. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పోవు నారోగ్య మన్నను పొగను పీల్చి
    మద్య పానము మితిమీర మతి చలించ
    పలికె నొక్కడు ఖలుడు సెబా సనంగ
    ఏకదంతుని వాహన మెలుక కాదు.

    చిత్ర కారుడు చెక్కిన శిల్పము గని
    యే(ఏ)కదంతుని వాహన మెలుక గాదు
    ఖనకమని బల్కె మేటరి కవి వరుండు
    మూషికమ్మును జూపెను మూగయొకడు

    రిప్లయితొలగించండి
  14. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘సంస్కృత ముద్దుపట్టి’ అని సమాసం చేయరాదు కదా! ‘సంస్కృత బోధకుండు’ అందామా?
    *****
    భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. గురుదేవులకు , కవిమిత్రులకు మరియు బ్లాగు వీక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.

    వీధి చివరన ప్రతిమలో విఘ్నపతియె
    కరివరదుని వాహనమగు గ్రద్దనెక్క
    ఏకదంతుని వాహన మెలుక కాదు
    డేగ యంచును బల్కెనో డింభకుండు!

    రిప్లయితొలగించండి
  16. వినడు పెద్దల మాటలు కనడు తాను
    ఘనపురాణేతిహాసాల గ్రంథములను
    వాదనలజేయు వెంగలి పలుకునిట్లు
    ఏకదంతుని వాహన మెలుక కాదు.

    రిప్లయితొలగించండి
  17. ఏకదంతుడు మాయింటి యెదుటి వాడు
    మంచి రూపమ్ము కరిముఖ మసలు కాదు
    మారుతీ కారు గలదులే మీరు జూడ
    ఏకదంతుని వాహన మెలుక కాదు.

    రిప్లయితొలగించండి
  18. గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గోలి హనుమచ్చాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  19. ఏక దంతుని వాహన మెలుకగాదు
    ననుట కే సాక్ష్యమేలేదు ఆర్యులంత
    తెలియ జేసిన కథగాన విలువ లుంచి
    పూజ జేయుడి చవితికి పుణ్య మబ్బు|
    2.మనసు నేకాగ్ర తందున మరలి నపుడు
    భక్త వర్యులమనసు ఓ శక్తిగాగ?
    ఎరుక యనునట్టి ఎలుకను నెక్కగలుగ
    ఏక దంతుని వాహన మెలుక గాదు|

    రిప్లయితొలగించండి
  20. లంకా గిరిధర్ గారి పూరణ (ముఖపుస్తకం ద్వారా).....

    పుణ్యనదు లందు స్నానము పూర్తిజేసి
    షణ్ముఖుని కంటె ముందుగ జనిన వాని
    కండ నారాయణశ్లోక మంతె గాని
    ఏకదంతుని వాహన మెలుక గాదు

    రిప్లయితొలగించండి

  21. ఏక దంతుని వాహన మెలుక, కాదు
    నా న ననగను భావ్యమే నార సింహ !
    యెలుక యే వాహ నము గద యీ శు సుతున
    కు మఱి సంశయ మువలదు కొంచె మైన


    రిప్లయితొలగించండి

  22. భరతదేశాన హిందువుల్ వ్రతమొనర్చి
    విఘ్నముల్ బాపుకొనుటకు వేడు కొందు
    రేకదంతుని. వాహన మెలుక కాదు
    వారి కోర్కెలు దీరగ వరము లిడగ

    రిప్లయితొలగించండి
  23. మిత్రులందఱకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు!

    (యుద్ధమున నేకదంతమునుం బ్రయోగించఁగా, దంతపుఁబోటులకుం దాళలేక మూషికాసురుఁడు విఘ్నేశ్వరు[ని దంతము]నకు "నేకదంతుని వాహనముగ నుందు"నని వాగ్దానముం జేసిన వృత్తాంతము నిట ననుసంధానించుకొనునది)

    మూషికాసురుఁ డానాఁడు మూర్ఛఁజెంది
    బాధతోడుత నీ రీతి బాససేసె
    "నేకదంతుని వాహన మెలుకగా", దు
    రంత దుఃఖమిడెడి యేకదంతమునకు!

    రిప్లయితొలగించండి
  24. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘కాదు+ననుట=కా దనుట’ అవుతుంది. ‘లేదు+ఆర్యులు’ అన్నపుడు సంధి నిత్యం. మీరు విసంధిగా వ్రాసారు.
    *****
    లంకా గిరిధర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కాదు| నాన ననగను..’ అర్థం కాలేదు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    వైవిద్యమైన విరుపుతో చక్కని పూరణ నందించారు. చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  25. ఏకదంతుని వాహన మెలుక కాదు
    ఖైరతాబాదు నుండిక మారుమ్రోగి
    ప్రజల నాట్యమాడించుచు బయలుదేరి
    టాంకు బండుకు పోవంగ ట్రాక్టరదియె!

    రిప్లయితొలగించండి