17, సెప్టెంబర్ 2015, గురువారం

పద్య రచన - 1010

వినాయక చవితి శుభాకాంక్షలు!
కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

34 కామెంట్‌లు:

 1. కొలుతును భక్తిగ స్వామీ
  తొలివందనమిడుచు నిన్ను స్తోత్రించెద నే
  తొలగించుము విఘ్నమ్ముల
  కలిగించుము సుఖము శాంతి గణపతి దేవా

  రిప్లయితొలగించండి
 2. మనపతి సురపతి విద్యా
  ధనముల కధిపతి జనముల దయతో బ్రోచే
  జనపతి పశుపతి సుతుడే
  గణపతి జగముల కధిపతి గజముఖ రెడున్

  మా కొరకిల లో వెలసిన
  శ్రీకర మందార రార శ్రీగణ నాథా
  శ్రీకరమౌ నీ నామము
  సాకల్యమె మాకు యెపుడు సాహితి వరదా

  తరుణీమతల్లి లలితా
  పరమేశ్వరి నలుగు తోడ బాలుని రూపమ్
  మురిపము తో నొనగూర్చగ
  విరిసిన నీ రూపమదియె విఘ్నేశ్వరుడా

  రిప్లయితొలగించండి
 3. కరిముఖ వరదుడ వగునిను
  మరువక పూజింతు నయ్య మాలూరము లన్
  పరమేశు డైన తొలుతన
  మురిపము గాకోరునంట భూరి వరమ్ముల్

  రిప్లయితొలగించండి
 4. కాటిఱేని పుత్ర కరిముఖ నినుఁగొల్తు
  భక్తితోడుతనను రక్తితోడ
  విఘ్నములను బాపి విజయముల్గలిగించు
  మనవరతము నాకునంభసుతుడ

  రిప్లయితొలగించండి
 5. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘బ్రోచే’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. ‘దయ బ్రోచెడి యా| జనపతి...’ అనండి. ‘గజముఖ రేడు’ అని సమాసం చేయరాదు. అక్కడ ‘గజవదనుండౌ/ గజవదనుండే’ అనండి.
  రెండవపద్యంలో ‘మాకు నెపుడు’ అనండి.
  మూడవపద్యంలో ‘రూపమ్’ అని హలంతంగా ప్రయోగించారు. అక్కడ ‘బాలునిగా నిన్| మురిపెముతో...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘నాకు నంభసుతుడ’ అన్నచోట ‘నాకు నాంబికేయ’ అనండి.

  రిప్లయితొలగించండి

 6. 1.ఆ.వె:శరణు శరణు నీకు శంకర సుతనయా
  చరణముల నుతింతు చదువు లొసగు
  ఉడుపతి నిను జూచి యుడికించె గావున
  శాపగ్రస్తుడయ్యె చవితి నాడు.
  2.ఆ.వె:ఆది పూజితుడవు నాఖువాహనుడవు
  కుక్షి నిండ నీకు కుడుము లిడుదు
  కరిముఖ గణపయ్య కాపాడు కరుణతో
  విన్న వించు కొందు విఘ్న రాజ.

  3.ఆ.వె:ఏక దంత నిన్ను నేమరక కొలిచెద
  వక్రతుండమాకు వరము లొసగు
  గణముల కధిపతివి కరిరాజ ముఖుడవు
  సన్నుతింతు నయ్య సంతసాన.
  4ఆ.వె:వ్యాస ప్రోక్త మైన భాగవతాదులన్
  రచన చేసితీవు రమణ తోడ
  నదియె నేటి కిలను నారాధ్య గ్రంథము
  అందుకొనుము జోత లంబ పుత్ర.
  5.ఆ.వె:గౌరి బొమ్మఁజేసి గారాబము ను జూపి
  పెంచు కొనుచు నుండె ప్రేమ తోడ
  దారి కడ్డు పడ్డ తనయుని శిరమును
  భవుడు నరికె నపుడె పాలుమాలి
  6.ఆ.వె:అంబరాధిపుడవు యగజేశు సుతుడవు
  అర్థి తోడ గొల్తు రవని జనులు
  అగ్ర పూజ నీదె యఖిల గణాధిపా
  తప్పు లన్ని దిద్ది దారి జూపు.
  7.ఆ.వె:తల్లి కోర్కె తీర్చ తపమొనర్చి శివుని
  యాత్మ లింగముగొని యరుగు చుండ
  దానినందు కొనుచు ధరణిపై బెట్టిన
  బాల రూపు డీవె భవ్య చరిత.
  8ఆ.వె:వామదేవ తనయ వాసిగా నిను గొల్తు
  వేడు చుంటి నయ్య విజయ మొసగు
  కోరి కొలుతు మయ్య గుంజిళ్ళు తీయుచు
  కోర్కె లన్ని దీర్చు గుజ్జు రూప.

  రిప్లయితొలగించండి
 7. పూజ్య గురుదేవులకు,కవిమిత్రులందరికీ... వినాయక చవితి... శుభాకాంక్షలు...

  వందనము విఘ్ననాయక
  వందనమిదె పరశుధరుడ పార్వతి తనయా!
  వందనము వక్రతుండుడ
  వందనము గణేశ నీకు వందనశతముల్!!!


  చేకొని పత్రిని విరులన్
  శ్రీకరముగ బూజ జేతు సిద్ధిగణేశా!
  ప్రాకటమగు వరములొసగి
  సాకతమిడి గావు మయ్య శంకర తనయా!!!

  బాధ్రపద శుద్ధ చవితిన భవ్యముగను
  బొజ్జదేవరను దలచి భూరిగాను
  భక్తి తోడను బూజింప భాగ్యమిడుచు
  విఘ్నములు తొలగించునా విఘ్నరాజు !!!

  రిప్లయితొలగించండి
 8. "కంప్యుటరు" గణ (న) నాథ !
  ఓం శ్రీ గణాధిపాయ నమః.

  వీక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.

  సీసము:
  మాత పంచెను నీకు "మదరుబోర్డ్ సాఫ్ట్వేరు"
  హరుడిచ్చె గజశిర "హార్డువేరు"
  ముల్లోకముల "నెట్టు" లల్ల "కనెక్షన్లు"
  మూషికమేగాగ "మౌసు" నీకు
  ఓం నమః లే "డాటు కాం"లుగా మారగా
  దేవతల "వెబ్ సైట్ల" త్రోవ నీవు
  పన్ను "రైటరు డిస్కు" పిన్నుగానే జేసి
  వ్యాస భారతమీవు వ్రాసినావు

  ఆటవెలది:
  గణనయంత్రములను ఘన "కంప్యుటరు" వీవు
  గణముల పతి నీవె గణన నాథ !
  మంచి "సైట్ల" నీవు మాతోడ తెరిపించి
  "వైరసు" దరి రాని వరమునిమ్మ.

  రిప్లయితొలగించండి
 9. మిత్రులందఱకు వినాయక చతుర్థి పర్వదిన శుభాకాంక్షలు!

  ఓం శ్రీ మహాగణాధిపతయే నమః !

  విధు రుచి నిభ గాత్ర! విష్ణు! ద్విమాత్రుక!
  ప్రార్థనాద్య మంత్ర! పర్శుపాణి!
  విశ్వనేత! ఢుంఠి! విఘ్ననాయక! శూర్ప
  కర్ణ! తే నమోఽస్తు ఖనక రథిక!

  *** *** ***


  (వినాయకచవితినాఁడు చంద్రుని దర్శించినవారికి నీలాపనిందలు
  కలుగునని పార్వతి శాపమిచ్చిన వృత్తాంతము)


  చవితి దినమున నవ్వంగఁ జందమామ,
  కొడుకు గణనాథు నుదరమ్ము క్రుమ్మరించె
  లోని కుడుముల, నుండ్రాళ్ళ; వానిఁ జూచి,
  క్రోధమున శపించెను గౌరి బాధతోడ!

  "చవితి దినమున నేవారు చంద్రుని ముఖ
  దర్శనము సేతురో వారు తత్క్షణమ్మె
  తగని నీలాపనిందల నెగడుదురయ!"
  యనఁగ, దేవతల్ ప్రార్థింప వినిచె నిట్లు;

  "నాదు తనయునిఁ బూజించి, నాఁడు నక్ష
  తలఁ దలపయిఁ జల్లుకొన నిందలు తొలఁగి, శు
  భమ్ము లొనఁగూడు" ననుచు శాపావధి నిడ,
  నంద ఱానందమందిరి, వందనమిడి!


  (శ్రీకృష్ణుని చంద్రదర్శనము; అతనికిం గలిగిన నీలాపనిందలు)

  అల వినాయక చవితి సాయంత్రమందుఁ
  గృష్ణుఁ డొంటిగఁ దోఁట కేగియు నచటనె
  కూర్చొనఁగ రుక్మిణీసతి కూర్మిమీఱ
  దుగ్ధపాత్ర నొసఁగఁగ నందునను నతఁడు

  చంద్రుఁ బొడఁగాంచినంత సాక్షాత్కరించె
  నింద; సత్రాజితుని దమ్మునిం దునిమి, య
  తని శమంతకమణిఁ గొనె ననుచు వేగ!
  దైవమైననుఁ దలవ్రాఁతఁ దాఁటఁ గలఁడె?

  (అది, ప్రసేనుండు ధరియించి యడవి కేఁగ,
  సింగ మొక్కం డతనిఁ జంపి, చెలఁగి, కొనఁగ,
  జాంబవంతుండు సింహముం జంపి, మణినిఁ
  దనదు కొమరిత మెడలోనఁ దనర వైచె! )

  దానఁ గృష్ణుండు వనికేగి, తఱచి వెదుక,
  నొక్కచో జాంబవంతునియొక్క తనయ
  జాంబవతి కంఠమందున సౌరభమిడు
  నా శమంతకమణిఁ జూచి, యతనితోడ

  యుద్ధముం జేసి, యోడించి, యుక్తముగను
  జాంబవతితోడి మణిఁగొని, సరగునఁ జని,
  యచట సాత్రాజితిం బొంది, యందగించె
  విఘ్నపతి చల్లఁగాఁ జూడ వెన్నుఁడంత!

  శుభం భూయాత్


  రిప్లయితొలగించండి
 10. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  మూడవపద్యం మొదటిపాదంలో గణదోషం. ‘నిన్ను నేమరక గొలుతు’ అనండి.
  నాల్గవపద్యం చివర ‘జోత లాంబికేయ’ అనండి. (సమాసంలో అంబాపుత్ర అనవలసి ఉంటుంది. అందుకే ఈ సవరణ).
  ఆరవపద్యంలో ‘అంబరాధిపుడవు నగజేశు...’ అనండి.
  *****
  శైలజ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  ‘వందనము వక్రతుండా!’ అనండి.
  *****
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  హాస్యస్ఫోరకమైన మీ కంప్యూటర్ గణపతి పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  మీ గణేశస్తుతి, చంద్రశాప వృత్తాంతం, శమంతకోపాఖ్యానం పద్యాలు మనోహరంగా ఉన్నాయి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. గండరగండడీవనుచు గట్టులరాయుని దండి మన్మడా
  దండముబెట్టి మోదమున దండిగబెట్టిన మోదకమ్ములన్
  నిండుగ రెండుహస్తముల నిల్పితినన్న నెపమ్మువీడి నీ
  తొండమునెత్తియేని మది తోచిన దీవెనలిమ్ము దేవరా

  గట్టులరేని పట్టి చిరుగజ్జెల పట్టెలుకాలగట్టి వేల్
  పట్టుకు విద్దె విద్దెయని పాతరలాడగ నేర్పినంత నే
  పట్టిసమూని విఘ్నముల పారగజేయగ వచ్చెనేడు తా
  నట్టువరేని బొట్టెడును నాయనకున్ సరితూగు దట్టుడున్

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గణనాథ! వందనము శిష్టుల బ్రోచెడు విఘ్ననాయకా!
  వేగమె రమ్మటంచు నిను వేడెద వేడుక చేయ గోరి నీ
  యాగమ నాభిలాషి నయ యన్నివిధమ్ముల ప్రీతి జేయుచున్
  స్వాగత మివ్వ నందుకొని సౌఖ్యము లిమ్మయ భక్తకోటికిన్!

  మిత్రులకు, శ్రేయోభిలాషులకు గణేశోత్సవ శుభాకాంక్షలు!!

  రిప్లయితొలగించండి
 13. గురువర్యులకు, కవిమిత్రులకు వినాయక చవితి శుభాకాంక్షలు

  రిప్లయితొలగించండి
 14. మూషిక వాహనంబునట మోదక పాణివి యైనపార సం
  తోషము పైగొనన్నడువ దుష్టుడు సోముడు జూచినవ్వగన్
  దోషికి శాపమున్నొసగ తుష్టుడ వైతివి విఘ్నభీరు న
  న్శోషుని గావుమయ్యమదిఁ సూక్తుల గొల్తును విఘ్ననాయకా

  రిప్లయితొలగించండి
 15. శ్రీగురుభ్యోనమః

  వినాయకచవితి పర్వదిన శుభాకాంక్షలు

  వీధి వీధి లోన విఘ్నేశ్వరుని కొలువు
  కనుల పండువాయె జనులకెల్ల
  యీశపుత్రు గొల్వ యీప్సితార్థము దీరు
  తొలగు విఘ్నమ్ము లన్నియున్ కలుగు శుభము

  రిప్లయితొలగించండి
 16. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  ధన్యవాదాలు.
  *****
  పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 17. హరసుత గజశిర లంబో
  దర విఘ్నేశ్వర నగసుత దనయ దురితాప
  హర మూషిక వాహన సుర
  వర సన్నుత గై కొనుమివె వందన శతముల్

  రిప్లయితొలగించండి
 18. ద్వాదశ విఘ్ననాయకులు దండన సేయగ విఘ్నసంతతిన్
  మోదము మీర వేదికను ముచ్చట గొల్పుచు కొల్వుదీరగా
  ఖేద మదెక్కడింక మనకేళ్ళు మొగిడ్చి నమస్కరించినన్
  ప్రోదిని జేసి భాగ్యముల పొందు ఘటించెద రెల్లవారికిన్.

  భాసురలీల భర్మమయ భవ్యసమాశ్రయమందు ఠీవిగా
  మోసులువేయ ప్రీతి కని మోదము చెందెడి భక్తకోటిలో
  నీసులసూయలంతమయి యెల్లమనమ్ములు వెల్గ స్వఛ్చమై
  వాసవ బ్రహ్మవిష్ణుశివ వందితు డీశసుతుండు కూర్చొనెన్.

  బంగరు వన్నె ధామమున ప్రజ్జ్వలమౌ గణనాథు దీధితుల్
  హంగగు శోభలన్ మిళితమై కనువిందొనరింప దోచెడిన్
  ముంగిట నిల్చు వారికి ముముక్షుల డెందములందు నొక్కటై
  పొంగెడు భక్తినిర్వృతుల పొల్పగు సంగమ మట్లు ధీవరా!

  రిప్లయితొలగించండి
 19. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  రెండవపాదం చివర గణదోషం. ఇక్కడ పాదాంతంలో తప్పక గురువుండాలి. అంటే గగమో,సగణమో ఉండాలి. మీరు జగణం వేసారు.
  *****
  మిస్సన్న గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  ఆధ్యాత్మక నేపథ్యంతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘చక్రమ్మునకు’ అనవలసింది. అక్కడ ‘చక్రాని కధిపు డీవు’ అనండి. (ఈ విషయాన్ని మనం ఫోన్‍లో మాట్లాడుకున్నాం. మరిచిపోయారు)

  రిప్లయితొలగించండి
 20. హరసుత గజశిర లంబో
  దర విఘ్నేశ్వర నగసుత దనయ దురితసం
  హర మూషిక వాహన సుర
  వర సన్నుత గై కొనుమివె వందన శతముల్

  రిప్లయితొలగించండి

 21. చిత్ర మందున గణపతి చిత్ర చిత్ర
  వర్ణ ములతోడ శోభిల్లె బంధురముగ
  వేయి కళ్ళును జాలవు వీ క్షితులకు
  చూడ రారండియందరు శుభము కలుగు

  రిప్లయితొలగించండి
 22. కవిమిత్రులందరకు నమస్కారములు.అందరికి వినాయకచవితిపండుగ శుభాకాంక్షలు.
  అధిష్టానచక్రమునకు అధిదేవత వినాయకుడు.వినాయకునితొండమువలె కుండలిని
  నాడివంపుతిరిగివుంటుంది.యోగాభ్యాస కుడు ప్రాణమును కుంభించి కుండలిని మేల్కొలిపి ఆ అనుభూతినిపొందును.మొదటి ఆటంకము కుండలినిమేల్కొనుటయే. అందుకే ఆటంకములకధినాయకుడైన గణపతిని ముందుగాపూజించేఅచారము.ఈవిషయమునే పొందుపరచడానికి ప్రయత్నము చేసినాను.. .
  నిజమే..మిత్రమా మర్చిపోయినాను. తిరిగి ప్రవేశపెడుతున్నాను.

  ఆదియాధార చక్రానికధిపుడీవు
  విఘ్నమింకేల పూజింతు విడువుదోవ
  కుండలినిలేపి ప్రాణమ్మునుండజేసి
  సంచరించెదనాధార చక్రమందు.

  రిప్లయితొలగించండి
 23. పోచిరాజు కామేశ్వర రావు గారూ,
  సవరించిన మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  సీసపద్యం ఎత్తుగీతి మొదటి పాదాన్ని 'గొప్ప యాడంబరాలతో కూర్చి పేర్చి' అనండి.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *****
  భూసారపు నర్సయ్య గారూ,
  సవరించినందుకు సంతోషం. పద్యానికి ముందు ఇచ్చిన నేపథ్యం జ్ఞానదాయకంగా ఉంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 24. ము౦దల విఘ్ననాయకుడు పూజితు
  డౌనని డె౦దమ౦దు మే
  ము౦. దలపోయు చు౦టిమి విభుత్వ
  మహోజ్వల. మూర్తి ! శాశ్వతా
  న౦దమయస్వరూప! గణనాయక!
  దీనశరణ్య! పార్వతీ
  న౦దన! చల్లనైన కరుణ౦. గను
  మయ్య భజి౦తు ము౦దుగాి

  రిప్లయితొలగించండి
 25. ద౦డము,ద౦డమయ్య విహిత
  ప్రతిబ౦ధక జాల శోషణా
  ద౦డము,ద౦డమయ్య జనిత
  శ్రమ పాప తమో నివారణా
  ద౦డము,ద౦డమయ్య వినుత
  స్పుట సౌమ్య కళా విభూషణా
  ద౦డము,ద౦డమయ్య. నిరత౦బు
  కృప౦గను విఘ్ననాయకా

  రిప్లయితొలగించండి
 26. వాడవాడల నిలిపి మావాడ వనుచు
  మందిరమ్మున, హృదయ పు మందిరాన
  వెలసియున్నట్టిదేగ కోవెల|సితిమతి
  నుంచబోకయ్యగణనాథ |నుంచ ఫలమ?.

  రిప్లయితొలగించండి
 27. స్వార్థపరులు నిల్ప సంతోష మనుకోకు
  -----మంచిమనసు లేనిమందిరాన
  పత్రి,పుష్పము లుంచ పరమార్థ మనుకోకు
  -------లాభలోభాలాశ లక్ష్యముండు
  విద్యుత్తు వెలుగున వేడుకలుంచినా
  -------మసకచీకట్లందు మనసులుండు
  నాగరికత యన్న నాజూకు గరికను
  -----నీచెంత నుంచియు నిధుల నడుగు
  గొప్పయాడంబరాలతో కూర్చి పేర్చి
  మండపాలిడ గణనాథ|దండుజుచి
  భక్తియనుకొన్న దోషమే భక్తవరద
  నమ్మికొలిచెడి వారికి సొమ్మునీవె.
  2.కొలువు లెన్నున్న భక్తియు నిలువకున్న
  వెలుగు లేనట్టి గుడియందు మెలుగుటేగ
  వేడుకన్నది నైఖ్యతావిలువ|బెంచు
  విఘ్నరాజును సేవించు విధియె?చవితి

  రిప్లయితొలగించండి
 28. గురుదేవులకు మరియు కవిమిత్రులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు.

  సమయస్ఫూర్తిని జూపగ
  నుమామహేశులు గణములకొడయని జేయన్
  సుమములపూజించి కుశధ
  ర! మోదక ప్రసాదములిడ ప్రజ్ఞలనీమా!

  రిప్లయితొలగించండి
 29. గురువుగారికి మరియు సుకవిమిత్ర బృందానికి హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు.

  శ్రీరంజిల్లఁగ బార్వతీ తనయుఁడై శ్రీకంఠు సత్పుత్రుఁడై
  ధీరుండై సుర మౌని ముఖ్యగణముల్ తృప్తిన్ ప్రసేవించగా
  కారుణ్యాబుధివై ప్రయత్నముల విఘ్నంబంతయున్ బాపి వి
  ద్యారత్నంబుల సంపదల్నొసఁగి మా ద్వైమాతురా బ్రోవవే.

  నినుసేవింపకయున్న బాయునె మహా నిస్తేజముల భక్తి భా
  వనఁ నీ పాదములన్ స్మరించక సుసౌభాగ్యంబులెట్లబ్బు చిం
  తామాత్రంబున విఘ్నముల్ తొలఁగి సాధ్యంబౌ సుకార్యంబు కా
  న నినున్ వేడెద మమ్ము గావుము మహానంద ప్రదాతా! విభో!

  రిప్లయితొలగించండి
 30. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పద్యాలన్నీ బాగున్నవి. అభినందనలు.
  ‘సితిమతి’...?
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *****
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి