6, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1780 (పాపకర్ములు దుష్టులు భాగవతులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
పాపకర్ములు దుష్టులు భాగవతులు. 

25 కామెంట్‌లు:

  1. మొదలు పెట్టినన్ కార్యముల్ ముగియు వరకు
    విఘ్న మెరుగకన్ కొనసాగి విజయ మంద
    కువలయమ్మున విఘ్నేశుఁ గొలచు వారె
    పాపకర్ములు, దుష్టులు, భాగవతులు!

    రిప్లయితొలగించండి

  2. సమస్య:పాపకర్ములు.దుష్టులు,భాగవతులు
    రెండు పాదాల ధర్మమ్ము యుండ,కలరు
    పాప కర్ములు,దుష్టులు, భాగవతులు
    ఒంటి కాలిపై ధర్మమ్ము కుంటు చుండ
    పాడు లోకాల నట నట భాగవతులు

    రిప్లయితొలగించండి
  3. ఏడు కొండల మెట్లెక్కి వేడుకొనుచు
    మొక్కు లన్నియు దీర్చంగ ముదముతోడ
    విష్ణు గొలువగ తిరుమల వెడలు చుండె
    పాపకర్ములు, దుష్టులు, భాగవతులు!!!

    రిప్లయితొలగించండి
  4. తే.గీ:ఘోర దురితములొనరించుక్రూరు లైన
    చెప్ప నలవికాని పనులు చేసి యున్న
    శ్రీపతి దయ యున్నయెడల శీఘ్ర ముగను
    పాపకర్ములు,దుష్టులు,భాగవతులు.

    రిప్లయితొలగించండి
  5. మిత్రులందఱకు నమస్సులు!

    నేరకయె సేసినట్టిడు నీచకృతుల
    మథనపడుచును దొసఁగుల మాన్ప మధురి
    పు శరణాగతులయి మోక్షము నడిగిరయ
    పాపకర్ములు,దుష్టులు,భాగవతులు!

    రిప్లయితొలగించండి
  6. పాపకర్ములు దుష్టులు భాగవతులు
    నెవ్వరైనను శ్రీహరిన్ హృదయపీఠి
    నిలుపుకొన్నను చాలునే నిశ్చయముగ
    మోక్షసామ్రాజ్యమబ్బునద్భుతము గాదె

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    పాపకర్ములు,దుష్టులు,భాగవతులు,
    కవులు,గురువులు,శ్రామికుల్,గాయకులను
    పలురకమ్ముల గుణములు బడయుటేల?
    పూర్వ జన్మలలో బాపపుణ్య ఫలమె!

    రిప్లయితొలగించండి

  8. చేయు చుందురు నిరతము శివుని నింద
    పాపకర్ములు దుష్టులు, భాగవతులు
    భార ముంతురు మఱి భగ వంతు పైన
    కల్ల కపటమ్ము లేనట్టి యుల్ల మునన

    రిప్లయితొలగించండి
  9. కాలునికడకు పోవుడు ఖాయమౌను
    పాపకర్ములు దుష్టులు, భాగవతులు
    సత్యదేవు పూజించుచు సంతతమ్ము
    మోక్షమును పొందుచుందురు మోదమలర

    రిప్లయితొలగించండి
  10. ఆచరించిన యఘముల కార్తి జెంది
    మలినములనన్ని మనమున మట్టు వెట్టి
    విషయ వాంఛల విడనాడి విష్ణు గొలువ
    పాపకర్ములు దుష్టులు భాగవతులు.

    రిప్లయితొలగించండి
  11. పతితులై దుష్టకర్మల భ్రష్టులైరి
    పాపకర్ములు దుష్టులు;భాగవతులు
    కర్తృరాహిత్య కర్మల కరణి దెలిసి
    భ్రమను విడనాడి సాయుజ్య పదవి గనిరి

    రిప్లయితొలగించండి
  12. పాపకర్ములు దుష్టులు భాగవతులు
    వారు వీరేమి మానవా కారు లెల్ల
    వివిధ మతముల వారును విశ్వమయుని
    తలచుకొందురు తమ మత తత్వమెరిగి.

    రిప్లయితొలగించండి
  13. యుగయుగమునందు ప్రభవింత్రులుర్వి యందు
    ధర్మ నిరతులు జ్ఞానులు దార్శనికులు
    పాపకర్ములు దుష్టులు భాగవతులు
    మార్గ దర్శకులౌటకు మంచిచెడుకు !!!

    రిప్లయితొలగించండి
  14. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    విఘ్నేశుని కొలుచువారు పాపకర్ములు, దుష్టులు ఎలా అయ్యారో అర్థం కాలేదు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    చివరిపాదంలో గణదోషం. ‘అవని వాసరపురమున కరుగుచుంద్రు’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కొంత అన్వయలోపం కనిపిస్తున్నది. ‘ధర్మమ్ము+ఉండ’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘రెండు పాదాలతో ధర్మ ముండ’ అనండి.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    కర్తృపదాలు బహువచనంలో ఉంటే ‘వెడలుచుండె’ అని ఏకవచనంలో క్రియాపదాన్ని చెప్పారు. ‘వెడలుచుండ్రి/వెడలుచుంద్రు’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘గాను పరిణమింతురు కృపాపాత్రు లగుచు’ అన్న పాదాన్ని చేర్చితే భావం అర్థవంతమౌతుంది.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    ముందుగా నిన్న మీరు నాపట్ల చూపిన సౌహార్దానికి ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    భూసారపు నర్సయ్య గారూ,
    ముందుగా నిన్న మీ యింటిలో నాకు లభించిన ఆత్మీయ ఆతిథ్యానికి ధన్యవాదాలు.
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    పరుల సంపద కబళించి బ్రతుకువారు
    పాపకర్ములు దుష్టులు; భాగవతులు
    కూచిపూడి నాట్యమునందు కొవిదులుగ
    నాంధ్ర దేశము నందున నలరు వారు
    భరత దేశము నందున బరగు వారు
    ప్రతిభ పాశ్చాత్య మందైన బడయు వారు

    రిప్లయితొలగించండి
  16. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. స్వార్థ చిత్తులై మనుజులు వసుధ యందు
    సిరులు కాంక్షించి పరుల వంచించువారు
    పాప కర్ములు దుష్టులు, భాగవతులు
    మోక్షగాముల లక్ష్యమ్ము ముక్తి పథము

    రిప్లయితొలగించండి
  18. గురుదేవులకు ధన్యవాదములు.
    పాపకర్ములైనా, దుష్టులైనా మరియు భాగవతులైనా తాము మొదలు పెట్టినకార్యములు నిర్విఘ్నంగా కొనసాగి విజయము లభించాలని ఎవ్వరైనా ఈ భూమి మీద విఘ్నేశుని పూజిస్తారనే భావంతో వ్రాశానండీ. అన్వయ లోపముంటే వివరించ మనవి.

    రిప్లయితొలగించండి
  19. పాప కర్ములు దుష్టులు , భాగవతులు
    పలు రకమ్ముల జనులున్న భరత భూమి
    కలియు గంబున ధర్మము గాంచి నంత
    సురలు యసురులు కలహించ సోయ గమ్ము

    రిప్లయితొలగించండి
  20. తే.గీ:ఘోర దురితములొనరించుక్రూరు లైన
    శ్రీపతి దయ యున్నయెడల శీఘ్ర ముగను
    పాపకర్ములు,దుష్టులు,భాగవతులు
    గాను పరిణమింతురు కృపా పాత్రు లగుచు.
    సవరించానండీ.

    రిప్లయితొలగించండి
  21. కోపతాపపు కోర్కెల శాపపరులె
    పాప కర్ములు దుష్టులు|”భాగవతులు
    భయము, భక్తికి లోబడి బాధ్యతలను
    మలచి మానవ తత్వాన మసలువారె”.

    రిప్లయితొలగించండి
  22. గురుదేవులకువందనములు ద్వాపర యుగములో ధర్మము రెండుపాదము లలో నుండ దుష్టులురెండు వంతులు .భాగవతులు రెండు వంతులు కలరు.కలియుగములో ధర్మము
    ఒంటి కాలిపై కుంటు చున్నది అందుచే నేటి పాడు లోకములోనట నట భాగవతులు కలరు
    అని నాభావన.

    రిప్లయితొలగించండి
  23. సాధు జనుల పెక్కు బాధల బెట్టెడి
    కనకకశిపు డాది దనుజు లిల న
    ధర్మపరులు పాపకర్ములు దుష్టులు
    భాగవతులు కారు భ్రాంతి వలదు.

    రిప్లయితొలగించండి
  24. పాపముల జేసి యౌవన ప్రాయమందు
    ​ప్రాయముడిగిన బాపముల్ బాయనెంచి
    వేడు చుందురు దేవుని విడువకుండ
    పాపకర్ములు, దుష్టులు, భాగవతులు!

    రిప్లయితొలగించండి
  25. వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    సహదేవుడు గారూ,
    మీ వివరణ సంతృప్తి నిచ్చింది. సంతోషం!
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ వివరణ సంతృప్తికరం. సంతోషం!
    *****
    మిస్సన్న గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి