28, సెప్టెంబర్ 2015, సోమవారం

పద్య రచన - 1018

కవిమిత్రులారా,
“కవివర! నీ కవిత్వమునఁ గాంతుము...”
ఇది పద్య ప్రారంభం.
దీనిని కొనసాగిస్తూ పద్యరచన చేయండి.

30 కామెంట్‌లు:

  1. కవివర! నీ కవిత్వమునఁ గాంతుము చక్కని దేశ భక్తియున్
    భవితకు పట్టుకొమ్మలగు బాలల గొప్పగ తీర్చిదిద్ది మం
    చి విలువలున్న పౌరులుగ చేసెడి బోలెడు నీతిసూక్తులున్
    కవులకు మార్గదర్శకముగా కలకాలము నిల్చు శైలియున్

    రిప్లయితొలగించండి
  2. కవివర! నీ కవిత్వమునఁ గాంతుము నిర్మల జాహ్నవీ స్ఫుర
    న్నవ కమనీయ ధార; భువన త్రయ మోహన వాక్చమత్క్రియా
    ర్జవము; ప్రసన్న శైలి; రస రమ్య కథా గ్రథనోపపత్తి; నీ
    కివె ప్రణతుల్ సహస్రము సుధీ! ప్రతిభా శరధీ ! లసన్మతీ !

    రిప్లయితొలగించండి
  3. కవివర! నీకవిత్వమునఁ గాంతుము నందలి భావ వీచికల్
    వివరణ జేయగా మదికి వేదన దీర్చగ సంత సంబునన్
    పవనపు తేరులం దిరుగు వన్నెల సొంపగు మేఘ మాలికల్
    రవమిడె విందు జేయగను లాలిత లాస్యపు శ్రావ్య గానముల్

    రిప్లయితొలగించండి
  4. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    ఉత్తమకవిత్వ లక్షణాలనన్నీ వివరిస్తూ మనోహరమైన పద్యాన్ని చెప్పారు. ‘మీ కివె ప్రణతుల్ సహస్రము సుధీ! ప్రతిభా శరధీ! లసన్మతీ!’
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘సుందర భావవీచికల్’ అనండి.

    రిప్లయితొలగించండి
  5. కవివర! నీ కవిత్వమునఁ గాంతుము నిర్మల వాగ్విలాసమున్
    నవరస పోషణాపటిమ జ్ఞానసుధాంబుధి పంచగల్గి గౌ
    రవము రహింపజేయు పద లాలిత శోభిత వాక్య సంపదల్
    ప్రవిమల ధార ధారణలవంధ్య!బుధోత్తమ!సన్నుతించెదన్

    రిప్లయితొలగించండి
  6. కవివర! నీ కవిత్వమున గాంతుము చక్కని భావసంపదన్
    నవరస మొల్కు నీ కృతుల నాణ్యత సోయగ మొప్ప మెచ్చిరే
    నవతర పాఠకోత్తములు నవ్యత గోరెడు వారు సైతమీ
    కవితల నాదరింప నిల కావ్య ప్రదాతల జన్మ ధన్యమే!

    రిప్లయితొలగించండి
  7. కవివర నీకవిత్వమున గాంతుము భక్తుల దివ్య గాధలన్
    వివశుల జేయు పద్యములు విన్నను పాడిన తన్మయత్వమే
    భవహర మౌను భాగవత భవ్య సుధారస పానతృష్ణచే
    దివిజులు సైతమున్కవనతీపిని గ్రోలగరారె పోతనా !!!

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు!

    సుకవి మిత్రులు డా. విష్ణునందన్ గారూ! మీ పద్యము సుమనో మనోహరముగ, హృదయామోద దాయకముగ, సద్భావ విలసితముగ, మధురముగ నుండి పఠితల నలరింపఁజేయుచున్నది. మీకివే నా శుభాభినందనలు!

    రిప్లయితొలగించండి
  9. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యం చాల బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    మంద పీతాంబర్ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘కవనతీపి’ అని సమాసం చేయరాదు కదా! ‘దివిజులు సైత మందుగల తీపిని...’ అందామా?
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. కవివర నీ కవిత్వమునఁ గాంతుము స్వచ్ఛ వియన్నదీ ప్రవా
    హ వర మనోజ్ఞ తైర్థ్యము! విహాయస వీథ్యుపవిష్ట వాత్యమున్!
    నవక వచోఽమృతార్థక నినాహ్యము! శబ్ద విశేష భూషితో
    ద్భవ యమకాది వేష్యము! సువాక్య రసార్ణవ నవ్య కావ్యమున్!

    రిప్లయితొలగించండి
  11. కవిమిత్రులకు నమస్కారములతో
    గురుమూర్తి ఆచారి
    "మధ్యాక్కర చందములో"
    కవివర నీ కవిత్వమున గాంతుము ; మధుర భావమును ,
    ప్రవిమలార్ధ యుత విశిష్ట పదబంధురంబగు ధార (ను + )
    నవిరళ భక్తితత్వమును , హ్లాద కర కథారసమును ,
    భవదుర్విష హరణమైన భాగవత గ్రంథ సుధను

    రిప్లయితొలగించండి
  12. కవివర! నీ కవిత్వమునఁ గాంతుము మల్లెలు జాలువారుటన్,
    నవ కమలంపు సౌరభము, నాకనదీమ హొయళ్ళ సోకులున్,
    భవహర పాదపద్మముల భక్తిఁ బవిత్ర మనంబునిండుగాన్,
    కువలయరక్ష ధర్మమను కొంత సదాశయ బుద్ధి, యోర్మినిన్.

    రిప్లయితొలగించండి
  13. కవివర!నీ కవిత్వమునఁ గాంతుము భావ గభీర గూఢముల్
    కవన సుధార సోద్దిత వికాస మనోజ్ఞ మరంద ధారలున్
    సువికసితా రవిందములు సుందర శబ్ద సుసంహి తమ్ములున్
    నవరస గుంభితా విరల నంద విశేష విలాస దాయముల్

    రిప్లయితొలగించండి
  14. కవివర!నీ కవిత్వమునగాం తుము చక్కని సూక్తుల న్యవి
    న్యువతకు పట్టుకొమ్మలయి యూ తును బాగుగ నుంట జేసి యు
    న్నవగుణ జోలికేగక ను హాయిగ జీవన మార్గ మొందుచు
    న్నవిరళ జీ వనంబును నయం బుగ జేయుచు హాయి నొప్పెడున్


    రిప్లయితొలగించండి
  15. పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. మీరిచ్చిన పద్య పాదము చూడగా శ్రీ కృష్ణ దేవరాయలు ఇచ్చిన పాదము గుర్తుకు వచ్చింది. తెనాలి రామ కృష్ణ కవి పూరణ గుర్తుకు వచ్చింది. కవి పుంగవు లందరితో పంచు కోవాలని ఈ క్రింద ఉదహరిస్తున్నాను.

    స్థుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనో
    యతులిత మాధురీ మహిమ హా తెలిసెన్ భువనైక మోహనో
    ద్ధత సుకుమార వార వనితా జనితాఘన తాప హారి సం
    తత మధురాధరోధిత సుధా రస ధారల గ్రోలుటం జుమీ

    రిప్లయితొలగించండి
  16. కవివర! నీకవిత్వమునఁగాంతుము సుందరమైన పోకడన్
    భువితలమందు నీసరి ప్రమోద మునిచ్చుమనీషి కల్గునా
    నవతరమున్ ప్రభావిత మొనర్చెనునీదు మనోజ్ఞ భావనల్
    కవికుల శేఖరా నలువకాంత కుమార నమస్సులందుమా

    రిప్లయితొలగించండి
  17. గుండు మధుసూదన్ గారూ,
    చక్కని శబ్దశోభతో అలరారే పద్యాన్ని అందించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *****
    గురుమూర్తి ఆచారి గారూ,
    మీ మధ్యాక్కర చక్కగా ఉంది. అభినందనలు.
    *****
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    అందమైన పద్యాన్ని అందించారు. అభినందనలు.
    తెనాలి రామకృష్ణుని పద్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం. కాని దోషాలెక్కువగా ఉన్నాయి. అన్నిటినీ వివరించలేను. మీ పద్యాన్ని నా సవరణతో పోల్చి చూడండి.
    కవివర!నీ కవిత్వమున గాంతుము చక్కని సూక్తు లెన్నియో
    యువతకు పట్టుకొమ్మలయి యొప్పును బాగుగ నుంట జేసియే
    యవగుణముల్ త్యజించియును హాయిగ జీవన మార్గ మెంచగా
    నవిరళ జీవనంబును నయంబుగ జేయుచు హాయి గొల్పెడిన్.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘భువితలము’ అనరాదు. ‘భువిని గనంగ నీ సరి...’ అందామా?

    రిప్లయితొలగించండి
  18. కవివర! నీ కవిత్వమున గాంతుము సుస్వరమ్ములున్!
    జవిగొని ఘంటసాల తను జక్కగ పుష్పవిలాప కావ్యమున్
    బ్రవిమల రీతి గాత్రమున మార్దవమొప్పుచు విందుజేయగన్
    రవి,శశులుండు దాక తమ ప్రక్య వెలుంగును శాస్రి! మీకిటన్!

    రిప్లయితొలగించండి
  19. శ్రీగురుభ్యోనమః

    కవివర! నీ కవిత్వమున గాంతుము భావ పటుత్వ సంపదన్
    వివరణ వర్ణనామృతము విశ్వకవీంద్ర రవీంద్ర ధీమణీ
    కవనపయోధి జిల్కితివి కమ్ర సుధారసధార పంచగన్
    రవికర దీప్తి దీప్తముగ రంజిలుచుండు ననంత కాలమున్

    రిప్లయితొలగించండి
  20. కవివర నీకవిత్వమున గాంతుము పేదల కష్ట నష్టముల్
    అవిరళ సాధువర్తన సహాయము జిక్కునుభావ బంధమై
    శ్రవణము నందె సర్వమును సాగెడి లోకము కళ్ళముంగిటే
    వివరణ గానుపించు గద విద్య వివేకములున్నమానవా|

    రిప్లయితొలగించండి
  21. కవివర నీకవిత్వమునగాంతుము “కాలముబంచెడి మార్పు తీర్పులున్
    కవితను బెంచబూనుటకె కాచిన పూల సుగంధ బంధమై
    వివరణ విజ్ఞతన్ నొసగు విచ్చిన పువ్వులు నచ్చి నట్లుగా
    సవరణ లేని సంస్కృతిని సాకెడి బంధమె అక్ష రాకృతుల్|

    రిప్లయితొలగించండి
  22. శ్రీ గుండా వేంకట సుబ్బ సహ దేవుడు గారూ 1 వ పాదములో గణ భంగమైనట్లుగా నున్నది. గమనింప మనవి.

    రిప్లయితొలగించండి
  23. ఒకానొక కారణాన మధ్యాహ్నం నుండి నా మనస్సు కల్లోలంగా ఉంది. ప్రశాంతత కోల్పోయాను. అందువల్ల మీ పద్యాలను చదివి వెంట వెంట వ్యాఖ్యానించలేకపోయాను. మన్నించండి.
    చక్కని పద్యాలను పంపిన...
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    శ్రీపతి శాస్త్రి గారూ,
    కె. ఈశ్వరప్ప గారూ,
    అభినందనలు, ధన్యవాదాలు.
    వీలైతే రేపు సమీక్షిస్తాను.

    రిప్లయితొలగించండి
  24. కవివర! నీ కవిత్వమున గాంతుము చీకటిలోక తీరులున్
    కవితనిరర్థకంబు యది గాంచనిచో ప్రజ యార్తరావముల్
    నవనవ భావవీచికలు నవ్య సమాజపు బాట వేయుచో
    కవి పని సార్థకంబు రవి గాంచనిచో కవి గాంచునే కదా !

    రిప్లయితొలగించండి
  25. కృష్ణారావు గారూ,
    మీ పద్యం కొన్ని చిన్న చిన్న లోపాలున్నా బాగున్నది. అభినందనలు.
    ‘నిరర్థకంబు+అది=నిరర్థకం బది’ అవుతుంది. అక్కడ యడాగమం రాదు. ‘నిరర్థకం బనుచు గాంచనిచో...’ అనండి.

    రిప్లయితొలగించండి
  26. ఆటవిడుపు సరదా పూరణ:
    (కంది వారి ప్రార్థన)

    కవివర! నీ కవిత్వమునఁ గాంతుము మెండుగ ప్రాస ఘాతముల్
    సవరణ జేసి జేసినను సంధి సమాసములీవు నేర్వవే
    నవనవలాడు దోషములు
    నాకడ త్రోయుచు దిద్దుమంటివే
    కవనము మాని శంకరుని గావు ప్రభాకర శాస్త్రి! ధీపతీ!

    రిప్లయితొలగించండి
  27. కవివర! నీ కవిత్వమునఁ గాంతుము కొల్లలు తప్పుతడ్కలన్
    సవరణ జేయ నాకికను శక్తియు లేదుర శాస్త్రివర్యుడా!
    భువనము వీడి పోవుముర పొందుగ నీవిక రౌరవమ్మునన్!
    చివరకు నాకు దక్కునుర శ్రేయము శాంతియు శాశ్వతమ్ముగా!

    రిప్లయితొలగించండి