13, సెప్టెంబర్ 2015, ఆదివారం

సమస్యాపూరణ - 1787 (భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.
ఈ సమస్యను సూచించిన భూసారపు నర్సయ్య గారికి ధన్యవాదాలు.

30 కామెంట్‌లు:

  1. భక్తుడు సుదక్షిణుడు బాధ పడుట గాంచి
    పరువు పరువున భువిఁజేరి భండనమున
    నెన్నుదటనున్న చిచ్చఱ కన్ను దెఱచి
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.

    [ ఈ కధ ఆధారముగా : https://te.wikipedia.org/wiki/%E0%B0%AD%E0%B1%80%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B8%E0%B1%81%E0%B0%B0%E0%B1%81%E0%B0%A1%E0%B1%81 ]

    రిప్లయితొలగించండి
  2. ఊకదంపుడు గారు లింకు ఇచ్చిన కథ చదవడానికి క్రింది లంకెను క్లిక్ చేయండి.
    “భీమాసురుఁడు”

    రిప్లయితొలగించండి
  3. ఊకదంపుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘నెన్నుదుట’ టైపాటువల్ల ‘నెన్నుదట’ అయింది.
    భీమాసురుని గురించిన లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి

  4. ఏకచక్ర పురమునంద నేక జనుల
    జంపు రక్కసు డొక్కని జంప నెంచె
    నమ్మ యానతి పై బండి యన్నము దిని
    భీముడతి భీకరమ్ముగ భీము జంపె.
    భీముడు=కుంతీ సుతుడు
    భీముఁ=భయంకరుడైన(బకాసురుని)

    రిప్లయితొలగించండి
  5. వారు రణరంగ భీములు భారతమున
    భీమ దుర్యోధనుల్ యుద్ధ వీరులుగను
    భండ నమ్మున తలపడన్ వాయుసుతుడు
    భీముడతి భీకరమ్ముగ భీము జంపె

    రిప్లయితొలగించండి
  6. బలుడగు బకాసురుని పాల బడక నేక
    చక్ర పురజనులను గావ సత్వరముగ
    భక్ష్యముల బండి నిడుకొని పాండు సుతుడు
    భీముఁ డతి భీకరముగ భీము జంపె!!!!

    రిప్లయితొలగించండి
  7. ద్రౌపదినికోరు కీచకున్ దర్పమడచ
    వడిగ నర్తన శాలకు వాని బిలచి
    నాతి వేషమ్ము ధరియించివాతసుతుడు
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!!!

    రిప్లయితొలగించండి
  8. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    వి.యస్. ఆంజనేయులు శర్మ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శైలజ గారూ,
    మీ రెండవ పూరణ కూడ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. భీము డనుపేర యసురుడు భీకరముగ
    భక్తు డైన సు దక్షిణు వెతల బఱు ప
    తనదు మూడవ కంటిని నెనర దెఱచి
    భీము డతి భీ కరమ్ముగ భీము జంపె

    రిప్లయితొలగించండి
  11. మిత్రులందఱకు నమస్సులు!

    (శంకరుఁడు భీమాసురునిఁ జంపినకథ నిట ననుసంధానించుకొనునది)

    ఆ సుదక్షిణ దంపతు లార్తితోడ
    హరునిఁ బూజింప, భీముండు నపహసించి,
    "ఱాయి కాచునే" యని, కత్తి వ్రేయఁ, ద్రిపుర
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె!

    రిప్లయితొలగించండి
  12. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    'పేర నసురుడు' అనండి.
    ****
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. కవిమిత్రులందరకు నమస్కారములు

    భీమసేనుడు కౌరవభీముఁగాంచి
    యెదురులే పారిపో నాకునెదురురాకు
    మనిన;నెదురించగానెంచి యెదుటనిలువ
    భీముఁడతి భీకరమ్ముగ భీముఁజంపె.

    ధృతరాష్ట్రుని నూర్గురి కుమారులలో ఒకనిపేరు భీముడు.

    రిప్లయితొలగించండి
  14. శంభుగొప్పతనమ్మును సరకుగొనక
    కనలి శివలింగమున్ గని కత్తిదూయ
    నుగ్రరూపమ్ముతోడ తానుద్భవించి
    భీముఁడతిభీకరమ్ముగ భీముఁజంపె

    రిప్లయితొలగించండి
  15. శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

    మధుర మృష్టాన్నములతోడ మనుజు నొకని
    దినుచు జనులను బ్రతుక భీతిలగ జేయు
    దైత్య బకునికి భుక్తిగా తానె యేగి
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.

    రిప్లయితొలగించండి
  16. ఆ జరాసంధుని వధించ హరిని గూడి
    విప్రునివలె వాయుసుతుండువెంట నడచి
    గడ్డి పోచవలెన్ జీల్చి గడుసు గాను
    భీముఁడతి భీకరమ్ముగ భీముఁజంపె!

    రిప్లయితొలగించండి
  17. భీమ బలుడట బాలుడు బెదరలేదు
    అమ్మనాజ్ఞకులోబడు నమ్మకమ్మె
    బెంచివిఘ్నేషు డెదురించ-విర్రవీగి
    భీము డతి భీకరంమునభీము జంపె|

    రిప్లయితొలగించండి
  18. భీమబలుడగు మల్లుడు విరటు నగరు
    వచ్చి దోర్యుద్ద మునకు సవాలు సేయ
    వలలుడను పేర బరగిన వాయుసుతుడు
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె

    రిప్లయితొలగించండి
  19. హ్రదము దాగిన కురుభీమ రాజరాజు
    ద్వందయుద్దాన్ని జేయంగ దానిలోన
    రాజరాజుకు తొడలను రాలగొట్టి
    భీము డతి భీకరమ్మున భీముజంపె
    2కిచకాధము డావిధి కృష్ణ్డుబొంద
    నర్త నంబుల శాలకు నడిమిరేయి
    నేగ యుద్ధభీముడు వాని నేర్పు మీర
    భీముడతిభీకరమ్మునభీముజంపె
    [శ్రీమల్లెల సోమనాథ శాస్త్రి గారిపూరణ]

    రిప్లయితొలగించండి
  20. భూసారపు నర్సయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. ప్రయాణంలో ఉన్నాను. వ్యాఖ్యలు పెట్టడం ఇబ్బందిగా ఉంది. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  22. సతియె ద్రౌపది తెలుపగ పతిగ తాను
    తిమిర మందున వేచెను తెరను ముసుగు
    జాడ తెలియగ కీచకు జంప నెంచి
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె

    రిప్లయితొలగించండి
  23. శ్రీగురుభ్యోనమః

    ఋషిని దన్నుచు నహిషుడు రెచ్చిపోగ
    చిలువ రూపమ్ము బొందుచు చేరె మడుగు
    తృప్తి నొంద బ్రశ్నించి యదృశ్య రూప
    భీముడతి భీకరమ్ముగ భీము జంపె

    రిప్లయితొలగించండి
  24. ఏక చక్రపు రంబున కెగ్గు సేయ
    భీమ కాయుడు రక్కసుఁ భీకరనర
    మారకుఁ బకుని, కౌంతేయ మధ్యముండు
    భీముఁ డతిభీకరమ్ముగ భీముఁ జంపె.

    రిప్లయితొలగించండి
  25. భాగవతుల కృష్ణారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ యొక్క నేపథ్యాన్ని తెలిపితే బాగుండేది.
    ‘లేదు+అమ్మ’ అని విసంధిగా వ్రాసారు. ‘అమ్మ+ఆజ్ఞకు’ అన్నప్పుడు నుగాగమం రాదు. ‘బెదురు లేక| అమ్మ యాజ్ఞకు...’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    కొద్ది రోజులుగా మీ పూరణలను చదివే అదృష్టానికి దూరమయ్యాం. మీ పునర్దర్శనం సంతోషదాయకం.
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    పోచిరాజు కామేశ్వర రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి