28, ఆగస్టు 2013, బుధవారం

శ్రీకృష్ణ స్తుతి



శ్రీకృష్ణ స్తుతి


పాదపము

శ్రీమధురాధిప! శ్రీధర! కృష్ణా! 
శ్రీమురళీధర! చిన్మయ! కృష్ణా!
ప్రేమ రసాకర! శ్రీకర! కృష్ణా!
కామిత దాయక! కల్పక! కృష్ణా!

జ్ఞాన ధనాఢ్య! జగద్గురు! కృష్ణా!
దీనజనావన! ధీనిధి! కృష్ణా!
మౌనిజన స్తుత! మాధవ! కృష్ణా!
శ్రీనయనోత్సవ! చిద్ఘన! కృష్ణా!

నందకులాఖిల నాయక! కృష్ణా!
సుందర రూప సుశోభిత!కృష్ణా!
విందగు నీ శుభవీక్షణ! కృష్ణా!
వందనమో శ్రితవత్సల! కృష్ణా!

వారిరుహాసన వందిత! కృష్ణా!
వారిజ లోచన! భాగ్యద! కృష్ణా!
భూరి గుణోజ్జ్వల భూషణ! కృష్ణా!
వీరవరేణ్య! త్రివిక్రమ! కృష్ణా!

పావన నామ! శుభప్రద! కృష్ణా!
దేవనుతా! కులదీపక! కృష్ణా!
రావె జగత్త్రయ రంజన! కృష్ణా!
ప్రోవవె మమ్ము ప్రభూ! హరి! కృష్ణా! 

శ్రేయోభిలాషులందరికి శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలతో

నేమాని రామజోగి సన్యాసి రావు

14 కామెంట్‌లు:

  1. గురువుగారికి ప్రణామములతో..
    శ్రీకృష్ణస్తుతి వెన్నపూసంత కమ్మగా,మకరందమంత మధురంగా,పాడుటకు చాలా అనుకూలంగా వున్నది...చాలాచాలా ఆహ్లాదకరంగావ్రాసారు..తమకు పాదాభివందనములు చేస్తూ..
    శైలజ..

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

    శ్రీమధురాధిపతిని అతి రమ్యముగా వర్ణించి మాకందించితిరి.
    =======*==========
    గోప సతుల తోడ నీవు గురువాయురందుంటి వేమి?
    ఆపద లందున్న నేటి యాడువారిని గాచ వేమి?
    కోప గించ వలదు కృష్ణ గురుడవనుచు నిన్ను దలచి
    నీపద సీమను జేర నిత్యము గొలుచుచునుంటి.

    రిప్లయితొలగించండి
  4. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో..

    గురుదేవుల పాద పద్మములకు మురళీ కృష్ణుని పై నేను వ్రాసుకొన్న పద్యములు
    ======*======
    మోహ రహిత చిత్త పరమ మౌని మానస హంస కృష్ణ
    సాహస హత వైరి యోగ సంఘ మహోద్ధార కృష్ణ
    పాహి పాహి విమల హృదయ ప్రహ్లాద రక్షక కృష్ణ
    మోహపాశములను ద్రుంచి ముక్తి నిడుముకృష్ణ కృష్ణ 1
    ======*========
    వృత్యస్త పాదార వింద విశ్వ వందిత శేష శయన
    సత్య బోధన జేయు చున్నసద్గుణ మునిజన బృంద
    ప్రత్యస్త మిత భేద కంద పాలితా నంద సునంద
    నిత్య దీనులను రక్షించు నిర్మలా నంద గోవింద!
    =========*=======
    సుతుడనుచు దశరధుండు,సుగ్రీవు డతి బలుడవగు
    హితుడనుచును వానరులు,హింసించు కంసుని జంప
    క్షితిపతి వనుచు భూపతులు కిర్తించు చుండిరి గాని
    పతిత పావనుడని నిన్ను వారు దెలియగ లేరైరి!
    ======*========
    అల జరాసంధాదు లెల్ల నాత్మ విరోధి వటంచు
    కలవాడవని కుచేలుండు కవులు సద్గుణుడవనుచును
    చెలికాడ వనుచు పాండవులు జేరిరి నీజెంతకు గాని
    జలజాక్షుడవు నీవనుచును సామాన్యులు దెలియ లేరైరి!
    =======*=======
    నరుడ వనుచు నరులెల్ల,నరకాదులు విరోధి వనుచు
    దొరవని జేరె యాదవులు దురితము ద్రుంచగ జనులు
    వరుడ వనుచు గోప సతులు వరదుడవని గొల్చె గాని
    పరమాత్ముడవనుచు నిన్ను వారు భావింప లేరైరి!
    =======*========
    మురళీధర! గోవర్ధన
    గిరి ధారీ! దీన జనుల క్షేమము కోరీ!
    మరి మరి హరివై!హరివై
    ధరణికి పరిపరి విధముల త్రాతవు కృష్ణా!

    రిప్లయితొలగించండి
  5. నేమాని పండితార్యా! శ్రావ్యమైన పద్య గీతికలు! నమోనమామి!

    నల్ల కలువ మోము, పిల్లన గ్రోవియున్,
    ఘల్లుఘల్లు మనెడు కాలి గజ్జె,
    చిట్టిపొట్టి యడుగు లిట్టట్టు వేయుచు
    నందు నిందు నాడు నందు పట్టి!

    ఆవు పొదుగు చెంత 'ఆ' యని నోరుంచి
    క్షీర మాను నందశిశువు వదన
    బింబ రుచుల గాంచి బిడియమ్ముతో దాగె
    మబ్బు వెనుక చందమామ గనుడు!

    చేత కొంత వెన్న, మూతిని మరి కొంత,
    మెడను పులి నఖమ్ము మెరయుచుండ
    బెట్టు సేయు ముద్దు బెట్ట రావే యన్న,
    చుట్టు ముంగమూతి సున్న వోలె!

    పల్లె లోని పడుచు పిల్లల చూపులు
    చిన్ని కృష్ణు పైనె యున్న వంచు
    దృష్టి తీసివైచు దినదినమ్ము యశోద
    వన్నె తగ్గకుండ వెన్న దొంగ!

    రారా! నందకుమారా!
    రారా! నవనీత చోర! రార! మురారీ!
    రారా! నగధర! నాకీ
    వేరా! శరణంటి పదము లిమ్ముగ కృష్ణా!

    రిప్లయితొలగించండి
  6. శ్రీ నేమానివారి కృష్ణ స్తుతి శబ్దశోభితమై అలరారుతోంది. చక్కని స్తుతి రచించి అందించినందులకు ప్రశంసలు, కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  7. ఈనాటి కృష్ణాష్టమి స్తోత్రములలో శ్రీ వర ప్రసాద్ గారు మరియు శ్రీ మిస్సన్న గారు కూడా మంచి ఊపుతో భక్తి తన్మయత్వమును నింపేసేరు. చాలా సంతోషము. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. శ్రీ వరప్రసాద్ గారికి ,నమస్సులు,..
    కృష్ణుడిని ఎవరెవరు తమ హృదయాలలో ఎలా బావిస్తున్నారో చాలా బాగా వ్రాసారు..అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. శ్రీ మిస్సన్నగారికి నమస్సులు,..
    బాలకృష్ణుడిని అద్బుతంగా వర్ణించారు,..చేతకొంతవెన్న,మూతిని మరికొంత,పద్యములో చిన్ని బాలకృష్ణుడిని చూసినట్లే అన్పించింది...అభినందనలు..

    రిప్లయితొలగించండి
  10. కొంటె కృష్ణునిపై శ్రీయుతులు నేమానిగారు, ప్రసాద్ గారు, మిస్సన్న గారు వ్రాసిన పద్యములు చాలా బాగున్నవి.

    వెన్నను మించిన మనసుర !
    వెన్నంటిన నీదు మోము వెలుగొందునురా !
    వెన్నంటి నన్ను బ్రోవుము
    వెన్నుడవే కావ? కావ వేలర కృష్ణా !

    రిప్లయితొలగించండి
  11. పచ్చిమిరపకాయ వంటి బాలుండు గో
    కులమున౦ దు కూల్చె అలవిగాని
    పూతన శకట సుదివాత రాక్షసులను
    నోటజూపె విశ్వ నాటకమును

    రిప్లయితొలగించండి

  12. అన్నయ్యగారికి, అభివందనములు. శ్రీకృష్ణాష్టమి సందర్భముగా మీరు కూర్చిన శ్రీకృష్ణ స్తుతి భక్తియుతము గాను మనోజ్ఞముగా నున్నది. ఒక పది పర్యాయములు చదువుకొని ధన్యుడనయ్యాను. ధన్యవాదములు. మిస్సన్న మహాశయుల వారి పద్యాలు,శ్రీ వరప్రసాద్ గారి పద్యాలు కూడా అలరిస్తున్నాయి. గురువు గారికి వందనములు. మిత్రులకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.



    రిప్లయితొలగించండి
  13. శ్రీ నేమాని పండితులకు, శైలజగారికి, మూర్తిమిత్రునకు, హనుమచ్ఛాస్త్రిగార్కి ధన్యవాదములు.

    శైలజ గారికి పద్య రచన పట్ల ఉన్న ఉత్సాహం త్వరలోనే వారిని పద్యకవయిత్రిగా జేయగలదని నమ్ముతున్నాను.

    మూర్తిమిత్రులు ఈ మధ్యన బొత్తిగా శీతాకాలంలో ఉంటున్నారు.

    హనుమచ్ఛాస్త్రి గారు అందమైన అనుప్రాసలతో పద్యాలు అదరగొట్టేస్తున్నారు.

    రిప్లయితొలగించండి