31, ఆగస్టు 2013, శనివారం

పద్య రచన – 450 (తెలుఁగు పద్యము)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము...
“తెలుఁగు పద్యము”

41 కామెంట్‌లు:

 1. నా పూర్వ రచన:

  పద్యమ్ము పద్మసంభవ భామినీ విలా
  ....సాద్భుత రచనా మహత్త్వఫలము
  పద్యమ్ము కవిరాజ వాక్సుధా వాహినీ
  ....వీచీవిలోల కవిత్త్వ మయము
  పద్యమ్ము సముచిత పద గుంఫనోపేత
  ....రసవిశేష పటుత్త్వ రాజితమ్ము
  పద్యమ్ము శబ్దార్థ వైచిత్ర్య విన్యాస
  ....బాహుళ్య రుచిర సంపల్లలితము
  సాహితీ నందనోద్యాన జనిత పారి
  జాత సుమథుర సౌరభ సార కలిత
  పద్యము మనోహరాకార వైభవమ్ము
  భవ్య సౌవర్ణ భావ సౌభాగ్యవతికి

  (ఈ పద్యములో ఓం, ఐం, హ్రీం, శ్రీం అను మంత్రబీజములకు సంబంధించిన మహత్త్వ, కవిత్త్వ, పటుత్త్వ, సంపదలు 4 పాదములలో వరుసగ నున్నవి. స్వస్తి)

  రిప్లయితొలగించండి
 2. అచ్చ తెనుగులో:

  అచ్చపు దెనుగున నెల్లరు
  మెచ్చుకొనెడు నటుల నలరు మేలిమి తలపుల్
  ముచ్చటలిడు పలుకులతో
  చెచ్చెర పద్దెములు వ్రాసి చెలగెద వేడ్కన్

  రిప్లయితొలగించండి
 3. గురుదేవులందరికి పాదాభివందనాలు..
  ............................

  "మధుర సుధలు నింపు, మహిమాన్వితంబౌను!
  సులలితంబు సరససుందరంబు!
  హృద్యమైన తెలుగు పద్యమున్ వినినంత
  యెదలు పులకరించి మదులఁ దోచు!

  రిప్లయితొలగించండి

 4. తెలుగు పద్యమ్ము క్లిష్ట తరము
  ఎంత వ్రాసినను అర్థము కాదు
  అనుకొనుట తప్పు సుమా
  రాయగ రాయగ మేలగును సుమా !

  శుభోదయం
  జిలేబి
  (స్వంత ఘోష!)

  రిప్లయితొలగించండి
 5. ఛందమందు పద్యమందమ్ముగానుండు
  పామరునికినైన బాడ సుఖము
  గాత్ర శుద్ధిగలుగు గానమ్ము సేయగా
  తెలుగు పద్య మెపుడు వెలుగు జగతి.

  రిప్లయితొలగించండి
 6. తెలుగున పద్యము తీయన
  మిలమిలమని మెరయునెపుడు మిన్ననతారన్
  పలికిన పదముల భావము
  సులువుగధారణ పరుగిడి సురుచిరమగున్


  తేనెకన్న తీపి తెలుగుభాష
  పాలధారవోలె పద్యముండు
  భావనిధులువేడి భారతీదేవికి
  ఆటవెలదితోడ ఆర్ఘ్యమిత్తు

  రిప్లయితొలగించండి
 7. 2.
  తెలుగు పద్యమ్ము రుచిమించు తేనెఊట
  పొగడ హృదయమ్ము దోచెడి పూలతోట
  మంచి మార్గమ్ముఁదెలిపెడి మంచిమాట
  తెలుగు జాతి తేజమ్మును తెలుపునంట.

  రిప్లయితొలగించండి
 8. పండిత నేమాని వారూ,
  పద్య స్వరూపాన్ని మనోహరమైన సీసంలో వివరించడమే కాక, అచ్చతెనుఁగులో ముచ్చటైన పద్యాన్ని వ్రాసి ఆనందింపజేసారు. ధన్యవాదాలు.
  *
  శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
  చక్కని పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  ‘వినినంత నెదలు’ అనండి.
  *
  జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం......

  “తెలుఁగు పద్యమ్ము క్లిష్టమ్ము; తెలియరాని
  దెంత చదివిన వ్రాసిన సుంతయేని”
  యని తలంచుట దోషమే యందు నిపుడు
  కృషి యొనర్చిన మేలైన గెలుపు దక్కు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  తెలుగు పద్యం యొక్క వెలుగును సాక్షాత్కరింపజేసారు మీ పద్యంలో. బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. శైలజ గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి పద్యంలో ‘మిన్నున’కు ‘మిన్నన’ అని టైపాటు అనుకుంటాను. ‘సురుచిరమగున్’ అంటే గణదోషం. ‘సురుచిరము నగున్’ అంటే సరి!
  రెండవ పద్యం మొదటిపాదంలో గణదోషం. ‘తెలుగు భాష మనది’ అంటే సరిపోతుంది.
  *
  శ్రీ యెర్రాజి జయసారథి గారూ,
  అంత్యప్రాసతో మీ రెండవ పద్యం మధురంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

  గురువుగారు నా ప్రయత్నము లన్నియు మీ భిక్ష.శ్రీ నేమాని పండితుల వారు మార్గము జూపగ నేను ఆ మార్గమున నడచు చుంటిని.

  ఆది కవి నన్నయకలము నందు బుట్టి
  తెలుగు జాతికి నిండుగ వెలుగు నిచ్చె,
  తిక్కన కరము నందున తీపిని గొని
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  ఎంచె నెర్రా ప్రగడ వారు మంచి దనుచు
  శంభు దాసుడై కొంగ్రొత్త శైలి నందు
  విష్ణు కథలు వ్రాయగ మంచి విరుపు తోడ
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  నవ రసముల శ్రీనాథుని నవ్య శైలి
  పద పద యను పోతన గారి పద్య రాశి
  తెనుగు వారింట మెండుగా దీప మయ్యె
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  పలికె నన్యులు తెనుగును పరవశమున
  దేవ రాయులు జిహ్వకు తీపి నింప
  దేశ బాషల యందున తెలుగు లెస్స
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  వేయి పడగలతో నిల్చె "విశ్వ నాథ "
  నేర్చి బాష సి. నా . రెడ్డి నెమ్మది గను
  జ్ఞాన పీఠ్ కు రావూరి విజ్ఞా న కవుల
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  కంది వారి మదిని మంచి గంధ మయ్యె
  రామజోగి వారల పద్య రాశు లెల్ల
  శంక రాభరణము నందు స్నాన మాడ
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర !

  రిప్లయితొలగించండి

 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
  శ్రీ నేమానిగురుదేవుల మంత్రబీజము సీసము, అచ్చ తెనుగు పద్యము , శ్రీ జయ సారథి గారి మధుర సుధలు, తెలుగు జాతి తేజమ్ము, శ్రీ జిలేబి గారి "క్లిష్ట తరము" (పద్య రచనకు ) శ్రీ గోలి వారి గాత్ర శుద్ధి, శ్రీ శైలజ గారి పాలధార, శ్రీ శంకరయ్య గురుదేవుల కృషి జూచిన పిమ్మట మరొక పద్యము
  =====*======
  సత్కవుల చిరు నగవుల సంపదలను
  భావి తరముల వారికి పంచి, నీతి
  శతక కర్తల సుమములు శాంతి తోడ
  తెనుగు పద్యము పరులిడె తేజ మలర!

  రిప్లయితొలగించండి
 12. తెలుగు పద్యపు భావమ్ము తీ యనగుచు
  సంతసమ్మును గలిగించు జదు వరులకు
  అందువలననే ననియెను నాంధ్ర భోజు
  డైన రాయలు మఱి లెస్స యైన దనియు

  రిప్లయితొలగించండి
 13. అందమౌ రూపమ్ము నాదికవులు గూర్చి
  ....ప్రాణమ్ము పోసిరి పద్యమునకు
  పాలు తేనెలు పండ్లు పంచదారలు పోసి
  ....యభివృద్ధి నొందింఛి రాదరమున
  యతులు ప్రాసలు చిత్రమైన విన్యాసాలు
  ....వెలయింప జేసిరి వేడ్క గొలుప
  శబ్దార్థ వైచిత్ర్య సద్భూషణాళితో
  ....నలరింపగా జేసి రంచితముగ
  వివిధ రీతుల నలరు కవిత్వములని
  ఎందరెందరో కవివరుల్ హృద్యముగను
  తీర్చి దిద్దుచు నుండగా తెలుగు పద్య
  వైభవ మ్మద్భుతమ్ముగ పరిఢవిల్లు

  కమలాసను రమణీమణి
  ప్రమదమ్మున బూను తెలుగు పద్యంబను బల్
  వెలుగుల మణిమయ దీపిక
  బళి బళి! యా యోగమన్య భాషల గలదే?

  రిప్లయితొలగించండి
 14. శ్రీ నేమాని గురుదేవులు ఒక్క సీస పద్యము నందు తెలుగు బాషకుగల చిత్రమైన విన్యాసాలు గూర్చి అద్భుతముగా తెలియజేనినారు.

  రిప్లయితొలగించండి
 15. వైభవమ్ము దెలుప కవి వర్యులకును
  సీస పద్యము జాలుగ, సిరులొలికెడి
  తెలుగు బాషకుగల నవ్య వెలుగు జూప,
  పండితులవారి కలమున పరిఢవిల్లె.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ వరప్రసాద్ గారికి, నమస్సులు,
  తెలుగు పద్య వైభవాన్ని చాటుతున్న మీ పద్యములన్నీ హృద్యముగా వున్నాయి..నిన్న వ్రాసిన పద్యములపై గురువుగారి ప్రశంశలు పొందిన మీకు నా అభినందనలు..

  రిప్లయితొలగించండి
 17. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారు మీరు ఎన్నెన్నో పద్యములను వ్రాయుచున్నారు. అన్నియునూ ప్రశంసార్హములే. అభినందనలు. ఒకచో "నవ్య వెలుగు" అని వాడేరు. నవ్య దీప్తి అనండి. లేకుంటే దుష్ట సమాసము అంటారు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ శైలజ గారికి ధన్యవాదములు.మీరు కుడా మంచి పద్యములు వ్రాస్తున్నారు. కొంచెం గణము పై శ్రద్ధ జుపండి..మీకు నా అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. క్రొత్త వెలుగు నను బావములో వ్రాసితిని. దుష్ట సమాసము మగునని తెలియక, సవరణతో...

  వైభవమ్ము దెలుప కవి వర్యులకును
  సీస పద్యము జాలుగ, సిరులొలికెడి
  తెలుగు బాషకుగల నవ్య దీప్తి జూప,
  పండితుల వారి కలమున పరిఢవిల్లె.

  రిప్లయితొలగించండి
 20. నేమాని పండితార్యా! మేలు మేలు! అద్భుతంగా వర్ణించేరు తెలుగు పద్యాన్ని.
  వరప్రసాదు గారూ! మీ పద్యాలు చాలా బాగున్నాయి.

  తెలుగను నర్తన వేదిని
  సలిపెడు నృత్యమ్ము పద్య శైలూషి యదే!
  తలలూపుచు సరసులు గని
  భళిభళి యని మెచ్చుకొనగ భవ్య గతులలో!

  తెలుగు పద్య మన్న వెలలేని బంగరు
  పాత్ర నున్న యమృత ఫలము సుమ్ము!
  మనసు పడిన వారి కనుపమ మధురమౌ
  రసము లూర జేయు రసన పైన!

  తేటగీతి సీస మాట వెలందులు
  నందమైన వృత్త కంద గతులు
  రాగ తాళ వాద్య లయబద్ధమై సాగు
  నాలకించు చెవుల కమృత ఝరులు!

  వస్తువెట్టిదైన వర్థిల్లు తెలుగున
  పద్యమందు నొదిగి, బంగరంపు
  టుంగరమున రత్న మొదిగిన రీతిగా!
  పోతబోయ బడిన బొమ్మ వోలె!

  పద్యము తెల్గు భారతికి పచ్చల హారము కంఠ సీమలో!
  హృద్యము దీని సోయగము నింపులు సొంపులు! కావ్య సీమలన్
  సేద్యము జేయు రైతులకు శ్రీల నొసంగెడు పైరు! స్వంతమౌ
  విద్యది తెన్గు వారలకు! విత్తము సత్కవి కెన్న నిద్ధరన్!

  రిప్లయితొలగించండి
 21. శ్రీ పండిత నేమాని గారు బీజాక్షరాల స్వరూపాలను పద్యములొ ప్రస్పుటింప జేసిన తీరు
  పోతనగారి అమ్మలలగన్నయమ్మ అను పద్యాన్ని స్పురణకు తెచ్చింది.వారి పద్యాలు చాలా గొప్పగా యున్నాయి. శ్రీయుతులు మిస్సన్న, వరప్రసాదు మరియు కవిమిత్రుల పూరణలన్నియును చాలా బాగున్నాయి.

  గురువుల లఘువుల కుదురుగా కూర్చిన
  పలు గణమ్ముల మాల పద్యమోయి
  ప్రాసలు యతులను పరిమితుల్ గల్గిన
  విద్యయే రసరమ్య పద్య మోయి
  మత్త కోకిలలును మత్తేభవృత్తాలు
  పాదపములునుండు పద్యమోయి
  సంధి సమాసాలు సహజోపమానాలు
  పాదమ్ములందుండు పద్యమోయి

  పద్యమే తెల్గు భాషకు ప్రాణ మోయి
  పద్యమే తెల్గు ప్రజల సౌభాగ్య మోయి
  పద్యమే వాణి కిష్ట నైవేద్య మోయి
  పద్యమేగద కవులకు ప్రాణపదము!!!

  రిప్లయితొలగించండి
 22. తెలుఁగు పద్యము :

  గట్టుతేనియకన్నఁ కమనీయమై పొల్చుఁ
  .........చక్కెర పాకమున్ ధిక్కరించుఁ
  నిర్మలకల్లోలినీ ఒంపుసొంపులన్
  .........పరిహసించగలట్టి తరుణిగాదె
  పర్వతాగ్రములకూర్ద్వముఖంబుగా వెల్గుఁ
  .........పవనదైవమవోలె వ్యాప్తిఁగలదు
  సంపూర్ణ పౌర్నమీ చంద్రోజ్వలా కాంతి
  ......... చిన్నబోవునుఁ గాదె నిన్నుఁజూసి

  కళలఁ కావ్యంబులన్ నాటకములయందు
  మేటి యవధాన మందు సమృద్ధి గాచి
  విశ్వవిఖ్యాతమై వేనవేల యేళ్ళు
  తెలుఁగు పద్యమ్ము నిత్యమై వెలుఁగుచుండు ( వెలుఁగు గాత )


  రిప్లయితొలగించండి
 23. వరప్రసాద్ గారూ,
  ఈరోజు మీలో పద్యావేశం పెల్లుబికినట్లుంది. చాలా మంచి పద్యాలు వ్రాసారు. అభినందనలు.
  మొదటి విడత పద్యాలలో మకుట పాదంలో ‘పరుగిడె’కి ‘పరులిడె’ అని టైపాటు అనుకుంటాను.
  *
  సుబ్బారావు గారూ,
  మంచి పద్యం వ్రాసారు. అభినందనలు.
  ‘అందువలననే + ఆనియెను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. అక్కడ ‘అందువలన తా ననియెను’ అంటే బాగుంటుంది.
  *
  పండిత నేమాని వారూ,
  తెలుగు పద్య ప్రాభవాన్ని మనోహరంగా వర్ణించారు. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  తెలుగు పద్య సోయగాన్ని అద్భుతంగా వర్ణించారు. అభినందనలు.
  ‘విద్య + అది’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. “విద్యయె తెల్గువారలకు..’ అనవచ్చు కదా!
  *
  మంద పీతాంబర్ గారూ,
  తెలుగు పద్యస్వరూపాన్ని మనోజ్ఞంగా వర్ణిస్తూ అందమైన పద్యాన్ని వ్రాసారు. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ‘తెలుఁగు పద్యమ్ము నిత్యమై వెలుఁగు గాత’ అంటూ దాని సౌందర్యాన్ని మధురమైన పద్యంలో వివరించారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో....
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు. శ్రీ మిస్సన్న గారికి,శ్రీ మంద పీతాంబర్ గారికి ధన్యవాదములు.
  శ్రీ మిస్సన్న గారి "తెలుగను నర్తన వేదిని" చాలా బాగుగానున్నది,
  శ్రీ మంద పీతాంబర్ గారికి "పద్యమోయి" చాలా బాగుగానున్నది,

  కందములో

  గలవే? యవధానమ్ములు
  గలవే? ప్రాస యతులనెడి కలకండలు,రా
  గలవే? పర బాషలు,పో
  గలవే? ముందుకు తెనుగున గాన మధురమున్?

  గలరే? యవధానులు, మన
  గలరే? జంట కవుల సరి గలరే? భువిలో
  గలరే? సహజ కవులు, కన
  గలరే? తెనుగు పద ఝరిని,కమ్మదనమునన్?

  రిప్లయితొలగించండి
 25. పూజ్యగురుదేవులు శ౦కరయ్యగారిక్ నమస్కారములు

  ఛందము సంస్కృత భాషది
  సుందరముగ ప్రాస యతులు శోభిల్లంగన్
  విందొనరించే యమకము
  అందమ్ముగ తెలుగు పద్య యానమ్మమరెన్

  తొలుత రచించె భారతము తోరము పూరము నన్నపార్యుడా
  లలిత మనోజ్ఞ ఛందముల లాలనజేయుచు కందపద్యముల్
  తలిరుల తేటగీతి లయ తాళము మేలగు ఆటలాడు యా
  వెలదులు సీసముల్గల కవిత్వపు మార్గము దేశ రీతులున్

  సాక్షర రమ్యతల్ గల ప్రసన్నకథా కలితార్ధయుక్తి మై
  దీక్షగ ఆంధ్రమo దనువదించెను వ్యాసుని భారతమ్మునున్
  అక్షరమైన కావ్యముగ అంకితమిచ్చెను రాజరాజుకున్
  సాక్షిగనిల్చె నీ తెలుగు సాహితినందు ప్రమాణ గ్రంథ మై

  తరువోజలు మధురాక్కర
  మరులొల్కెడి తరలములును మానిని, మాలల్
  ఉరుమత్తేభము, స్రగ్ధర
  గురుశార్దూలములు మత్తకోకిలలమరన్

  నాటి నన్నపార్యుని నుండి నేటివరకు
  తెలుగు పద్యమ్ములన్ని హoగులు ధరించి
  ద్విపదకావ్యముల్, శతకముల్ వీరశైవ
  గాథలన్నియు వెలుగొందె క్రాంతినిడుచు

  భగవదంకితమైనట్టి భాగవతము
  భక్తి కావ్యముల్ బసవేశు పథమునందు
  కాశివిశ్వేశు శ్రీనాథు కావ్యములును
  రాజులందరు మెచ్చెడి ప్రణయములును

  పది శతాబ్దముల్ గడచెను ప్రజల కొరకు
  పద్య నాటక అవథాన ప్రక్రియలను
  భావగీతముల్ విప్లవభరిత రచన
  నేడు వినిపించుచున్నవి వాడ వాడ

  “నా” యన స్వార్థంబయ్యెను
  “నీ” యన నింద్యమ్ము గాదె నీతిగ బ్రతకన్
  నాయన పద్యము వ్రాయుము
  సాయము చేయంగ క్రొత్తసాహితి కొఱకున్

  రిప్లయితొలగించండి
 26. మాస్టరుగారూ ! ధన్యవాదములు. తెలుగు పద్యము గురించి హృద్యముగా జెప్పిన కవిశేఖరులందరికీ అభినందనలు.వరప్రసాదు గారి పద్య ధార..వసంత కిశోర్ గారిని గుర్తుకు తెచ్చుచున్నది..వారికి అభినందనలు.కిశోర్జీ ఎలా ఉన్నారు...

  రిప్లయితొలగించండి
 27. శ్రీ తిమ్మాజీరావు గారి భావౌచిత్యము మరియు ధారాశుద్ధికి జోహారులు. వారి పద్యములు బహుధా ప్రశంసనీయములు. వారికి అభినందనలు. కొన్ని సూచనలు:

  1. విందొనరించే యమకము: విందొనరించెడి యమకము అనుట సాధువు.
  2. లలిత మనోజ్ఞచందములు: సమాసము సాధువు కాదు - వ్యాకరణ కార్యమును కూడా చూడండి.
  3. రాజరాజుకున్: రాజరాజునకున్ అనుట సాధువు.
  4. సాహితి నందు : సాహితి యందు అనవలెను.
  5. పద్య నాటక అవధాన ప్రక్రియ: విసంధిగా నుంచ రాదు.
  6. బ్రతకన్: బ్రతుకన్ అనుట సాధువు (టైపు పొరపాటు కావచ్చును).
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 28. *శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములు.
  *మా పద్యములను చదివి మాకు తప్పులను ఒప్పులను తెలియ జేయుచు, మమ్ము ప్రోత్సహిస్తున్న వారికి మరొక్క మారు పాదాభివందనములు, మీ దయ,కృషి తో తెలుగు పద్యము పది కాలములు తప్పక జీవించును.

  *గోలి హనుమచ్ఛాస్త్రి గారికి ధన్యవాదములు.

  *శ్రీ తిమ్మాజీరావు గారి" క్రొత్తసాహితి" లో అన్ని వృత్తములను చక్కగా వివరించారు.

  రిప్లయితొలగించండి
 29. తెలుగుకు పద్యమ్మందము
  తెలుగుకు ఛందస్సు వలన తేజము గలిగెన్
  తెలుగు పదాంతములో న
  చ్చులు వచ్చుచు వరలులు సుస్వరములతో.

  రిప్లయితొలగించండి

 30. తెలుగు పద్యము వెలిగెను తెలుగు నాట
  తెలుగు పద్యము లందున తేనె గలదు
  తెలుగు పద్యము భాషకు విలువ బెంచె
  తెలుగు పద్యముల్ రాగాల తీగ లయ్య

  రిప్లయితొలగించండి
 31. నన్నయాదుల చేత నడిపించబడెనిద్ది
  కుసుమములనుబోలు కోమలతల;
  పోతన్న బలుకుల పూదేనె లొల్కెనె
  నోళ్ళెల్ల మధురంపు నుడుల తోడ;
  శ్రీనాథు పదునైన జిహ్వబలికెనిద్ది
  ప్రౌఢరీతుల నిల ప్రభల జిలుక;
  కృష్ణశాస్త్రి విరహ కృతులందు విహరించి
  మరపించె మేనుల, మతులు దప్ప;

  ముద్దులొలుకు బాల ముసినవ్వులను బోలు
  నచిరకాలముండ నతిశయమేమొకో,
  తెలుగు పద్యమిదియె గెలుచు మనములను
  లెస్సయైన భాష లేదిట్టి దెచ్చట.

  అందరి పద్యములు బహు సుందరములు.

  రిప్లయితొలగించండి
 32. గురువుగారూ ధన్యవాదములు. మీ సవరణ బాగున్నది.

  తిమ్మాజీరావుగారి పద్యములు మనోహరంగా శోభిల్లుతున్నాయి.

  రిప్లయితొలగించండి
 33. లక్ష్మీ దేవి గారూ మీ సీస పద్యం మనోజ్ఞంగా ఉంది.
  సీస పాదాల తర్వాత పద్యం సరిజేయాలేమో ఒక సారి చూడండి.

  రిప్లయితొలగించండి
 34. తప్పేమిటో చెప్పేయండి మిస్సన్నగారూ, నాకేమీ తెలీలేదు. ఆటవెలదిలో

  రిప్లయితొలగించండి
 35. లక్ష్మీ దేవి గారూ ఆట వెలదిలో 2, 4 పాదాల్లో 5 సూర్య గణాలు ఉండాలి కదా.

  రిప్లయితొలగించండి
 36. తెలిసినది...తెలిసినది.

  ముద్దులొలుకు బాల ముసినవ్వులను బోలు
  లెస్సయైన భాష లేమ , మనది.
  తెలుగు పద్యమిదియె గెలుచు మనములను
  స్థిరకాలముండు చింతలేల?

  గబగబా వ్రాయాలన్న తొందర ఎప్పుడు పోతుందో?

  రిప్లయితొలగించండి
 37. మిస్సన్న గారు,
  మీ వ్యాఖ్య చూడలేదు. సిస్టమ్ మూసేసి మళ్ళీ పరుగెత్తుకొచ్చినాను.
  మీరు చెప్పకపోతే గమనించకపోదును. అలవాటు తప్పినది. అభ్యాసము లేక.

  రిప్లయితొలగించండి
 38. వరప్రసాద్ గారూ,
  అంత్యానుప్రాసతో మీ కందపద్యాలు అందంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ ఖండిక మనోహరంగా ఉంది. అభినందనలు.
  పండిత నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా!
  ‘లలిత మనోజ్ఞ వైఖరులు’ అందాం.
  ‘అక్షరమైన కావ్యమది యంకితమందెను రాజరాజు తా
  సాక్షిగనిల్చె...’ అంటే సరిపోతుంది.
  ‘పద్య నాటకా లవధాన...’ అనండి.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ సీసపద్యం బాగుంది. అభినందనలు.
  (సవరించిన తర్వాత కూడా) చివరి పాదంలో గణదోషం. ‘స్థిరముగ విలసిల్లు చింత యేల’ అందామా?

  రిప్లయితొలగించండి
 39. తెలుగుకు పద్యమ్మందము
  తెలుగుకు ఛందస్సు వలన తేజము గలిగెన్
  తెలుగు పదాంతములో న
  చ్చులు వచ్చుచు వరలుచుండు సుస్వరములతో.

  రిప్లయితొలగించండి
 40. గురువు గారు,
  మీ సవరణ శిరోధార్యము.
  మన్నించండి.
  ధన్యవాదాలు.
  మిస్సన్నగారు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి