7, ఆగస్టు 2013, బుధవారం

సమస్యాపూరణం – 1136 (పాండవులు దుష్టచిత్తులై)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
పాండవులు దుష్టచిత్తులై భంగపడిరి.

20 కామెంట్‌లు:

  1. వాసమొనరించు చుండగా భద్రముగను
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    కౌరవులు ఘోషయాత్రకై గర్వ మెసగ
    నరిగి గంధర్వులకు జిక్కి యార్తి నొంది

    రిప్లయితొలగించండి
  2. శిష్ట మానసులై నెగ్గి, సిరులు పొంది,
    మివుల నానందమునఁ దేలి, మిన్నలైరి
    పాండవులు! దుష్ట చిత్తులై భంగ పడిరి
    కౌరవులు! ధర్మమే గెల్చె ధారుణి పయి!!

    రిప్లయితొలగించండి
  3. మిత్రులారా! శుభాశీస్సులు.
    నిన్నటి సమస్య: అప్పిచ్చెడు వాడు వైద్యుడగు ననిరి బుధుల్ గురించి:

    భావ వైవిధ్యముతో పద చమత్కృతితో మంచి మంచి పూరణలు పుస్ఫాలుగా మిత్రు లెందరో సమర్పించేరు. అందరికీ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. ఓడిపోవగ జూదమ్ము నాడు సభను
    ధర్మరాజుయు తలవంచ తమ్ములున్ను
    కౌరవాధము డొక్కడు గీర బలికె
    పాండవులు దుష్టచిత్తులై భంగపడిరి.

    రిప్లయితొలగించండి
  5. ధర్మ నిరతులు ధరనేల తగిన వారు
    పాండవులు: దుష్ట చిత్తులై భంగ పడిరి
    కౌరవులుపెక్కు మారులు ధారుణముగ
    ధర్మ సుతునకే చివరకు ధరణి దక్కె!!!

    రిప్లయితొలగించండి
  6. సహన మెంతయొ గల్గిన సాత్వికుండ్రు
    పాండవులు! దుష్ట చిత్తులై భంగ పడిరి
    గారవింపక ధర్మంబు కౌరవుండ్రు !
    భాగ్య ఫలమున జదువరే భారతమ్ము !!

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    ========*========
    ధర్మ మార్గమున నడచి ధరణి యందు
    నస్త్ర శస్త్ర విద్యల నెల్ల నభ్య సించె
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    కౌరవులు ఘనముగ నేర్చి గపట విద్య.

    రిప్లయితొలగించండి
  8. సాధు వర్తనులు మఱియు సాత్త్వికులు ను
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    ధార్త రాష్ట్రులు ఘోష యాత్ర కరి గి కద !
    మేలు జరుగును నిరతము మైత్రి వలన

    రిప్లయితొలగించండి
  9. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి మిత్రుల పూరణ లన్నియును నలరించుచున్నవి. అందరికి అభినందనలు.

    1.శ్రీ మధుసూదన్ గారు: మంచి విరుపుతో మీరు చెప్పిన విధము ధర్మమే గెలిచినది అనుట - పద్యము చాల బాగుగ నున్నది.

    2.శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: ఒక కౌరవాథముడు గేలిచేసిన విధమును మీరు పేర్కొనినారు - పద్యము చాల బాగుగ నున్నది.

    3. శ్రీ పీతాంబరం గారు: కౌరవులు దారుణముగ భంగపడిన విధమును మీరు మంచి విరుపుతో వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    4. తమ్ముడు డా. నరసింహమూర్తి: నీ పూరణ చాల బాగుగ నున్నది. సాత్వికుండ్రుకి బదులుగా సత్వగుణులు అన వచ్చు అలాగే కౌరవుండ్రుకి బదులుగ కౌరవతతి అంటే బాగుంటుంది.

    5. శ్రీ వరప్రసాద్ గారు: మీ పూరణ చాల బాగుగ నున్నది. అభ్యసించె పాండవులు అనుటలో అన్వయము బాగు లేదు. అభ్యసించిరి అనవలెను కదా. ఆ పాదమును ఇలాగ మార్చుదామూ:
    "అస్త్ర శస్త్ర విద్యల నేర్చి రద్భుతముగ" -- అని.

    శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది - ఘోష యాత్రను ఉట్టకించేరు. ఆఖరి పాదములో మేకి మైకి యతి మైత్రి లేదు.

    రిప్లయితొలగించండి
  10. విరటు కొలువున జేరంగ భీతి జెంది
    మనల గుర్తించు వారున్న మరల హాని
    దుష్ట దుర్యోధ నాదుల దురిత గతిని
    పాండవులు దుష్ట చిత్తులై భంగ పడిరి

    రిప్లయితొలగించండి
  11. సహన శీలురు సద్ధర్మ సమర ఘనులు
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    పార్థు నెదిరించి నిలవక పారిపోయి
    కౌరవులు, గో గ్రహణసంగ్రామమందు

    రిప్లయితొలగించండి
  12. సాధు వర్తనులు మఱియు సాత్త్వికులు ను
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    ధార్త రాష్ట్రులు ఘోష యాత్ర కరి గి కద !
    కలిసి యుండిన నెంతైన కలుగు సుఖము

    రిప్లయితొలగించండి
  13. సహన శీలురు సద్ధర్మ సమర ఘనులు
    పాండవులు, దుష్ట చిత్తులై భంగ పడిరి
    పార్థు నెదిరించి నిలవక పారిపోయి
    కౌరవులు, గో గ్రహణపు సంగ్రామమందు

    రిప్లయితొలగించండి
  14. ధర్మరాజాదులెవ్వరు? ధార్తరాష్ట్రు
    లెట్టి చిత్తులై మసలిరి? ఎట్టి ఫలము
    గొనిరి? తెలుపుము ఘోషయాత్రను వరుసగ
    పాండవులు, దుష్టచిత్తులై, భంగపడిరి

    రిప్లయితొలగించండి
  15. మిత్రులారా! మరికొన్ని పూరణలను తిలకించుదాము. ముందుగా అందరికీ శుభాభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు: అమ్మా! మీ పద్యములో అన్వయము సమముగా లేదు. మరికొంచెము అర్థవంతముగా వచ్చే రీతిగా ప్రయత్నించండి.

    శ్రీ లక్ష్మీనారాయణ గారు: మీరు ఉత్తర గోగ్రహణము గురించి ప్రస్తావించేరు - పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: సవరించిన మీ పద్యము చాల బాగుగ నున్నది.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: మీరు క్రమాలంకారమును ఆశ్రయించేరు. పద్యము బాగుగ నున్నది.

    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. కీర్తినందిరి సన్మార్గవర్తనమున
    పాండవులు, దుష్టచిత్తులై భంగపడిరి
    ధార్తరాష్ట్రులు తప్పదు ధరణిలోన
    పలువలకు నెల్లవేళల భంగపాటు.

    రిప్లయితొలగించండి
  17. కవి మిత్రులకు నమస్కృతులు.
    నా ఆరోగ్యం మరింత దిగజారింది. జ్వరంతో ఒళ్ళు కాలిపోతున్నది. గొంతు ఇన్ఫెక్షన్. దగ్గు, కళ్ళ మంట. ఈ పరిస్థితిలో మీ రచనల సమీక్ష చేయలేకపోతున్నాను. మన్నించండి.
    గురుదేవులు పండిత నేమాని వారు దయతో మిత్రుల పూరణల, పద్యాల గుణదోష విచారణ చేస్తూ, తగిన సూచన లిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వారికి కృతజ్ఞతా పూర్వక నమోవాకాలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. శ్రీ హరి...మూర్తి గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది.
    పలువలకు నెల్ల వేళల భంగపాటు అనే వాక్యము ప్రశంసనీయము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. ఆర్యా!
    ధన్యవాదములు.
    "సకలజగదంబ"కు బదులుగా "జగదధీశ్వరి" ప్రయోగము సుందరము, సముచితము.
    నమస్కారములు.

    శ్రీయుతులు శంకరయ్యగారికి జగన్నాథుడైన ఆ శంకరుడు త్వరగా స్వస్థత చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  20. అన్నయ్యగారికి ధన్యవాదములు. గురువు గారు త్వరగా కోలుకోవాలని భగవంతునికి ప్రార్ధనలు.

    రిప్లయితొలగించండి