24, ఆగస్టు 2013, శనివారం

సమస్యాపూరణం – 1153 (మురళీగానమ్ము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
మురళీగానమ్ము మరణమును గలిగించున్.

30 కామెంట్‌లు:

  1. గరగర మను గొంతుకతో
    సరిగమలా చాలుచాలు సాధన లింకన్
    పెరవారి జూడు మాపుము
    మురళీ! గానమ్ము మరణమును గలిగించున్.

    రిప్లయితొలగించండి
  2. ధరనుండి ముక్తిఁ గొనియెడి
    తరుణ మ్మాసన్నమైన దానవ తతికిన్
    నరుఁడైన బాలకృష్ణుని
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    రిప్లయితొలగించండి
  3. పరమానందము గూర్చును
    మురళీగానమ్ము, మరణమును గల్గించున్
    హరి హరి! తీతువు పిట్టలు
    కొరకొర గేహమ్ము జొచ్చి కూసిన యెడలన్

    రిప్లయితొలగించండి
  4. పరమ పదంబును జేర్చును
    మురళీ గానమ్ము, మరణమును గలిగించున్
    విరివిగ దీపి పదార్ధము
    అరయగ మధు మేహ రోగి యాహా రించన్

    రిప్లయితొలగించండి
  5. మిస్సన్న గారూ,
    కర్ణకఠోరమైన గానాన్నిగురించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    కృష్ణ మురళీగానం దానవులకు మరణశాసనమన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    నాగులవ పాదాన్ని అచ్చుతో ప్రారంభించారు. అక్కడ ‘పదార్థము/ లరుదుగ’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  6. నరపాలా! రూపాయిని
    పరికింపుము,లేనియెడల వాణిజ్యముకున్
    సరళీ కృత రాగజనిత
    మురళీగానమ్ము మరణమును గలిగించున్!!!

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమాని గారికి ,శంకరయ్య గారికి నమస్సులు

    మురళీ కృష్ణుని గానము
    తరుణులు విని గోకులమున తన్మయులవగా
    అరికంసమామ కనిశము
    మురళీ గానమ్ము మరణమును కలిగించున్

    రిప్లయితొలగించండి
  8. మురళీ గానము నాట్యము
    పురజనులెల్లకనియగ పులకితులవగన్
    హరిగనికాళీయునికి
    మురళీ గానమ్ము మరణమును గల్గించున్

    రిప్లయితొలగించండి
  9. భరియింపగరానిదయిన
    విరహపు వేదనకు నాడు- వీనుల విందై
    మురిపించెడు, సుమధురమౌ మురళీగానమ్ము-
    మరణమును గల్గించున్.

    రిప్లయితొలగించండి
  10. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

    గురుదేవులు ఆరోగ్యముపై శ్రద్ధ జుపండి,నా మనవి మీకు ప్రయాణములు సాధ్య మైనంతవరకు తగ్గించండి.
    ఆంద్ర రాష్ట్రములో పరిస్థితులు బాగుగా లేవు.
    శ్రీ మధుసూదన్ గారికి ధన్యవాదములు మీరు జెప్పినది నిజము. పప్పులో కాలు వేసితిని.
    రఘు రామ్ గారు నన్ను క్షమించగలరు.
    ======*=====
    సురలోక సుధకు సమమగు
    మురళీ గానమ్ము,మరణమును గలిగించున్
    ధరణి పయి రాక్షస తతికి,
    కరిని మకరి వలె ననిశము గరచిన యెడలన్ ।

    రిప్లయితొలగించండి
  11. శ్రీ మంద పీతాంబర్ గారు నా భాణిలో చాలా మంచి పద్యము వ్రాసినారు. నాకు ఆలోచన వచ్చినది కానీ పద్యము వ్రాయలేక పోతిని.

    సోదరి శ్రీ లక్ష్మీ దేవి గారికి పునః స్వాగతము.

    రిప్లయితొలగించండి
  12. విరహము లోనిను మరిమరి
    తరచుగ తలచితి పిలచితి తలపుల నినునే
    మరుచుట నెటులో వినకను
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    రిప్లయితొలగించండి
  13. శ్రీ మంద పీతాంబర్ గారి స్పూర్తితో
    ========*======
    నరపాలా!జూడుము నిక
    పరదేశపు డాలరులను వర్తకమునకై,
    మరువ మన దేశమున నీ
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    రిప్లయితొలగించండి
  14. మంద పీతాంబర్ గారూ,
    సరళీకృత వాణిజ్యవిధానం నలన నష్టమున్నదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘వాణిజ్యముకున్’ అనడం దోషం. ‘వాణిజ్యమునకున్’ అని అనవలసి ఉంటుంది. అక్కడ ‘వాణిజ్యమునన్’ అంటే సరి.
    *
    కెంబాయి తిమ్మాజీరావు గారూ,
    కంసునకు కృష్ణుని మురళీగానం ప్రాణాంతకమ్మన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కంసమామ’ అని సమాసం చేయడం దోషం. అక్కడ ‘అరి యగు కంసుం డనిశము’ అందామా?
    *
    శైలజ గారూ,
    మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    కొన్ని లోపాలు.. 2,4 పాదాల్లో గణదోషం. మీ పద్యానికి నా సవరణ....
    మురళీ గానము మధురా
    పురజనులెల్ల వినుచుండి పులకింపగ నా
    హరి గని కాళీయునకును
    మురళీ గానమ్ము మరణమును గల్గించున్
    *
    లక్ష్మీదేవి గారూ,
    మళ్ళీ ఎన్నాళ్లకు? సంతోషం!
    మురళీగానం వలన కలిగే విరహవేదన కంటే మరణం మేలైనదంటారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    రెండు మంచి పూరణ లిచ్చారు. అభినందనలు.
    ‘చూడుము + ఇక’ అన్నప్పుడు ‘చూడుమిక’ అవుతుంది. అక్కడ ‘కనుగొను మిక’ అందాం.
    *
    ‘శీనా’ శ్రీనివాస్ గారూ,
    మీ పూరణ అందంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు. సవరణతో
    ========*=======
    నరపాలా!కనుగొనుమిక
    పరదేశపు డాలరులను వర్తకమునకై,
    మరువ మన దేశమున నీ
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    పాకిస్తాన్ ను మన రూపాయిల ప్రింట్ నిలిపి డాలరులను ప్రింట్ జేసి పంపమని
    =======*=====
    నరపాలా!కోరుము మన
    పరదేశమును విలువ గల పది డాలరులన్,
    మరువ మన దేశమున నీ
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    రిప్లయితొలగించండి
  16. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
    ======*=======
    గిరులను కరగించు మధుర
    మురళీ గానమ్ము,మరణమును గలిగించున్
    హరి హరులను నిందించిన,
    వరదక్షిణ కోరి జంప పడతిని భువిలో!

    రిప్లయితొలగించండి
  17. ప్రస్తుత రాజకీయములపై
    =====*=======
    కిరణు కుమారు బలుకులన్,
    కరి మకరులు విని కదలగ కదనపు భూమిన్,
    పొరుగింటి "డిగ్గి" బాడెడి
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!
    ( డిగ్గి= దిగ్విజయ్ )

    రిప్లయితొలగించండి
  18. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు
    ఉల్లి ధర తగ్గించుటకు చర్యలు తీసుకుంటిమి అన్న మాట విన్న వారు పస్తులుండిన

    ======*=======
    గిరిపై నిలచిన యుల్లిని
    పురజనులందరికి నిడుదు పూనిక తోడన్,
    మరిమరి బాడెడి పాలక
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్!

    రిప్లయితొలగించండి
  19. శ్రీ వరప్రసాద్ గారూ ధన్యవాదములు . వైవిధ్యమైన భావములతో ఒకే సమస్యకు పలు రీతులలో మీదైన శైలితో పూరణలను చేస్తూ శంకరాభరణానికి మరింత శోభను చేకూర్చుతూ శ్రీ వసంత కిశోర్ గారిని తలపింప జెస్తున్నారు.మీకు అభినందనలు.
    శ్రీ శంకరయ్య గారూ నమస్కారం మీరు చేసిన సవరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ మంద పీతాంబర్ గారికి ధన్యవాదములు, ఇది అంతయూ గురుదేవుల కృప మరియు మీ అభిమానము.శ్రీ వసంత కిశోర్ గారు ఈ మధ్య బ్లాగున పద్యములు వ్రాయడం లేదు.

    రిప్లయితొలగించండి
  21. పరమహిత నందనందన
    మురళీ గానమ్ము మరణమును దొలగించున్
    ఖర దూషణ రవ భీషణ
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్

    రిప్లయితొలగించండి
  22. విరహము నందున మమతల
    మురళీ గానమ్ము మరణమును గలిగించున్
    మురళీ మోహన రూపము
    పరివృత మై కలత బెట్టి పాశము విడకన్

    రిప్లయితొలగించండి
  23. గురువుగారు మరియు సోదరుల సాదరవాక్కులకు ఎంతో ఆనందం కల్గింది.

    వీనుల విందై మురిపించెడు, సుమధురమౌ మురళీగానమ్ము-భరియింపగరానిదయిన విరహపు వేదనకు నాడు మరణమును గల్గించున్.
    అని నా ఉద్దేశ్యము. అట్ల ధ్వనింప జేయలేకపోయినాననుకుంటాను.

    రిప్లయితొలగించండి
  24. శ్రీ శంకరయ్య గురుదేవులకు నమస్కారములు
    మీరు సూచించిన విధముగా వ్యాఖ్యను సవరించితిని

    మురళీ కృష్ణుని గానము
    తరుణులు విని గోకులము న తన్మయులవగా
    అరియగు కంసుoడనిశము
    మురళీ గానమ్ము మరణమును కలిగించున్

    రిప్లయితొలగించండి
  25. పొరపడి మురళీ ఇంటికి
    బిరబిరమని పోయి జలదరింపుకు గురయ్య!
    సురములు కూడా వినవవి
    మరళీ గానమ్ము మరణమును కలిగించున్!

    రిప్లయితొలగించండి
  26. వరప్రసాద్ గారూ,
    మరి నాలుగు పూరణలను పంపారు. సంతోషం. అభినందనలు.
    పాకిస్తానును ప్రస్తావించిన పూరణలో అన్వయలోపం ఉన్నట్టు తోస్తున్నది.
    మిగిలిన పూరణలు వైవిధ్యంగా చక్కగా ఉన్నాయి.
    *
    పండిత నేమాని వారూ,
    కృష్ణావతారాన్ని ప్రస్తావించి రామావతార ఘట్టానికి ‘జంప్’ చేశారు. మీ పూరణ మనోజ్ఞంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ నిర్దోషంగా ఉంది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    అది నా అవగాహనా లోపం. మన్నించండి. మీ వివరణ చూసిన తర్వాత మీ పూరణను చదివితే నేను చేసిన పొరపాటు తెలిసింది. వివరణకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  27. కిశోర్ కుమార్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసింపదగినది. రెండవ పాదంలో యతి తపింది. గణదోషం కూడా ఉంది. కానీ మీరు ప్రయత్నిస్తే తప్పక మంచి పద్యాలు వ్రాస్తారు. ఆ ప్రతిభ మీ పద్యాన్ని చూస్తే తెలుస్తున్నది. మీ రచనా వ్యాసంగాన్ని నిస్సంకోచంగా కొనసాగించండి. శుభం.

    రిప్లయితొలగించండి
  28. సరసముగా వీధిన కొని
    సరిగమ పలికించ బూని శ్రవణమ్ముల తా
    భరియింప కఠోరమ్మగు
    మురళీగానమ్ము మరణమును గలిగించున్

    రిప్లయితొలగించండి
  29. తిరుగుచు వీధుల వెంబడి
    అరకొరగా నేర్చి తిండి కమ్ముట కొరకై
    వెరవని గంటల కొలదౌ
    మురళీగానమ్ము మరణమును గలిగించున్

    రిప్లయితొలగించండి