14, ఆగస్టు 2013, బుధవారం

పద్య రచన – 433 (అపరిచితులు)

కవిమిత్రులారా,
ఈరోజు పద్య రచనకు అంశము....
"అపరిచితులు"

19 కామెంట్‌లు:

 1. అపరిచితుల వలన నర్థమనర్థము
  లెటుల నుండుననుచు నెరుగ లేము
  మంచి మనసు తోడ మర్యాదల నొనర్చి
  మేలు చేయ పుణ్యమే లభించు

  రిప్లయితొలగించండి
 2. పరిచితులు మంచివారల
  పరిచితులే చెడ్డనుచును భయపడుటేలా ?
  పరిచితులలోనను మరియ
  పరిచితులలొ మంచిచెడులు పరికించు సఖా !

  రిప్లయితొలగించండి
 3. ఆపద సమయము లందున
  ఆపదలను బాప బనుప నా దేవుండే
  ఆపద్బాంధవు లొదుగురు
  ఆపదలను బ్రోచు వారు నవనీ సురులే !

  రిప్లయితొలగించండి
 4. నమ్మకుము దుష్ట జనులను
  నమ్మకుమా యపరిచితుల నర్మపు మాటల్
  నమ్మకుము నీ మనస్సును
  నమ్ముము మఱి దేవ దేవు నామము నరుడా !

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  రెండవ పాదాన్ని ఇలా సవరిద్దాం... 'పరిచితులే చెడ్డ యనుచు భయపడ వలదా.. (వలదు + ఆ)...
  'పరిచితులలొ' అని 'లో'' ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాయరాదు. 'పరిచితుల మంచి చెడులను' అందాం.
  *
  గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ఒదుగురు.... 'అగుదురు' కు టైపాటా?

  రిప్లయితొలగించండి
 6. సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 7. మంచి భావమరసి మైత్రిని చేయంగ
  పరిచితులపరిచితులప్రశ్నలేల
  పరిచయమవనిదెవరు ప్రయత్నమున్నన్
  అపరిచితులెమారునాప్తులుగన్


  రిప్లయితొలగించండి
 8. శైలజ గారూ,
  మీ ప్రయత్నం ప్రశంసనీయం.
  మొదటి పాదంలో తప్ప మిగిలిన పాదాల్లో గణదోషం. నా సవరణలతో మీ పద్యం......
  మంచి భాన మరసి మైత్రి జేయగ పరి
  చితు లపరిచితులను చింత యేల?
  పరిచయమ్ము కాని వారేరి యత్నింప
  నపరిచితులె యాప్తు లగుదురేమొ!

  రిప్లయితొలగించండి
 9. ఎంద అందముగా ,ఇంపుగా నా భావాన్ని పదములలో పొదిగారు గురువుగారూ...మీకు పాదాభివందనములు..

  రిప్లయితొలగించండి
 10. గురువు గారూ ! నమస్సులు.
  'ఒదుగురు ' -లభింతురు అనే అర్ధముతో వాడేనండి.' అవసరానికి వాడు ఒదిగేడురా ' అని విన్నమాట. ఆంధ్రభారతి ( బ్రౌణ్య ) వారి నిఘంటువులో చూస్తే ' దొరకు ' అనే అర్ధము దొరికిందండి.

  రిప్లయితొలగించండి
 11. అల్లకల్లోలమై కల్లోలినీగంగ
  విలయతాండవమాడి చెలఁగుచుండ ( ఉత్తరాఖండ్ )
  గురుబోధలనుగోరి గూడికూర్చున్న వి
  జ్ఞానతత్వాసక్త సంచయమున
  ధృత్యున్నతోత్సాహ తీర్థయాత్రాసక్త
  సంఘంబుగూడి సంచారమందు ( కైలాస మానససరోవర యాత్ర )
  సరియైన నిర్ణీత సమయంబునకురాని
  వాహనంబునకు తాఁ వగచునపుడు

  బాధలందున నిత్యసద్బోధలందు
  సంతసంబున విసిగివేసారునపుడు
  మనుజులాత్మీయ చిత్తులై మసలుకొనెద
  రపరిచితులైన నప్పుడు సుపరిచితులె

  రిప్లయితొలగించండి
 12. గన్నవరపు వారూ,
  మీరు చెప్పిన అర్థంలో 'ఒదుగుదురు' సాధురూపం అవుతుంది. అది 'ఒదుగురు' కాదు కదా.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  ఆపద వేళలో అపరిచితులు సుపరిచితులయ్యే విధానాన్ని సీసపద్యంలో మనోజ్ఞమైన పదబంధాలతో చక్కగా చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.

  సీస పద్యము వ్రాసి చాలా దినములైనది గురుదేవులు క్షమించగలరు.
  =====*=====
  ఆపదలందున దీపము జూపును
  | తపములు జేసెడి యపరిచితులు
  కైపదముల కెల్ల దూపము వేయును
  | చపలము జూపని యపరిచితులు
  దూర భారమునను దూరము జేయుచు
  | సఫలము గావించు నపరిచితులు
  కార్య భారమునను కాగితమును జేయు
  | కపటము లేనట్టి యపరిచితులు
  అపరి చితులు నెయ్యమ్మున సుపరి చితులు
  సుపరి చితులు కష్టములందు నపరి చితులు
  సుపరి చితుల మధ్యన గల రపరి చితులు
  యపరి చితులందు గలరు సుపరి చితులు.

  రిప్లయితొలగించండి
 14. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ!
  మీ సీస పద్యము బాగుగ నున్నది. అపరిచితులు/సుపరిచితులు అనునవి బహువచనములు కావున చూపును/వేయును/కావించు/చేయు అనే క్రియలను సరిగా వేయుచు దిద్దవలెను. చూపెదరు/వేసెదరు/కావించెదరు/చేసెదరు అను అర్థములలో పదములను వేయవలెను. అటులనే ఆఖరి పాదములో 1 లఘువు తక్కువగా నున్నది. సరిచేయండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. అపరి చితులైన కొందరు
  విపరీతపు విలువ నిచ్చు వేడుక కొఱకై
  సుపరి చితుడైన బంధువు
  చపలత్వము గలిగి యుండి సంకట పడగన్ !

  రిప్లయితొలగించండి
 16. అపరిచితులకెపుడు నాశ్రయమీయగ
  కాకమూషికములు కాదనంగ
  వినక లేడి, నీడ వృకమునకీయగ
  వలను జిక్కి లేడి వ్యథను బొందె

  రిప్లయితొలగించండి
 17. గురువు గారూ నమస్సులు, ధన్యవాదములు. నా పద్యాన్ని సవరిస్తున్నాను.

  ఆపద సమయము లందున
  నాపదలను బాప బనుప నా దేవుండే
  ఆపద్బాంధవు లొదుగుదు
  రాపదలను బ్రోచు వారు నవనీ సురులే !

  రిప్లయితొలగించండి
 18. వరప్రసాద్ గారూ,
  “సుపరి చితులు కష్టములందు నపరిచితులు” అనడం బాగుంది. మంచి పద్యం. అభినందనలు.
  నేమాని వారి సూచనను గమనించారు కదా!
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మిత్రలాభం కథాప్రస్తావనతో మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  గన్నవరపు వారూ,
  సంతోషం.

  రిప్లయితొలగించండి