11, ఆగస్టు 2013, ఆదివారం

పద్య రచన – 430 (గానుగ)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

29 కామెంట్‌లు:


 1. గాడెద్దు తిరగతా ఉండాది తిరగతా ఉండాది
  రాజ్యం తిరగతా ఉండాది తిరగతా ఉండాది
  నేతలు డిల్లీ చుట్టూ తిరగతా తిరగతా ఉండారు
  మేము మీ చుట్టూ తిరగతా తిరగాతా ఉండాము !

  జిలేబి
  (తిరగదు ఆగదు ఆగితే తిరగదు !)

  రిప్లయితొలగించండి
 2. వేదాంత పరముగా:

  పూనికతో హృదయంబను
  గానుగలో వేసి సకల కర్మముల శివ
  ధ్యానముతో నాడించిన
  జ్ఞానమనెడు నూనె పొంద గలరు ముముక్షుల్

  జ్ఞానమ్మే తైలమ్ముగ
  మానసమే ప్రమిద, వర్తి మాయ యయినచో
  నానంద కాంతులంత న
  నూనమ్ముగ వెల్లి విరియు నో మహితాత్మా!

  రిప్లయితొలగించండి
 3. నేమాని వారికి ప్రణతులు
  అద్భుతమైన పద్యాలను పంచారు

  రిప్లయితొలగించండి
 4. శ్రీ నేమాని గారూ ! చక్కని వేదాంతం చెప్పారు.

  గానుగ నెంతాడించిన
  కానుగ నే జన్మలోన కలిగిన దొరగా
  గానుగ చుట్టెద్దులు మర
  గానుగ నాబ్రతుకు తిరుగు కనుడీ పేదన్.

  రిప్లయితొలగించండి
 5. పూజ్య గురువుగారికి ప్రణామములు,
  తమరి పద్యములు ఎంతో బాగుగ,భక్తిప్రపత్తులు వెదజల్లుతున్నవి..

  రిప్లయితొలగించండి
 6. భ్రమణమొందకున్న భవితయేమాయం
  గానుగెద్దులాగ గంజి శూన్యం
  పగలురేయిబండి పయనమెజీవితం
  పగలుసెగలువలదు ప్రకృతి లోన

  రిప్లయితొలగించండి
 7. అమ్మా! శైలజా గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమును చూచేను. మాయం, శూన్యం, జీవితం అనే ప్రయోగములు వ్యాకరణ శుద్ధములు కావు. మాయము, శూన్యము, జీవితము అనవలెను. డు ము వు లు ప్రథమా విభక్తి అని తెలుసును కదా. మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

  భ్రమణ మొందకున్న భవితయే మాయమౌ
  గానుగెద్దు లాగ గంజి సున్న
  పగలు రేయి బండి పయనమ్ము బ్రతుకులు
  పగలు సెగలు వలదు ప్రకృతి లోన

  రిప్లయితొలగించండి
 8. మా పద్యములను గురించి ప్రశంసలను తెలిపిన శ్రీ రమణ గారికి, శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారికి, శ్రీమతి శైలజ గారికి హృదయపూర్వక శుభాశీస్సులు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 9. అయ్యా! శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యమును చదువుతుంటే ఏదో నిర్లిప్తత చోటు చేసుకొనిన మనస్సుతో వ్రాసినటుల కనుపించుచున్నారు. అది భావ్యము కాదు. నందో రాజా భవిష్యతి - అనే నానుడి మీకు తెలుసును కదా. మానవుని మేధస్సు అనంతము, యోగములు అపారము. పేరాస వలదు కానీ, ధైర్యం పురుష లక్షణము అని భావిస్తూ జీవితమును ఆనందమయముగా గడపవలెను. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 11. జిలేబి గారికి ,
  మీ భావం నచ్చి, నాకు తోచినది వ్రాసాను,..అన్యధా భావించవలదని ప్రార్ధన...

  గాడెద్దులు తిరుగుతు గానుగ లాగెను
  రాజ్యం తిరుగుచునుండె రమణుల చుట్టు
  నేతలెల్ల తిరిగె డిల్లి నెయ్యంకోసం
  మేమెపుడును తిరిగెద మేట రుకొరకు

  రిప్లయితొలగించండి
 12. తిలల నుండి మరిని దైలము దీ యంగ
  జోడు వృషభ ములను గాడి కట్టి
  త్రిప్పు చుండె జూడు తెలుకల రామయ్య
  చూడ ముచ్చట య్యె జూచు కొలది

  రిప్లయితొలగించండి

 13. శ్రీ నే మాని వారి నేటి పూరణ అద్భుతః !

  అంతులేని వేదాంతాన్ని నాలుగు పదాల్లో అపురూపం గా, ఆవిష్కరించారు !


  శైలజ గారికి,

  నా భావానికి పద్యం అందించి నందులకు నెనర్లు !

  చీర్స్
  జిలేబి

  రిప్లయితొలగించండి
 14. నేటి రాజకీయములపై
  ========*========
  నీతి తోడ గలసెను'నవి నీతి'లోకమందు ప్ర
  ఖ్యాతి జెందగ,దినుసులను గానుగ పయి ద్రిప్పగన్
  నేతి వంటి నూనె గారె,నిజము గనుగొనంగ నే
  కోత బెట్ట నీతి కుళ్ళి కుళ్ళి యేడ్చు చుండెరా!
  ======*=========
  గానుగ దిరుగుచు నుండె గత నాలుగు దినములందు
  మానిక నూనె రాకుండె మరల మరల యప్పు జేసి
  బానిస నైతిని జూడు పశువుకు గట్టితి గంత
  జానెడు పొట్టకు(కడుపుకు)గంత,శాంతిని గట్టుము స్వామి.
  (మానిక నూనె = స్వల్ప లాభము)

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమాని గురుదేవులవారి నేటి పూరణ అద్భుతము. నాలుగు వేదాల సారము,నాలుగు పదాల్లో జూపినారు!

  రిప్లయితొలగించండి
 16. మిత్రులారా! మరికొన్ని పద్యములను సమీక్షించుదాము: ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీమతి జిలేబి గారొక గేయము వ్రాసేరు; శ్రీమతి శైలజ గారు దానిని మరొక గేయము చేసేరు -- పద్యము ఎక్కడా కనుబడలేదు.

  శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము బాగుగ నున్నది. మొదటి పాదములో యతి మైత్రి లేదు. ఆ పాదమును ఇలాగ మార్చుదాము: "తిలల నుండి ద్రిప్పి తీయంగ తైలము"

  శ్రీ వరప్రసాద్ గారు: మీ 2 పద్యములు(ఉత్సాహ, మధ్యాక్కర) చాల బాగుగ నున్నవి.
  ఉత్సాహ: కలసెను + అవినీతి = కలసెనవినీతి అని సంధి నిత్యముగా జరుగును.

  రిప్లయితొలగించండి
 17. శ్రీమతి జిలేబి గారి గేయానికి తేటగీతిలో:

  గిరగిరా గానుగెద్దులు తిరుగు చుండ
  బిరబిరా రాజకీయాలు జరుగుచుండ
  చరచరా హస్తినకు నేత లరుగు చుండ
  జరజరా మంచి కవితలు వరలుచుండె

  రిప్లయితొలగించండి

 18. శ్రీ నేమాని వారి కి ధన్యవాదములు .

  sir,

  Loooks to me like today you have touched the state of 'Thuriya' while expressing beautiful vedantha in your exceptional couplets!

  Blessed is this platform of writers to have the privilege of your good selves.

  cheers
  zilebi

  రిప్లయితొలగించండి
 19. శ్రీమతి జిలేబీ గారిభావానికి నా పద్యరూపము.............

  గాడెద్దుల్ భ్రమణంబుచేయదొడఁగెన్ కర్తవ్య ధారణ్యతన్
  నేడీ రాజ్యపరిభ్రమాతిశయమున్ నిర్జింపరే ఎవ్వరు
  న్వోడన్ గెల్చిన మీరెదిక్కనుచు సందోహమ్ముగా మ్రొక్కరే
  నేడో చూచిన మీప్రదక్షిణము నందే యుంటిమంధాత్ములై.

  రిప్లయితొలగించండి
 20. గాను గెద్దు బ్రతుకు మానవ జన్మంబు
  గంత కట్టె మనకు వింత గాను
  తనదు బ్రతుకు తెరువు తైలమ్ము దీయంగ
  ప్రాణ సంక టమ్ము బరువు మనకు

  రిప్లయితొలగించండి
 21. శ్రీమతి జిలేబి గారికి శుభాశీస్సులు. మీ సుహృద్భావానికి మా సంతోషము.

  శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: మీ పద్యము ఒక మంచి ప్రయత్నము. అందులో మాకు కొంత అవగాహన కాలేదు.
  1. తెలుగులో వు, వూ, వొ,వో లతో మొదలయ్యే పదములు లేవు అని వ్యాకరణ సూత్రము. మీరు వోడన్ అని ప్రయోగించారు కదా.
  2. ధారణ్యత మరియు అంధాత్ములు అనే పదములకు మాకు అన్వయము తట్టుట లేదు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 22. ఒక పెద్ద కాష్ఠముండును
  సుకరమ్ముగ తిరుగుటకును శుభ్రమ్మగు రో
  లొక బాన నూనె నిండగ
  చక చక జోడెద్దులతో సాధింపoగన్

  తిలలును, కొబ్బెర, కుసుమలు
  అలలును, వేరుశెనగలును, ఆముదములు నూ
  నెలు తీయు యంత్ర మిదియే
  తొలి కాలమునన్ రహించె తూరుపు కోనన్

  తెలకలి నూనెను అమ్మును
  తిలపిష్టము నానబెట్టి ధేనువునకు గొ
  ల్లలు కుడితి త్రాగనిత్తురు
  తిలఘాతకు జీవితములు తీరుగ వెలయన్

  కులవృత్తులు నశియించెను
  కలికాలము దాపురించె, గానుగ ఎద్దుల్
  వలె బ్రతుకు సాగుచున్నది
  బలిఅవగా ప్రజలు స్వార్థపరుల గులాముల్

  గంతలు కట్టిన ఎద్దులు
  సంతతముగ తిరుగుచుండు సాగవు ప్రగతిన్
  ఇంతేగద ఈ బ్రతుకులు
  సుంతయు తెలియంగ లేరు చోద్యంబయ్యెన్

  రిప్లయితొలగించండి
 23. సహృదయులు,సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచనలను తప్పక పాటించెదను.
  " నవ నీతు"లు అని ప్రయోగించి పద్యము కొరకు నవి నీతి జేసితిని."నవ నీతి" యని మార్చిన యెటు లుండునో తెలుపగలరు.

  రిప్లయితొలగించండి
 24. శ్రీపండిత నేమాని గురువులకు నమస్సులతో

  జనన మరణాల చక్ర సూచకము గాను
  గాను గెద్దుల జీవులు గడపుచుండ
  కర్మ ఫలమన తైలంబుగా స్రవించు
  గాండ్ల వానిగ పరమాత్మ గ్రహిళుడగును౤

  రిప్లయితొలగించండి
 25. గంతలు గట్టిరి మనకిల
  ముంతలు నిండంగ మోహ తైలం బనగా
  సుంతైనను జాలి పడని
  హంతకులట మనుజు లంత యసుర గణంబుల్ !

  రిప్లయితొలగించండి
 26. శ్రీ నేమాని గురువుగారు వేదాంతసారమంతయు కందపుష్పాలలో చెప్పిన తీరు అమోఘము౤ అది వారికే చెల్లు౤ వారికి నా ఆనందపూర్వక నమస్సులు౤

  శ్రీ కెంబై తిమ్మాజీ రావు గారు పంచకందాత్మకంగా చెప్పిన పద్యాలు మొత్తం ప్రక్రియను సజీవ రూపంగా చూపారు౤ వారికి మిక్కిలి అభినందనలు౤

  రిప్లయితొలగించండి
 27. శ్రీ తిమ్మాజీ రావు గారు! శుభాశీస్సులు. మీ 5 పద్యములు బాగుగ నున్నవి. కొన్ని సూచనలు:
  1. 1వ పద్యము 4వ పాదములో గణభంగము కలదు.
  2. వేరు సెనగ అనుట సాధు ప్రయోగము - వేరుశెనగ అనరాదు.
  3. అక్కడక్కడ సంధులను మీరు చేయుటలేదు. నూనెను + అమ్ముచు అనుచోట నూనెల నమ్ముచు అంటే బాగుంటుంది. అభినందనలు.

  శ్రీ తోపెల్ల శర్మ గారు: మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. పరమాత్మ ఎన్నడునూ కర్తయు, భోక్తయు కాడు కదా! గ్రహిళు డెట్లగును?

  శ్రీ వర ప్రసాద్ గారు: శుభాశీస్సులు. నీతి తోడ జేరిన దవినీతి అనండి - బాగుంటుంది.

  రిప్లయితొలగించండి
 28. అమ్మా! రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు. అన్వయ సౌలభ్యము కొరకు మీ పద్యమును కొంచెము సవరించ వలసి యున్నది. మీ ప్రయత్నమునకు అభినందనలు.

  రిప్లయితొలగించండి