17, ఆగస్టు 2013, శనివారం

పద్య రచన – 436 (గురు బోధనము)

కవిమిత్రులారా,
పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

19 కామెంట్‌లు:

 1. భారతీపతి వేద వాఙ్మయ రూపుండు
  ....వనరుహప్రభవుడౌ బ్రహ్మ గురుడు
  ప్రథిత గీతాచార్య వరుడు హయగ్రీవ
  ....మూర్తియునగు విష్ణుమూర్తి గురుడు
  ఆదిమాచార్యుండు నా దక్షిణామూర్తి
  ....యైన జ్ఞానాంబుధి హరుడు గురుడు
  సచ్చిదానంద భాస్వ ల్లక్షణయుతుండు
  ....పరమాత్మయే జగద్గురువరుండు
  తల్లిదండ్రులు గురువులు ధరణిపైని
  ప్రాణితతులెల్ల గురువులే ప్రకృతియందు
  గురువులగు వారినెల్ల నాదరము మీర
  దలచి త్రికరణ శుద్ధి నంజలి ఘటింతు

  గురులజ్ఞాన మహాంధ భాస్కరు లనన్ గూర్మిన్ బ్రకాశించుచున్
  దరుమన్ శిష్యుల యందవిద్యను సదా తత్త్వార్థ తేజంబుతో
  గరమొప్పారుచు శిష్యసత్తములు ప్రజ్ఞావంతులై జ్ఞానభా
  స్కరులై రాజిలుచుండ సర్వజగముల్ గాంచున్ మహాయోగముల్

  రిప్లయితొలగించండి

 2. విశ్రాంత తెలుగు పండితుల వేదిక
  బ్లాగర్ చెట్టు కింద పద్యోద్యమం !
  అరుగు దెంచి నలుగురూ నేర్చు కొందురు
  శుభములన్ తెలుగు వెలుగులన్ జిలుగులన్ !


  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. అన్నయ్య గారికి ప్రణామములు. మీ గురుస్తుతి అద్భుతము!

  రిప్లయితొలగించండి

 4. కణ్వు డాదిగ ఋషుల యా కథలు వినగ
  దెలియ వచ్చెను పూర్వము తిరము గాను
  ఆశ్ర మంబున శిష్యుల కాశ్ర యంబు
  నిచ్చి గావించె బోధన లింపుగాను

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  గురుస్వరూపాన్నీ, గురుప్రాశస్త్యాన్నీ, గురుప్రభావాన్నీ గొప్పగా వర్ణించారు. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  జిలేబీ గారూ,
  ధన్యవాదాలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన
  జయము బడయుచుండు జగతినందు
  గురియె గలుగు గాద గురుభోధనందు
  మార్గ దర్శి యగును మంచి గురువు

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  శ్రీ నేమాని గురుదేవుల గురుస్తుతి అద్భుతము!
  =======*=========
  శిష్య తతులంజలి ఘటించి జెంత జేర
  రామ లక్ష్మణులకు జెప్పె రమ్య మైన
  వేద విదులు వసిష్టుడు,వినయ మలర
  విని పఠించు చుండెను వారు విద్యనెల్ల.

  రిప్లయితొలగించండి
 8. శ్రీమతి శైలజ గారి పద్యము చాలా బాగుగ నున్నది. చిన్న సవరణలను ఈ విధముగ చేసేను:

  గురుని యొద్ద విద్య కుదురుగ నేర్చిన
  జయము లొదవు చుండు జగతి యందు
  గురియె గలుగు గాన గురు బోధనములందు
  మార్గదర్శకుడగు మంచి గురువు

  రిప్లయితొలగించండి
 9. శ్రీ వరప్రసాద్ గారి పద్యమును ఇలాగ మార్చుచున్నాను:

  రామ లక్ష్మణ ముఖ శిష్య ప్రతతి చేర
  వేదవేత్త వసిష్టుండు విద్యలెల్ల
  వారలకు నేర్పుచుండ నవ్వారు మిగుల
  శ్రద్ధగా నేర్చుచుండి రాశ్రమమునందు

  రిప్లయితొలగించండి
 10. అమ్మా జిలేబి గారూ! శుభాశీస్సులు.
  మీ ఉద్దేశములో "పద్య కవులు" అంటే విశ్రాంత తెలుగు పండితులే అనుకొనుచున్నారేమో. ఆ ఉపాధ్యాయ వృత్తిలోనుండు వారే చాల తక్కువ శాతము - ప్రస్తుతము మన బ్లాగు సభ్యులలోనే కాదు - అంతటా ఇతర వృత్తులలో నుండే మా వంటి వారే ఎక్కువమంది పద్య కవులు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 11. ధన్యుడను,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములు.
  నా పద్యము పదును లేని కరవాలము.మీ సవరణతో ఖడ్గమైనది.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.
  గురువులు నాడు--నేడు,శిష్యులు నాడు--నేడు
  ======*=======
  కోరగ వరముల నపుడు-కొసరి దీవించె శిష్యులను,
  కోరగ విద్యను నిపుడు-కొసరి వడ్డించె శిష్యులను.
  కోరిన స్వరములు గూర్చి-కూరిమి నొందిరి నాడు,
  కోరిన గతులను మార్చి-కోపము జూపును నేడు.
  ======*========
  గురుదేవుల బలుకులు విన-గురుకులమ్మును జేరి రపుడు,
  గురువుల బలుకులను విన-గూగుల్ న వెదకెద రిపుడు.
  గురుదక్షిణను కోరక నిడె-గొబ్బున తన శిష్యులపుడు,
  గురువులు కోరక నిడును-గోమయమును శిష్యులిపుడు.

  రిప్లయితొలగించండి
 13. వినయమ్మునకు మించు విత్తము లేదిలన్,
  .........వినయ రహితమైన విద్య కీడు!
  పరులకు మేల్జేయ పరమ ధర్మంబగు;
  .........పరపీడనము గొప్ప పాప కర్మ!
  సత్యభాషణముచే సంపద లొనగూరు,
  .........ప్రియ హిత వాక్కుల ప్రేమ గలుగు!
  రాజరికమ్మన్న రాజ్యభోగము గాదు,
  .........ప్రజల శ్రేయస్సుకే పదవి గలదు!

  గురు వసిష్ఠులు దశరథు కుఱ్ఱ వాండ్ర
  కిట్లు బోధించుటంజేసి యిలను వారు-
  రూపు దాల్చిన ధర్మమై ప్రాపు వడసి
  నారు, సద్గురు బోధన నైజ మిద్ది.

  రిప్లయితొలగించండి
 14. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  “ధర్మవిగ్రహుఁ డయ్యు ధర్మవిగ్రహుఁ డయ్యె రామయ్య రఘుకులప్రాణవిభుఁడు
  శేషభావుం డయ్యు శేషభావుం డయ్యె లక్ష్మన్న భృత్యలీలాభృతుండు
  గైకాత్మజుం డయ్యుఁ గైకాత్మజుం డయ్యె భరతుండు భ్రాతృసేవారతుండు
  సౌమిత్రకుం డయ్యు సౌమిత్రకుం డయ్యె శత్రుఘ్నుఁ డధ్వరశత్రుహంత

  భగవదవతారమూర్తులకు గురుభావ
  మంది ధన్యుండ నైతిఁ! గర్మంది నైన
  ఫలముఁ గాంచితి! సర్వవిద్యలును మీకు
  వ్యక్తమగు!” నంచు దీవించె యతివరుండు.

  అవిరళధర్మమార్గనిరతామృతదివ్యపథానువర్తులై,
  “భవదుపదేశవాఙ్నిచయభావితపావనసర్వశాస్రముల్
  భవతరణంబులై మము శుభంబులఁ గూరిచి బ్రోచు" నంచు నా
  లవు నిగమాళిఁ బోలి దవులం బ్రణమిల్లిరి యాజినందనుల్.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 15. గురువు దైవము కంటెను గొప్ప వాడు
  నాది శంకరు లనగను నాది గురువు
  గురుని సేవించు నిరతము కోవి దుండు
  శివుని యవతార మందురు శ్రేయ మిడగ

  రిప్లయితొలగించండి
 16. గురువును తల్లిదండ్రులుగ కూరిమి దైవముగా తలంచుచున్
  నెరపగ సేవలన్ గురువు నేర్పును విద్యలు, ఛాత్రులందరున్
  తరచుచు అధ్యయమ్ము నిరతమ్మును జేయుచు సంఘటిoచుచున్
  పరులును అస్మదీయులను భావన లేక రహింపగావలెన్

  గురువు వశిష్టు బోధనలు కోసల రాజకుమారు లెల్లరున్
  సరగున భక్తీశ్రద్ధలను సాధన జేసి గ్రహించి సేమమున్
  అరసి కుటుoబమందు తమ అన్నల తమ్ముల బాగు కోరుచున్
  గురుతర భాధ్యతన్ ప్రజల కోరిక మేరకు రాజ్య మేలగా

  రిప్లయితొలగించండి
 17. మాన్యులు డా.మురళీధర రావు గారు మంచి అందమైన పద్యాల నిచ్చేరు.
  వారి మొదటి పద్యానికి భావాన్ని వివరిస్తే నా బోటి అల్పభాషా
  పరిజ్ఞానం గలవారికి ఉపయుక్తంగా ఉంటుంది.

  రిప్లయితొలగించండి