8, ఆగస్టు 2013, గురువారం

సమస్యాపూరణం – 1137 (త్రాగి పాడెనంట)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
త్రాగి పాడెనంట త్యాగరాజు.

52 కామెంట్‌లు:

 1. ప్రాచేతస మహర్షి భాగ్యవైభవముగా
  ....ప్రాప్తించినట్టి శ్రీరామ రసము
  శబరి మహాభక్తి సంపత్ఫలమ్ముగా
  ....లభ్యమైనట్టి శ్రీరామరసము
  ఆనంద్రసాంద్రుడై ఆంజనేయస్వామి
  ....ప్రేమతో గొనెడు శ్రీరామరసము
  ఆసేతు శీతమహాచల వాసులు
  ....రక్తితో గొనెడు శ్రీరామరసము
  మధువునేని మించు మధురరసమ్మును
  పరమ పదము జేర్చు భక్తి రసము
  శ్రేయములను గూర్చు శ్రీరామ రసమును
  త్రాగి పాడె నంట త్యాగరాజు

  రిప్లయితొలగించండి
 2. శ్రీ పండితనేమాని గారికి నమస్కృతులు
  రసరమ్య మైన పూరణ చేసిన మీకు అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. గగన వీధు లందు గంధర్వ గానమ్ము
  పరవ శించి వినగ వరమ టంచు
  ప్రేమ మీర భక్తి పీయూష మది యేమొ
  త్రాగి పాడె నంట త్యాగ రాజు !

  రిప్లయితొలగించండి
 4. ఇహము పరమునందు బహువిధ సౌఖ్యంబు
  లందజేయుచుండి యనవరతము
  నవ్యమైన రామనామామృతంబును
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 5. మిత్రులారా! శుభాశీస్సులు.

  శ్రీ పీతాంబర్ గారి ప్రశంసలకు మా సంతోషమును తెలుపుకొను చున్నాను.

  శ్రీమతి రాజేశ్వరి గారు: గంధర్వ గానము విని పరవశించుచు భక్తి పీయూషమును త్రాగిన త్యాగరాజును వర్ణించిన మీ పద్యము హృద్యముగా నున్నది. అభినందనలు.

  శ్రీ హరి....మూర్తి గారు: మీరు చిన్న పద్యముతో ముగించేరు. నవ్యమైన రామ నామామృతముతము గురించి చక్కగా వ్రాసేరు. అభినందనలు. ఈ సాయంకాలములోగా మరికొన్ని పద్యములు వ్రాస్తారని మా ఊహ.
  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. రామ నామ మధుర రమ్య సత్కృతులను
  వ్రాసి, జనుల కిడియు భక్తి తోడ
  నీమముగను రామ నామామృతమ్మును
  ద్రాగి పాడెనంట త్యాగరాజు!

  రిప్లయితొలగించండి
 7. హరిహర నిజ శక్తి మరిగించి వడ 'బోయ '
  నరులకందినట్టి నామ రసము
  నిత్యనూతనమ్ము నిగమాల సారమ్ము
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 8. శ్రీ మధుసూదన్ గారు: శుభాశీస్సులు. మీ పద్యము మధురముగా నున్నది - మధుర రమ్య సత్కృతులతో రామ నామామృతముతో అలరారుచున్నది కదా. అభినందనలు. ఔను మీ పేరులో కూడా మధువు ఉన్నది కదా. స్వస్తి.

  శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: శుభాశీస్సులు. హరి హరుల తత్త్వములను కలిపి మరగించి వడబోసిన రామనామ రసప్రియులు మీరు - మీ పేరులోనే ఉన్నది ఆ పెన్నిధి. మీ పద్యము చాల బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 9. రామ నామామృత రుచినిమరగి
  రామ భక్తి రసము రంగరించి
  నాదో పాసనయే నారామ రసమని
  త్రాగి పాడెనంట త్యాగరాజు

  రిప్లయితొలగించండి
 10. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
  మీకు పద్య రచన యందు ఆసక్తి కలిగి నందులకు సంతోషము. మీరు పద్య లక్షణములన్నీ క్షుణ్ణముగా తెలిసికొనవలసి యున్నది. ఈనాడు మీరు చేసిన ప్రయత్నములో ఆటవెలది లక్షణములన్నీ పాటింపబడలేదు. గణములు, యతి ప్రాస నియమములు గురించి బాగుగ అధ్యయనము చేయండి. మీ కృషికి మా సహాయము ఎల్లప్పుడూ ఉంటుంది. సులక్షణ సారము అనే చిన్న పుస్తకమును కొని చదవండి. పూర్వ కవుల పద్యములను చదువుతూ ఉండండి. స్వస్తి.

  రిప్లయితొలగించండి

 11. మిత్రుల పూరణ లతి మధురము !

  రామ నామ మధుర రమ్యామృతము దెచ్చి
  తేట తెనుగు బాస తేనె బోసి
  భక్తిరసపు తీపి పంచదారను గల్పి
  త్రాగి పాడె నంట ! త్యాగరాజు !

  రిప్లయితొలగించండి
 12. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.
  మీ భావమునకు నేను కూర్చిన ఆటవెలది పద్యరూపమును చూడండి:

  నయము మీర రామ నామామృతమ్మును
  రామ భక్తిలోన రంగరించి
  లలిత నాదమందు రామరసమునింపి
  త్రాగి పాడెనంట త్యాగరాజు

  రిప్లయితొలగించండి
 13. నిండు సభలోన నేతుల జోగయ్య
  త్రాగి పాడె నంట , త్యా గ రాజు
  రామ చంద్రు పైన రమ్యమై న గృతులు
  రచన జేసి మిగుల రాణ యొప్పె

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శ్రీ నేమాని గురుదేవుల సవరణలకు ధన్యవాదములు

  పూజ్య గురువులు, పెద్దలు శ్రీ త్యాగరాజు గారిపై మంచి పద్యములు వ్రాసినారు.
  పెద్దలకు మనవి శ్రీ త్యాగరాజు గారు నా పద్యములోని త్యా గ...రాజు గారు వేరు
  పాకిస్తాన్ మరియు చైనా కవ్వింపులపై మాట్లాడని త్యాగ... రాజు ( మన్మోహన్ సింగ్ ) పాడు పాటలపై
  1. కుంభకోణముల గూర్చి ప్రస్తావించిన ప్రగతి ఆగిపోవును
  2, నాకు టూజీ దెలియదు సోనియాజీ, రాహుల్ జీ మాత్రమే తెలుసు

  కుంభ కోణమనుచు గుర్తు జేయగ మన
  ప్రగతి కుంటు బడును, రాజకీయ
  మందు కష్టములను బొందవలె ననుచు
  ద్రాగి పాడె నంట, త్యాగ... రాజు

  ఖలుల జెంత జేరి కాంగ్రేసు రసమును
  ద్రాగి పాడె నంట, త్యా గ...రాజు
  వారు బలుకు జీలు వేరు గదర!నాకు
  రెండు "జీలు" దెలియు మెండుగాను

  రిప్లయితొలగించండి
 15. రామ చంద్రుని పదరజమగు భాగ్యము
  కొఱకు పరితపించి కొలిచెనతడు,
  తారకమ్మును గొని దాహము తీరగ
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 16. మిత్రులకు శుభాశీస్సులు.
  మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ సుబ్బా రావు గారు: మీరొక అనామధేయుడిని ప్రస్తావిస్తూ మంచి విరుపుతో పూరించేరు. బాగుగనున్నది. కానీ 1వ పాదములో గణభంగమును మీరు సరిచేయవలసి యున్నది.

  శ్రీ వరప్రసాద్ గారు: మీ బాణీయే వేరు - ప్రస్తుతము గూర్చి ప్రస్తావించుచూ ఉంటారు. మంచిది. కానీ అప్పుడప్పుడు సనాతన సంప్రదాయములోనికి కూడా ప్రవేశించుతూ ఉండాలి. అన్ని రంగాలలోను మీరు రాణించాలి కదా. మీ పూరణలు 2 మంచి బాగుగ నున్నవి.

  శ్రీమతి లక్ష్మీ దేవి గారు: మీ భక్తి పూర్వకమైన పూరణ చాల బాగుగ నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 17. శ్రుతుల సారమెల్ల కృతులలో బంధించి
  రచన జేసి భక్తి రసములూర
  రాగ తాళమిళితరామనామరసము
  త్రాగి పాడెనంట త్యాగరాజు!!!

  రిప్లయితొలగించండి
 18. రామ భక్తి రాజ్య రమకు రారాజుగ
  రామ నామ మహిమ రహిని పొంగ
  రామ నామ గాన రాగామృతము జుఱ్ఱి ,
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ నేమాని గురువర్యులకు ప్రణామములు,
  మీ సూచనలు చూసాక గానీ నేను పద్యములో వాడిన గణదోషాలు గమనించలేకపోయాను,తప్పక మీ సలహాలు పాటించి, లక్షణాలు సరిచూసుకుంటాను,తమరు,శంకరయ్య గురువుగారు, అందిస్తున్న సహాయము వలన ఈ మాత్రమైనా వ్రాయగల్గుతున్నాను,నా వంటి పామరుల పద్యాలను కూడా శ్రమ అనుకోక సరిదిద్దుతున్నందుకు, మీకు, గురువుగారికి, సర్వదా కృతజ్ఞురాలిని..

  రిప్లయితొలగించండి
 20. రాజు కాడు గాన రారాజు సంగీత
  రాగ కృతుల నెన్నొవ్రాసినాడు
  గళము విప్పి,దివ్యగానరసమ్మును
  ద్రాగి , పాడె నంట త్యాగరాజు

  రిప్లయితొలగించండి
 21. మిత్రులారా! శుభాశీస్సులు.
  మరికొన్ని పూరణలను పరిశీలించుదాము. ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ పీతాంబర్ గారు: రాగ తాళ మిళిత రామ రసాయనము త్రాగించేరు. చాల బాగుగ నున్నది మీ పద్యము.

  శ్రీ శ్రీనివాస్ గారు: మీరు కూడా రామ గాన రాగామృతమును త్రావించేరు. మంచి పద్యము వ్రాసేరు.

  శ్రీ లక్ష్మీ నారాయణ గారు: మీరు కూడా దివ్య గాన రసముతో నింపేసేరు మీ పద్యమును. చాలా బాగుగ నున్నది మీ పద్యము.మొదటి పాదములో టైపు పొరపాటు అనుకొనుచున్నాను -- రాజు కాడు గాని అని ఉండాలి అనుకొంటాను -- రాజు కాడు గాన అని వ్రాసేరు.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
  =========*========
  రామ నామ రుచిని ప్రేమతోడను జూచి
  భక్తితోడ గృతులు వ్రాసినారు,
  రాగ తాళములను రామ రసము నింపి,
  ద్రాగి, పాడె నంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 23. అయ్యా! శ్రీ వరప్రసాద్ గారూ! శుభాశీస్సులు.
  మీ 2 పద్యములను చూచేను. చాలా బాగుగ నున్నవి. మొదటి దానిలో "అన్య దేశ తోటలు" అను సమాసము బాగు లేదు - మార్చవలసి యున్నది. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 24. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు, గురుదేవులను కష్ట పెడుతున్నందులకు క్షమించాలి.
  ========*=======
  రామ నామ రుచిని ప్రేమతోడను గని
  గాన రసము నింపి గళము నందు,
  సిరులకన్న మిన్న శ్రీరామ నామమ్ము
  ద్రాగి,పాడె నంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 25. శ్రీ నేమాని గురుదేవుల సూచనలకు ధన్యవాదములు
  సవరించిన పద్యము
  =======*========
  వెలుగు జూచెను గద తెలుగు పదములెల్ల,
  పంచరత్న కృతుల పంచదార
  బంచె జనుల కెల్ల,మంచి యను సుధను
  ద్రాగి పాడె నంట, త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 26. సారహీనమైన సంసారమునురోసి
  సారసాక్షుని మనసార దగిలి
  సామనిగమసార సారంగమై తిరిగి
  త్రాగి పాడెనంట త్యాగరాజు

  రిప్లయితొలగించండి
 27. నిండు జనము గలుగ బండి రా ధా కృష్ణ
  త్రాగి పాడె నంట , త్యా గ రాజు
  రామ చంద్రు పైన రమ్యమై న గృతులు
  రచన జేసి మిగుల రాణ యొప్పె

  రిప్లయితొలగించండి
 28. రామ నవమి నాడు రంజిలు భక్తితో
  నుపవసించ నెంచి, యుల్ల మలర
  రార రామ యనుచు, నారికేళాంబువుల్
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 29. రామనవమి నాడు రంజిలు భక్తితో
  దశరథాత్మజునకు ధరణిజకును
  పెండ్లి జేసి మురిసి ప్రీతిఁ పానకమును
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 30. మిత్రులారా! శుభాశీస్సులు.
  మరికొన్ని పూరణలను చూద్దాము: ముందుగా అందరికీ అభినందనలు.

  1. శ్రీ వరప్రసాద్ గారు: మీ 2 పద్యములు చాలా బాగుగ నున్నవి.

  2. శ్రీ ఆదిత్య గారు: మీరు చిన్న వయసులోనే సారహీనమైన సంసారము అనుట సరికాదు. మీ పద్యము చాలా బాగుగ నున్నది. 3వ పాదములో చివరన గణభంగము కలదు. సారంగమై చొక్కు అంటే బాగుంటుందేమో.

  3. శ్రీ సుబ్బా రావు గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది - ఒక రాధకృష్ణ గారు మీకు దొరికేరు - పాపము. రమ్యమైన గృతులు అన్నారు - కృతులు అనుటే సాధువు.

  4. మిస్సన్న గారు: 2 పద్యములు ఉపవాసముతో ఉండగా వ్రాసేరా? రామ కళ్యాణమును జరిపించేరా? చాల ధన్యులు. మీ పద్యములు చాలా బాగుగ నున్నవి.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 31. పూజ్యులు నేమానివారికి ధన్యవాదములు!
  శ్రీరామ రసముఁ గ్రోలి, తన్మయుఁడై, జనులను శ్రీరామనామ గానసుధాలహరిలో ముంచితేల్చిన త్యాగరాజును గూర్చిన మీ పూరణము ప్రశస్తముగ నున్నది. అందమైన సీసపద్యము. అభివాదములతో....
  భవదీయుఁడు,
  గుండు మధుసూదన్.

  రిప్లయితొలగించండి
 32. శ్రీ మధుసూదన్ గారూ! శుభాశీస్సులు.
  మీ ప్రశంసలకు సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 33. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 34. అయ్యా! శ్రీ తిమ్మాజీరావు గారు! శుభాశీస్సులు.
  మీ పద్యము భావ గర్భితముగా అలరారుచున్నది. అభినందనలు. 3వ పాదము చివరలో ఒక టైపు పొరపాటు దొరలినది. రాసము అని పడినది - రసము అనుట సరియైన పదము కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 35. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
  ======*======
  వేద సార మెల్ల వివిధ కృతులు జేసి
  ద్రాగి, పాడె నంట త్యాగరాజు
  రామరామ యనుచు రాగ యుక్తముగను
  చెలువ మలర జేసె శిష్య తతులు.

  శ్రీ త్యాగరాజు గారు కావేరి నది తీరము నందు నివసించెనని దెలియుచున్నది.
  ========*=======
  వివిధ కృతులు జేసె వేద సారము నెల్ల,
  అన్య దేశ మందు గణ్యు డయ్యె
  కంజ నేత్రు గొలిచె కావేరి జలముతో,
  ద్రాగి, పాడె నంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 36. Sree varaprasaad Gaaroo!
  ధారా ప్రవాహమన నొ
  ప్పారును మీ పద్య రచన బహు రమ్యముగా
  శ్రీరస్తని దీవించెద
  సారమతిన్ మిము వరప్రసాదు కవీశా!

  రిప్లయితొలగించండి
 37. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా జ్వరం మరింత తీవ్రమయింది. కొద్ది నిముషాలు కూడా సిస్టం ముందు కూర్చోలేకపోతున్నాను. మానీటర్‌ను కాసేపు చూడగానే కళ్ళమంటలు, నీళ్ళు కారడం, తలనొప్పి.
  నిన్న మా డాక్టర్ కొన్ని మందులు వ్రాసి మూడురోజుల్లో తగ్గక పోతే కొన్ని పరీక్షలు చేయాలన్నారు. రేపు సాయంత్రం వరకు తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాను.
  ఆంధ్ర భాషాభిమానంతో, సమధికోత్సాహంతో పూరణలు, పద్యాలు చెప్తున్న మిత్రులందరికీ పేరు పేరునా అభినందనలు, ధన్యవాదాలు.
  ఎంతో ఓపికతో ప్రతి ఒక్కరి రచనను పరామర్శిస్తూ, సవరణలు సూచిస్తూ, ప్రోత్సహిస్తున్న గురువర్యులు పండిత నేమాని వారికి ఏమిచ్చి ౠణం తీర్చుకోను? వారికి పాదాభివందనలు చేయడం తప్ప!
  నా ఆరోగ్యం కుదుట పడాలని కోరుతూ సందేశాలు పంపిన మిత్రులందరికీ ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 38. మిత్రులారా,
  ఇప్పుడు ఇస్తున్న సమస్యలన్నీ బాసర జ్ఞాన సరస్వతీ దేవి దేవాలయ ప్రాంగణంలో తయారు చేసుకున్నవి.

  రిప్లయితొలగించండి
 39. గురువర్యులకు నమస్సుమాంజలులు,
  మీకు జ్వరం మరింత తీవ్రమయ్యిందని తెలిసి చాలా భాధపడుతున్నాను,తప్పక డాక్ఠర్ని సంప్రదించండి,బాగా తగ్గేవరకూ కంప్యూటర్ చూడకండి,మీరు త్వరగా కోలుకోవాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నా...

  రిప్లయితొలగించండి
 40. శ్రీ నేమాని గురుదేవుల దీవెనలకు ధన్యుడను.
  శ్రీ శంకరయ్య గురుదేవుల ఆరోగ్యము కుదుట పడాలని భగవంతుని ప్రార్థిస్తూ,గురువుగారుమీరు తప్పక డాక్టర్ దగ్గరికి వెళ్ళిరండి.
  =====*======
  క్షీరమును ద్రాగు చుంటిని
  శ్రీరాముల దీవెనలకు చెలువ మలరగన్,
  కోరితి గురువుల పాదపు
  నీరము శిరమున ననిశము నినుపారముగన్.

  రిప్లయితొలగించండి
 41. భక్తిలేనిపాటవలనకల్గునముక్తి?
  శాస్త్రములను చదువ సాధ్యమగున?
  జ్ఞానమొసగు రామ సామ గానరసము
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 42. ఎందరో మహానుభావులు,..
  అందరికీ వందనములు,..
  ఈ రోజు మీ అందరి పద్యములు చదువుతుంటే,ఆ త్యాగరాజ కృతులు వింటున్నంత హాయిగా వుంది,.
  గురువుగారి పద్యము రామరసము సేవిస్తున్నంత,భక్తిగా,భావయుక్తంగావుంది,నిజంగా ఈ బ్లాగు చూడటం నా అదృష్ఠం...

  ఈ వ్యాఖ్య పేరు పేరు నా అందరికీ ....

  రిప్లయితొలగించండి
 43. శ్రీపండిత నేమాని గురువులకు శ్రీ శంకరార్యులకు
  శంకరాభరణ కవిమిత్రులకు బ్లాగువీక్షకులకు నమస్సులతో
  సుమారు నాల్గు మాసముల పంచాయితీ ఎన్నికల అజ్ఞాతవాస దీక్షానంతరం ఒక ప్రయత్నము.

  అతులిత గుణధాముడగు రామ భూవిభు
  పాదార్పిత మనము పాత్ర జేసి
  భవ సాగరము దాట భవ్య నామంబగు
  రామ నామమనెడి రసము నింపి
  “బంటురీతి కొలువు” బడయంగ మారుతి
  భక్తి యనెడి ద్రాక్ష పాక మందు
  రామ చరిత లోని రసమయ ఘట్టాల
  సారాంశ మంతయు రంగ రించి
  అంత రంగ మందు నాత్మవిభుని గూర్చి
  మధుర కీర్తనలుగ మలచి నాడు
  పారవశ్య భక్తి భావామృతంబును
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి
 44. Sri T.B.S.Sarma Garu!
  అయ్యా! శుభాశీస్సులు. మంచి పద్యమునే చక్కని భావముతో రామ రస మయముగా బ్లాగు నందుంచేరు. చాల సంతోషము. అభినందనలు. "సారాంశమంతయు రంగరించి" అను పాద భాగములో యతి మైత్రి లేదు.

  రిప్లయితొలగించండి
 45. నేమాని పండితార్యా! ధన్యవాదములు.

  మీ సీసంలోంచి రామరసం చిప్పిల్లుతోంది.

  రిప్లయితొలగించండి
 46. పూజ్యులు నేమానివారికి
  అవునండి. చూసుకోలేదు. మీ సవరణ బాగుంది. ధన్యవాదాలు. సారహీన సంసారము... త్యాగరాజ స్వామివారి మాటలను చిలకపలుకులా అప్పజెప్పాను అంతే గానీ నాకటువంటి అనుభూతి ఇంకా కలుగలేదు. :)
  అభిమానంతో మీరిచ్చిన సూచనకు కృతజ్ఞుణ్ణి.

  రిప్లయితొలగించండి
 47. చిరకాల దర్శనమిచ్చిన తమ్మునికి శ్రీరస్తు.

  రిప్లయితొలగించండి
 48. గురువుగారు త్వరగా కోలుకోవాలని మా ఆకాంక్ష.

  రిప్లయితొలగించండి
 49. శ్రీపండిత నేమాని గురువుల పద్యం మనస్సును రామనామ రసఝరుల నోలలాడించినది౤
  అందరి పద్యములు అద్భుతముగానున్నవి౤ అన్న మిస్సన్నగారి ఆశీస్సులకు నమస్సులతో శ్రీ పండితులవారు తెల్పిన దొసగు సవరించుచూ

  అతులిత గుణధాముడగు రామ భూవిభు
  పాదార్పిత మనము పాత్ర జేసి
  భవ సాగరము దాట భవ్య నామంబగు
  రామ నామమనెడి రసము నింపి
  “బంటురీతి కొలువు” బడయంగ మారుతి
  భక్తి యనెడి ద్రాక్ష పాక మందు
  రామ చరిత లోని రసమయ ఘట్ట సా
  రాంశము నంతయు రంగ రించి
  అంత రంగ మందు నాత్మవిభుని గూర్చి
  మధుర కీర్తనలుగ మలచి నాడు
  పారవశ్య భక్తి భావామృతంబును
  త్రాగి పాడెనంట త్యాగరాజు.

  రిప్లయితొలగించండి