7, ఆగస్టు 2013, బుధవారం

పద్య రచన – 426 (శివలాస్యము)

కవిమిత్రులారా,
 పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

16 కామెంట్‌లు:

 1. తోటకము:
  పరమేశ్వర తాండవ వైభవమున్
  పరమేశ్వరి లాస్యము పర్వములై
  సరసాద్భుత రీతుల సాగె నహో
  కరమొప్ప జగంబులు కాంతులతో

  మత్తకోకిల:
  తాండవప్రియ! పార్వతీసహితా! మహేశ్వర! శంకరా!
  ఖండశీతమయూఖశేఖర! క్ష్మాధరాలయ! సుందరా!
  చండభాను సహస్ర సన్నిభ చారుగాత్ర సుశోభితా!
  పండువౌకద నీదు దర్శన భాగ్యమో పరమేశ్వరా!

  కవిరాజవిరాజితము:
  సరసగుణాకర సాంబశివా! సురసన్నుత వైభవ! సాంబశివా!
  సరస నటేశ్వర సాంబశివా! విలసఛ్ఛశిశేఖర! సాంబశివా!
  స్మరహర! శంకర! సాంబశివా! గిరిజా హృదయేశ్వర! సాంబశివా!
  స్వర రస తత్పర! సాంబశివా! మనసా మిము గొల్తును సాంబశివా!

  రిప్లయితొలగించండి
 2. మిత్రులారా! శుభాశీస్సులు.
  నిన్నటి విషయము : పానకాల నరసింహ స్వామి గురించి:

  భావ వైవిధ్యముతో పద చమత్కృతితో మంచి మంచి పూరణలు పుస్ఫాలుగా మిత్రు లెందరో సమర్పించేరు. అందరికీ అభినందనలు.

  రిప్లయితొలగించండి
 3. శ్రీ నేమాని గారూ ! మీ పద్యములు చదువుతుంటే శివతాండవమును గనినట్లున్నది.

  కణకణమున కనిపించును
  ఝణఝణ నృత్యమ్ము హరుని సద్భక్తులకున్
  గణగణ నూపురముల ని
  క్వణమే వినిపించు తాండవమ్మున వినినన్.

  రిప్లయితొలగించండి
 4. శివ లాస్యమ యది , జూడగ
  భవబంధము లన్ని దొలగి పరముం గలుగున్
  శివలాస్యపు మహిమమ యది
  శివ శివ యని పలుక మ నకు సేమము గలుగున్

  రిప్లయితొలగించండి
 5. శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
  మీ ప్రశంసలకు సంతోషము. మీ పద్యము మంచి శబ్ద ప్రాశస్త్యముతో అలరారుచున్నది. అభినందనలు.

  శ్రీ సుబ్బారావు గారూ! శుభాశీస్సులు.
  మీ పద్యము మంచి భక్తి సౌరభమును వెదజల్లుచున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. హిమ గిరుల పైన నృత్యము
  హిమవంతుని పుత్రి తోన హేలా రతుడై
  రమణీయ తాండ వమ్మున
  ప్రమదము ముదమంది మిగుల భర్గుని గాంచెన్ !

  రిప్లయితొలగించండి
 7. గురువులు క్షమించాలి ఒకచిన్న ప్రయత్నం . తోటకము

  అవనీ తలమందలి పాశములన్
  భవ బంధములన్ మరువం గయనన్
  శివ తాండవ వైభవ శీతలమున్
  వివరిం చగ సన్నుతి వేలుపులన్ !

  రిప్లయితొలగించండి
 8. కవిరాజవిరాజితము:

  లలితమనోహరలాస్యమొనర్చు సులక్షణశోభిత రాగమయిన్
  తళుకునుగాంచుచుతన్మయమొందుచు తద్ధిమితద్ధిమి తాళగతిన్
  సలిపెనునాట్యము శైలసుతన్ తన సందిటజేర్చెను సాధనతో
  చలిమలయల్లుడు. చంద్రుడు,గంగయు, సంస్తుతి జేయగ హర్షమునన్

  రిప్లయితొలగించండి
 9. సకలజగదంబతో గూడి సంతసమున
  శివుడు చేసిన తాండవ మవనిజనుల
  కఖిలశుభదము, సంతత హర్షదాయి
  యఘహరంబది తలచిన నాత్మలోన.

  రిప్లయితొలగించండి
 10. వెండి కొండ నుండు వేలుపు శివు డంట
  సొగసు లొలుకు చెలిని శోభ యనుచు
  ప్రణయ నృత్య మందు భవ బంధములు వీడి
  తన్మయమ్ము నొంది తాండ వించె

  రిప్లయితొలగించండి
 11. మిత్రులారా! మరికొన్ని పూరణలను తిలకించుదాము. ముందుగా అందరికీ శుభాభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: అమ్మా! మీ పద్యమును (కందపద్యము) మరికొంచెము అర్థవంతముగా చేయవలసి యున్నది.
  తోటకమునకై మీ ప్రయత్నము అభినందనీయము. 1, 2 పాదములలో యతిని మీరు గమనించలేదు.

  శ్రీ తిమ్మాజీరావు గారు: మీ కవిరాజవిరాజితము ప్రశంసనీయము. ఆఖరి పాదములో ఆఖరి స్థానములో యతిని సరిగా వేయలేదు. హర్షమునన్ కి బదులుగా "చారుమతిన్" అంటే బాగుంటుంది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ హరి...మూర్తి గారు: మీ పద్యము చాల బాగుగ నున్నది. సకల జగదంబ అనునది నూత్న ప్రయోగము కదా. దానికి బదులుగా జగదధీశ్వరి అంటే బాగుంటుందేమో. అభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: అమ్మా! మీ 3వ పద్యమును ఇలాగ సవరించి వ్రాయుచున్నాను:
  వేండి కొండ నుండు విశ్వనాథుండుమా
  సహితుడగుచు కూర్మి సంధ్య వేళ
  నాడె తాండవంబు నద్భుత రీతుల
  సకల జగతి మిగుల సంస్తుతింప

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీమాన్నే మాని గారికి నమస్కారాలు,

  ఆంధ్ర మహావ్హారతం లో కణ్వ ఆశ్రమమును వర్ణిస్తూ
  కవిరాజ విరాజితం(21 పద్యం ఆదిపర్వం చతుర్దాశ్వాసము)
  నన్నయ గారి పద్యమును చూడమని ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ తిమ్మాజీ రావు గారికి శుభాశీస్సులు.
  మీరు ఫలానా ఫలాన పద్యము చూడండి అని ఎందుకు అంటున్నారో నాకు అర్థము కాలేదు. మీ కవిరాజవిరాజితములో ప్రతిపాదములో 3 యతులు వేసి మంచి సంప్రదాయమును పాటించేరు. ఆ విధముగా పద్యము ఎంతో బాగుగనున్నది. ఆఖరి పాదములో 3వ స్థానములో యతి మైత్రి లేదు. తదుపరి మీ ఇష్టము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ పండిత నేమాని గురుదేవులకు ధన్యవాదములు. మీ సూచన శిరోధార్యము. తప్పక పాటించెదను.

  రిప్లయితొలగించండి