13, ఆగస్టు 2013, మంగళవారం

పద్య రచన – 432 (శిల-శిల్పము)

కవిమిత్రులారా,
ఈరోజు పద్య రచనకు అంశము....
"శిల - శిల్పము"

18 కామెంట్‌లు:

 1. శిలను చెక్కెనేని శిల్పమ్ముగానగు
  చెక్కుతున్న భాష చేరువగును
  గుణము చెక్కుతున్న గుణధాముడౌను
  మనసు చెక్కినీవు మనిషివగుమ

  రిప్లయితొలగించండి
 2. శిలను బోలునట్టి జీవుని శ్రమతోడ
  మలచి మలచి ద్రుంచి మాయలెల్ల
  శిల్ప సదృశమైన చిన్మయమూర్తిగా
  జేయు సద్గురు పద సీమ నతులు

  రిప్లయితొలగించండి
 3. ammaa! Sailaja garu!
  శుభాశీస్సులు.
  మీ ప్రయత్నము బాగుగ నున్నది. 3వ పాదము చివర గణ భంగము కలదు. సరిచేయవలెను. ఆలాగుననే మనిషి అనేది వ్యావహారిక భాష. మనుజుడు, మనుష్యుడు, మానిసి అనేవి సరియైన పర్యాయ పదములు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 4. దెబ్బలు కొట్టగ స్థపతియె
  అబ్బాయని యనక మిగుల యణకువ జూపన్
  నిబ్బరముగ నాశిలయే
  అబ్బురముగ మూర్తి యగుచు నాహా నిలచున్.

  రిప్లయితొలగించండి
 5. శిలను జెక్కువాని శిల్పి యండ్రు భువిని
  శిల్పి చెక్కు శిలను శిల్ప ముగను
  ప్రాణ ముండు దాని వలె రమ్యమై యుండి
  మనసు దోచు కొనును మాన్యు లార !

  రిప్లయితొలగించండి
 6. శ్రీ పండిత నేమాని గురువర్యులకు నమస్సులు..
  నేను గణదోషాల పొరపాటు చేసినపుడల్లా తమరినుంచి ఒక్కొక్క పాఠము నేర్చుకుంటున్నాను..మీసూచనననుసరించి ఇలా సవరించితిని,.ఇందులో కూడ తప్పలున్న మన్నించి సవరించ ప్రార్దన..

  శిలను చెక్కెనేని శిల్పమ్ముగానగు
  చెక్కుతున్న భాష చేరువగును
  గుణము చెక్కుతున్న గుణధాముడగున్
  మనసు చెక్కినీవు మానిసగుము

  రిప్లయితొలగించండి
 7. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి పద్య రచనలను పరిసేఏలించుదాము:

  శ్రీమతి శైలజ గారు: మీ పద్యమును ఇలాగ సవరించుచున్నాను:

  శిలను జెక్కెనేని శిల్పమ్ము గానగు
  జెక్కుచున్న భాష చేరువగును
  గుణము జెక్కుచున్న గుణవంతుడగు భువి
  మనసు జెక్కు నెడల మనుజుడగును

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: శిల దెబ్బలను భరించి అబ్బురపరచే శిల్పమగునని సెలవిచ్చేరు. పద్యము బాగున్నది.

  శ్రీ సుబ్బా రావు గారు: స్థపతి చేతిలో శిల శిల్పమయి ప్రాణముగల మూర్తి వలె తయారగును అని సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది.

  స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. శిల రూపుననున్నను మను
  జుల పాదపు తాడనముల సొక్కుట విధియౌ,
  పలు దెబ్బలతో తీరిన
  శిల శిల్పంబై మెరయును చెలువముతోడన్.

  రిప్లయితొలగించండి
 9. శైలజ గారూ,
  పొరపాటును ఎత్తి చూపినప్పుడు అంగీకరించి సవరించుకొని క్రొత్త పాఠాలను నేర్చుకొనడం ఔత్సాహిక కవులకు కర్తవ్యం. అది సహృదయ లక్షణం. సంతోషం.
  సవరించిన తరువాత కూడా మూడవ పాదంలో గణదోషం దొర్లింది. అంతేకాక ‘మానిసి + అగును’ అన్నప్పుడు సంధిలేదు. యడాగమం వస్తుంది. మీ చివరి రెండు పాదాలకు నా సవరణ.....
  గుణము చెక్కుచున్న గుణధాము డనబడున్
  మనసు చెక్కినపుడె మాని యగు.
  *
  పండిత నేమాని వారూ,
  పెద్ద దిక్కుగా మీరు బ్లాగుకు అందిస్తున్న సహకారానికి నమోవాకములు.
  మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

  విషయ మెద్దియైన వేదాంతి వగుచు నా
  ధ్యాత్మికముగఁ జెప్పునట్టి నేర్పు
  రామజోగి మందు రక్తితోఁ బానమ్ము
  జేసినట్టి నీకుఁ జేకుఱెను గద!
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘మిగుల నణకువ’ అనండి.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 10. లక్ష్మీదేవి గారూ,
  మీ కందం అందంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శిలలపై నలలను జెక్కె స్థిరముగాను,చెలి రూపమ్ము
  నలతి యలతి శిలల పయి నాభరణమ్ముల తోడ
  నలనాటి చరితము దెలిపె నమర శిల్పి మన జక్కన్న,
  గలవు బేలూరున జుడు కదలక మెదలక నేడు
  గలగల బలుకుల తోడ కనులకు జేయును విందు.

  రిప్లయితొలగించండి
 12. శిల-శిల్పము
  శిలలు లేనిదే శిల్పము కలవి కాదు
  శిల్పమున కన్ని శిలలును చేవ కావు
  శిలలు శిల్పము కలిగినా శిల్పకారు
  డెలమి వలయును చేపట్టి ఉలియు, సుత్తి
  చెక్కి మూర్తిని స్పూర్తితో చక్క జేయ
  మెరుగులన్నియు దిద్దుచు సరసముగను
  కలలసుందరి మిలమిల నిలుపు నెదుట

  శిల్పకారుని నిపుణత చెక్కినట్టి
  సుత్తి, ఉలియును పొందును మిత్తి గాని
  శిలయు శిల్పమ్ము, సిగ్గులు చిరునగవుయు
  మిగిలిపోవు సతతము యుగయుగములు

  రిప్లయితొలగించండి
 13. నల్లని శిలనే యైనను
  నుల్లము రంజిల్లు శిల్ప ములియలి కిడిచే
  కల్లలు గాదని శిల్పిని
  యెల్లరు మెచ్చంగ నతని నేర్పరి తనమున్ !

  రిప్లయితొలగించండి
 14. వరప్రసాద్ గారూ,
  కర్ణాటకలో ఉంటూ బేలూరు శిల్పాలను గురించి చక్కగా వర్ణించారు. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీరావు గారూ,
  మీ పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.
  ‘శిల్పముకు ’ అనకుండా ‘శిల్పమునకు’ అనాలి. అక్కడ ‘శిల్పము జేయరాదు’ అందాం.
  ‘కలిగినా’ అనడం వ్యావహారికం. దానిని ‘కలిగిన/కలిగినన్’ అనవచ్చు.
  ‘చిరు నగవుయు’ అనకుండా ‘చిరునగవును’ అనండి.
  చివరి పాదంలో గణదోషం. ‘మిగిలిపోవును’ అంటే సరి.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  చివరిపాదంలో యతిదోషం. ‘శిల్పిని/ నెల్లరు మెచ్చంగ...’ అంటే అఖండయతితో సరి.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ నేమానిగారికి ధన్యవాదములు.
  మాస్టరు గారూ ! నిజమే...చక్కనిసవరణకు ధన్యవాదములు.
  సవరణతో...

  దెబ్బలు కొట్టగ స్థపతియె
  అబ్బాయని యనక మిగుల నణకువ జూపన్
  నిబ్బరముగ నాశిలయే
  అబ్బురముగ మూర్తి యగుచు నాహా నిలచున్.

  రిప్లయితొలగించండి