23, ఆగస్టు 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1152 (తీర్థయాత్రల వలన)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
తీర్థయాత్రల వలన వర్ధిల్లు నఘము.

22 కామెంట్‌లు:

  1. పుణ్య తీర్థముల్ సేవింప బోవు నెడల
    మోసకారు లనేకులు కాసులకయి
    వంచనము చేయుచుందురు బహు విధముల
    తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము

    రిప్లయితొలగించండి
  2. పుణ్యములు వృద్ధిపొందును బూరుషునకు
    నిత్య సత్కర్మ, సద్భక్తి, సత్యవాక్కు,
    తీర్థ యాత్రల వలన! వర్ధిల్లు నఘము
    దౌష్ట్యములు సేయఁగా నిరతమ్ము! నిజము.

    రిప్లయితొలగించండి
  3. కలి యుగమ్మున మహిమలు వెలయు మెండు
    కొలువు దీరిన వెంకన్న కోరి నిలచె
    తీర్ధ యాత్రల వలన వర్ధిల్లు నఘము
    ముడుపు రూపము లందున పుచ్చు కొనగ

    రిప్లయితొలగించండి
  4. తీర్థ యాత్రల లో గూడ తిమ్మరాజు
    మందు మానడు చెప్పినన్ మాట వినడు
    " తీర్థ " మన్నది వెంటగా తెచ్చి జేయు
    ' తీర్ధ ' యాత్రల వలన వర్ధిల్లు నఘము

    రిప్లయితొలగించండి
  5. చిత్తశాంతి నిచ్చు చింతలన్ని తీరు
    భక్రి బావమున్న భావి తరము
    తీర్ధయాత్ర లవలన వర్ధిల్లు నఘము
    నుత్త మాట కాదు నిదియె నిజము

    రిప్లయితొలగించండి
  6. పండిత నేమాని వారూ,
    తీర్థక్షేత్రాలలో వంచకుల వలన పాపం వర్ధిల్లు ననే మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. కానీ దేవుడు ముడుపులు పుచ్చుకున్నందువలన అఘం ఎలా వర్ధిల్లుతుందంటారు?
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    జనబాహుళ్యంలో ‘తీర్థ’ శబ్దానికి ఉన్న వ్యంగ్యార్థాన్ని సమర్థంగా వినియోగించుకొని చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    శైలజ గారూ,
    సమస్య తేటగీతి అయితే మీరు ఆటవెలది వ్రాసారు. అలాగే సమస్యను సమర్థించినట్టుగా వ్రాసారు. మీ పద్యానికి నా సవరణ....
    చిత్తశాంతి నొసఁగుఁ దీరు చింతలన్ని
    భక్రి బావమ్ము గలిగిన భావి తరము
    తీర్ధయాత్ర లవలన వర్ధిల్లు; నఘము
    కలుగ దిది నిజమ్మగు, నుత్త మాట కాదు.

    రిప్లయితొలగించండి
  7. పండిత నేమానిగారికి పూజ్య గురుదేవులు
    శంకరయ్య గారికి నమస్సులు

    పూజలిండ్లను చేయగ పుణ్య మొదవు
    మందిరమ్ముల నొనరింప మరి యధికము
    తీర్థ యాత్రల వలన వర్ధిలు, నఘము
    సర్వము నశియించు గంగలో స్నానమాడ .

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు.

    నారదుడు ఈ రీతిని భూలోక విషయములను జెప్పు చుండె
    ==========*===========
    పుణ్య కార్య మనుచు నేడు పుడమి జనులు
    పుణ్య తీర్థములందున మునిగి దేల
    తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము
    తీర్థ జలము నందు,గనుడు దేవ దేవ।

    రిప్లయితొలగించండి
  9. పూలుపళ్ళనుదెచ్చిపూజించి గుడియందె
    ..........ప్లాస్టీకుసంచుల పాఱవైచి
    దొడ్డగొంతుకతోనె దూరవాణిలొవాగి
    ..........సాటిభక్తులను కష్టాలబెట్టి
    ఉచితానుచితములనొదిలి దర్పముతోడ
    ..........ఫోటోలకొసమై ఫోజులిచ్చి
    ఆచారమర్యాదలన్నివిడచి అప
    ..........చారాపరాధముల్ చాలసలిపి

    భక్తి కొంచమైననులేక పరులవద్ద
    మేముఁజనితిమచ్చటకని మేముజూచి
    తిమని గొప్పలుబలుకుచు తిరుగునట్టి
    తీర్థ యాత్రలవలన వర్ధిల్లునఘము ||

    రిప్లయితొలగించండి
  10. రెండవపాదమున "లో" ను, చన్దస్సుసనుగుణముగా హ్రస్వముగా "లొ" గా వాడేను.
    అందుకు బదులుగా ఈక్రింది సవరణ:
    "గట్టిగాఁనరచి జంగమదూరవాణిలో సాటిభక్తులనుకష్టాలబెట్టి"
    అని మార్చినాను.

    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  11. శ్రీమతి శైలజ గారి పద్యమును సవరించుచు శ్రీ శంకరయ్య గారు చెప్పిన పద్యములో 4వ పాదమును(యతి మైత్రి కొరకు) మార్పు చెయ్యాలి. ఇలాగ మారుద్దాము:
    "కలుగు నిది నిజమ్మే కాని కల్ల కాదు"
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  12. మిత్రులారా! శుభాశీస్సులు.
    మరికొన్ని పూరణలను చూద్దాము. ముందుగా అందరికీ శుభాభినందనలు.

    1. శ్రీ తిమ్మాజీరావు గారు: పుణ్యము వర్ధిల్లు, నఘము నశించు అని మంచి విరుపుతో పూరించేరు. చాల బాగుగ నున్నది.

    2. శ్రీ వర ప్రసాద్ గారు: తీర్థములలో జనులెల్లరు స్నానములు చేయుటవలన ఆ తీర్థ జలములలో నఘము చేరుచున్నట్లు నారదుడు చెప్పుట బాగుగ నున్నది.

    3. శ్రీ గూడ రఘురాం గారు: తీర్థ యాత్రా స్థలములలో వివిధ దంభ ప్రదర్శనలను విప్-ఉలీకరించేరు. చాల బాగుగ నున్నది. ఉచితానుచితముల నొదిలి -- అని ప్రయోగించేరు .. ఒదిలి అను పదమును శబ్దరత్నాకరములో ఈయలేదు (వదిలి అనుట సాధువు).

    రిప్లయితొలగించండి
  13. పుణ్య పురుషార్ధములు మఱి గణ్య ముగను
    తీ ర్ధ యాత్రలవలన వర్ధిల్లు, నఘము
    కలుగు ప్రాణ హింస జరుగు నెలవు చోట
    ప్రాణ హింసను జేయక పదిల పడుము

    రిప్లయితొలగించండి
  14. తల్లి దండ్రులక్షేమమ్ముదలపలేక
    పలుకులందున సత్యమ్ము నిలపలేక
    ప్రేమతత్వమ్ముబెంచక వెళ్ళు చుండు
    తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!!!

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.
    మీసూచనకు ధన్యవాదములు..

    "ఒదిలి" కి బదులుగా "ఉడిగి" అని వాడిన సరిగానుండుననుకుంటాను..
    శబ్దరత్నాకరములో - "ఉడుగు" కు కృశించు అని అర్థమున్నది..
    కావున ఈ మార్పుతో.. ఆ పాదము "ఉచితానుచితములనుడిగి దర్పముతోడ" అని మార్చవచ్చునా?

    రిప్లయితొలగించండి
  16. శ్రీ సుబ్బా రావు గారు! తీర్థ యాత్రలవలన పుణ్య పురుషార్థాలు వర్ధిల్లునని మంచి విరుపుతో పూరించేరు - బాగుగ నున్నది - అభినందనలు.

    శ్రీ పీతాంబర్ గారు: తల్లిదండ్రులను చూడక, ప్రేమ లేక, సత్యమును విడిచి తీర్థయాత్రలను చేస్తే అనర్థమే చక్కగా సెలవిచ్చేరు. అభినందనలు.

    శ్రీ రఘురాం గారు: ఓకే (మీ సూచన సరియైనదే).

    రిప్లయితొలగించండి
  17. రఘురామ్ గారూ మంచి పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గుమ్మము వద్దను గుట్టుగా డబ్బిచ్చి
    ........అడ్డదారిన లోన కరుగు వార్కి
    తీర్థ ప్రసాదము లర్థ భాగమె గొని
    ........వెక్కసమై క్రింద విడచు వార్కి
    గుడికేగినను యింటి గొడవలే చర్చించి
    ........పెరవారి నిబ్బంది పెట్టు వార్కి
    భారతీయత మాసి పాశ్చాత్య దుస్తుల
    ........వెకిలి వేషములను వేయు వార్కి

    పాదరక్షలు, చరవాణి పైన నిల్పి
    చిత్తమును, నిల్చు వార్కి శివుని ముందు
    యెన్ని యాత్రలు జేసిన నేమి ఫలము?
    తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!

    (రఘురామ్ గారి స్ఫూర్తితో)

    రిప్లయితొలగించండి
  19. శ్రీ మ్నిస్సన్న గారూ! శుభాశీస్సులు. మీ పద్యము ప్రశంసనీయముగా నున్నది. శ్రీ వరప్రసాద్ గారు సూచించి నటుల తేటగీతిలో గణభంగము కనుపించినా అది టైపు పొరపాటే -- సరిజేయండి. యతి మైత్రి బాగుగనే యున్నది. పాశ్చాత్య దుస్తులు అనే సమాసము మాత్రము బాగు లేదు. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ మిస్సన్న గారు చాలా మంచి పద్యము వ్రాసారు, నా తప్పిదమునకు మన్నించగలరు.

    రిప్లయితొలగించండి
  21. నేమాని పండితార్యా! ధన్యవాదములు. సవరించితిని.

    గుమ్మము వద్దను గుట్టుగా డబ్బిచ్చి
    ........అడ్డదారిన లోన కరుగు వార్కి
    తీర్థ ప్రసాదము లర్థ భాగమె గొని
    ........వెక్కసమై క్రింద విడచు వార్కి
    గుడికేగినను యింటి గొడవలే చర్చించి
    ........పెరవారి నిబ్బంది పెట్టు వార్కి
    భారతీయత మాసి పాశ్చాత్య వస్త్రాలఁ
    ........వెకిలి వేషములను వేయు వార్కి

    పాదరక్షలు, చరవాణి పైన నిల్పి
    చిత్తమును, నిల్చు వారికి శివుని ముందు
    యెన్ని యాత్రలు జేసిన నేమి ఫలము?
    తీర్థ యాత్రల వలన వర్ధిల్లు నఘము!

    రిప్లయితొలగించండి