18, ఆగస్టు 2013, ఆదివారం

పద్య రచన – 437 (తెలుఁగు లెస్స)

కవిమిత్రులారా,
ఈనాటి పద్యరచనకు అంశము....
"తెలుఁగు లెస్స"

25 కామెంట్‌లు:

  1. తెలుగు రాష్ట్రము మహాతేజోనిధానమై
    ....సిరిసంపదలు నిండి చెలగు గాక!
    తెలుగు భాష సమస్త దేశభాషలలోన
    ....మిన్నయై ప్రఖ్యాతి మించు గాక!
    తెలుగు సంస్కృతి కళా కలితమై లలితమై
    ....అందరి మన్నన లందు గాక!
    తెలుగు ప్రజలు మహా ధీవిశేషులటంచు
    ....స్థిరమైన కీర్తి గాంచెదరు గాక!
    నన్నయాదుల ప్రేముడి కన్న భాష
    ఆంధ్ర భోజు సత్కృతి గని నట్టి భాష
    వేవెలుంగుల ప్రోవుగా వెలుగు భాష
    దేశ భాషలలో లెస్స తెలుగు భాష

    రిప్లయితొలగించండి
  2. తెలుగు తోటను విరియంగ వెలుగు పూలు
    పండి తోత్తము లందించు పంట లనగ
    కవుల కావ్యాలు విని నంత కలుగు ముదము
    దేశ భాష ల కన్నిట తెలుగు లెస్స

    రిప్లయితొలగించండి
  3. అక్షరాలేబది యారుతో నలరారు
    లక్షలారు పదాల లలిత భాష !
    అచ్చులు హల్లులు అరుదైన అరసున్న
    సున్నయును విసర్గలున్న భాష!
    నెలవంక ముడులతో తలపైన గుడులతో
    తలకట్టు కొమ్ముతో దనరుభాష !
    ఏత్వాల ఓత్వాల ఔత్వాల ఋత్వాల
    ఒత్తులైత్వాల గమ్మత్తు భాష!

    పూర్ణచంద్రుని రూపమ్ము బోలుభాష!
    భాను బింబంబు రీతి గన్పట్టుభాష !
    గుండ్రముగనుండు నిండు భూగోళభాష!
    వింత అనుభూతి నిడెడు అజంత భాష!

    క్షీరాబ్ధి చిలుకంగ క్షితిపైన తెలుగింట
    ఒలికిన తేనెయో తెలుగుభాష !
    హరునిశిరంబందు సురగంగ దూకంగ
    దివినుండి జారెనో తెలుగుభాష !
    వాగ్దేవి నుదుటన బాలార్క బింబమై
    వెలుగొందు తిలకమో తెలుగుభాష !
    చంద్రవంకలపైన ఇంద్రచాపము లీల
    వెలుగు వర్ణమ్ములో తెలుగుభాష !

    చేవగల్గిన విశ్వ ప్రాచీన భాష !
    దేవరాయలు మెచ్చిన జీవ భాష!
    విశ్వ భాషల ధీటుగా వెలుగు భాష!
    దేశ భాషల మణిపూస తెలుగుభాష !!!

    రిప్లయితొలగించండి
  4. పలుకుతేనెలొలుకు ప్రధమ భాష
    వేనవేల కవుల వెన్న పూస
    ఆంధ్ర భోజ నోట యలరు భాష
    దేశభాషలందు తెలుగు లెస్స

    రిప్లయితొలగించండి
  5. శ్రీమతి శైలజ గారి పద్యమును -- ఆటవెలదిగా సరిదిద్దుచూ ఒక పద్యము:

    పలుకు తేనె పాలు పంచదారల బాష
    వేన వేల కవుల వెన్నపూస
    ఆంధ్ర భోజు నోట నలరు కమ్మని భాష
    దేశ భాషలందు తెలుగు లెస్స

    రిప్లయితొలగించండి
  6. దేశ భాష లందు తెలుగు లెస్స నియెను
    సార్వ భౌము డపుడు సరిగ బలికె
    తేనె లొలుకు భాష తెలుగు భాషయె మఱి
    అర్ధమగును నార్య యందఱకును

    రిప్లయితొలగించండి
  7. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    =========*=======
    భూ జనుల మదిని గెలచిన
    రాజు"తెలుగు లెస్స"యనెను రసరమ్యముగన్,
    తేజ మలరు భాషయనుచు
    తేజోవంతుడు బలికెను తెలుగును మహిలో।

    రిప్లయితొలగించండి
  8. అందచందమొల్కు నక్షరమ్మున లెస్స
    పలుక నోట తేనె లొలుకు లెస్స
    పద్యమందు బాడ వాక్శుద్ధి యగు లెస్స
    దేశ భాషలందు తెలుగు లెస్స.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  10. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని గారికి గురుదేవులు
    శంకరయ్య గారికి నమస్కృతులు

    తమిళ మలయాళ లిపులు సమానరీతి
    సరళ పరుషముల్ పల్కగ, సంస్కృతలిపి
    తెలుగు కన్నడ భాసలు అనుసరించి
    తమకు ప్రత్యేక స్థానమమర్చు కొనియె

    కట్టుబాటులు ఒకటిగా కలిసిపోయె
    ఛoద వ్యాకర ణమ్ముల చంద మొకటి
    గాని తలకట్టు వంగును కన్నడ లిపి
    నింగిజూచును తెనుగున నిబ్బరముగ

    అన్ని ద్రావిడ బాసల యందు తెలుగు
    తేనెలొల్కును తెలగాణ తీపితనము
    చేవ గల్గెడి రాయలసీమ తెలుగు
    తీరప్రాంతపు నన్నయ తిక్కయజ్వ
    శంభు దాసుడు శ్రీనాథు దంభ కవిత
    తెలుగు సాహిత్యమునకిడు దివ్యజ్యోతి

    తమిళము మళయాళము కన్నడము మరాఠి
    బాస పల్కుల కన్ననుభవ్యముగను
    తెనుగు తీపియు తేటయు పునుగు బాస
    దేశ భాషల యందున తెలుగులెస్స

    రిప్లయితొలగించండి
  12. సురుచిర సుందరోజ్వల యశోవిభవోన్నత కీర్తిచంద్రికా
    కరముల వెల్గి కావ్య శతకమ్ముల మించి శతావధానమం
    దరయగ సత్కవీశ్వర సమంచిత భావమునందు తేజమై
    విరిసిన పుష్పమో యని వెలింగెడు తెల్గున కంజలిచ్చెదన్.

    రిప్లయితొలగించండి
  13. మిత్రులారా! అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. కొన్ని పద్యములను పరిశీలించుదాము:

    శ్రీమతి రాజేశ్వరి గారు: తెలుగు పూల తోట. పండితులు పండించిన పంట, కవులు కావించిన కావ్యములతో సమృద్ధి నొందిన భాష అని అభివర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ పీతాంబర్ గారు: 2 మంచి పద్యములలో చాల విపులముగా వర్ణించేరు. గుండ్రముగా నుండు అక్షరములను సూర్య చంద్రులతో సమానముగా వర్ణించేరు. అనేక ఉపమానములను చూపుచు తెలుగు భాష వైభవమును చాల ఎత్తునకు తీసుకొని వెళ్ళినారు. ప్రశంసనీయమైన రచన.

    శ్రీమతి శైలజ గారు: పద్యరచన ఇంకా పట్టు బడలేదు. ప్రయత్నము చేస్తున్నారు. తేనె లొలుకు భాష అని తెలుగును వర్ణించుచు ఆంధ్ర భోజుని కూడా గుర్తు చేసేరు. భావము చాల బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బా రావు గారు: కృష్ణరాయలు కీర్తించిన భాష అని తెలుగును అభివర్ణించేరు. చాల బాగుగ నున్నది పద్యము.

    శ్రీ వర ప్రసాద్ గారు: చక్కని పద్యములో ఆంధ్ర భోజుడు కీర్తించిన తెలుగు భాషను అభివర్ణించేరు.

    శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారు: తెలుగు లిపి చాల అందమైనది, భాష చాల తీయనైనది, మరియు ఆ భాషలో వాక్శుద్ధిని గూర్ఛే మహిమ కలదని వర్ణించేరు. చాల మంచి పద్యము.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: ఒక మంచి ఊపులో వచ్చేయి వీరి పద్యములు. దక్షిణ దేశ భాషలన్నింటిని ఉట్టంకించుచూ అన్నిట్లో తెలుగు యొక్క ప్రత్యేకతను, వైభవమును అద్భుతముగ వర్ణించేరు. బహుథా ప్రశంసనీయము.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ వర ప్రసాద్ గారు: ఒక మంచి ప్రయత్నము చేసేరు. ఆటవెలది/సీసమును ఆవిష్కరించేరు. ప్రశంసనీయమైన కృషి. 3 చోటులలో నుగాగమమునకు బదులుగా యడాగమము ఉండవలెనని నా భావము:
    2వ పాదము: జగతినందు (జగతియందు - సాధువు)
    4వ పాదము: ఆటవెలదినందు (ఆటవెలదియందు - సాధువు)
    ఆటవెలది 3వ పాదము: పుడమినందు (పుడమియందు - సాధువు)
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు:
    ఒక కమ్మని చంపకమాలను వికసింపజేసేరు - అభినందనలు. భావము చాలా ప్రశంసనీయము. కవీశ్వరుల భావములో విరిసిన పుష్పముగా తెలుగు భాషను వర్ణించేరు. 4వ పాదములో యతి మైత్రి లేదు. చిన్న సవరణతో సరిజేయగలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  16. శ్రీ నేమాని గురుదేవులకు ధన్యవాదములు
    గురుదేవులకు క్షమించగలరు వ్యావహారికములు వేసితిని. సవరణలతో

    ఆటవెలది/సీసము
    =======*========
    తెలుగు వారి వెలుగు తెలుగు బల్క బెరుగు
    ---- తేట తేట తెలుగు తెల్ల వార
    వెలుగు,జనుల నెల్ల గలుపు జగతియందు
    ----మూడు లింగ ములకు ముక్కరగను
    నిలిచి యుండె గనుడు నిర్మల మనమున
    ---- కంద సీసములకు చందనమయి
    ఆట వెలది యందు నాడి పాడుచునుండి
    ----తేట గీతులకును దీపి నిచ్చి
    పలుకు వారి మదిని పనస తేనెల నింపి
    ---- వినెడి వారి జెవుల విందు జేసి
    పుడమి యందు నిలచె పొంకమలరగను
    ----తెలుగు మరచి మీరు దిరుగ వలదు.

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితుల పద్యం తెలుగు వెలుగులను అద్భుతంగా కీర్తిస్తోంది.

    మంద పీతాంబర్ గారి పద్యాలు తెలుగు లిపి అందచందాలను, మాధుర్యాన్ని
    చాలా అందంగా వర్ణించాయి.

    రిప్లయితొలగించండి
  18. టాకు తెలుగు లెస్సు, టాకినింగ్లీషోన్లి
    టోల్డ్ కిడ్సు సారు బోల్డు టోను!
    (Talk Telugu less, talk in English only.
    Told kids Sir bold tone)

    మాతృ భాష వలదె? మాతయు వలదొకో?
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    పాప నవ్వు వోలె! పాల మీగడ వోలె!
    మంచిగంధ మట్లు! మల్లె లట్లు!
    వీణ పాట రీతి! విలసిల్లు జగతిని
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    మలయ పవన వీచి! మకరంద బిందువు!
    పాల కడలిని యల! పూల మాల!
    మింటి మెరుపు తీవ! మెరసెడు తారక!
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    తెనుగు భాష ముందు పునుగు జవ్వాదుల
    యునికి గుండు సున్న యనెద రయ్య
    తెలుగు సౌరభంపు తీరిది వింటివా?
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    తెలుగు భాష తీపి తేనియకును లేదు!
    తెలుగు వర్ణమాల తీరు సొగసు!
    తెలుగున తలకట్టు నిలుపును ఠీవిని!
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    తెలుగు రాని వాడు, తెలుగు నేర్వని వాడు,
    తెలుగు పలుకుబడుల తియ్యదనము
    తెలుగు నేల బుట్టి తెలియక, మూర్ఖుడు!
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    వేల వత్సరాల వెనుకనే ప్రభవించి
    దీప్తు లీను చుండె తెలుగు ధాత్రి!
    మధురిమలను పంచు మన తెలుగేనయా!
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    వస్తువెట్టిదైన వర్థిల్లు తెలుగున
    పద్యమందు నొదిగి, బంగరంపు
    టుంగరమున రత్న మొదిగిన రీతిగా!
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    దేశ భాషలందు దివ్యమై వెలుగొందు!
    సురలు పలుకు చుంద్రు మురిసి తెలుగు!
    కృష్ణ రాయ విభుని కీర్తి తెల్గేనయా
    తెలుపు మయ్య గురుడ! తెలుగు లెస్స?

    రిప్లయితొలగించండి
  19. శ్రీ పండిత నేమాని గారికి నమస్కారములు.నా పద్యాలపై మీ వ్యాఖ్యనాలో ఉత్సాహాన్ని నింపింది నాకు మహదానందాన్ని కలుగజేసింది,ధన్యవాదాలు .

    శ్రీ మిస్సన్న గారూ ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ మిస్సన్న గారికి శుభాశీస్సులు. నవ నవలాడే ఆటవెలదుల విన్యాసములతో వేడుక చేసేరు. మనోహరమైన ఖండిక. అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. కవిమిత్రులకు నమస్కృతులు.
    తెలుగు యొక్క శ్రేష్ఠత్వాన్ని మనోహరమైన పద్యాలలో వివరించిన ....
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    మంద పీతాంబర్ గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    ...... అభినందనలు, ధన్యవాదాలు.
    *
    పండిత నేమాని వారూ,
    మిత్రుల పూరణల, పద్యాలను విశ్లేషిస్తూ తగిన సూచనలను, సవరణలను ఇస్తున్నందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురువర్యులకు నమస్సులు.
    యతి దోషమును సూచించినదులకు ధన్యవాదములు. సవరిస్తూ........

    విరిసిన పుష్పమే యిది భువిన్ మకరందము గ్రోలగావలెన్.

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి