10, ఆగస్టు 2013, శనివారం

సమస్యాపూరణం – 1139 (నెల కేడు దినమ్ములని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

24 కామెంట్‌లు:

 1. అల ముప్పది దినముల నొక
  నెల, కేడు దినమ్ములనిగణింతురు విజ్ఞుల్
  చెలగు నొక వారమునకని
  యలఘు గుణా! కంది శంకరార్యా! సుకవీ!

  రిప్లయితొలగించండి
 2. శంకరయ్య గారు!
  మీరు, మన ’శంకరాభరణం’ బ్లాగు సభ్యులంతా ఈ క్రింది లింకును క్లిక్ చేసి, ’రేడియో తరంగ’లో ప్రసారమయిన నా ’ఇంటర్ వ్యూ’ ను వినండి. అందులో మన ’శంకరాభరణం’ బ్లాగు చేస్తున్న విశేష కృషిని గురించి వివరించాను.
  http://telugu.tharangamedia.com/srujana-swaram-ii-dr-phanidra/

  రిప్లయితొలగించండి
 3. లలితా ! వినుమా చెప్పెద !
  కలసిన వారములు మూడు కాదది యాపై
  కలవవలెను తెలియగ మరి
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 4. ప్రతి శ్రావణమాసమునఁ దమ యూరిలో నేడు దినములు జరుగు రథోత్సవములఁ గూర్చి ముచ్చటించుకొనుచున్న జనుల సంభాషణము...

  "ఇల దైవారాధనమునఁ
  దులలే నట్టుల జరుగు రథోత్సవమందున్
  ’బులకింతు రిటులె జనములు
  నెల కేడు దినమ్ము’లని గణింతురు విజ్ఞుల్!"

  రిప్లయితొలగించండి
 5. సహృదయులు, సత్కవీశ్వరులు శ్రీ నేమాని గురుదేవులకు, శ్రీ శంకరయ్య గురుదేవులకు వినమ్రవందనములు.
  ====*=======
  కొలువులు బొందిన వారిని
  తిలకించెడి పని దినముల దీపిక జూడన్
  సెలవులు,బందులు దీయగ
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.
  ( దీపిక=హాజరు పట్టి )

  రిప్లయితొలగించండి
 6. శ్రీ డా: ఆచార్య ఫణీంద్ర గారు మీ " ఇంటర్ వ్యూ "రేడియో తరంగ లింక్ లో మీ సృజన స్వరం విన్నాము. చాలా బాగుగా నున్నది. త్రిలింగ బాషను శివాత్మకమని జెప్పి నిరూపించినారు, ధన్యవాదములు. మీరు కొద్ది సమయము వెచ్చించి మన "శంకరాభరణం" బ్లాగులో అనుదినము ఒక పద్యము వ్రాసి గురుదేవులతోడ మాకు మార్గదర్శకత్వము వహించగలరు. నాకు కూడా కపిల్ దేవ్ యన్న చాలా ఇష్టము. మీ పద్యములు కూడా మంచి ధారతో పూర్వ కవుల పద్యముల వలె సుందరముగా నున్నవి. అన్యదేశ పదములతొ ఆటలాడితిరి. మీ అక్షరముల ఇటుకలను మాకు కూడా పంచి మమ్ము ఆనందింప ప్రార్థన.

  రిప్లయితొలగించండి
 7. అల శాస్రజ్ఞులు సెప్పిరి
  నెల కేడు దినమ్ములని ,గ ణిం తురు విజ్ఞుల్
  మెలమెల్ల గ దివిని గదలు
  పలు తారల ఫలిత మార్య ! ప్రమదము తోడన్

  రిప్లయితొలగించండి
 8. మిత్రులారా! శుభాశీస్సులు.
  ఈనాటి సమస్యకు వచ్చిన కొన్ని పూరణలను చూద్దాము. ముందుగా అందరికీ అభినందనలు.

  శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు: 3వారములపైని 7 రోజులు కలిపితే ఒక నెల అని సెలవిచ్చేరు. పద్యము బాగుగ నున్నది.

  శ్రీ గుండు మధుసూదన్ గారు: శ్రావణ మాసములో రథోత్సవములను నెలకు 7 రోజులే జరుపుతారని అన్నారు. బాగున్నది పద్యము.

  శ్రీ వర ప్రసాద్ గారు: ఉద్యోగుల పని దినములలో సెలవులు, బందులు మొదలైన వానిని తొలగించితే మిగిలేవి నెలకు 7 రోజులే అని సెలవిచ్చేరు. భావము క్రొత్తగా నున్నది. బాగుగనున్నది పద్యము.

  శ్రీ సుబ్బా రావు గారు: గ్రహ తారా గతులు మారితే నెలకు 7 రోజులే ఉండునని శాస్త్రజ్ఞులు సెలవిచ్చేరు అన్నారు. పద్యము బాగుగ నున్నది.  రిప్లయితొలగించండి
 9. వారం క్రితం పుట్టిన ఒక బిడ్డను గురించి చెబుతూ.......

  కిల కిల నగవుచుఁ దలిదం
  డ్రులకు మనోరథము దీర్ప రోమాంచితమౌ
  పలుతెఱఁగుల వన్నెల చి
  న్నెలకేడే దినములని గణింతురు విజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 10. కల కలము రేప మనసుకు
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్ !
  నిల బ్రతుక జీవి కెనిమిది
  కల నైనను వినగ లేము గాంగుని కైనన్

  గాంగుడు = భీష్ముడు

  రిప్లయితొలగించండి
 11. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 12. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 13. ఏమో..ఏదయినా జరగవచ్చు..అన్నభావనతో ..పాత పధ్ధతే అయినా.. గేయకవిత వ్రాసాను ..తప్పయిన మన్నించ ప్రార్దన..

  ఏమో గఱ్ఱం ఎగరావచ్చు
  నెలకేడు దినములు రానూ వచ్చు
  బడికే వెళ్ళని రోజే వచ్చు
  బ్లాగులె బడులై మారావచ్చు ...ఏమో..
  మనిషే కాలం తిప్పెయ్యొచ్చు
  మనసే చదివే చదువే వచ్చు
  వయసే వెనుకకు నడవా వచ్చు
  వరసలన్నవి పోనూ వచ్చు ...ఏమో..
  ఋతువులే గతి తప్పావచ్చు
  బతుకున మెతుకే పోనూవచ్చు
  వత్సరాల వడి తగ్గావచ్చు
  మాసాలన్నవి మడిచెయ్యొచ్చు ...ఏమో...
  కలలే నిజమవ్వావచ్చు
  ఇలయే కలగా కరగా వచ్చు
  నెలకేడు దినములవ్వావచ్చు
  నెలఱేడే దిగి రానూ వచ్చు ....ఏమో..


  రిప్లయితొలగించండి
 14. అల సూర్యు చుట్టు తిరుగగ
  హలకొక యేడాది పట్టు హాయనమునకున్
  నెలలేబది రెండగుచో
  నెలకేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 15. శ్రీ సంపత్ కుమార్ శాస్త్రి గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగ నున్నది.
  వారము రోజుల క్రితము పుట్టిన బిడ్డ యొక్క వన్నెలు చిన్నెలు గుర్తు చేసేరు. అభినందనలు.

  శ్రీమతి రాజేశ్వరి గారు: శుభాశీస్సులు. మీ భావము తెలియుట లేదు.

  శ్రీమతి శైలజ గారు: మీ గేయము బాగుగ నున్నది. పద్య విద్యయే మన బ్లాగు యొక్క సంప్రదాయము.

  శ్రీ తిమ్మాజీ రావు గారు: శుభాశీస్సులు. సమస్యను గణిత శాస్త్రము ద్వారా పరిష్కరించేరు. పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. శ్రీ వరప్రసాద్ గారి బాటలోనే ::

  నెలజీతగాండ్రచెంతను
  కళకళలాడుచునులక్ష్మి కదలాడుదినం
  బులు యెన్ననన్ రమారమి
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 17. కవిమిత్రులకు నమస్కృతులు.
  నా ఆరోగ్య పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. డాక్టర్ గారి దగ్గరకు వెళ్తే ఏ పరీక్షలూ అవసరం లేదన్నారు. ఇంతకు ముందిచ్చిన మందులనే వాడమన్నారు. ఇంకా జ్వరం పూర్తిగా తగ్గలేదు. బలహీనంగా ఉంది. ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోలేకపోతున్నాను.
  మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే అనారోగ్యం.. రేపు ఇల్లు మారాలి. అద్దె పెంచమన్నారు. పెంచలేక ఇల్లు మారుతున్నాం. సొంత ఇల్లు లేని బాధ ఎన్నాళ్ళనుంచో అనుభవానికి వస్తున్నదే.
  పండిత నేమాని వారూ,
  మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరో రెండు రోజులు మిమ్మల్ని శ్రమపెడుతున్నాను. మన్నించాలి.
  మంచి మంచి పూరణలను, పద్యాలను అందిస్తున్న కవిమిత్రులకు అభినందనలు, ధన్యవాదాలు.
  రేపు, ఎల్లుండి పోస్టులను షెడ్యూల్ చేసాను.

  రిప్లయితొలగించండి
 18. నెల- నాలుగు వారములకు;
  నెలలో రేయి, పగలుండు నిక్కము సగమై;
  కొలచియు గంటల లెక్కన
  నెలకేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.


  దినమునకు 24 గంటలు అయినచో
  రెండువారములు పగలు=ఏడు రోజులు అని పద్యమును పూరించడం జరిగింది.

  రిప్లయితొలగించండి
 19. శ్రీ రామకృష్ణ గారు: శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు. జీతగాళ్ళకు మొదటి 7 రోజులే ఇల్లు డబ్బుతో కళకళ లాడును కదా. దినంబులు + ఎన్నననన్ = అనుచోట యడాగమము రాదు. పరిశీలించండి.

  శ్రీ బొడ్డు శంకరయ్య గారు: శుభాశీస్సులు.
  మీరు మళ్ళీ గణితముతోనే సాధించేరు - పద్యము బాగుగ నున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. పండిత నేమాని వారికి నమస్సులు. ధన్యవాదములు

  ఇలా సవరిస్తున్నాను:

  నెలజీతగాండ్ర చెంతను
  కళకళలాడుచును లక్ష్మి కదలాడుదినం
  బులనెంచమన రమారమి
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్!

  భవదీయుడు

  రిప్లయితొలగించండి
 21. నెలతకు నెలతప్పినదని
  తెలిసిన దేమాసమన్న తండ్రిట్లనియెన్
  లలితా! తక్కువ యేడవ
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్.

  రిప్లయితొలగించండి
 22. శ్రీ రామకృష్ణ గారూ! శుభాశీస్సులు. మీరు సవరించిన తరువాత పద్యము చాలా బాగుగ నున్నది. అభినందనలు.

  శ్రీ మిస్సన్న గారూ:మీరు బేంకు లెక్కలు చెప్పెదరనుకొంటే మరొక లాగ పూరించేరు. బాగుగ నున్నది మీ పద్యము. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. అలరగ నాలుగు రవివిన్
  చలచల్లగ మరియు మూడు శనివారములున్
  సెలవులు "ఇషాని" స్కూలుకు
  నెల కేడు దినమ్ములని గణింతురు విజ్ఞుల్


  ...నా మనుమరాలు "ఇషాని" కి మొదటి శనివారము తప్ప మిగిలిన మూడు సెలవులు.

  రిప్లయితొలగించండి