5, ఆగస్టు 2013, సోమవారం

సమస్యాపూరణం – 1134 (వావి వరుసలఁ జూడని)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వావి వరుసలఁ జూడనివా  రనఘులు.

41 కామెంట్‌లు:

  1. స్వర్గమున సవ్యసాచికి సరసజేరి
    సంగమము గోరి యూర్వశి చాల చాల
    బోధ చేయుచు బల్కె నో పురుష సింహ!
    వావి వరుసలు జూడని వారనఘులు

    రిప్లయితొలగించండి
  2. కష్టకాలాన "రక్షింతు నిష్టుల" నని;
    "వీరు నా వారలు; పరాయి వారు వార"
    లంచు గణియింప నొల్లక;మంచిఁ గోరి,
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!

    రిప్లయితొలగించండి
  3. న్యాయ మూర్తిగ నిలచిన నాడు చూడ
    తీర్పు జెప్పుట లోనింత మార్పు లేక
    నీమమింతయు దప్పక నిష్ట గలిగి
    వావి వరుసలఁ జూడనివా రనఘులు.

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    అవధాన సరస్వతులు శ్రీ నేమాని పండితార్యులు
    మంచి పాయంటును వ్రాసేసిన అదృష్ట వంతులు మార్వలెస్

    రిప్లయితొలగించండి
  5. గురువు యని నెంచ కడిగెను విరటు డపుడు
    తనదు కూతురు నుత్తర తగిన దనుచు
    పరిణ యమ్మును గావించ పార్ధు నకును
    వావి వరుసలఁ జూడని వారనఘులు

    రిప్లయితొలగించండి
  6. శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు:శుభాశీస్సులు. మీ పద్యము బాగుగనున్నది. అభినందనలు.
    "నిష్ఠ" అనుట సాధు ప్రయోగము - నిష్ట అనరాదు. స్వస్తి

    రిప్లయితొలగించండి
  7. అమ్మా! శ్రీమతి రాజేశ్వరి గారూ! శుభాశీస్సులు.
    మీ ప్రశంసలకు సంతోషము.
    మీ పద్యమును చూచేను. గురువు + అని = గురువని అగును; అని + ఎంచక = అనియెంచక అగును; ఎంచక + అడిగె = ఎంచకయడిగె అగును.
    మీ పద్యములోని మొదటి పాదమును ఇలాగ మార్చుదాము: "గురువనుచు నెంచక యడిగె విరటు డపుడు" స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. పండిత నేమాని వారూ,
    ఊర్వశి పలుకులుగా మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    స్వపర భేదాలు పాటింపక మేలు చేయాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బంధుత్వాన్ని పాటించకుండా నిష్పక్షపాతంగా తీర్పు చెప్పాలన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    గురువు తండ్రితో సమానుడని భావించని విరటుని మాటగా మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సవరణలను గమనించారా?
    *
    నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  9. నిండు జాబిలి వెన్నెల నెఱయ బూయ
    వేణునాదము వీనుల విందు జేయ
    జేరి కృష్ణుని గొల్లతల్ గోరు వేళ
    వావి వరుసలఁ జూడని వారనఘులు.

    రిప్లయితొలగించండి




  10. వావి వరుసలు జూచి నుద్వాహ మాడ
    మంచి సంతాన వంతులై మహిని వెలిగి
    మఱియు నాచంద్ర తారార్కమములు నౌను
    వావి వరుసలు జూడని వారనఘులు



    రిప్లయితొలగించండి
  11. మంద పీతాంబర్ గారూ,
    మీ ప్రయత్నం ప్రశంసనీయం.
    కాని 'వావి వరుసలు చూడనివారు పుణ్యాత్ములు' అన్న సమస్యను ఏ విధంగా సమర్థిస్తున్నారు?
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    రాసకేళిలో వారి వరసలు జూడని గొల్లతల గురించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మంచి ప్రయత్నమే.
    కాని సమస్య సమర్థింపబడినట్లు లేదు.
    చూచి యుద్వాహమాడ... అని ఉండాలి. ఆచంద్రతారార్క'మములు' నౌచు..?

    రిప్లయితొలగించండి
  12. అవగాహనాలోపం వలన పొరపాటు జరిగింది. సవరించినపూరణ.
    రాజ రాజనరేంద్రుని రాణియైన
    రమణిచిత్రాంగికోరగ రాచకొడుకు
    వావి వరుసలఁ జూడనివా రనఘులు
    కారుకారనివారించెగౌరవముగ!!!

    రిప్లయితొలగించండి
  13. మంద పీతాంబర్ గారూ,
    సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో
    శ్రీ కంది శంకరయ్యగురుదేవులకు తీర్థయాత్ర దిగ్విజయముగా పూర్తిచేసుకొని వచ్చిన సందర్భముగా శుభాకాంక్షలు. ప్రసాదమును బ్లాగు వీక్షకులకు పంచగలరు.
    =======*======
    ధర్మమార్గమున నడచి ధరణి యందు
    మునిజనులను రక్షింపగ ముందు నిలిచి
    కీచకులనెంచి యనిశము కీడు జేయ
    వావి వరుసలఁ జూడనివా రనఘులు

    రిప్లయితొలగించండి
  15. వరప్రసాద్ గారూ,
    దుష్టశిక్షణలో వారి వరుసలు పాటింపరాదన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ పీతాంబర్ గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అభినందనలు. ఒక సూచన: 3వ పాదములో మీరు పార్థివ! అని సంబోధించేరు. పార్థివ అంటే అర్జునుడు అనే అర్థము రాదు. అర్జున! అని సంబోధించితే బాగుంటుంది. పరిశీలించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. చంద్రమతి పల్కె భర్తతో సందియమ్ము
    వీడి నన్నమ్ముమో ప్రభూ విపణిలోన,
    సత్య పాలన జేయుచో సతిపతులని
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!

    రిప్లయితొలగించండి
  18. తండ్రిని 'హరిం'చు మత్తచిత్తాత్ముడొకడు
    మాతృశమనము సల్పు దుర్మార్గుడొకడు
    బంధుజాలము ద్రుంచు బీభత్సుడొకడు
    వావి వరుసలఁ జూడనివా రనఘులు

    శమనము - శాంతి, వధము
    జాలము - సమూహము, వల

    రిప్లయితొలగించండి
  19. శ్రీపండితనేమాని గారికినమస్కారం.సూచనకు ధన్యవాదాలు.
    నా రెండవ పూరణ మూడవ పాదములో "పార్థివా" బదులుగా"అర్జునా" యని గమనింప ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  20. తొల్లి మర్యాదరామన్నపల్లె లందు
    తగవులను దీర్చి ఘన కీర్తి దాను పొందె
    దీర్పులను ధర్మబద్దులై తెలుపువేళ
    వావి వరుసలఁ జూడనివా రనఘులు

    రిప్లయితొలగించండి
  21. భావి బ్రతుకున దంపతుల్ బడయ సుఖము
    వావివరుసలు జూచిన వారు ఘనులు
    దైవనిర్ణయ మిదియని తలనువంచి
    వావివరసలు జూడని వారనఘులు

    రిప్లయితొలగించండి
  22. కూడు గుడ్డకు నోచక కువలయమున
    బ్రతికియుండుట కష్టమై బాధపడెడు
    దీనజనులను రక్షించ బూనునపుడు
    వావివరుసలు చూడనివారనఘులు.

    ధర్మమార్గంబు, జీవన మర్మగతులు
    విస్తృతంబైన వేదాన్త విషయములును
    తెలియగోరుచు దీక్షతో నిలిచినపుడు
    వావివరుసలు చూడనివారనఘులు.

    రిప్లయితొలగించండి
  23. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    నేమాని వారి సూచన ననుసరించి సవరణ చేసినందుకు సంతోషం.
    *
    మిస్సన్న గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఆదిత్య గారూ,
    అలాంటి వారే అనఘులుగా కీర్తింపబడుతున్నారంటారు..! బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  24. నా రెండవ పూరణ:

    నరహరియె తన జనకుని మరణమునకుఁ
    గారకుం డని యెఱిఁగియుఁ గరుణఁ బ్రోవ
    భక్త ప్రహ్లాదుఁ డా హరిఁ బ్రస్తుతించె!
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!!

    రిప్లయితొలగించండి
  25. సవరించిన పూరణ.

    తాత తండ్రిసమానుల తాను జంప
    ననగ, హరియనె జనులెల్ల నవనిలోన
    కర్మ బద్దులే, అర్జునా కదన మందు
    వావి వరుసలఁ జూడనివారనఘులు!!!

    రిప్లయితొలగించండి
  26. ధర్మసంరక్షణార్థము ధరణిజపతి
    వెంటనడచెను నాడు విభీషణుండు
    లోకకళ్యాణ కారణాలోకనమున
    వావివరుసలఁ జూడని వారనఘులు

    ఆలోకనము = చూచుట

    రిప్లయితొలగించండి
  27. గుండు మధుసూదన్ గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. తేలి కలలందు కోరెను దేవ యాని
    కచుని పరిణ మాడంగ కాంక్ష తోను
    గురువు పుత్రిక సోదరి కుదర దనగ
    వావి వరుసలఁ జూడని వార నఘులు

    రిప్లయితొలగించండి
  29. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ధరణిజపతి'ని `ధరణిజేశు' అంటే?

    రిప్లయితొలగించండి
  30. రాజేశ్వరి అక్కయ్యా,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. మీ సవరణ సర్వదా ఆమోదయోగ్యమే గురువు గారూ,

    ధన్యోస్మి.

    రిప్లయితొలగించండి
  32. నా మూఁడవ పూరణము:

    భ్రాతృ దుష్కృత్య దుస్సహ ప్రాశ్నికుఁడు, వి
    భీషణుఁడు, రాము శరణమ్ము వేడి, యగ్ర
    జాపమృత్యు కారక పుణ్య చరితుఁ డాయె!
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!!

    రిప్లయితొలగించండి
  33. మాస్టరుగారూ! ధన్యవాదములు.
    శ్రీ నేమాని గారూ ! ధన్యవాదములు. మీరు చూపిన సవరణతో...

    న్యాయ మూర్తిగ నిలచిన నాడు చూడ
    తీర్పు జెప్పుట లోనింత మార్పు లేక
    నీమమింతయు దప్పక నిష్ఠ గలిగి
    వావి వరుసలఁ జూడనివా రనఘులు.

    రిప్లయితొలగించండి
  34. నా నాలుగవ పూరణము:

    అన్నదమ్ములు ద్రౌపది, నావభృథను
    నిండు సభలోని కీడ్చి, దుర్నీతి తోడ
    భంగపెట్ట, వికర్ణుండు ప్రతిఘటించె!
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!!

    రిప్లయితొలగించండి
  35. మిత్రుల పూరణ లన్నీ అద్భుతంగా నున్నాయి. అందఱికీ అభినందనలు. శ్రీ హరివేంకట సత్యన్నారాయణ మూర్తి గారికి ప్రత్యేకాభినందనలు. చక్కని భావమును అందమైన భాషలో సుందరంగా చెప్పారు వారు !

    రిప్లయితొలగించండి
  36. ధాత్రి లోన ధర్మము దారి తప్పి నపుడు
    తిరిగి ధర్మమును నిలుప ధరణిపతులు
    ధర్మ రక్షణకై చేయు కర్మ మందు
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!

    రిప్లయితొలగించండి
  37. నా యైదవ పూరణము:

    పల్లవేశుఁడు మాధవవర్మ, తనదు
    సుతుఁడు రథచోదనముచే శిశువును జంప;
    పొరిగొనిన సుతునకు నిడె మరణశిక్ష!
    వావి వరుసలఁ జూడనివా రనఘులు!!

    రిప్లయితొలగించండి
  38. గుండు మధుసూదన్ గారూ,
    మీ తాజా మూడు పూరణలూ వైవిధ్యంగా, మీ పద్యరచనా ప్రావీణ్యాన్ని ప్రకటించేవిగా అలరిస్తున్నవి. అభినందనలు.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    గన్నవరపు వారూ,
    ధన్యవాదాలు.
    ఇటువంటి ప్రశంసలే మిత్రులకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

    రిప్లయితొలగించండి
  39. ఆర్యా! గన్నవరపు నరసింహమూర్తిగారూ!
    ధన్యవాదములు

    రిప్లయితొలగించండి