26, ఆగస్టు 2013, సోమవారం

సమస్యాపూరణం – 1155 (వేశ్య కౌఁగిలింతను గోరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి.
(‘శతావధాన సారము’ గ్రంథంలోని సంస్కృత సమస్య “అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ” స్ఫూర్తితో)

26 కామెంట్‌లు:

  1. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మీరు ఈనాడు "శ్య" ప్రాసతో సమస్యను ఇచ్చిరి. దీనిని ఎందరు ఔత్సాహిక కవులు పూరించగలరు? నా ఉద్దేశములో కందపద్యములో కాకుండా సమస్య యొక్క ఛందస్సునైనా మార్చితే బాగుంటుంది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. పండిత నేమాని వారూ,
    శుభోదయం!
    మీ సూచన ననుసరించి సమస్యవు తేటగీతి పాదంగా మార్చి ఇస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  3. అమలాపురం శతావధానంలో ఇచ్చిన సంస్కృత సమస్య....
    “అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ”
    తిరుపతి వేంకట కవుల పూరణ....

    విపిన మధివసంతం మౌనిరాడృశ్యశృంగం
    స్వనగర ముపనేతుం తద్గతా వారయోషాః |
    వర మతియతిబుద్ధ్యా సస్త్రియా అజ్ఞతాయా
    అభిలషతి హి వేశ్యాలింగనం సిద్ధయోగీ ||

    రిప్లయితొలగించండి
  4. ముక్తి కాంత సమీపించె ముదముమీర
    వేశ్య వేషమ్ము నూని, యా విధము దెలిసి
    ఆదరము మీర ప్రణతుల నాచరించి
    వేశ్య కౌగిలింతను గోరె వృద్ధ యోగి

    రిప్లయితొలగించండి
  5. నా పూరణలో ఆఖరి పాదమును సమస్య పాదముగా "వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి" అని మార్చి చదువుకొనెదము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  6. ఆది శంకరు డైనను మోద మలరె
    బ్రహ్మ కైనను దిరుగును రిమ్మ తెగులు
    కాంత కనకము లన్నను కలత బడగ
    వేశ్య కౌఁ గిలింతను గోరె వృద్ధ యోగి

    రిప్లయితొలగించండి
  7. అయ్యా! శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    మాకు వారూ వీరూ ఇచ్చిన పూరణలు వ్రాయుట కంటే - మీ పూరణలు ఇచ్చి మమ్ము ఆనందింపజేయ గలరు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. సమస్యను కందము నుండి తేటగీతికి మార్చినందులకు మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి ధన్యవాదములు.

    పృథ్విపైనున్న దినములు వేద పఠన,
    పాఠన, తపో విశేష, సద్బ్రహ్మచర్య
    దీక్షఁ గడచె! దివికినేగి, స్థిరత దేవ
    వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!!

    రిప్లయితొలగించండి
  9. మిత్రులు కంది శంకరయ్యగారికి, పూజ్యులు నేమానివారికి, సాహితీ మిత్రులకు నమస్కారములు.

    తిరుపతి వేంకటకవుల సంస్కృత పూరణమున కనుసరణము.

    (రోమపాదుఁడు ఋష్యశృంగుని దన నగరమునకు రప్పించిన సందర్భము...)

    అటవి నివసించు మౌనీంద్రు ఋష్యశృంగు
    స్వీయ నగర ప్రవిష్టుని జేయ నెంచి,
    తనదు వారాంగనలఁ బంపఁ దాఁ దెలియక
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి!

    (వేశ్య కౌఁగిలింతను గోరె వృద్ధ యోగి!!)

    నాలుగవ పాదమును బూజ్యులు నేమానివారి స్ఫూర్తితో మార్చితిని.

    రిప్లయితొలగించండి
  10. పండిత నేమాని గారికి శంకరయ్య గురుదేవులకు నమస్కారములు .

    వశ్య మొనరింప బ్రహ్మము కశ్యపుడను
    వృద్ధ యోగి తపమ్ము గావింప నచట
    దృశ్యమాయెను యూర్వశి దీక్ష మరచి
    వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి

    రిప్లయితొలగించండి
  11. ధర్మపత్ని నుపేక్షించఁ దలఁచి యొకఁడు
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె; యోగి
    యొక్కఁ డతని దుర్వర్తన నుడుగు మనుచు
    సదుపదేశ మొసఁగ విని చక్కఁబడియె.

    రిప్లయితొలగించండి
  12. నా రెండవ పూరణమున... 1వ పాదము..."అటవి నివసించు మౌనీంద్రు ఋష్యశృంగు"లో యతిమైత్రి తప్పినది. దానిని "ఋషి వనస్థిత మౌనీంద్రు ఋష్యశృంగు" నని సవరించితిని.


    ఋషి వనస్థిత మౌనీంద్రు ఋష్యశృంగు
    స్వీయ నగర ప్రవిష్టుని జేయ నెంచి,
    తనదు వారాంగనలఁ బంపఁ దాఁ దెలియక
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి!

    రిప్లయితొలగించండి
  13. నిన్నటి సమస్యకు నా పూరణ...

    చకచక ఛాయా చిత్రము
    లిక జూడుము నచ్చె నాకు నీరెండు సఖా !
    యొకకాలిపైన నిలచిన
    బకము న్వడి మ్రింగు చున్న బల్లిన్ గనుమా !

    రిప్లయితొలగించండి
  14. వన్నె చిన్నెల వలపు వయ్యారములకు
    వశ్యమగునునెంతటి వారలైన
    కాషాయములుగట్టినా కాముడొదులున
    వేశ్యకౌగిలింతను గోరివెడలెయోగి

    రిప్లయితొలగించండి
  15. విప్ర నారాయణుండపుడు పిచ్చివాని
    వలెను పడిపోయె నాడు తా వలను జిక్కి
    వారకాంతయె వేయగా పంతమూని
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి.

    రిప్లయితొలగించండి
  16. సాని కొంపకు రయమున సత్తి బాబు
    వేశ్య కౌగిలింతను గోరి వెడలె, యోగి
    వేమన శతకము వ్రాసె వినుర వేమ
    అనెడు మకుటాన పద్యము లద్భుతముగ

    రిప్లయితొలగించండి
  17. శ్రీ కంది శంకరయ్య గారు! శుభాశీస్సులు.
    మా కోరికను మన్నించి తమ పూరణను కూడా ప్రకటించినందులకు సంతోషము. చాల బాగుగనున్నది - మంచి విరుపుతో వ్రాసేరు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. నేటి కాలపు మనుజుండు నీతి దప్పి
    యోగి ననిజెప్పి శిష్యుల బ్రోగు జేసి
    కామ లాలసుడై తన కడకు వచ్చు
    నతివ లందున నత్యంత యందమైన
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి.

    రిప్లయితొలగించండి
  19. అయ్యా! బొడ్డు శంకరయ్యా గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము బాగుగ నున్నది. అందులో "అత్యంత అందమైన" అనే రీతిగా సమాసమును చేయరాదు. ఈ విధముగా ఆ పాదమును మార్చుదాము:
    "సుదతు లందున నత్యంత సుందరి యగు" స్వస్తి.

    రిప్లయితొలగించండి
  20. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు వినమ్రవందనములతో
    శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    =========*========
    వేశ్య కౌగిలింతను బొంది కశ్యపు డొక
    నాడు సకల జగతి గని నాడని విని
    వేశ్య కౌగిలింతను గోరి వెడలె,యోగి
    యనెడి జ్ఞాన హీనుడు కడు ఆశ తోడ!

    రిప్లయితొలగించండి
  21. శ్రీ వరప్రసాద్ గారి పద్యము బాగుగ నున్నది. దానిలోని ఆఖరి పాదమును ఇలాగ మార్చితే బాగుంటుంది:
    "యనెడు జ్ఞానహీనుం డొకం డాశ తోడ"

    రిప్లయితొలగించండి
  22. శ్రీ నేమాని గురు దేవులకు నమస్కారములు, మీరు సూచించిన విధముగా సవరణతో...........

    నేటి కాలపు మనుజుండు నీతి దప్పి
    యోగి ననిజెప్పి శిష్యుల బ్రోగు జేసి
    కామ లాలసుడై తన కడకు వచ్చు
    సుదుతు లందున నత్యంత సుందరి యగు
    వేశ్య కౌఁగిలింతను గోరి వెడలె యోగి.

    రిప్లయితొలగించండి
  23. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
    మీరు సూచించిన విధముగా సవరణతో...
    ========*======
    వేశ్య కౌగిలింతను బొంది కశ్యపు డొక
    నాడు సకల జగతి గని నాడని విని
    వేశ్య కౌగిలింతను గోరి వెడలె,యోగి
    యనెడు జ్ఞానహీనుండొకం డాశ తోడ

    రిప్లయితొలగించండి
  24. ఆది శంకరు డైనను మోద మందె
    కాంత కనకము లన్నను కలుగు బ్రాంతి
    వేశ్య కౌగిలింతను గోరి వెడలె యోగి
    బ్రహ్మ కైనను దిరుగును రిమ్మ తెగులు

    రిప్లయితొలగించండి
  25. కవిమిత్రులకు వందనములు.
    ఉదయంనుండి వివిధ కార్యక్రమాల్లో వ్యస్తుడనై ఇప్పుడే ఇల్లు చేరాను.
    ఈనాటి సమస్యకు చక్కని పూరణలు చెప్పిన మిత్రులు...
    పండిత నేమాని వారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గుండు మధుసూదన్ గారికి,
    కెంబాయి తిమ్మాజీరావు గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    శైలజ గారికి,
    సుబ్బారావు గారికి,
    బొడ్డు శంకరయ్య గారికి,
    వరప్రసాద్ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    బాగా అలసి ఉన్నందున ఒక్కొక్కరి పూరణలను సమీక్షించలేకపోతున్నాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  26. మిత్రులారా! శుభాశీస్సులు.
    ఈనాటి సమస్యకు మంచి మంచి పూరణలు వచ్చినవి. ముందుగా అందరికీ అభినందనలు.

    శ్రీమతి రాజేశ్వరి గారు బమ్మకైన పుట్టు రిమ్మ తెగులు అనే సామెతను సమర్థించేరు. బాగుగ నున్నది.

    శ్రీ గుండు మధుసూదన్ గారు: 1. యోగి స్వర్గమును చేరి అక్కడ దేవవేశ్యల పొందు కోరునని సెలవిచ్చేరు. 2. తిరుపతి వేంకట కవుల సంస్కృత శ్లోకమునకు తెలుగు అనువాదము చేసేరు. చాలా బాగుగ నున్నవి.

    శ్రీ తిమ్మాజీ రావు గారు: కశ్యపుని తీరు వర్ణించేరు - బాగుగ నున్నది.

    శ్రీ కంది శంకరయ్య గారు మంచి విరుపుతో ధర్మపత్నిపై అలిగిన ఒక కుటుంబీకుని ప్రవర్తనను వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీమతి శైలజ గారు ఇంకా పద్య రచన ప్రయత్నములలోనే ఉన్నారు కాషాయమును కట్టినా కాముడు వీడునా అనే సత్యము ఉట్టంకించినారు. 1వ పాదములో యతిమైత్రి లేదు. 2, 3 పాదములలో గణభంగము. భావము బాగుగనున్నది.

    శ్రీ గోలి హనుమఛ్ఛాస్త్రి గారు విప్రనారాయణ కథను తెలిపేరు. బాగుగ నున్నది.

    శ్రీ సుబ్బారావు గారు వేమన శతక రచన గురించి మంచి విరుపుతో వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ బొడ్డు శంకరయ్య గారు నేటి మోసకారులైన యోగుల తీరు వర్ణించేరు. చాల బాగుగ నున్నది.

    శ్రీ వరప్రసాద్ గారు ఒక యోగి అనే అజ్ఞాని గురించి సెలవిచ్చేరు. చాల బాగుగ నున్నది. స్వస్తి.


    రిప్లయితొలగించండి