14, ఆగస్టు 2013, బుధవారం

సమస్యాపూరణం – 1143 (హారము కొఱకై యొక సతి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది .....
హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్.

36 కామెంట్‌లు:

 1. కోరను నగలను మరి మరి
  భారము బంగార మనుచు పరి పరి విధముల్
  మారిచి కనకము నకిలీ
  హారము కొరకై యొకసతి హారము నమ్మెన్ !

  రిప్లయితొలగించండి
 2. కోరని దారిద్ర్యము దరిఁ
  జేరఁగఁ దానెంతొ వగచి చివరకుఁ దానై
  దారిని వెదకుచు నిఁక నా
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్!

  రిప్లయితొలగించండి
 3. సోదరులు మధు సూధన్ గారి పద్యం చాలా బాగుంది నా నిద్ర కళ్ళకి తట్ట లేదు

  రిప్లయితొలగించండి

 4. హీరో హోండా పైనఁ గు
  మారుం డతి రయమున నొక మనుజుని దాఁకెన్
  ఘోరముగ గాయపడఁ బరి
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్.

  రిప్లయితొలగించండి
 5. రాజేశ్వరి అక్కయ్యా,
  నకిలీ హారం కోసం హారాన్ని అమ్మడమా? నమ్మమంటారా? అందరూ బంగారు నగలను బ్యాంకు లాకర్లలో పెట్టి, గిల్ట్ నగలను వేసుకుంటున్నారు.
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  `ఆహారం' కొరకన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 6. శ్రీరమ్యానందద కా
  శ్మీరాది మనోజ్ఞ సరస సీమలలో శృం
  గార రసభరితమైన వి
  హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

  రిప్లయితొలగించండి
 7. భారపు బ్రతుకున పొలమున
  పైరునకే బట్టె చీడ భర్తకు మందుల్
  చేరుచు గొన పురుగుల సం
  హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

  రిప్లయితొలగించండి
 8. దాన ధర్మము లన్నియు దండి చేసి
  తనదు ఆస్తులెల్లయున్ తరలగ ఆహా
  రముకొరకైయొకసతి హారంనమ్మె
  నకట విధినెరుగుటనరుల వశమె

  రిప్లయితొలగించండి
 9. పండిత నేమాని వారూ,
  మీ పూరణ రమ్యంగా, మనోజ్ఞంగా, రసభరితంగా ఉంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  ఎరువులకోసం, పురుగు మందుల కోసం రైతులు సొమ్ము లమ్ముకొనడం ఉన్నదే. మంచి పూరణ. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  సమస్య కందపాదం. ఇది ఎట్టి పరిస్థితిలోనూ మరో ఛందంలో ఇమిడే అవకాశం లేదు.
  మీరు వ్రాసిన తేటగీతిలోను ఛందోదోషాలున్నాయి.
  మరో ప్రయత్నం చేయండి.

  రిప్లయితొలగించండి
 10. అమ్మా! శైలజ గారూ! శుభాశీస్సులు.

  మీ భావమునకు ఒక పద్యములో నా పూరణను చూడండి:

  పేరిమి తన సంపదలను
  ధారాదత్తమ్ము చేసి దానము లంచున్
  దారిద్ర్యములో తన కా
  హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

  రిప్లయితొలగించండి
 11. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
  మీరు ఇచ్చిన నేటి సమస్యను ఎట్టి పరిస్థితులలోను వేరొక ఛందములోనికి మార్చే అవకాశము లేదు అన్నారు కదా. మాలో ఏదో చాపల్యము కదా -- మధ్యాక్కర పాదమును చూడండి:
  "హారము కొరకై యొక సతి హారము నమ్మెన్ కవీంద్ర!"

  రిప్లయితొలగించండి
 12. మిత్రులారా,
  చింతా రామకృష్ణారావు గారు తమ 'ఆంధ్రామృతం' బ్లాగులో గురుదేవులు, సహజకవి పండిత నేమాని రామ జోగి సన్యాసి రావు రచించిన 'శ్రీమదధ్యాత్మ రామాయణము' గ్రంథంలో వారు ప్రయోగించిన ఛందో వైవిధ్యాన్ని, చిత్రకవితా నైపుణ్యాన్ని విపులంగా ప్రస్తావించారు. ఇవి మనకు పద్యరచనలో మార్గదర్శకాలు. తప్పక చూచి స్పందించండి.
  http://andhraamrutham.blogspot.in/2013/08/blog-post_12.html

  రిప్లయితొలగించండి
 13. మీరిన వాంఛావృద్ధిన్
  తాఁ, రమణీయంబు జిలుగు తళుకులకై కా
  శ్మీరంబుననుండెడి క
  ల్హారముకొఱకై యొక సతి హారమునమ్మెన్.

  రిప్లయితొలగించండి
 14. శ్రీ శంకరయ్య గురుదేవులకు,శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  =======*=======
  కోరి వరియించిన పతికి
  మీరిన భాదలు రయమున మీదను బడన్
  జోరుగ బెరిగెడి కణ సం
  హారము కొరకై యొక సతి హారము నమ్మెన్

  రిప్లయితొలగించండి
 15. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  కాశ్మీరపు కలువకోసం నగను అమ్మేసిందా? బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  బాగుంది మీ పూరణ. అభినందనలు.
  రెండవ పాదంలో గణదోషం. 'మీద బడంగన్' అంటే సరి.
  'కణ సంహారము'...?

  రిప్లయితొలగించండి
 16. బేరము లాడితి గట్టిగ
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్
  కారణ మరయగ దెలిసెను
  వారసుడగు గొడుకు బంప వాషింగ్టనుకున్

  రిప్లయితొలగించండి
 17. సుబ్బారావు గారూ,
  కొడుకును అమెరికా పంపడానికి తల్లి హారాన్ని అమ్మిందన్న మీ పూరణ బాగుంది. విరుపుతో మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 18. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  గురుదేవులు క్షమించాలి క్లాసుకు టైమైనది,ఆ హడావిడిలో తప్పులు జరిగినవి.
  (పతికి కిమోథెరఫి జేయించుటకు సతి హారము నమ్మెన్)
  ========*========
  కోరి వరియించిన పతికి
  మీరిన భాదలు రయమున మీద బడంగన్
  జోరుగ బెరిగెడి కణ సం
  హారము కొరకై యొక సతి హారము నమ్మెన్!

  రిప్లయితొలగించండి
 19. వరప్రసాద్ గారూ,
  కెమో థెరఫీని కణసంహారం అన్నారా? బాగుంది!

  రిప్లయితొలగించండి
 20. ఈ రోజున అందరి కందములు మకరందము చిందుతున్నవి,చదివి ఆహ్లాదమొంది మనము,కనుల చిందె అశ్రుకణములానందముగా..

  రిప్లయితొలగించండి
 21. శ్రీ కంది శంకరయ్యగురువుగారికి,శ్రీ నేమాని గురువుగారికి ప్రణమిల్లుతూ..కందమున ప్రధమ ప్రయత్నము అదే భావముతో చేసాను ,తప్పిదములనెల్ల మన్నించమని సవినయముగా కోరుతున్నా...

  దారిద్రమువలన తన
  దారులన్నియు మూసుకొనగధారుణిలోనన్
  మారు మార్గములేక ఆ
  హారము కొరకై యొకసతిహారమునమ్మెన్.

  రిప్లయితొలగించండి
 22. శైలజ గారూ,
  సంతోషం.
  మొదటి ప్రయత్నమైనా చాలా వరకు సఫలులయ్యారు. ఈ బ్లాగులో పద్యాలు వ్రాస్తున్న కొందరు మిత్రులు ప్రారంభంలో మీలాగే ఎన్నో దోషాలు చేసేవారు. క్రమంగా దోషాలేమిటో తెలిసికొని, సవరించుకొని ఇప్పుడు చాలా మంచి పద్యాలను వ్రాయగలుగుతున్నారు.
  మీ కంద పద్యంలో కొన్ని దోషాలున్నాయి. మీ పద్యన్ని, నా సవరణలను పోల్చి చూస్తే ఆ దోషాలు తెలుస్తాయి. మీ పద్యానికి నా సవరణ.......
  దారిద్ర్యమువలనను తన
  దారులవియె మూసుకొనగ ధారుణిలోనన్
  మారు తెరువును గనక నా
  హారము కొరకై యొకసతిహారమునమ్మెన్.

  రిప్లయితొలగించండి
 23. మరొక ప్రయత్నము:

  హారము కొరకై యొక సతి
  హారము నమ్మెన్ లభించె నంతట లాభం
  బా రీతిగ వర్ధిలె వ్యా
  పారం బంతంత లగుచు భాగ్యము పొంగెన్

  రిప్లయితొలగించండి
 24. పండిత నేమాని వారూ,
  వ్యాపారపరంగా చెప్పిన మీ రెండవ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 25. పూజ్యులు నేమానివారి దారిలోననే మఱొక ప్రయత్నము:

  ఒక భార్య తన భర్తతో వ్యాపారమునకై దారిని జూపుచుఁ బలికిన మాటలు:

  "ఓరిమి తోడుతఁ గష్టము
  లే రీతినిఁ బడినఁ గాని యే లాభ మిడెన్?
  దారిఁ గనుఁ డిటుల" నని, బే
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్!

  రిప్లయితొలగించండి
 26. శ్రీ శంకరయ్య గురుదేవులకు, శ్రీ నేమాని గురుదేవులకు పాదాభివందనములతో

  శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు.
  నాకు తెలిసిన మూడు సంఘటనలను ఈ రూపమున
  1.పతి దూర మాయనని దుఖ్ఖించెను సతి
  2.వారసురాలు గానట్టి వనిత వారసురాలినని బలుకుట
  3.కలహమున జంపి పతిని మరుసటి దినము బంగారమునమ్మి పుట్టింటికి జేరిన వనిత.
  ======*========
  పైరుకు బట్టగ పురుగు, బరుగున వెడలెను రైతు
  పైరుల పై గొట్ట మందు,పడి లేచెను పురుగు,మందు
  భారము శిరమున జేర పరలోకమును జేరె నతడు,
  దూరమైన పతిని దలచి దుఖ్ఖించెను సతియు జాల.
  వారసులకు భరణమ్ము బంచెద లాభము లందు
  కారకుడై నట్టి నేత కరములు జోడించి బలుక,
  వారసురాలు గానట్టి వనిత దిరిగి దిరిగె పరి
  హారము కొరకై,యొక సతి హారము నమ్మెను నేడు
  కోరిన కొంగ్రొత్త రీతి కొంచెమైనను లేదనుచును
  కారకుడవు నీవనుచును కలహమునను జంపె పతిని.

  రిప్లయితొలగించండి
 27. శ్రీ పండిత నేమాని గురుదేవుల,
  వ్యాపారపరంగా చెప్పిన పూరణ చాలా బాగుంది.

  శ్రీ శంకరయ్య గురుదేవుల,హీరో హోండా పూరణ చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 28. ధన్వవాదములు గురువుగారూ..
  నా ప్రయత్నాన్ని ప్రోత్యహిస్తూ మీరు చెప్పిన మాటలు నాకు మరింత బూస్ట్ నిచ్చాయి, మీ సవరణలతో నా మొదటి కంద పద్యాన్ని చూసుకుంటే ఎంతో సంతోషంగా వుంది..

  రిప్లయితొలగించండి
 29. ఒకసతి హారమునమ్మెను
  అకాండముగ దేశముల విహారము కొఱకై
  యొకసతి హారమునమ్మెన్
  వికటించిన విధికి లొంగి వేదన పడుచున్

  రిప్లయితొలగించండి
 30. శ్రీ వరప్రసాద్ గారికి శుభాశీస్సులు. వారు వివిధ ఛందస్సులను చక్కగా నడిపించుచున్నారు. మధ్యాక్కరలు చాలా బాగుగ వచ్చుచున్నవి. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 31. నమస్కారములు
  గురువులు సోదరులు శ్రీ శంకరయ్య గారి హీరో హోండా చాలా బాగుంది
  ఇక ఈ రోజుల్లో స్త్రీలు ఒక్క బంగారమే అన్న మాటే ముంది ? కొందరు అవుసరాన్ని బట్టి భర్తలనే అమ్మేస్తున్నారు .కాదంటారా ?

  రిప్లయితొలగించండి
 32. భారం బత్తా! కాసుల
  హారము నా వల్లకాని దమ్మో దాల్చన్
  వేరొం డిమ్మని తేలిక
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్.

  రిప్లయితొలగించండి
 33. గుండు మధుసూదన్ గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వరప్రసాద్ గారూ,
  మీ విపులమైన పూరణ బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  సంతోషం. పద్య రచనా ప్రావీణ్యతా ప్రాప్తిరస్తు!
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మంచి విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
  పద్యం మధ్యలో అచ్చులు రాకుండా జాగ్రత్త పడండి.
  *
  మిస్సన్న గారూ,
  హారాన్ని అమ్మి భారాన్ని తగ్గించుకొన్న దన్న మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 34. పోరాడి భర్త తోడను
  సారస్వత డాక్టరేటు సంపాదించన్
  మారాము జేసి ఋతుసం
  హారము కొఱకై యొక సతి హారము నమ్మెన్

  రిప్లయితొలగించండి
 35. కూరిమి తగ్గగ పతితో
  పోరాడి విడాకులిడుచు పోకిరి తనమున్
  మీరిన యాకలితో నా
  హారము కొరకై యొక సతి హారమునమ్మెన్

  రిప్లయితొలగించండి